భూమి: సౌర మండలంలో మూడవ గ్రహం

సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి.

సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై, ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.

భూమి 🜨
భూమి రంగుల ఫోటో - అపోలో 17 నుండి తీసినది.
భూమి రంగుల ఫోటో - అపోలో 17 నుండి తీసినది.

ప్రఖ్యాత "నీలి గోళీ" భూమి ఫోటో - అపోలో 17 నుండి తీసినది.
కక్ష్యా లక్షణాలు
Epoch J2000.0
అపహేళి: 152,097,701 km
1.0167103335 AU
పరిహేళి: 147,098,074 కి.మీ.
0.9832898912 AU
Semi-major axis: 149,597,887.5 కి.మీ.
1.0000001124 AU
అసమకేంద్రత (Eccentricity): 0.016710219
కక్ష్యా వ్యవధి: 365.256366 రోజులు
1.0000175 yr
సగటు కక్ష్యా వేగం: 29.783 కి.మీ./సె
107,218 కి.మీ./గం
వాలు: 1°34'43.3"
to Invariable plane
Longitude of ascending node: 348.73936°
Argument of perihelion: 114.20783°
దీని ఉపగ్రహాలు: 1 (the చంద్రుడు)
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 6,371.0 కి.మీ.
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: 6,378.1 కి.మీ.
ధ్రువాల వద్ద వ్యాసార్థం: 6,356.8 కి.మీ.
ఉపరితల వైశాల్యం: 510,072,000 చ.కి.మీ.

148,940,000 km² land  (29.2 %)

361,132,000 km² water (70.8 %)
ఘనపరిమాణం: 1.0832073×1012 కి.మీ.3
ద్రవ్యరాశి: 5.9736×1024 kg
సగటు సాంద్రత: 5.5153 గ్రా/సెం.మీ3
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 9.780327 m/s²
0.99732 g
పలాయన వేగం: 11.186 కి.మీ./సె 
సైడిరియల్ రోజు: 0.99726968 రో
23h 56m 4.100s
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 1,674.4 km/h (465.1 m/s)
అక్షాంశ వాలు: 23.439281°
అల్బిడో: 0.367
ఉపరితల ఉష్ణోగ్రత:
   కెల్విన్
   సెల్సియస్
కనిష్ఠసగటుగరిష్ఠ
184 K287 K331 K
−89 °C14 °C57.7 °C
విశేషాలు: రాతి, నేలతో కూడిన, మట్టి, మృత్తిక, టెల్యూరిక్, టెల్యూరియన్
వాతావరణం
ఉపరితల పీడనం: 101.3 kPa (సముద్ర మట్టం వద్ద)
సమ్మేళనం: 78.08% నత్రజని (N2)
20.95% ఆక్సిజన్ (O2)
0.93% ఆర్గాన్
0.038% కార్బన్ డయాక్సైడ్
సుమారు 1% నీటి ఆవిరి (శీతోష్ణస్థితిని బట్టి మారుతుంది)
భూమి ఉచ్ఛారణ

భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది. భూమి, సౌరవ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది.

భూగోళపు బయటి పొరను ఫలకాలుగా (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉంది. మిగిలిన భాగంలో ఖండాలు, ద్వీపాలూ ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.

భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటికా మంచు ఫలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలూ ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ (గర్భం), దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది.

భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది. ఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్నీ ప్రభావితం చేసింది. దాంతో ఏరోబిక్, ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి. కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం, 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుండి, సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు వగైరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి. భూమి చరిత్రలో, జీవ వైవిధ్యం దీర్ఘ కాలాల పాటు వృద్ధి చెందింది. కొన్ని సార్లు జీవులు సామూహికంగా అంతరించి పోయాయి. ఇప్పటి వరకూ భూమిపై జీవించిన జీవజాతుల్లో 99% వరకూ అంతరించి పోయాయి. ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి; చాల జాతులను ఇంకా గుర్తించలేదు. 760 కోట్ల పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ, భూమి జీవావరణంపై, దాని సహజవనరులపై ఆధారపడి ఉన్నారు. మానవులు అనేక సమాజాలు, సంస్కృతులను ఏర్పరచారు. రాజకీయంగా ప్రపంచంలో 200 సార్వభౌమిక రాజ్యాలున్నాయి.

కాలగతిలో

శాస్త్రవేత్తలు భూగ్రహం ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను చాలా లోతుగా అధ్యాయనం చేసారు. సౌర వ్యవస్థ 456.72 ± 0.06 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది (1% శాతం అనిశ్చితితో) . భూమి, ఇతర గ్రహాలు సౌర నీహారిక (సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళితోటి, ఇతర వాయువులతోటీ కూడిన మేఘం) నుండి ఆవిర్భవించాయి. ఈ ధూళి మేఘం నుండి భూమి అవతరించడానికి 1–2 కోట్ల సంవత్సరాలు పట్టింది. భూమి బాహ్య పొర మొదట్లో వేడికి కరిగి ద్రవరూపంలో ఉండేది. క్రమేణా అది చల్లబడ్డాక గట్టిపడింది. దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడు. భూమిలో 10% బరువుండి, అంగారక గ్రహం పరిమాణంలో ఉండే 'థీయా' అనే ఒక గ్రహం భూమిని ఢీకొనడం వలన దానిలోని కొంత భాగం భూమిలో మిళితమై పోయి, మిగతాది శకలాలుగా అంతరిక్షంలోకి విరజిమ్మ బడింది. ఆ శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది.

భూమిపై వాయువులు, అగ్నిపర్వతాల వల్ల మొదటగా వాతావరణం ఏర్పడింది. ఉల్కలు, ఇతర గ్రహాలు, తోక చుక్కలూ మొదలైన వాటి నుంచి వచ్చి చేరిన మంచు, నీరూ కలిపి మహా సముద్రాలు ఏర్పడ్డాయి. ఖండాల పెరుగుదలకు రెండు ముఖ్యమైన కారణాలను ప్రతిపాదించారు: నేటి వరకు స్థిర పెరుగుదల, భూమి ఏర్పడినప్పుడు మొదట్లో ఉన్న ఆకస్మిక పెరుగుదల. ఇంతవరకు జరిగిన అధ్యయనం ప్రకారం రెండవ పద్ధతి ద్వారా ఏర్పడిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి కొంచంకొంచంగా ఖండాలు ఏర్పడటం, ముక్కలవటం జరుగుతూ ఉంది. కొన్ని ఖండాలు ఉపరితలం మీద సంచరిస్తూ ఒక్కోసారి కలిసిపోయి మహా ఖండాలుగా రూపాంతరం చెందాయి. ఇంచుమించు 75 కోట్ల సంవత్సరాల క్రితం, మనకి తెలిసిన మహా ఖండం రొడీనియా ముక్కలవటం మొదలయింది.60–54 కోట్ల సంవత్సరాల క్రితం అవి మళ్లీ కలిసి పనోషియా అనే మహా ఖండం గాను, ఆ తరువాత పాంజియా అనే మహా ఖండం గానూ అవతరించింది. సుమారు 18 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ముక్కలుగా విడిపోయింది.

ప్రస్తుతం గడుస్తూ ఉన్న మంచుయుగాల చక్రం 4 కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది.3 కోట్ల సంవత్సరాల కిందట ప్లైస్టోసీన్ ఇపోక్‌లో ఇది ఉధృతమైంది. ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేరుకోవడం (గ్లేసియేషన్), మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి 40, 000 - 1,00,000 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతూ వచ్చింది. చిట్త చివరి గేల్సియేషన్ ముగిసి 10,000 సంవత్సరాలైంది.

జీవ ఆవిర్భావం, పరిణామం

ప్రస్తుతం జీవ ఆవిర్భావానికి తోడ్పడే పర్యావరణాన్ని కలిగి ఉన్నది భూగ్రహం ఒక్కటే. నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన రసాయనిక చర్యల వలన స్వీయ పునస్సృష్టి చేసుకోగల కణాలు ఏర్పడ్డాయి. జీవరాశులు కిరణజన్యుసంయోగక్రియ (ఫోటోసింథసిస్) ద్వారా సూర్యుని శక్తిని వినియోగించుకోవడం మొదలు పెట్టాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడింది. ఈ ఆక్సిజన్ ప్రోగయ్యి అతినీలలోహిత కిరణాల సంయోగం వలన వాతావరణంపై భాగాన ఓజోన్ పొర (ఓజోన్ పొర అనగా పర్యావరణ ఉపరితలంలో పరమాణువు రూపంలో ఏర్పడిన ఆక్సిజన్) ఏర్పడింది. చిన్న కణాలూ పెద్ద కణాలతో కలిసి సంక్లిష్టమైన ఆకృతిగల యూకర్యోట్లు ఆవిర్భవించాయి. ఒక ప్రదేశంలో ఉన్న కణాలు పరిణితి చెంది బహు కణజీవులుగా రూపాంతరం చెందాయి. ఓజోన్ పొర ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను పీల్చుకోవటంతో భూమిపై జీవులు విస్తరించాయి.

75 నుండి 58 కోట్ల సంవత్సరాల మధ్య పెద్ద మంచు పలకలు భూమిని పూర్తిగా కప్పినట్లు 1960 లో ఊహించారు. ఈ ఊహాజనిత అధ్యయనాన్ని స్నో బాల్ ఎర్త్ గా అభివర్ణించారు. దీని వెనువెంటనే కేంబ్రియన్ ఎక్స్‌ప్లోజన్ (కేంబ్రియన్ విస్తరణ) సంభవించింది. ఆ ఎక్స్‌ప్లోజన్ లోనే బహుకణ జీవులు విస్తరించాయి.

కేంబ్రియన్ ఎక్స్‌ప్లోజన్ తరువాత సుమారు 53.5 కోట్ల సంవత్సరాల కిందట, అయిదు సార్లు సామూహిక వినాశనాలు జరిగాయి. ఆఖరి వినాశనము 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు జరిగింది. ఆ వినాశనములో డైనోసార్లు, ఇతర సరీసృపాలూ అంతరించి పోయాయి. కొన్ని క్షీరదాలు, మరికొన్ని చుంచులను పోలిన చిన్న జంతువులూ మాత్రమే బ్రతికాయి. గత 6.5 కోట్ల సంవత్సరాలుగా అనేక రకాల క్షీరదాలు ఆవిర్భవించి విస్తరించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు రెండు కాళ్ళ మీద నిలబడ గలిగింది. ఇది పనిముట్ల వాడుకకు, సంభాషణల ఎదుగుదలకూ తోడ్పడింది. తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు సమకూరాయి. ఇది మానవ పరిణామానికి దోహదపడింది. వ్యవసాయం, తద్వారా నాగరికతలూ అభివృద్ధి చెందటంతో మానవులు భూమిని చాలా తక్కువ కాలంలోనే శాసించ గలిగారు. ఇతర జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం పడింది.

భవిష్యత్తు

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
సూర్యుని యొక్క జీవితం

భూగ్రహపు దీర్ఘకాలిక భవిష్యత్తు సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. సూర్యుని వెలుగు, వచ్చే 110 కోట్ల సంవత్సరాలలో 10 శాతం పెరుగుతుంది. తరువాతి 350 కోట్ల సంవత్సరాలలో ఇంకొక 40% పెరుగుతుంది. భూమిని తాకే సూర్య కిరణాలు వాటి యొక్క ప్రభావాన్ని భూమిపై ఉన్న సముద్రాల మీద చూపిస్తాయి.

భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, కిరణజన్యుసంయోగ క్రియ జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశనమౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి. మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది. ఉపరితల ఉష్ణోగ్రత 70 °C కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది. వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు. సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.

సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యుడు, దాని వ్యాసార్ధం ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు. అప్పుడు భూమి గతి ఏమౌతుందనేది ఇంకా స్పష్టంగా లేదు. రెడ్ జయింట్‌గా మారాక సూర్యుడు 30% ద్రవ్యరాశిని కోల్పోతుంది. దాంతో భూమిపై టైడల్ ప్రభావం నశించి భూమి తన కక్ష్య (సగటు కక్ష్యా దూరం: 1.0 ఏస్ట్రొనామికల్ యూనిట్ - AU) నుండి దూరం జరుగుతూ, సూర్యుడు గరిష్ఠ పరిమాణానికి చేరుకునేటప్పటికి 1.7 ఏస్ట్రొనామికల్ యూనిట్ల (AU) దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంటుంది. సూర్యుని కాంతి, వేడి పెరగటంతో చాల వరకూ జీవం నశించి పోతుంది. టైడల్ ఫోర్సుల ప్రభావం వల్ల భూమి కక్ష్య క్రమక్రమంగా క్షీణిస్తూ, సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించి ఆవిరై పోతుంది.

కూర్పు, ఆకారం

భూమి రాతి (టెరెస్ట్రియల్) గ్రహం. అంటే గట్టి నేల కలిగినది. గురు, శని గ్రహాల్లాగా వాయు గ్రహం కాదు. నాలుగు రాతి గ్రహాల లోనూ భూమి అతి పెద్దది - పరిమాణం లోను, బరువులోనూ. ఈ నాలుగు గ్రహాలలో, భూమికి ఎక్కువ సాంద్రత, ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి, దృఢమైన అయస్కాంత శక్తీ కలిగి ఉంది. వీటిలో చైతన్యవంతమైన ప్లేట్ టెక్టోనిక్స్ కలిగినది భూ గ్రహం మాత్రమే.

రూపము

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
అంతర గ్రహాల పరిమాణాల పోలిక (ఎడమ నుండి కుడికి): బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు

భూమి రూపు గోళాకారానికి దగ్గరగా ఉంటుంది. ధ్రువాల వద్ద అణచి భూమధ్యరేఖ వద్ద సాగదీసినట్లుగా ఉంటుంది. ధ్రువాల వద్ద వ్యాసం కంటే భూమధ్య రేఖ వద్ద వ్యాసం 43 కి.మీ. ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగానే భూమి కేంద్రం నుండి నుంచి అత్యంత ఎక్కువ దూరం ఉండే ఉపరితల ప్రదేశం (6384.4 కి.మీ.) ఈక్వడార్లో ఉన్న చింబొరాజో పర్వతాగ్రం. సగటు వ్యాసం 12,742 కి.మీ.

భూమి ఒక కచ్చితమైన వృత్తంగా ఉండక, ప్రాంతీయ టోపోగ్రఫీలో చిన్న చిన్న తేడాలుంటాయి. అన్నిటికంటే ఎక్కువ ప్రాంతీయంగా మార్పులు ఉన్నవి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం వద్ద (సముద్రమట్టం కంటే 8, 848 మీటర్లు ఎత్తులో ఉన్నది) 0.14%, మారియానా ట్రెంచ్ (సముద్రమట్టం నుండి 10, 911 మీటర్లు లోతున ఉన్నది) 0.17% గరిష్ఠంగా తేడా ఉంటుంది.

యఫ్. డబల్యు. క్లార్క్ రూపొందించిన టేబుల్ అఫ్ క్రస్ట్ ఆక్సిడ్స్.
మిశ్రమం సూత్రం కూర్పు
సిలికా SiO2 59.71%
అల్యూమినా Al2O3 15.41%
సున్నం CaO 4.90%
మెగ్నేసియా MgO 4.36%
సోడియం ఆక్సైడ్స్. Na2O 3.55%
ఐరన్(II) ఆక్సైడ్స్ FeO 3.52%
పొటాషియం ఆక్సైడ్స్ K2O 2.80%
ఐరన్(III) ఆక్సైడ్స్ Fe2O3 2.63%
నీరు H2O 1.52%
టైటానియం డై ఆక్సైడ్స్ TiO2 0.60%
ఫాస్ఫరస్ పెంటాక్సైడ్స్ P2O5 0.22%
మొత్తం 99.22%

రసాయనిక కూర్పు

భూమి ద్రవ్యరాశి సుమారు 5.98×1024 కె.జి. భూమి ఎక్కువగా ఇనుము (32.1%), ఆక్సిజన్ (30.1%), సిలికాన్(15.1%), మెగ్నీేషీియం (13.9%), సల్ఫర్ (2.9%), నికెల్ (1.8%), కాల్షియం (1.5%), అల్యూమినియం (1.4%); మిగతా 1.2% లో ఇతర పదార్థాలనూ కలిగి ఉంది. గర్భం (కోర్) అంతా ముఖ్యంగా ఇనుము (88.8%), ఇంకా కొంచం నికెల్ (5.8%), సల్పర్ (4.5%) లతో కూడుకుని ఉంది. ఇతర చిల్లరమల్లర పదార్థాలు 1% కన్నా తక్కువ ఉన్నాయి.

భూమి క్రస్ట్ లో ఉన్న రాళ్ళ సమ్మేళనంలో ఉన్నవి దాదాపుగా అన్నీ అక్సైడ్‌లే; క్లోరిన్, సల్ఫర్, ఫ్లోరిన్ లాంటి ఇతర పదార్థాలు అన్నీ కలిపి 1% కి మించవు. ఈ ఆక్సైడ్‌లలో కూడా 90% వరకూ ఉన్నవి 11 ఆక్సైడ్‌లే. వాటిలో ప్రధానమైనవి సిలికా, అల్యూమినా, ఐరన్ అక్సైడ్‌లు, లైమ్, మెగ్నీషియా, పోటాష్, సోడా అనేవి ప్రధానమైనవి.

అంతర్భాగం

భూమి అంతర్భాగం ఇతర రాతి గ్రహాల లాగానే వాటి రసాయనిక, భౌతిక లక్షణాలను బట్టి పొరలుగా విభజించబడింది. భూమి బయటి పొర ఇసుక రాయితో (సిలికేట్) ఏర్పడింది. దాని క్రింద చిక్కటి మ్యాంటిల్ వ్యాపించి ఉంది. క్రస్టును, మ్యాంటిల్‌నూ వేరు చేస్తూ 'మొరోవికిక్ డిస్కన్టిన్యుటి' ఉంటుంది. క్రస్టు మందం మహా సముద్రాల క్రింద 6 కిలో మీటర్లు, ఖండాల క్రింద 30-50 కిలో మీటర్లు ఉంటుంది. క్రస్టును, మ్యాంటిల్ కు పైన ఉండే చల్లటి గట్టి మ్యాంటిల్ భాగాన్నీ కలిపి శిలావరణం (లితోస్పియర్) అంటారు. ఈ శిలావరణం లోనే టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. శిలావరణం కింద కొంచం తక్కువ ఘనీభవించి ఉండే పొరను అస్థెనోస్పియర్ అంటారు. దీనిపైన లితోస్పియర్ తేలుతూ ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే స్పటిక నిర్మాణాలలోని ముఖ్యమైన మార్పులు ఉపరితలం నుండి 410 నుంచి 660 కిలో మీటర్ల దిగువన చోటు చేసుకుంటాయి. మ్యాంటిల్‌కు దిగివన బాగా పలుచని ద్రవరూపంలో ఉండే బయటి గర్భం (ఔటర్ కోర్) ఉంటుంది. ఇది ఘన రూపంలో ఉండే అంతరగర్భానికి పైన ఉంటుంది. ఈ అంతర గర్భం మిగతా భూమి కంటే ఎక్కువ కోణీయ వేగంతో తిరుగును. ఈ కారణంగా అంతర గర్భం మిగతా భూమి కంటే సవత్సరానికి 0.1 నుండి 0.5 డిగ్రీల వరకూ ఎక్కువ తిరుగుతుంది.

భూమి పొరలు.
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 

కోర్ నుంచి ఎక్సోస్పియర్ వరకు భూమి (స్కేలు బద్ధం కాదు)
లోతు
కిలో మీటర్లు
పొర సాంద్రత
గ్రా/సెం3
0–60 లితోస్పియర్
0–35 ... క్రస్ట్ 2.2–2.9
35–60 ... పై కప్పు (మ్యాంటిల్) 3.4–4.4
35–2890 కప్పు 3.4–5.6
100–700 ... ఆస్థెనోస్పియర్
2890–5100 బాహ్య గర్భం (ఔటర్ కోర్) 9.9–12.2
5100–6378 అంతర గర్భం (ఇన్నర్ కోర్) 12.8–13.1

ఉష్ణం

భూమి అంతర్గత ఉష్ణంలో 20% వరకు గ్రహం రూపుదిద్దుకునే క్రమంలో (ఎక్రీషన్) జనించిన ఉష్ణంలో మిగిలిపోయిన భాగం ఉంటుంది. మిగతా 80% రేడియో ధార్మిక వికిరణం (రేడియో యాక్టివ్ డికే) వలన కలుగుతుంది. భూమి మీద వేడిని పుట్టించే ఐసోటోపుల్లో ప్రధానమైనవి పొటాసియం-40, యురేనియం-238, థోరియం-232. భూకేంద్రంలో ఉష్ణోగ్రత 6,000 °C వరకు ఉండవచ్చు, అక్కడ పీడనం 360 జిపిఏ (5.2 కోట్ల పిఎస్‌ఐ లేదా 35,85,274 బార్) వరకూ ఉండవచ్చు ఉష్ణం చాలావరకు రేడియో ధార్మిక వికిరణం వలన కలుగుతోంది కాబట్టి, భూమి పుట్టిన తొలనాళ్ళలో తక్కువ అర్ధ జీవిత కాలం ఉండే ఐసోటోపులు అంతం అవక ముందు, ఉష్ణ జననం చాలా ఎక్కువ ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.300 కోట్ల సంవత్సరాల క్రితం ఉత్పత్తి అయిన ఉష్ణం, నేటి ఉష్ణానికి రెట్టింపు ఉండేది. ఇందువలన టెక్టోనిక్ ప్లేట్లు ఎక్కువయ్యి అగ్ని మయమైన రాళ్లు (కోమటైట్స్) ఏర్పడేవి. నేడు ఉష్ణోగ్రత తగ్గటం వల్ల అవి ఏర్పడటం లేదు.

వర్తమానంలో వేడిని ఉత్పత్తి చేస్తున్న ఐసోటోపులు
ఐసోటోపులు ఉత్పత్తి అయిన వేడి

[వాట్లు /కేజి ఐసోటోపు]

హాఫ్-లైఫ్

[సంవత్సరములు]

మాంటిల్ యొక్క సారము

[కేజి ఐసోటోపు/కేజి మాంటిల్]

ఉత్పత్తి అయిన వేడి

[వాట్లు/కేజి మాంటిల్]

238U 9.46 × 10-5 4.47 × 109 30.8 × 10-9 2.91 × 10-12
235U 5.69 × 10-4 7.04 × 108 0.22 × 10-9 1.25 × 10-13
232Th 2.64 × 10-5 1.40 × 1010 124 × 10-9 3.27 × 10-12
40K 2.92 × 10-5 1.25 × 109 36.9 × 10-9 1.08 × 10-12

భూమి నుంచి బయటకి వెళ్ళే మొత్తం ఉష్ణం 4.2 × 1013 Watts. భూమి కోర్ నుండి కొంత శాతం వేడి మాంటిల్ ప్లూమ్స్ (రాతితో కూడిన ఉష్ణ ప్రవాహాలు) ద్వారా క్రస్టుకు చేరుకుంటుంది. ఎక్కువ శాతం ఉష్ణం భూమి నుంచి టెక్టోనిక్ ప్లేట్ల ద్వారా, మహా సముద్రాల మధ్య ఉండే రిడ్జెస్ ద్వారా బయటకి పోతుంది. మిగతా ఉష్ణం క్రస్టు నుండి ఉష్ణవాహన (కండక్షన్) ప్రక్రియ ద్వారా పోతుంది. మహా సముద్రాల కింది క్రస్ట్ ఖండాల వద్ద కంటే పలుచగా ఉండటం వలన ఈ ప్రక్రియలో పోయే ఉష్ణంలో అధిక శాతం ఇక్కడి నుండే పోతుంది.

టెక్టోనిక్ ప్లేట్లు

భూమి యొక్క ముఖ్యమైన ఫలకాలు
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
ప్లేట్ పేరు వైశాల్యం
106 km²
పసిఫిక్ ప్లేట్ 103.3
అఫ్రికాన్ ప్లేట్ 78.0
ఉత్తర అమెరికన్ ప్లేట్ 75.9
యూరేషియన్ ప్లేట్ 67.8
అంటార్కిటిక్ ప్లేట్ 60.9
ఆస్ట్రేలియన్ ప్లేట్ 47.2
దక్షిణ అమెరికన్ ప్లేట్ 43.6

భూమి కఠినమైన బయటి పొర - శిలావరణం - టెక్టోనిక్ ప్లేట్లు గా విభజించబడీంది. ఈ ఫలకాలు ఒక దానితో ఒకటి సాపేక్షికంగా కదులుతూ ఉంటాయి. ఈ చలనాలు మూడు రకాలుగా ఉంటాయి. కన్వర్జంట్ బౌండరీల వద్ద ఇవి ఒకదానికొకటి దగ్గరగా కదులుతాయి. డైవర్జంట్ బౌండరీల వద్ద ఒకదానికొకటి దూరంగా కదులుతాయి. ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీ వద్ద ఒకటి పైకి ఒకటి కిందికీ (లేటరల్‌గా) కదులుతాయి. ఈ ఫలకాల హద్దుల వెంట భూకంపాలు, అగ్నిపర్వతం విస్ఫోటనాలు, పర్వతాలు ఏర్పడటం, సముద్రాల్లో అగడ్తలు ఏరపడటం వంటివి జరుగుతాయి. టెక్టోనిక్ ప్లేట్లు మాంటిల్‌కు పై భాగాన ఉండే ఆస్తనోస్ఫియర్ పైన ఉంటాయి.

కంవర్జెంట్ బౌండరీల వద్ద మహా సముద్రాల కింద ఉన్న క్రస్టు ఫలకాల కిందికి చొచ్చుకుపోతుంది. అదే సమయంలో డైవర్జెంట్ బౌండరీల వద్ద సముద్రాల కింద పర్వతాగ్రాలు ఏర్పడతాయి. ఈ చర్యల కారణంగా సముద్రాల క్రస్టు, మాంటిల్ గా మారిపోతూంటుంది. ఈ విధానం పదేపదే జరగడం వల్ల చాల వరకు సముద్రపు క్రస్టు వయసు 10 కోట్ల సంవత్సరాలకు లోపే ఉంటుంది. అన్నిటికన్నా పాత సముద్రపు క్రస్టు పశ్చిమ పసిఫిక్ సముద్రం వద్ద ఉంది. దీని వయసు 20 కోట్ల సంవత్సరాలు.. దీనితో పోలిస్తే ఖండాల క్రస్టు 403 కోట్ల సంవత్సరాల నాటిది.

ఏడు పెద్ద ఫలకాలు - పసిఫిక్, నార్త్-అమెరికన్, యూరేసియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో-ఆస్ట్రేలియన్, సౌత్-అమెరికన్ ఫలకాలు. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్ తో 50 నుండి 55 మిలియన్ సంవత్సరాల మధ్య కలిసి ఉండేది. ఒషనిక్ ప్లేట్లు వేగంగా కదిలే ప్లేట్లు, ఇవి కాకస్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్ తో కలిసి కదులుతాయి. కాకస్ ప్లేట్ కదిలే వేగం సంవత్సరానికి 75మి.మీ. పసిఫిక్ ప్లేట్ కదిలే వేగం ఏడాదికి 52-69 మి.మీ. అత్యంత నెమ్మదిగా పయనించే ప్లేటు యూరేసియన్ ప్లేట్, దీని వేగం 21 మి.మీ.

ఉపరితలం

భూమి ఉపరితల వైశాల్యం మొత్తం 51 కోట్ల చ.కి.మీ. ఇందులో 70.8%, అంటే 36.1 కోట్ల చ.కి.మీ సముద్ర మట్టానికి కింద ఉంటుంది. చాల మటుకు కాంటినెంటల్ షెల్ఫ్, పర్వత శ్రేణులు అగ్ని పర్వతాలు, కాలువలు, సముద్రపు పీఠభూములు, లోయలూ సముద్రాల క్రింద ఉన్నాయి. మిగతా 29.2% అంటే 14.894 కోట్ల చ.కి.మీ. పర్వతాలతో, ఎడారులతో, పీఠభూములతో, ఇతర పదార్థాలతో నిండి ఉంది.

గ్రహాల యొక్క పైభాగంలో, వాటి యొక్క రూపాలలో మార్పులు వస్తాయి, భూగర్భ కాల పరిమితి ప్రకారం టెక్టోనిక్స్ ఎరోషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఉపరితలం మీద టెక్టోనిక్ ప్లేట్లు కాల క్రమేణా వాతావరణమునకు, ఉష్ణ చక్రాలకు రసాయన చర్యలకు మార్పులు చెందినది. మంచు ముక్కలు, సముద్రపు ఒడ్డున నేల, నీటిలో మునిగి ఉండు రాతి గట్లు, ఉల్కల తాకిడి వంటి కారణాల వల్ల భూమి ఉపరితలం రూపాంతరం చెందింది.

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
Present day Earth altimetry and bathymetry. Data from the National Geophysical Data Center's TerrainBase Digital Terrain Model.

ఖండాల క్రస్టు తక్కువ సాంద్రత కలిగిన అగ్నిమయమైన రాళ్ళు, నల్ల రాయి (గ్రానైట్), యాండసైట్ మొదలైన పదార్దాలను కలిగి ఉంది. అధిక సాంద్రత కలిగిన అగ్నిపర్వత రాయి - బసాల్ట్ - తక్కువ మోతాదులో ఉంది. (ఇది సముద్రాల అడుగున ముఖ్యంగా ఉంటుంది).

నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరీ రాయి ఏర్పడుతుంది. ఖండాల యొక్క పైభాగంలో 75% సెడిమెంటరీ రాతితో కూడుకుని ఉంది, అయితే క్రస్టులో వీటి భాగం 5 శాతమే. భూమిపై దొరికే మూడవ రకం రాయి, మెటామార్ఫిక్ రాయి. అతి పురాతనమైన రాయి, అధిక వత్తిడి వలన గాని, అధిక ఉష్ణం వలన గాని లేదా ఈ రెండింటి వలన గానీ మార్పు చెంది ఈ రాయి ఏర్పడుతుంది. భూమి మీద విస్తారంగా లభించే ఇతర సిలికేట్ ఖనిజాలు - క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, యామ్ఫిబోల్, అభ్రకం (మైకా), ఫైరోక్సీన్, ఓలివైన్. సాధారణంగా లభించే కార్బొనేట్ ఖనిజాలు - కాల్సైట్, డోలమైట్.

భూ ఉపరితలపు ఎత్తు కనిష్ఠంగా డెడ్ సీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠంగా ఎవరెస్ట్ శిఖరం వద్ద 8,848 మీటర్లు. సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు.

పెడోస్ఫియర్ అనేది ఖండాల ఉపరితలం పైన ఉండే పొర. అది మొత్తం మట్టితో కూడుకుని ఉంటుంది. మట్టి ఏర్పడేది ఇక్కడే. మొత్తం నేలలో 10.9% సాగు భూమి కాగా 1.3% నేలలో ఎల్లప్పుడూ పంటలు పండుతాయి. భూమ్మీద ఉన్న నేలలో 40% వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. (సుమారు 1.67 కోట్ల చదరపు కిలో మీటర్ల నేల పంట పొలాలకు, 3.35 చదరపు కిలో మీటర్ల నేల పచ్చిక బయళ్ళకు ఉపయోగిస్తున్నారు).

జలావరణం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
Elevation histogram of the surface of the Earth. Approximately 71% of the Earth's surface is covered with water.

సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమిపై మాత్రమే నీరు ఉంది, అందుకే దానిని "నీలి గ్రహం"అని అంటారు. మహా సముద్రాలు మాత్రమే కాకుండా, ఖండాతర్గత సముద్రాలు, నదులు, సరస్సుల్లోని నీళ్ళు, భూమి లోపల 2,000 మీ లోతు వరకూ ఉన్న భూగర్భ జలం కూడా జలావరణంలో భాగమే. నీటిలో అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహా సముద్రంలో మారియానా ట్రెంచ్ వద్ద ఉన్న ఛాలెంజర్ డీప్. దీని లోతు 10,911.4 మీటర్లు.

మహా సముద్రాల ద్రవ్యరాశి 1.35 ×1018 మెట్రిక్ టన్ వరకు ఉండచ్చు, ఇది భూమి మొత్తం బరువులో 1/4400 వ వంతు. మహా సముద్రాల విస్తీర్ణం 36.18 కోట్ల కి.మీ2, సగటు లోతు 3,682 మీ., ఘనపరిమాణం 138.6 కోట్ల కి.మీ.3. సముద్రాల్లోని నీటిని మొత్తం భూమి అంతా సమానంగా పరిస్తే, నీటి లోతు 2.7 - 2.8 కి.మీ. వుంటుంది.

భూమ్మీది నీటిలో 97.5% కన్నా ఎక్కువ ఉప్పునీరే. మిగతా 2.5% మాత్రమే మంచి నీరు. మంచినీటిలో 68.7% వరకూ మంచుగడ్ద రూపంలో ఉంది.

సముద్రపు నీటిలో ఉప్పు శాతం సుమారు 3.5% ఉంటుంది. ఈ ఉప్పు చాల మటుకు, అగ్ని పర్వతాల నుండి, అగ్ని మయమైన రాళ్ల నుండి విడుదలయిందే. మహా సముద్రాల్లోని నీటిలో వాతావరణంలో ఉండే అనేక వాయువులు కరిగి ఉంటాయి. దీని వల్లే చాల జీవ రాసులు సముద్రంలో జీవించ గలుగుతున్నాయి. మహా సముద్రాలు పెద్ద ఉష్ణాశయం లాగా పని చేసి, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మహా సముద్రాల ఉష్ణోగ్రతలో కలిగే మార్పుచేర్పుల కారణంగా ఎల్ నినో- సదరన్ ఆసిలేషన్ వంటివి ఏర్పడి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.

వాతావరణం

భూమిపై సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 101.325 కిలో పాస్కల్ ఉంటుంది. వాతావరణం 8.5 కిలో మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉంటుంది. వాతావరణంలో 78.084% నత్రజని, 20.946% ఆక్సిజన్ 0.934% ఆర్గాన్, కొద్ది మోతాదుల్లో ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువులూ ఉన్నాయి. నీటి ఆవిరి 0.01% నుండి 4% వరకూ మారుతూ ఉన్నా, సగటున 1% ఉంటుంది. ట్రోపోస్పియరు ఎత్తు ధ్రువాల దగ్గర 8 కిలో మీటర్లు, భూమధ్య రేఖ వద్ద 17 కిలో మీటర్లు ఉంటుంది. ఋతువులను బట్టి, శీతోష్ణస్థితిని బట్టీ ఇది మారుతూంటుంది.

భూమిపై ఉన్న జీవావరణం వాతావరణాన్ని మార్చేసింది. 270 కోట్ల సంవత్సరాల క్రితం కిరణ జన్యు సంయోగ క్రియ మొదలైంది. దీని వల్ల నత్రజని, ఆక్సిజనులతో కూడిన నేటి వాతావరణం ఏర్పడింది. దీనితో, ఆక్సిజను వలన వృద్దిచెందే జీవులు ఆవిర్భవించాయి. ఓజోన్ పొర ఏర్పడటానికి కూడా పరోక్షంగా ఇదే కారణం. ఈ ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను (అల్ట్రా వయొలెట్) అడ్డుకుని జీవ వృద్ధికి తోడ్పడింది. వాతావరణానికి సంబందించిన ఇతర ప్రక్రియలలో ముఖ్యమైనవి - నీటి ఆవిరిని రవాణా చేయటం, ఉపయోగ కరమైన వాయువులను అందుబాటులో ఉంచడం, భూమిపైకి వచ్చే చిన్న చిన్న ఉల్కలను భూమిని తాకక ముందే వాతావరణంలో మండించెయ్యడం, ఉష్ణోగ్రతను నియంత్రించడం మొదలైనవి. ఈ ఆఖరి ప్రక్రియని గ్రీన్ హౌస్ ప్రభావం అని అంటారు: వాతావరణంలో ఉన్న పరమాణువులు భూమిలో ఉన్న ఉష్ణ శక్తిని గ్రహించి వాతావరణ ఉష్ణోగ్రతను పెంచుతాయి. వాతావరణంలో ఆవిరి, కార్బన్ డియక్సైడ్, మీథేన్, ఓజోన్ లు ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువులు. ఈ విధంగా వేడిని గ్రహించి ఉంచక పోతే వాతావరణపు సగటు ఉష్ణోగ్రత ప్రస్తుతమున్న +15 °C కాకుండా −18 °C వరకు తగ్గిపోయి, ప్రస్తుతమున్న జీవజాలం లాంటిది ఉండకపోయేది.

వాతావరణం, శీతోష్ణ స్థితి

భూమి యొక్క వాతావరణానికి ఒక కచ్చితమైన సరిహద్దు లేదు. ఎత్తుకు వెళ్లేకొద్దీ అది పల్చబడుతూ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పటికి పూర్తిగా అదృశ్యమౌతుంది. వాతావరణం యొక్క బరువులో సుమారు మూడు వంతులు మొదటి 11 కి.మీ. లోనే వ్యాపించి ఉంటుంది. అన్నిటి కంటే కింద ఉన్న పొరను ట్రోపోస్ఫియర్ అని అంటారు. సౌర శక్తి కారణంగా ఈ పొర, దాని కింద ఉన్న భూ ఉపరితలమూ వేడెక్కుతాయి. ఆ వేడికి గాలి వ్యాకోచిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన ఈ వేడి గాలి పైకి పోయి, ఎక్కువ సాంద్రత కలిగిన చల్లటి గాలి కిందికి దిగుతుంది. దీని వల్ల వాతావరణంలో గాలులు ఏర్పడి శీతోష్ణ స్థితిలో మార్పులు కలుగజేస్తాయి.

వాతావరణంలో ఏర్పడే గాలుల్లో ప్రధానమైనవి - భూ మధ్య రేఖ వద్ద 30° అక్షాంశాల మధ్య విస్తరించిన వాణిజ్య పవనాలు (ట్రేడ్ విండ్స్), 30° - 60° అక్షాంశాల మధ్య ప్రాంతంలో వీచే పడమటి గాలులు. సముద్రపు గాలులు కూడా వాతావరణాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా థర్మోహాలైన్ సర్కులేషన్ అనే ప్రక్రియ ద్వారా భూమధ్య రేఖ ప్రాంతం వద్దనున్న ఉష్ణశక్తిని ధ్రువాల వద్దకు చేరుస్తాయి.

భూమి ఉపరితలం మీద వ్యాప్తి చెందిన నీటి ఆవిరి వాతావరణంలోకి ఒక క్రమ పద్ధతిలో రవాణా అవుతుంది. వాతావరణ స్థితి కారణంగా వేడి, తడి గాలి పైకి వెళ్ళినపుడూ ఈ ఆవిరి చల్లబడి నీరుగా, మంచుగా కురుస్తుంది. అలా కురిసిన నీటిలో చాల వరకు నదుల ద్వారా తిరిగి సముద్రాల్లోకి, కొంత భాగం సరస్సుల్లోకీ చేరుతుంది. ఈ నీటి చక్రం భూమి మీద జీవులు బ్రతకడానికి చాల ముఖ్యమైన ప్రక్రియ. దీని వల్లే భూమి ఉపరితలం మీద ఉన్న మట్టి కొట్టుకు పోయి ఉపరితలంపై క్రమేపీ మార్పులు వస్తాయి. నీరు క్రిందకి చేరుకునే ప్రక్రియ ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల ఏడాదికి కొన్ని మీటర్ల లోతున, మరికొన్ని చోట్ల మిల్లీ మీటర్ల లోతున నీరు చేరుకుంటుంది. వివిధ ప్రాంతాల్లో ఉపరితలంలోని అంతరాలు, వాతావరణంలోని గాలులు, ఉష్ణంలోని తేడాలు, మొదలైన వాటి వల్ల ఆయా ప్రాంతాల్లోని వర్షపాతంలో తేడాలు సంభవిస్తూంటాయి.

పై అక్షాంశ్శాల వద్దకు వెళ్ళేకొద్దీ, భూ ఉపరితలంపై చేరుకునే సౌరశక్తి తగ్గుతూ ఉంటుంది. పై అక్షాంశాల వద్ద సూర్య కిరణాలు తక్కువ కోణంలో పడతాయి. పైగా అవి సాంద్రమైన వాతావరణ పొరల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితంగా సముద్ర మట్టం వద్ద ఉండే సగటు వార్షిక ఉష్ణోగ్రత భూమధ్య రేఖ నుండి పై అక్షాంశాలకు వెళ్ళే కొద్దీ ఒక్కో డిగ్రీ అక్షాంశానికి 0.4 °C చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ పోతుంది.

ఉపరి వాతావరణం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
భూ కక్ష్య నుండి చండ్రుడి దృశ్యం. భూ వాతావరణం పూర్ణ చంద్రుడిని కొంత కమ్మేసింది. నాసా ఫోటో

ట్రోపోస్ఫియర్ పైన, వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది. అవి స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్. ప్రతి పొరలోను పైకి పోయే కొద్దీ వాతావరణంలో కలిగే మార్పుల రేటు విభిన్నంగా ఉంటుంది. వీటికి పైన ఉండే ఎక్సోస్ఫియర్ పైకి పోయే కొద్దీ పల్చబడి, చివరికి అంతమై అక్కడ అయస్కాంతావరణం (మాగ్నెటోస్ఫియర్) లో కలిసిపోతుంది. ఈ అయస్కాంతావరణంలో సౌర పవనాలను భూఅయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. స్ట్రాటోస్ఫియర్ లోనే ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను పాక్షికంగా అడ్డుకుంటుంది. అందుచేత జీవకోటికి ఇది చాలా ముఖ్యమైనది. భూమికి పైన 100 కి.మీ. వద్ద ఉన్నట్లుగా నిర్వచించిన కార్మన్ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికీ మధ్య సరిహద్దు రేఖగా భావిస్తారు.

ఉష్ణశక్తి వల్ల, ఉపరి వాతావరణంలో ఉండే కొన్ని పరమాణువుల వేగం పెరిగి భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని అంతరిక్షంలోకి పోతాయి. దీనివల్ల నెమ్మదిగా వాతావరణం అంతరిక్షంలోకి తప్పించుకుని వెళ్లిపోతుంది. అస్థిర హైడ్రోజెన్ పరమాణు భారం తక్కువ ఉంటుంది కాబట్టి, అది మిగతా వాయువుల కన్నా త్వరగా, ఎక్కువగా తప్పించుకుపోతుంది. భూమి తొలినాళ్ళలో క్షయకరణ (రిడక్షన్) స్థితిలో ఉన్న వాతావరణం, ప్రస్తుతమున్న ఆక్సీకరణ (ఆక్సిడేషన్) స్థితికి చేరుకోవడానికి హైడ్రోజెన్ అంతరిక్షంలోకి వెళ్ళిపోవటం కూడా ఒక కారణం. కిరణజన్యు సంయోగక్రియ వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అయితే, హైడ్రోజెన్ బయటికిపోవడం అనేది, వాతావరణంలో ఆక్సిజన్ విస్తృతంగా పేరుకోవడానికి మార్గం సుగమం చేసింది. కాబట్టి, భూ వాతావరణం నుండి బయటికిపోయే హైడ్రోజెన్ యొక్క సామర్థ్యం భూమ్మీద జీవవృద్ధికి దోహదపడి ఉండవచ్చు. ప్రస్తుతం, ఆక్సిజన్ ఎక్కు ఉన్న వాతావరణంలో హైడ్రోజెన్ గాలిలో కలవక ముందే నీటి క్రింద మారుతోంది. ప్రస్తుత కాలంలో, ఉపరి వాతావరణంలోని మీథేన్ వాయువు ధ్వంసమవడం వలన హైడ్రోజెన్ నష్టం ఎక్కువగా కలుగుతోంది.

గురుత్వాకర్షణ క్షేత్రం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
నాసా వారి గ్రేస్ మిషన్ కొలిచిన భూమి గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ లోని తేడాలను ఇది చూపిస్తుంది. బలంగా ఉన్న చోట్లను ఎరుపు రంగు లోను, బలహీనంగా ఉన్నచోట్లను నీలం రంగు లోనూ చూపిస్తోంది.

భూగోళంలో ద్రవ్యరాశి విస్తరించడంతో వివిధ వస్తువులపై కలిగే త్వరణాన్ని భూమి గురుత్వాకర్షణ అంటారు. భూమి ఉపరితలం వద్ద గురుత్వ త్వరణం దాదాపు 9.8 మీ/సె2 ఉంటుంది. స్థానికంగా ఉండే ఉపరితల భౌగోళిక అంశాలు, భూగర్భ విశేషాలు, టెక్టోనిక్ ఫలకాల వంటివి గురుత్వాకర్షణలో తేడాలు కలగజేస్తాయి. వీటిని గురుత్వ వైపరీత్యాలు అంటారు.

అయస్కాంత క్షేత్రం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
భూమి అయస్కాంత శక్తి, అది డయిపోల్ కు దగ్గరగా ఉంటుంది.

భూ అయస్కాంత క్షేత్రం ప్రధానంగా గర్భంలో (కోర్) ఉద్భవిస్తుంది. డైనమో ప్రాసెస్ ద్వారా గర్భంలోని ఉష్ణ ప్రవాహాల్లోని కైనెటిక్ శక్తి ఎలక్ట్రికల్, అయస్కాంత శక్తులుగా మారుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం గర్భం నుండి బయటికి విస్తరించి, ఉపరితలాన డైపోల్‌గా అవుతుంది. ఈ డైపోల్‌ యొక్క ధ్రువాలు భూమి ధ్రువాలకు దగ్గరగా ఉంటాయి. అయస్కాంత క్షేత్రపు మధ్య రేఖ వద్ద, అయస్కాంత క్షేత్రపు శక్తి భూఉపరితలం వద్ద 3.05 × 10−5 T ఉంటుంది. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ 7.91 × 1015 T m3 ఉంటుంది. గర్భంలోని ఉష్ణ ప్రవాహాలు అవ్యవస్థంగా ఉండటంతో, అయస్కాంత ధ్రువాలు చలిస్తూ, ఒక నిర్ణీత సమయానికి అలైన్‌మెంటు మారుతూంటుంది. సుమారుగా ప్రతి పది లక్షల సంవత్సరాల కొకసారి అయస్కాంత ధ్రువాలు పరస్పరం తారుమారు అవుతాయి. కిందటిసారి ఇలా తారుమారు జరిగి 7,00,000 సంవత్సరా లయింది..

అయస్కాంతావరణం

అయస్కాంత క్షేత్రం అంతరిక్షంలో ఎంతవరకు విస్తరించిందో ఆ ప్రాంతాన్ని అయస్కాంతావరణం (మాగ్నటోస్పియర్) అంటారు. సూర్యకాంతి లోని అయాన్లు, ఎలక్ట్రాన్లను భూమిపైకి రాకుండా ఇది పక్కకు తప్పిస్తుంది. సౌర గాలుల పీడనం కారణంగా సూర్యుడికి అభిముఖంగా (పగటి వైపున) ఉన్న అయస్కాంతావరణం సంకోచించి, సూర్యుడికి అవతలి వైపున (రాత్రి వైపున) పొడవుగా, ఒక తోకలాగా విస్తరిస్తుంది.

కక్ష్య, భ్రమణం

భ్రమణం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
భూమి అక్షపు వాలు (వక్రత అంటారు). దానికి - భ్రమణాక్షానికి, కక్ష్యాతలానికీ ఉన్న సంబంధం.

భూమి తన చుట్టూ తను తిరగటానికి పట్టే కాలము, సూర్యుడితో సాపేక్షికంగా 86,400 సౌర సెకనులు (86,400.0025 SI సెకండ్లు).

స్థిరమైన నక్షత్రాలతో పోలిస్తే భూమి తన చుట్టూ తను తిరిగే కాలాన్ని 'స్టెల్లార్ డే' గా ఇంటర్నేషనల్ యర్త్ రోటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐ.ఈ.ఆర్.యస్) పేర్కొంది. ఇది 23h 56m 4.098903691s. అని కూడా పేర్కొంది.

వాతావరణంలో ఉండే ఉల్కలు, నిమ్న కక్ష్యల్లో ఉండే ఉపగ్రహాలతో పాటు మిగతా ఖగోళ వస్తువులన్నీ ఆకాశంలో పడమర దిశగా గంటకు 15° రేఖాంశాల వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తాయి. ఇది సూర్యుని లేదా చంద్రుని వ్యాసమును రెండు నిముషాలలో దాటు వేగమునకు సమానము. (సూర్య చంద్రుల పరిమాణాలు భూమిపై నుండి సమానంగా అగుపడతాయి). భూమి భ్రమణం వల్లనే సూర్యోదయాస్తమయాలు వస్తాయి.

కక్ష్య

భూ పరిభ్రమణ కక్ష్యకు సూర్యునికీ మధ్య ఉన్న సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది, దానినే ఒక సంవత్సరము, లేదా సైడిరియల్ సంవత్సరం అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ కక్ష్యలో చేసే ప్రయాణం వలన, నక్షత్రాలతో పోలిస్తే, సూర్యుడు రోజుకు సుమారు ఒక డిగ్రీ చొప్పున తూర్పుకు జరిగినట్లు కనిపిస్తుంది. ఈ చలనం వల్ల భూమి ఒక చుట్టు తిరిగి సూర్యుడు తిరిగి అదే రేఖాంశం వద్దకు చేరుకునేందుకు సగటున 24 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక సౌరదినం అంటారు. భూమి సగటు కక్ష్యావేగం సెకండుకు 30 కిలోమీటర్లు. ఈ వేగముతో భూమి తన వ్యాసానికి సమానమైన దూరాన్ని 7 నిమిషాలలోను, భూమి నుండి చంద్రుని గల దూరానికి సమానమైన దూరాన్ని 3.5 గంటల్లోనూ ప్రయాణిస్తుంది.

చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి నేపథ్యంలోని నక్షత్రాల స్థానాలను బట్టి చూస్తే 27.32 రోజుల కాలం పడుతుంది. భూమి, చంద్రుల వ్యవస్థ సూర్యుని చుట్టూ తిరిగే సామాన్య కక్ష్యను పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకు 29.53 రోజుల కాలం పడుతుంది, దీనినే ఒక చంద్ర నెల అంటారు. ఖగోళపు ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి, చంద్రుడు తమ కక్ష్యలలో చేసే ప్రయాణపు దిశ, తమతమ భ్రమణ దిశలూ అన్నీ అపసవ్య దిశలో ఉంటాయి. సూర్యుడి, భూమిల ఖగోళ ఉత్తర ధ్రువాల నుండి చూసినపుడు భూమి సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. భూమి అక్షం, దాని కక్ష్యాతలానికి 23.44 డిగ్రీల వాలుతో ఉంది. ఈ కారణం వలననే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి-చంద్రుల కక్ష్యా తలం, భూమి సూర్యుల కష్యా తలానికి ±5.1 వరకు వాలి ఉంది. ఈ వాలు లేకపోతే, ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మార్చి మార్చి)

భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం (దీన్ని హిల్‌స్ఫియర్ అంటారు) 15 లక్షల కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగిన గోళాకారములో ఉంటుంది. ఈ గోళం లోపల భూమ్యాకర్షణ శక్తి సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వ శక్తి కంటే కంటే ఎక్కువ ఉంటుంది. దీని లోపల ఉండే వస్తువులు మాత్రమే భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. అంత కంటే దూరంలో ఉన్నవి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి నుండి బయట పడతాయి.

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
పాలపుంత గాలక్సీ చిత్రం (ఫోటో కాదు) సూర్యుడి స్థానాన్ని గుర్తించారు.

భూమి, సౌర వ్యవస్థతో సహా పాలపుంత గాలక్సీలో భాగం. పాలపుంత కేంద్రం నుండి 28,000 కాంతి సంవత్సరాల దూరంలో దాని కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఇది గాలక్సీ తలానికి 20 కాంతి సంవత్సరాల ఎత్తులో ఓరియన్ బాహువులో ఉంది.

అక్షపు వాలు, ఋతువులు

భూమి అక్షం దాని కక్ష్యా తలానికి 23.439281° కోణంలో వాలి ఉంటుంది. అక్షం ఇలా వాలి ఉండటం వల్ల, భూమ్మీద సంవత్సరం పొడుగునా ఒక ప్రదేశంలో పడే సూర్యకాంతి మారుతూ ఉంటుంది. దీని వలన ఋతువులు ఏర్పడుతాయి. కర్కట రేఖ సూర్యునికి ఎదురుగా ఉన్నపుడు, ఉత్తరార్థగోళంలో వేసవి కాలం ఏర్పడుతుంది. మకర రేఖ సూర్యునికి ఎదురుగా ఉన్నపుడు, శీతాకాలం ఏర్పడుతుంది. వేసవి కాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో చాలా ఎత్తున ఉంటాడు. శీతాకాలంలో, వాతావరణం చల్లగా ఉంటుంది. పగటి సమయం తగ్గుతుంది. ఆర్కిటిక్ వృత్తం వద్ద సంవత్సరంలో సగం రోజులు పగలు అసలు వెలుగు ఉండదు. దీనిని ఒక ధ్రువీయ రాత్రి అంటారు. దక్షిణ భాగంలో, ఈ పరిస్థితి తారుమారవుతుంది.

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
అంగారకుడి నుండి చూస్తే భూమి, చంద్రుడు - మార్స్ గ్లోబల్ సర్వేయర్ తీసిన ఫోటో. అంతరిక్షం నుండి చూస్తే, భూమి కూడా చంద్రుడి లాగానే కళలకు లోనౌతుంది.

అస్త్రోనోమికాల్ లోక సమ్మతి ప్రకారం, ఎక్కువ వంగి ఉన్న భూ కక్ష్య సూర్యుడి వైపు లేదా అవతలి వైపుకు ఉండటం, కాంతి పాతము, సూర్యుని యొక్క దిక్కు, కక్ష్య యొక్క వంపు, రెండు లంబంగా ఉండటం. చలి కాలం డిసెంబరు 21, వేసవి కాలం జూన్ 21 కి దగ్గరగా, స్ప్రింగ్ కాంతి పాతము మార్చి 20 న, ఆటుమ్నాల్ కాంతి పాతం సెప్టెంబరు 23 న వస్తాయి.

భూమి యొక్క వంగి ఉండే కోణం చాల సేపటి వరకు స్థిరముగా ఉంటుంది. చాల చిన్న క్రమముగాలేని కదలికని న్యుటేషన్ అంటారు. ఈ వంకరుగా ఉన్న ప్రదేశం(టిల్ట్) కదలటానికి 18.6 సంవత్సరాల సమయం పడుతుంది. భూమి యొక్క కక్ష్య అల్లలడటం కొంత సమయం ప్రకారం మారుతుంది. ఇది 25, 800 సంవత్సరాలకి ఒక చక్రం తిరుగుతుంది. ఇదే మాములు సంవత్సరానికి సైదిరియల్ సంవత్సరానికి తేడ. ఈ రెండు కదలికలు సూర్యుని, చంద్రుని వేరు వేరు ఆకర్షణ శక్తుల వల్ల భూమి యొక్క మధ్య రేఖ వంపు దగ్గర ఏర్పడతాయి. భూమి యొక్క ధ్రువాలు కూడా దాని యొక్క ఉపరితలం మీద నుంచి కొంత దూరం వెళ్ళిపోతాయి. ఈ పోలార్ కదలికలకి చాల చక్రాలు ఉంటాయి, వీటన్నిటిని 'క్వాసి పిరియోడిక్ మోషన్'అంటారు. ఈ కదలికతో పాటు 14-నెలల చక్రం ఉంది, దానిని 'చాన్డ్లేర్ వోబుల్'అంటారు. భూమి యొక్క తిరిగే వేగమును, రోజు యొక్క పొడవు ప్రకారం కూడా కనుక్కుంటారు.

ఇప్పటి కాలంలో, భూమియొక్క పెరిహిలియన్ జనవరి 3 న, అపెహిలియన్ జూలై 4 నా ఏర్పడతాయి. ఈ రోజులు సమయం ప్రకారం మారిపోతూ ఉంటాయి, దానికి కారణం ప్రెసేషన్, కక్ష్యకు సంబంధించిన కారణాలు. ఇవి ఒక చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి, వాటిని మిలాన్కోవిట్చ్ చక్రాలు అని అంటారు. సూర్యునికి భూమికీ మధ్య దూరంలో మార్పుల వల్ల 6.9% కన్నా ఎక్కువ, పెరిహీలియన్ వద్ద భూమిని చేరే సౌర శక్తి అప్‌హీలియన్కి కూడా దగ్గరగా ఉంటుంది. భూమి యొక్క దక్షిణ భాగం సూర్యుని వైపుకు ఒకే సమయంలో కొంచం వంగి, సూర్యునికి భూమి దగ్గరగా ఉండుట వలన ఒక సంవత్సరంలో దక్షిణ భాగం, ఉత్తర భాగం కన్నా ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. భూమి యొక్క కక్ష్య కొంచం వంగి ఉండుట వలన ఈ చర్య తక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది, దక్షిణ భాగంలో మిగిలిన శక్తి ఎక్కువ నీటి మోతాదులలో అరాయించుకుంటుంది.

చంద్రుడు

ప్రత్యేకతలు
మధ్యరేఖ పొడవు/వ్యాసము. 3, 474.8 km
2, 159.2 mi
బరువు 7.349×1022 kg
8.1×1019 (short) tons
పెద్ద కక్ష 384, 400 km
238, 700 mi
ఆర్బిటాల్ పిరియడ్ 27 d 7 h 43.7 m

చంద్రుడు గ్రహం లాంటి ఉపగ్రహం. ఇది రాతి ఉపగ్రహం. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో నాలుగో వంతు ఉంటుంది. ఉపగ్రహాల పరిమాణం, వాటి మాతృగ్రహ పరిమాణాల నిష్పత్తిని పోల్చి చూస్తే ఇది సౌర వ్యవస్థ లోని ఉపగ్రహా లన్నిటిలోకీ పెద్దది. మరుగుజ్జు గ్రహం ప్లూటో యొక్క ఉపగ్రహం చరోన్ దీనికి మినహాయింపు. చంద్రుడిని ఇంగీషులో మూన్ అని అన్నట్టే, ఇతర గ్రహాల ఉపగ్రహాలను కూడా ఇంగ్లీషులో "మూన్స్" అని అంటూ ఉంటారు.

భూమికి చంద్రునికి మధ్య ఆకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో కెరటాలు ఏర్పడతాయి. భూమ్యార్షణ శక్తి వల్లనే చంద్రుడు భూమితో టైడల్ లాకింగులో ఉంటాడు. అంటే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికీ ఒకటే సమయం పడుతుంది. అందుచేతనే, ఎల్లప్పుడూ చంద్రుడి ఒకే ముఖం భూమి వైపు ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో చంద్రుడి వివిధ ప్రాంతాలపై సూర్యకాంతి పడుతుంది. దీని వల్ల చంద్రకళలు ఏర్పడతాయి.

భుమి చంద్రుల మధ్య ఉండే టైడల్ బలాల వల్ల, చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 38 మి.మీ. దూరంగా వెళ్తోంది. భూమిపై ఒక రోజుకు పట్టే సమయం సంవత్సరానికి 23 మైక్రో సెకండు చొప్పున పెరుగుతూ పోతోంది. ఈ రెండూ కలిసి కొన్ని లక్షల సంవత్సరాలలో పెద్ద మార్పులు వచ్చేందుకు కారణమౌతాయి. ఉదాహరణకు, డెవోనియన్ పీరియడ్‌లో అంటే 41 కోట్ల సంవత్సరాల క్రితం సంవత్సరానికి 400 రోజులు, రోజుకు 21.8 గంటలు ఉండేవి.

భూమి వాతావరణంపై చంద్రుడు ప్రభావం చూపిస్తూ, భూమిపై జీవాభివృద్ధికి దోహదపడింది. పురాజీవ ఆధారాలు, కంప్యూటర్ సిమ్యులేషన్లను బట్టి చూస్తే, చంద్రునితో భూమికి ఉన్న టైడల్ బలాల భూకక్ష్యలోని వాలు స్థిరపడిందని తెలుస్తోంది. ఈ సుస్థిరత లేకుండా ఉండి ఉంటే, సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ వల్ల భూమి కక్ష్య అస్తవ్యస్తంగా తయారై ఉండేదని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడి విషయంలో ఇలా జరిగి ఉంటుందని అనిపిస్తోంది.

భూమి నుంచి చూస్తే చంద్రుడు, సూర్యుల గోళాలు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. సూర్యుడి వ్యాసం చంద్రుడి వ్యాసం కంటే 400 రెట్లు ఉన్నప్పటికీ, భూమి నుండి వీటి దూరం కూడా అదే నిష్పత్తిలో ఉన్నందున ఇలా కనిపిస్తుంది. ఈ కారణం వల్లనే భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
భూమి, చంద్రుని మధ్య దూరాన్ని, వాటి పరిమాణాన్నీ కొలమానంలో చూపడం

చంద్రుడి పుట్టుక గురించి విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న పరికల్పన - మహా ఘాత పరికల్పన. అంగారకుడి పరిమాణంలో ఉన్న థేయా అనే ఒక ఆదిమ గ్రహం భూమిని గుద్దుకున్నప్పుడు చంద్రుడు ఏర్పడ్డాడు. దీనినే మహాఘాత పరికల్పన అంట్రు. చంద్రుడిపై ఇనుము లేకపోవడం, దీనిలోని పదార్థ సమ్మేళనం భుమితో సరిగ్గా సరిపోలడం లాంటి వాటిని ఈ పరికల్పన వివరిస్తుంది.

నివాసయోగ్యత

జీవం వర్ధిల్లడానికి వీలైన గ్రహాన్ని, జీవం అక్కడ ఉద్భవించకపోయినా సరే, నివాసయోగ్య గ్రహం అంటారు. జీవ రసాయనిక పరమాణువులు సమ్మేళనం చెందడానికి, జీవాభివృద్ధికి ఆవశ్యకమైన శక్తిని అందించడానికీ అనువైన ద్రవ రూప నీరు భూమిపై ఉంది. సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూకక్ష లోని ఎక్సెంట్రిసిటీ, భ్రమణ వేగం, కక్ష్య లోని వక్రత (వాలు), భూగర్భ చరిత్ర, అయస్కాంత క్షేత్రం- ఇవన్నీ భూ ఉపరితలంపైన ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులకు దోహదపడుతున్నాయి.

జీవావరణం

గ్రహం మీద ఉన్న జీవ రాశులనే జీవావరణం అంటారు. ఈ బయోస్ఫియర్ అనేది 350 కోట్ల సంవత్సరాల క్రితం మొదలయిందని భావిస్తున్నారు. విశ్వంలో భూమి ఒక్కటే ప్రాణులు జీవించగలిగే పరిసరాలను కలిగి ఉంది. భూమి లాంటి బయోస్ఫియర్స్ చాల అరుదుగా ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు.

సహజ వనరులు, భూవినియోగం

మనుషులు ఉపయోగించు కోడానికి వీలుగా భూమిపై సహజ వనరులు ఉన్నాయి. వీటిలో తిరిగి తయారు చెయ్యలేని వనరులు ఉన్నాయి. ఇవి అతి దీర్ఘ కాలంలోనే తిరిగి తయారవుతాయి.

బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు చాలా పెద్ద మొత్తాల్లో భూమి క్రస్టులో లభిస్తాయి. మానవులు వీటిని ఎక్కువగా శక్తిని ఉత్పత్తి చేయడానికి, రసాయనిక ఉత్పత్తుల కోసమూ వినియోగిస్తున్నారు. ముడి ఖనిజాలు కూడా భూమి క్రస్టులో లభిస్తున్నాయి. ఇవి టెక్టోనిక్ ఫలకాల చర్యల వలన, ఇరోజన్, మాగ్మాటిజంల చర్యల ద్వారా ఖనిజోత్పత్తి పద్ధతిలో తయారవుతాయి. ఇవి అనేక లోహాల ఖనిజాలకు ముడి వనరు.

బయోస్ఫియర్ మనుషుల కోసం చాల ప్రాకృతిక పదార్ధాలను ఉత్పత్తి చేస్తోంది. ఆహారం, చెక్క, ఔషధాలు, ఆక్సిజన్, వ్యర్ధ పదార్ధాల పునరుజ్జీవనం వంటివి వీటిలో ఉన్నాయి. నేలపై ఉండే జీవావరణం పైపొరలోని మట్టి పైన, మంచి నీటి పైనా ఆధారపడి ఉండగా, సముద్రాలలో జీవావరణం నేల మీద నుంచి కొట్టుకుపోయి నీటిలో కరిగిన పోషకాలపై ఆధారపడి వుంటుంది. మానవులు భూమిపై లభించే నిర్మాణ సామాగ్రిని వాడి నివాసాలను నిర్మిచుకుని జీవిస్తారు.1993, లో మనుషులు భూమిని వినియోగించిన శాతం(సుమారు)

భూమి వాడకం శాతము
సాగు భూమి : 13.13%
శాశ్వత పంటలు : 4.71%
పచ్చిక బయళ్ళు: 26%
అడవులు 32%
పట్టణాలు 1.5%
ఇతర: 30%

1993 నాటి అంచనాల ప్రకారం సాగు భూమి 24,81,250 చదరపు కిలోమీటర్లు

ప్రకృతి వైపరీత్యాలు

భూమిపై విస్తారమైన ప్రాంతంలో తుపానులు, హరికేన్లు, టైఫూన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతూ అక్కడి జీవజాలాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 1980 2000 మధ్య కాలంలో ఇలాంటి వైపరీత్యాల వలన ఏటా సగటున 11,800 మంది మానవులు మరణించారు. భూకంపాలు, కొండ చర్యలు విరగటం, సునామీ, అగ్ని పర్వతాలు బ్రద్దలవటం, వరదలు, కరువు, మంచు తుపానులు, సుడిగాలులు, వాన మొదలైన ప్రకృతి వైపరిత్యాలకు చాలా ప్రదేశాలు గురవుతున్నాయి.

వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆమ్ల వర్షాలు, పంటలు పండించకపోవటం, చెట్లు నరకటం, జంతువులని చంపటం, కొన్ని జాతుల జంతువులు, పక్షులూ అంతరించి పోవడం, భూసార క్షీణత మొదలైనవి మనుషుల చేసే చర్యల ద్వారా ఏర్పడుతున్నాయి.

మానవుని వలన (పరిశ్రమలు వెదజల్లే పొగలో ఉండే కార్బన్ డయాక్సైడ్) భూగ్రహం మీద వేడి పెరిగి "గ్లోబల్ వార్మింగ్"కి దారి తీస్తుంది అని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని వల్ల వాతావరణంలో చాలా ప్రమాదకర మార్పులు సంభవిస్తున్నాయి, అవి మంచు కరగటం, ఒకేసారి భూతాపం పెరగడం లేదా తగ్గటం, వాతావరణంలో మార్పులు, సముద్ర మట్టం పెరగటం లాంటివి జరుగుతాయి.

మనుషుల భూగోళ శాస్త్రం

పటములను అధ్యయనం చేయడం, తయారు చేయడాన్ని కార్టోగ్రఫీ అంటారు. భూమిని గురించి చెప్పటానికి కార్టోగ్రఫీ, జియోగ్రఫీని చారిత్రకంగా వాడతారు. అధ్యయనం (అనగా ప్రదేశాలను దూరాలను నిర్దేశించుట) నౌకాయానము (అనగా స్థితిని దిశను నిర్దేశించుట) అనునవి కార్టోగ్రఫీ, జియోగ్రఫీతో పాటుగా అభివృద్ధి చెందాయి. దీని వలన చాల వరకు విషయాలను లెక్కగట్ట గలిగారు.

2008 నవంబరు నాటికి భూమిపై జనాభా సుమారు 674 కోట్లు ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2013 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుతుంది. 2050 నాటికి 920 కోట్లకు చేరుతుంది. జనాభా పెరుగుదల ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనే వుంటుంది. మనుషుల జనాభా సాంద్రత ప్రపంచ మంతా వుంటుంది కానీ ఎక్కువ మంది మాత్రం ఆసియాలో నివసిస్తారు. 2020 నాటికి, 60% ప్రపంచ జనాభా పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా.

అధ్యయనాల ప్రకారం కేవలం 1/8 ప్రదేశం మాత్రమే మనుషులు నివసించడానికి వీలుగా ఉంది. మిగతా ప్రదేశం అంత సముద్రంతో నిండి ఉంది. మిగతా సగం ఎడారులతో (14%), పెద్ద పర్వతాలతో(27%),, ఇంకొన్ని పాత కట్టడాలతో నిండి ఉంది. ఉత్తర దిక్కులో అత్యంత దూరంలో ఉన్న మానవ శాశ్వత నివాస స్థావరం ఎల్లెస్మెరే దీవిలో ఉన్న అలెర్ట్. అది కెనడాలోని నూనావుట్‌లో (82°28′N)వుంది. దక్షిణాన అత్యంత దూరంలో ఉన్న స్థావరం, అముండ్‌సెన్-స్కాట్ ఉతర ధ్రువ స్టేషను, ఇది అంటార్కిటికాలో ఇంచుమించు ఉత్తర ధ్రువంలో ఉంది. (90°S)

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
The Earth at night, a composite of DMSP/OLS ground illumination data on a simulated night-time image of the world. This image is not photographic and many features are brighter than they would appear to a direct observer.

అంటార్కిటికా లోని కొంత ప్రదేశం తప్ప భూ గ్రహం యొక్క మొత్తం ప్రాంతాన్ని సార్వభౌమిక దేశాల అధీనంలో ఉంది. 2007 వరకు భూమ్మీద మొత్తం 201 సార్వభౌమిక దేశాలు ఉన్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి లోని 192 సభ్యదేశాలనూ కలిపిన సంఖ్య. ఇవి కాక, 72 స్వతంత్ర రాజ్యాలు, కొన్ని స్వేచ్ఛా ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలు, ఇతర ప్రదేశాలూ ఉన్నాయి. చరిత్రల ప్రకారం భూమికి ఎప్పుడు ఒక అధికారక ప్రభుత్వం లేదు. చాల ప్రపంచ దేశాలు ఈ ప్రభుత్వం లోసం పొరాడి ఓడిపోయాయి.

ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ ప్రఖ్యాత అంతర ప్రభుత్వ సంస్థ. అది ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైరాలను, యుద్ధాలను తొలగించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది ఒక ప్రపంచ ప్రభుత్వ సంస్థ. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో అన్ని దేశాల చట్టాల అంగీకారంతో, దేశాల మధ్య రాయబారం నెరపుతుంది. సభ్య దేశాల అంగీకారంతో అవసరమైతే ఆయుధాలతో కూడా మధ్య వర్తిత్వం నెరపుతుంది.

భూమి కక్ష్యలో పయనించిన మొదటి మనిషి యూరీ గగారిన్. ఇతను 1961 ఏప్రిల్ 12 న ఈ ఘనత సాధించాడు. మొత్తం 487 మందికి పైగా భూమి కక్ష్యలో పయనించారు. మొత్తం 12 మంది చంద్రుడి మీద నడిచారు. అంతరిక్షంలో ఉన్న మనుషులంటే సాధరణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆరుగురు మనుషులు ప్రతి ఆరు నలలకు ఒకసారి మారిపోతుంటారు. మనుషులు భూగ్రహం నుండి ప్రయాణించిన అత్యధిక దూరం, 1970 ల్లో అపోలో 13 భూమికి 4,00,171 కి.మీ. దూరంలో ఉన్నప్పటిది.

సాంస్కృతిక పథం

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
మొట్టమొదటి భూమి ఉదయిస్తున్న ఫొటో. అపోలో 8 నుండి తీసినది.
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం 
🜨

భూమి యొక్క సరైన అస్ట్రనామికాల్ గుర్తు ఒక వృత్తంలో శిలువ ఆకారం భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  వుంటుంది.

భూమిని దేవుడుగా ముఖ్యంగా దేవతగా వ్యాఖ్యానించారు. చాల ఆచారాలలో ఆడ దేవతలను భూమాతగా, ఫలాలనిచ్చే దేవతగా వ్యాఖ్యానించేవారు. వివిధ మతాలలో చెప్పిన కల్పిత కథల ప్రకారం భూమి ఆవిర్భావం మహిమలున్న దేవుడు లేదా దేవతలచేత జరిగింది. చాలా మతాలు, మత గ్రంథాలు, మహర్షులు, రోమన్ కాథలిక్ మత వ్యతిరేకులు, మహమ్మదీయులు భూమి యొక్క పుట్టుక గురించి, భూమి మీద జీవులు పెరగడం గురించీ చాలా బాగా వివరించారు. ఈ ప్రబోధాలను శాస్త్రవేత్తలు ఇంకొంతమంది మత పెద్దలూ తప్పని కొట్టి పారేసారు.

భూమి బల్లపరుపుగా వుండేదని గతంలో చాలా నమ్మేవారు. భూమి గుండ్రంగా వుంటుందని కనుక్కోవటంతో ఇది మరుగున పడింది. దీనిని ఓడ ప్రయాణాన్ని బట్టి కనుగొన్నారు. మనుషుల నమ్మకం ఏమిటంటే భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కోవటం వల్ల బయోస్పియర్ వెల్దపుగా కనబడుతోందని అనేవారు. పర్యావరణ ఉద్యమం చేపట్టారు. ఇది మనుషుల భూమి పైన చేసే నష్టాల గురించి వివరిస్తుంది.

సౌరవ్యవస్థలోని ఇతర వస్తువుల లాగానే భూమి కూడా చలనంలో ఉందని 16 వ శతాబ్దంలో తెలిసేవరకు, విశ్వానికి భూమి కేంద్రంగా ఉందని నమ్మేవారు. భూమి వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని పాశ్చాత్యులు 19 వ శతాబ్ది వరకు నమ్మారు. భుమి వయసు కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని 19 వ శతాబ్దిలో వారు భావించారు.

ఇవీ చూడండి

గమనికలు

మూలాలు

మరింత చదివేందుకు

బాహ్య లింకులు

Earth గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  నిఘంటువు విక్షనరీ నుండి
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  ఉదాహరణలు వికికోట్ నుండి
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
భూమి: కాలగతిలో, కూర్పు, ఆకారం, కక్ష్య, భ్రమణం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Tags:

భూమి కాలగతిలోభూమి కూర్పు, ఆకారంభూమి కక్ష్య, భ్రమణంభూమి చంద్రుడుభూమి నివాసయోగ్యతభూమి సాంస్కృతిక పథంభూమి ఇవీ చూడండిభూమి గమనికలుభూమి మూలాలుభూమి మరింత చదివేందుకుభూమి బాహ్య లింకులుభూమిసూర్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉదగమండలంప్రియ భవాని శంకర్కొమురం భీమ్గున్న మామిడి కొమ్మమీదరుక్మిణి (సినిమా)మహాత్మా గాంధీవిశ్వామిత్రుడుడేటింగ్ఇజ్రాయిల్విజయవాడరత్నం (2024 సినిమా)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతూర్పు చాళుక్యులుపొంగూరు నారాయణపక్షవాతంసమాచార హక్కుమానవ శరీరముH (అక్షరం)దేవులపల్లి కృష్ణశాస్త్రిప్రజా రాజ్యం పార్టీబాదామివరలక్ష్మి శరత్ కుమార్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంకాజల్ అగర్వాల్రోజా సెల్వమణిదొంగ మొగుడుతెనాలి రామకృష్ణుడుపాలకొండ శాసనసభ నియోజకవర్గంచంపకమాలనానాజాతి సమితిజిల్లేడునవగ్రహాలుపురాణాలుతెలుగు వికీపీడియా2024 భారత సార్వత్రిక ఎన్నికలుతొలిప్రేమగొట్టిపాటి రవి కుమార్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మృగశిర నక్షత్రముచాట్‌జిపిటిజాంబవంతుడుబంగారంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డితమన్నా భాటియాహనుమాన్ చాలీసాటెట్రాడెకేన్పిత్తాశయముప్రియురాలు పిలిచిందిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంకామసూత్రరకుల్ ప్రీత్ సింగ్వాల్మీకిజయలలిత (నటి)భారతదేశ జిల్లాల జాబితాశాసనసభ సభ్యుడునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంరుద్రమ దేవిమొఘల్ సామ్రాజ్యంవెలిచాల జగపతి రావుసంధ్యావందనంభారతదేశ సరిహద్దులువినాయకుడువై.యస్.అవినాష్‌రెడ్డిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్పంచభూతలింగ క్షేత్రాలురామ్ చ​రణ్ తేజమేరీ ఆంటోనిట్టేభారత జీవిత బీమా సంస్థశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంరాబర్ట్ ఓపెన్‌హైమర్బి.ఆర్. అంబేద్కర్రోనాల్డ్ రాస్తెలుగు సినిమాజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవై.యస్.రాజారెడ్డి🡆 More