గణతంత్ర భారతదేశ చరిత్ర

భారత దేశ గణతంత్ర చరిత్ర 1950 జనవరి 26 తో మొదలైంది.

భారతదేశం బ్రిటిషు పాలన నుండి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం సాధించింది. ముస్లింలు అధికంగా కలిగిన బ్రిటిషు పాలిత భారతదేశపు వాయవ్య, తూర్పు ప్రాంతాలు పాకిస్తాన్ దేశంగా భారతదేశం నుంచి విభజించారు. విభజన కారణంగా కోటి మంది జనాభా ఇరు దేశాల మధ్య వలస పోయారు. పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నాయకుడు జవాహర్‌లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధాన మంత్రి అయ్యాడు. సర్ధార్ వల్లభాయి పటేల్ ఉప ప్రధాన మంత్రితో పాటు, హోం శాఖ మంత్రిగా కూడా సేవలు అందించాడు. కానీ అత్యంత శక్తివంతమైన నాయకుడు మహాత్మా గాంధీ ఏ పదవినీ స్వీకరించలేదు. 1950 లో భారత రాజ్యాంగం భారత దేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య దేశంగా ధ్రువీకరించింది. భారత్ హిందువులు, ముస్లిం, సిక్కులు, ఇలా అనేకానేక మతాలను అవలంబించే ప్రజలు కలిగిన దేశం. భారతదేశం ఎన్నో మత కలహాలు, కులతత్వం, నక్సలెట్లు, ఉగ్రవాదం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఈశాన్యంలో ప్రాంతీయవాద అల్లర్ల వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఇప్పటికీ పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు చైనాతో ఉన్నాయి. ఫలితంగా 1962 లో భారత చైనా యుద్ధం జరిగింది. 1947, 1965, 1971 & 1999 సంవత్సరాల్లో పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారతదేశం తటస్థంగా ఉన్నప్పటికీ తన సైనిక బలగాలకు అవసరమైన ఆయుధాలను సోవియెట్ యూనియన్ నుండి కొనుగోలు చేసింది. తన శత్రువైన పాకిస్తాన్ మాత్రం అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉంది.

గణతంత్ర భారతదేశ చరిత్ర
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యం
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యం
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్యోద్యమం
భారతదేశ గణతంత్ర చరిత్ర
గణతంత్ర భారతదేశ చరిత్ర
స్వతంత్ర భారత తొలి కేబినెట్: (ఎడమ నుండి కుడికి కూర్చున్నవారు) బి.ఆర్ అంబేద్కర్, రఫీ అహ్మద్ కిద్వాయ్, సర్దార్ బల్దేవ్ సింగ్, మౌలానా అబుల కలాం ఆజాద్, జవాహర్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్, జాన్ మథాయ్, జగ్జీవన్ రాం, అమృత్ కౌర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ. (ఎడమ నుండి కుడికి నిల్చున్నవారు) ఖుర్షీద్ లాల్, అర్.అర్. దివాకర్, మోహన్‌లాల్ సక్సేనా, ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, ఎన్.వి.గాడ్గిల్, కె.సి.నియోగి, జైరామ్‌దాస్ దౌలత్‌రామ్, కె.సంతానం, సత్య నారాయణ్ సిన్హా, బి.వి.కేస్కర్

భారతదేశానికి అణ్వస్త్రాలు ఉన్నాయి. మొదటి అణుపరీక్ష 1974 లో నిర్వహించింది. తర్వాత 1998 లో మరో 5 ప్రయోగాలు నిర్వహించింది. 1950 నుండి 1980 మధ్య సామ్యవాద విధానాలను అవలంబించింది. భారతదేశపు ఆర్థిక పురోగతికి మితిమీరిన ఆంక్షల వల్ల అడ్డంకులు ఎదురయ్యాయి. సంరక్షణవాదం సర్వవ్యాప్త అవినీతికి, ఆర్థిక వ్యవస్థ మందగమనానికీ దారి తీసాయి. 1991 లో మొదలైన ఆర్థిక సంస్కరణలు భారత దేశాన్ని ప్రపంచపు మూడవ అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దాయి. ఈ రోజు భారతదేశం ఓ పెద్ద శక్తివంతమైన దేశం. అంతర్జాతీయ వ్యవహారాల్లో తన గళాన్ని ప్రముఖంగా వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తోంది.

1947-50

భారత దేశ విభజన

పశ్చిమ పంజాబ్, వాయవ్య దేశం, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, సింద్ లలోలో నివసించే హిందువులు, సిక్కులు ముస్లిం పాకిస్తాన్ లో అణచివేతకు గురయ్యారు. సుమారు 35 లక్షల మంది భారత దేశానికి తరలి వచ్చారు. మత ఘర్షణల వల్ల సుమారు పదిలక్షల హిందువులు, ముస్లింలు, సిక్కులు ప్రాణాలు కోల్పోయారు, ఈ కారణంగా రెండు దేశాల పంజాబ్, బెంగాల్ సరిహద్దుల వద్ద అస్థిరత ఏర్పడింది. ఈ ఘర్షణలు సెప్టెంబరు మాసం మొదట్లో ఇరు పక్షాల సహకారంతో ముగింపు కొచ్చాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ, మెజారిటీ ప్రజలను శాంతి పరచడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందు కలకత్తాలో, తర్వాత డిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చెయ్యడంతో ఘర్షణలు ఆగాయి. ఇరు ప్రభుత్వాలు కాందిశీకుల కోసం భారీ శిబిరాలు ఏర్పరచాయి. భారీ స్థాయిలో మానవత్వ సహాయం చేపట్టడం కోసం భారత సైన్యాన్ని నియోగించారు.

మహాత్మా గాంధీని 1948 జనవరి 30 నాడు నాథూరాం వినాయక్ గాడ్సే హత్య చేసాడు. గాడ్సే జాతీయతా ఉద్యమంతో సంబంధమున్న హిందూ అతివాది. దేశ విభజనకు గాంధీ కారకుడని అతడు భావించాడు. గాంధీ ముస్లింలను సంతుష్టి పరుస్తున్నాడని అతడు భావించాడు. మహాత్ముడికి తుది వీడ్కోలును తెలపడానికి హాజరైన లక్షలాది ప్రజలతో డిల్లీ వీధులు క్రిక్కిరిసి పోయాయి.

1949 లో తూర్పు పాకిస్తాన్ లో ముస్లిం అధికారుల అణచివేతను భరించలేక అక్కడి నుండి పశ్చిమ బెంగాలుకు, ఇతర రాష్ట్రాలకూ 10 లక్షల మంది హిందూ శరణాగతులు వలస వచ్చారు. శరణాగతుల అవస్థను చూసి హిందువులు, భారత జాతీయవాదులూ కోపోద్రిక్తులయ్యారు. కాందిశీకుల జనాభాతో ఆయా రాష్ట్రాల సంపద హరించుకుపోయి, వారిని భరించలేని పరిస్థితికి చేరుకున్నాయి. యుద్ధం జరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టేయకుండా, ప్రధాన మంత్రి నెహ్రూ, సర్దార్ పటేల్‌లు లియాఖత్ ఆలీ ఖాన్ ను చర్చలకు డిల్లీకి ఆహ్వానించారు. ఎందరో భారతీయులు దీన్ని సంతుష్టీకరణగా బావించినప్పటికీ, నెహ్రూ మాత్రం లియాకత్ ఆలీ ఖాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇరు దేశాల నేతలు తమ దేశంలోని మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు, మైనారిటీ కమిషను ఏర్పాటు చేసేందుకూ అంగీకరించారు. పటేల్ కు ఇది సమ్మతం కాకపోయినప్పటికి శాంతి భద్రతలను మెరుగు పరచడం కోసం ఆయన ఈ ఒడంబడికకు మద్దతునిచ్చాడు. అంతేకాక పశ్చిమ బెంగాల్ నుండి, ఇతర ప్రాంతాల నుండి దీనికి మద్ధతు చేకూర్చడంలోను, ఈ ఒడంబడికను అమలు చెయ్యడంలోనూ ముఖ్య పాత్ర పోషించాడు. ఖాన్, నెహ్రూలు ఇంకో వ్యాపార ఒప్పందంపై కూడా సంతకం చేశారు. ఇరు ప్రాంతాల వివాదాలను శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని అంగీకరించారు. పర్యవసానంగా, క్రమంగా లక్షలాది హిందువులు తూర్పు పాకిస్తాన్ కు తిరిగి వెళ్ళిపోయారు. కానీ కాశ్మీర్ వివాదం కారణంగా ఈ సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలవలేధు.

సంస్థానాల విలీనం

1950, 1960 లు

1952 లో భారతదేశం తన మొదటి సార్వత్రిక ఎన్నికలను రాజ్యాంగ బద్దంగా నిర్వహించుకుంది. 60 శాతం మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. భారత జాతీయ కాంగ్రెసు పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. నెహ్రూ రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాడు. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా రెండో సారి మొదటి పార్లమెంటు చేత ఎన్నికయ్యారు.

నెహ్రూ ప్రభుత్వం (1952–1964)

1957, 1962 ఎన్నికల్లో ప్రధాని నెహ్రూ కాంగ్రెసుకు భారీ విజయాన్ని అందించాడు. హిందూ సమాజంలో స్త్రీల హక్కులను మెరుగు పరచడం, కులవివక్ష, అంటరానితనాలకు వ్యతిరేకంగాను పార్లమెంటు విస్తృతమైన చట్టాలు చేసింది. భారత బాలలు ప్రాథమిక విద్యను అభ్యసించేందుకు నెహ్రూ గట్టి పునాది వేశాడు. దానిలో భాగముగా వేలకొద్ది బడులు, కళాశాలలు, ఐ‌ఐటి వంటి విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా స్థాపించాడు. నెహ్రూ భారత ఆర్థిక వ్యవస్థకు సామ్యవాద విధానాన్ని ప్రతిపాదించాడు -భారత రైతులకు పన్నుల నుండి మినహాయింపు, కార్మికులకు కనీస వేతనం, స్టీలు, వైమానిక, విద్యుత్తు, గనుల వంటి భారీ పరిశ్రమలను జాతీయం చేయడం ఇందులో భాగం. విస్తృతమైన ప్రభుత్వ నిర్మాణశాఖ, పారిశ్రామికీకరణ ఉద్యమం ద్వారా భారీ ఆనకట్టలు, నీటిపారుదల, రోడ్లు, తాప, జల విద్యుత్తు కేంద్రాలు స్థాపించారు.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ

1953 లో ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, ఫలితంగా ఆయన మృత్యువాత పడటంతో భారతదేశం చిత్రపటంలో భారీ మార్పులు ఏర్పడ్డాయి. నెహ్రూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పరచాడు. దీని సూచనల మేరకు 1956 లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రతిపాదించారు. భాష, జాతి భేదాలను పరిగణన లోకి తీసుకొని పాత రాష్ట్రాలను విభజించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుంచి విడదీయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రం, కేవలం తమిళం మాట్లాడే రాష్ట్రంగా తమిళనాడు ఏర్పడ్డాయి. 1960 మే 1 న బాంబే రాష్ట్రం నుండి మహారాష్ట్ర, గుజరాత్లు ఏర్పడ్డాయి. 1966 నవంబరు 1 న పంజాబీ సుబాలోని కేవలం పంజాబీ మాట్లాడే ప్రాంతం పంజాబుగాను, హర్యాన్వీ మాట్లాడే ప్రాంతం హర్యానా రాష్ట్రంగానూ 1966 నవంబరు 1 న ఏర్పడ్డాయి.

విదేశీ విధానం, సైనిక ఘర్షణలు

నెహ్రూ విదేశీ విధానం అలీనోద్యమానికి స్ఫూర్తి. ఈ ఉద్యమ వ్యవస్థాపకులలో భారతదేశం ఒకటి. నెహ్రూ అమెరికా, సోవియెట్ యూనియన్ ఇరువురితోనూ సత్సంబంధాలు నెరపాడు. చైనాను అంతర్జాతీయ సమాజంలో చేరేలా ప్రోత్సహించాడు. 1956 లో సూయెజ్ కెనాల్ కంపెనీని ఈజిప్ట్ ప్రభుత్వం జప్తు చేసినపుడు, అంతర్జాతీయ సమావేశం ఈజిప్టుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని 18-4 వోట్లతో ప్రతిపాదించగా, ఈజిప్టుకు మద్దతు పలికిన 4 దేశాలలో భారతదేశం కూడా ఒకటి. మిగితా మూడు ఇండోనేషియా, శ్రీలంక, సోవియట్ యూనియన్. పాలస్తీనా విభజనను భారతదేశం వ్యతిరేకించింది. సినాయ్‌పై ఇస్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్సుల దాడిని ఖండించింది. కానీ టిబెట్ పై చైనా ప్రత్యక్ష నియంత్రణను, హంగరీలో ప్రజాస్వామిక పోరాటాన్ని రష్యా అణిచివెయ్యడాన్ని మాత్రం వ్యతిరేకించలేదు. భారత అణుకార్యక్రమాన్ని నెహ్రూ బహిరంగంగా అంగీకరించనప్పటికీ, కెనడా, ఫ్రాన్సులు భారత్‌కు అణు విద్యుత్తు కేంద్రాల స్థాపనలో సహాయం అందించాయి. భారతదేశం 1960 లో పాకిస్తాన్ తో 7 నదీ జలాల వినియోగ విషయమై రాజీ కుదుర్చుకుంది. 1953 లో నెహ్రూ పాకిస్తాన్‌ను సందర్శించినప్పటికీ పాకిస్తాన్‌లో ఏర్పడ్డ రాజకీయ అల్లర్ల కారణంగా కాశ్మీర్ వివాదం విషయంలో ప్రగతి ఏమీ సాధించలేకపోయారు.

  1. భారతదేశం తన శత్రువు అయిన పాకిస్తాన్ తో మొత్తం 4 యుద్ధాలు చేసింది. వాటిలో రెండు ఈ కాలంలో జరిగాయి. 1947 లో యుద్ధం కాశ్మీరు గురించి జరిగింది. పాకిస్తాన్ మూడో వంతు రాజ్యాన్ని ఆక్రమించింది (భారతదేశం తనదని బావించే రాష్ట్రంలో నుండి) భారతదేశం 3/5 రాష్ట్రాన్ని కలుపుకుంది (పాకిస్తాన్ తనదని బావించే రాష్ట్రంలో నుండి). 1965 లో జరిగిన యుద్ధంలో భారత అధీనంలో ఉన్న కాశ్మీరు లోకి పాకిస్తాన్ సైన్యాల ప్రయత్నాలను పురస్కరించుకుని భారత్, పాకిస్తాన్ యుద్ద భూములన్నిటిపై దాడి చేసింది.
  2. పోర్చుగీసు అధీనంలో ఉన్న గోవాను శాంతియుతంగా పొందేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాక, 1961 లో దాడి చేసి విలీనం చేసుకుంది.
  3. 1962 లో హిమాలయ సరిహద్దు విషయమై చైనా భారత్ మధ్య యుద్ధం జరిగింది. అది భారత సైన్యానికి చెడు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ యుద్ధం ఆయుధ సేకరణకు, అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచు కోవడానికీ దారి తీసింది. యుద్ధానికి సంబందం లేనప్పటికి భారత చైనా సరిహద్దుకు పశ్చిమలో ఉన్న అక్సాయి చిన్ ప్రాంతంపై చైనా సార్వభౌమత్వాన్ని వివాదాస్పదం చేసింది.

నెహ్రూ తరువాత

గణతంత్ర భారతదేశ చరిత్ర 
నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1966–77 మధ్య ప్రధాన మంత్రిగా మూడు పర్యాయాలు పనిచేసారు. 1980–84 మధ్య నాలుగోసారి పనిచేసారు.

1964 మే 27 న నెహ్రూ తుది శ్వాస విడిచాడు. లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ తర్వాత ప్రధాన మంత్రి అయ్యాడు. 1965 లో కాశ్మీర్ విషయమై భారత పాకిస్థాన్‌లు మళ్ళీ యుద్ధానికి వెళ్ళాయి. కానీ ఫలితం ఏమీ రాలేదు. మార్పులేమీ చోటు చేసుకోలేదు. సోవియెట్ యూనియన్ చొరవతో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందంపై సంతకం చేసిన రాత్రే శాస్త్రి చనిపోయాడు. శాస్త్రి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఇందిరా గాంధీ, భారత మూడవ ప్రధాన మంత్రిగా పదోన్నతి పొందింది. ఆమె మొరార్జీ దేశాయిని ఓడించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కుంటుపడిన ఆర్థిక వృద్ది, ఆహార లేమి వగైరా సమస్యల వలన ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా కాంగ్రెసు పార్టీ 1967 ఎన్నికలలో తక్కువ మెజారిటీతో గెలిచింది. ఇందిరా గాంధీ పాలన ఒడిదుడుకులతో మొదలైంది. రూపాయి మారక విలువను తగ్గించడం భారత వాణిజ్యాన్ని, వినియోగదారులనూ కష్టాల పాలు చేసింది. రాజీకియ వివాదాల కారణంగా అమెరికా నుండి గోధుమల దిగుమతి ఆగిపోయింది.

మొరార్జీ దేశాయి ఇందిర ప్రభుత్వం లోకి ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రిగా ప్రవేశించాడు. సీనియర్ నాయకులు ఇందిర అధికారాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ తన రాజకీయ సలహాదారుదు అయిన పి. యన్. హక్సర్ సలహా మీద ఇందిర సామ్యవాద పద్ధతులను ఆచరించి ప్రజాదరణను తిరిగి సాధించింది. ప్రీవీ పర్సును రద్దు చేసింది. బ్యాంకుల జాతీయీకరణ చేసింది. దీన్ని వ్యతిరేకించిన పార్టీ నాయకత్వంపై దాడి చేసింది. దేశాయి, భారత వ్యాపార సంఘాలు ఈ చర్యను వ్యతిరేకించినప్పటికి సామాన్య ప్రజలు మాత్రం మెచ్చారు. 1969 లో కాంగ్రెసు నాయకత్వం ఇందిరను పార్టీ నుండి బహిష్కరించాలని చూసినపుడు, ఆమె పార్టీని చీల్చి, కాంగ్రెసు (ఆర్) పార్టీని ఏర్పరచింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ చీలిపోయింది. పార్లమెంట్ సభ్యులు భారీగా ఆమెకు మద్దతిచ్చారు. అతి కొద్ది ఆధిక్యతతో ఇందిర అధికారంలో కొనసాగింది.

1970 లు

1971 లో ఇందిరా గాంధీ పెద్ద మెజారిటీతో అధికారానికొచ్చింది. తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న దమననీతికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేస్తున్న స్వాతంత్ర్య పోరాటంలో భారత్ సైనిక జోక్యం చేసుకుంది. ఫలితంగా జరిగిన భారత్, పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించింది. తూర్పు పాకిస్తాన్‌కు విమోచనం కలిగి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం ఏర్పడింది. ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాధరణ ఉచ్ఛతమ స్థాయికి చేరింది.

అమెరికాతో భారత సంబంధాలు క్షీణించ సాగాయి. అలీనత్వానికి విరుద్ధంగా రష్యాతో 20 సంవత్సరాల స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. 1974 లో భారత్ తన మొదటి అణుపరీక్షను రాజస్తాన్ ఎడారిలో పోఖ్రాన్‌లో నిర్వహించింది. భారత సంరక్షణలో ఉన్న సిక్కింలో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, చొగ్యాల్ ను గద్దె దించి భారత దేశలో విలీనం కావాలనే ఫలితం వచ్చింది. 1975 ఏప్రిల్ 26 న సిక్కిం భారతదేశపు 22 వ రాష్ట్రంగా అవతరించింది.

హరిత విప్లవం, శ్వేత విప్లవం

భారత జనాభా 1970 తొలినాళ్ళలో 50 కోట్లను దాటేసింది. హరిత విప్లవం ద్వారా ఉత్పాదకతను పెంచి, ప్రభుత్వం ఆహార సంక్షోభానికి పరిష్కారం సాధించింది. ఆదునిక వ్యవసాయ పనిముట్లను ఉచితంగా అందించడం, కొత్త రకం విత్తనాలను అందించడం, ఆర్థిక మద్దతును పెంచడం ద్వారా వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాలతో పాటు, పత్తి, పొగాకు, టీ, కాఫీ వంటి వాణిజ్య పంటల ఉత్పత్తి కూడా మెరుగుపడింది. గంగామైదానం లోని రాష్ట్రాలు, పంజాబులలో ఉత్పాదకత పెరుగుదల విస్తరించింది. శ్వేత విప్లవం కింద ప్రభుత్వం పాల ఉత్పత్తికి ఇచ్చిన ప్రోత్సాహంతో పశువుల పెంపకం భారీగా పెరిగింది.

వీటితో భారతీయులు తమను తాము పోషించుకునే సామర్థ్యాన్ని గడించారు. రెండు దశాబ్దాల ఆహార దిగుమతులకు ముగింపు పలికారు.

1971 భారత పాకిస్తాన్ యుద్ధం

1971 లో జరిగిన ఈ యుద్ధం ఇరు దేశాల మధ్య జరిగిన 4 యుద్ధాలలో మూడోది. తూర్పు పాకిస్తాన్ లో సొంత పాలన స్థాపనకై జరిగిన ఈ యుద్ధంలో భారత్, పాకిస్తాన్ ను ఓడించింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది.

భారత అత్యవసర పరిస్థితి

ఆర్థిక, సామాజిక ఇబ్బందులు, అవినీతి ఆరోపణలు దేశ వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితికి దారి తీసాయి. ఇవి బీహార్ ఉద్యమంగా పరిణమించాయి. 1974 లో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వ వనరులను ఎన్నికల కోసం దుర్వినియోగం చేసినట్లుగా గుర్తించింది. ఇందిరా గాంధీ తక్షణమే రాజీనామా చేయాలంటూ విపక్షాలు దేశ వ్యాప్తంగా సమ్మెలు, ఆందోళనలూ నిర్వహించాయి. వివిధ రాజకీయ పార్టీలు ఇందిర "నియంతృత్వ" పాలనను ప్రతిఘటించేందుకు లోకనాయక్ జయ ప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఉద్యమించాయి. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు భారత ఆర్థిక స్థితిని, పాలననూ అస్థిర పరచాయి. ఇందిరను తొలగించాలని నారాయణ్ సైన్యానికి కూడా పిలుపు నిచ్చారు.

1975 లో ఇందిర అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కు సూచించడం ద్వారా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తిరుగులేని అధికారాలు చేజిక్కించుకుంది. శాంతి భద్రతలు విచ్ఛిన్నమయ్యాయని, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందనే సాకులను చూపి ఎన్నో పౌర హక్కులను సస్పెండు చేసి, జాతీయ, రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసింది. రాష్ట్రాల్లోని కాంగ్రెసేతర ప్రభుత్వాలను రద్దు చేసింది. దాదాపు 1000 మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు జైలు పాలయ్యారు. తప్పనిసరి కుటుంబ నియంత్రణను ప్రవేశ పెట్టింది. అన్ని రకాల ఆందోళనలను నిషేధించింది.

ఎడతెగని సమ్మెలు, రాజకీయ అస్థిరతలు అంతమవడంతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరింది. ప్రభుత్వం 20 సూత్రాల కలిగిన ప్రకటనను విడుదల చేసింది. దీంతో వ్యావసాయిక, పారిశ్రామిక ఉత్పత్తి పైరిగింది. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ఉత్పాదకత కూడా మెరుగైంది. కానీ ప్రభుత్వ అంగాల్లోను, కాంగ్రెసు నాయకుల్లోనూ అవినీతి, ఆధిపత్య ధోరణీ పెరిగింది. పోలీసులపై అమాయకులను అరెస్టు చేసి వేదించిన నిందలు పడ్డాయి. ఇందిరా గాంధీ కొడుకు, రాజకీయ సలహాదారు సంజయ్ గాంధీ ప్రజలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు. డిల్లీలో తుర్క్‌మెన్ గేటు వద్ద ఉన్న మురికి వాడల విధ్వంసం చేయడంతో వేల కొద్ది జనాలు చనిపోయారు. మరెందరో నివాసాలు కోల్పోయారు.

జనతా పార్టీ

ఇందిరా గాంధీ 1977 లో ఎన్నికలకు పిలుపునిచ్చింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ (అనేక పక్షాల సంకీర్ణం) చేతిలో ఘోర పరాజయం పొందింది. మొరార్జీ దేశాయి మొదటి భారత కాంగ్రెసేతర ప్రధాన మంత్రి అయ్యాడు. దేశాయి ప్రభుత్వం, అత్యవసర కాలంలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించింది. షా కమిషను నివేదిక ప్రకారం ఇందిర, సంజయ్‌లను అరెస్టు చేసారు.

కానీ 1979 లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు. అంతర్గత కలహాల వల్ల జనతా పార్టీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. అదే కాకుండా భారతదేశపు ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించగల నాయకత్వ పటిమ జనతాపార్టీకి లేదని ప్రజలు భావించారు.

1980 లు

1980 జనవరిలో కాంగ్రెసు (ఇందిర) భారీ ఆదిక్యంతో తిరిగి అధికారానికి వచ్చింది. పంజాబ్ లో తలెత్తిన వేర్పాటు ఆందోళన భారత భద్రతను ప్రమాదం లోకి నెట్టింది. అస్సాంలో స్థానికులు, బంగ్లాదేశ్ కాందిశీకుల తోటి, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళతోటీ అనేక మార్లు మత ఘర్షణలు జరిగాయి. ఆపరేషన్ బ్లూస్టార్‌లో భాగంగా భారత సాయుధ దళాలు స్వర్ణ దేవాలయంలోని ఖలిస్తాన్ తీవ్రవాదుల రహస్య స్థావరంపై దాడి చేసినపుడు అనుకోకుండా భవనానికి నష్టం, పౌరుల మరణాలూ సంభవించాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సిక్కులలో ఉద్రిక్తతలు రేకెత్తించింది. ప్రభుత్వం తీవ్రవాదుల చర్యలను అణచివేయడానికి పోలీసు చర్యలను చేపట్టింది. కానీ అది ఎన్నో మానవ హక్కుల హననానికి దారి తీసింది. భారత దళాలకు ఉల్ఫాకూ జరిగిన ఘర్షణలతో ఈశాన్య భారతం స్థంబించిపోయింది.

1984 అక్టోబరు 31 న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకుడే హత్యచేసాడు. దీంతో డిల్లీ, పంజాబుల్లో సిక్కులకు వ్యతిరేకముగా అల్లర్లు జరిగాయి. దీని కారణంగా వేలకొద్దీ సిక్కులు మృత్యువాత పడ్డారు. భయంకరమైన దోపిడీలు, ఇల్లు తగలబెట్టడాలు, మానభంగాలూ జరిగాయి. సీనియర్ కాంగ్రెసు సభ్యులపై సిక్కులకు వ్యతిరేకముగా హింసను సృస్టించారనే ఆరోపణలు వచ్చాయి. అల్లర్లకు కారకులను గుర్తించడంలోను, వారిని శిక్షించడంలోనూ దర్యాప్తు సంస్థలు సఫలం కాలేదు. కానీ ప్రజలు మాత్రం డిల్లీలో సిక్కులపై దాడులు జరిపించినది కాంగ్రెసు నాయకులే అని భావించారు.

రాజీవ్ గాంధీ పరిపాలన

తరువాతి ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ పెద్ద కొడుకైన రాజీవ్ గాంధీని కాంగ్రెసు పార్టీ ఎన్నుకుంది. రాజీవ్ గాంధీ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైంది 1981 లో. 40 ఏళ్ల వయసులో అతను అత్యంత పిన్న వయసు కలిగిన జాతీయ రాజకీయ నాయకుడు, ప్రధాన మంత్రీ. అనేకమంది వృత్తిగత రాజకీయ నాయకుల నిష్ప్రయోజకత్వాన్ని, అవినీతినీ చూసి విసిగిపోయిన ప్రజల దృష్టిలో అతని వయసు, అనుభవలేమీ అవసరమైన అర్హతగా కనిపించాయి. చిరకాలపు సమస్యలకు సరికొత్త పరిష్కారాలను ఆశించారు.

రాజీవ్ గాంధీ పార్లమెంటును రద్దు చేసి, ఎన్నికలకు వెళ్ళాడు. కాంగ్రెసు పార్టీ, తన చరిత్ర లోనే అత్యంత భారీ విజయాన్ని (415/545) అందుకుంది. తన తల్లి హత్యను సానుభూతి వోటుగా మార్చుకుని రాజీవ్ గాంధీ, సీట్ల పంట పండించుకున్నాడు.

రాజీవ్ గాంధీ ఎన్నో మార్పులను అమలు చేసాడు –లైసెన్స్ రాజ్ ను సడలించాడు, విదేశీ పెట్టుబడులు, దిగుమతులు, ప్రయాణాలు, కరెన్సీపై భారత నిబందనలు గణనీయంగా తగ్గాయి. సొంత వ్యాపారాలు సాధనాలను వాడుకుని వాణిజ్య వస్తువులు ప్రభుత్వ ఉద్యోగిస్వామ్యం సంబంధం లేకుండా తయారు చేయడానికి వీలు పడింది. విదేశీ పెట్టుబడుల ఆగమనం జాతీయ విదేశ మారక ద్రవ్య నిల్వలను పెంచింది. తన తల్లి నడిచిన మార్గం నుండి తప్పుకుని, రాజీవ్ గాంధీ అమెరికాతో సంబంధాలను మెరుగు పరచాడు. తత్కారణంగా ఆర్థిక సహాయం, శాస్త్రీయ సహకారమూ మెరుగు పడ్డాయి. రాజీవ్ గాంధీ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని ఎంతగానో ప్రోత్సాహించాడు. ఫలితంగా దూరప్రసార పరిశ్రమ, భారత అంతరిక్ష కార్యక్రమం విస్తరించాయి. సాఫ్టువేరు పరిశ్రమ, ఐటీ రంగం భారత్‌లో కాలూనాయి.

1984 డిసెంబరులో భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారంలో మిథైల్ ఐసోసయనేట్ అనే విషవాయువు లీకయింది. కొన్ని వేల మంది వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేల మంది అనంతర కాలంలో చనిపోయారు. మరి కొందరు వికలాంగులయ్యారు.

భారత్ 1987 లో శ్రీలంక ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని అక్కడ శాంతిభద్రతలను నెలకొల్పడానికి తన సేనలను రంగంలోకి దించేందుకు అంగీకరించింది. ఒప్పందం ప్రకారం, తమిళ తిరుగుబాటుదారులను నిరాయుధులను చేసేందుకు, భారత శాంతి స్థాపక సేనలను శ్రీలంకలో నియోగించింది. తీరా ఈ సేనలు అక్కడి కలహాల్లో చిక్కుకుని తమిళ తిరుగుబాటుదారులతో స్వయంగా తామే యుద్ధం చేసే స్థితికి దిగాయి. ఈ క్రమంలో శ్రీలంక జాతీయవాదుల గురిగా మారాయి. 1990 లో వీపీ సింగ్ ఈ సైన్యాన్ని వెనక్కి తీసుకున్నాడు. సామ్యవాద సిద్దాంతాల నుండి రాజీవ్ దూరంగా వెళ్లిపోవడం సాదారణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. నిరుద్యోగం తీవ్రమైన సమస్యగా మరింది. తామరతంపరగా పెరుగుతున్న జనాభా, తరిగిపోతున్న వనరుల సమస్యను తీవ్రతరం చేసింది.

బోఫోర్స్ కుంభకోణంలో, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు దేశరక్షణ ఒప్పంద విషయంలో స్వీడన్ చెందిన తుపాకి తయారీ సంస్థ దగ్గర లంచం తీసుకున్నారన్న విషయం బయట పడింది. దీంతో రాజీవ్ గాంధీకున్న నిజాయితీ ముద్ర (మీడియా అతన్ని మిస్టర్ క్లీన్ గా పిలిచేది ) ధ్వంసమైపోయింది.

జనతా దళ్

1989 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమిని చవి చూసింది. మాజీ రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి, జనతా దళ్‌కు చెందిన వి.పి.సింగ్‌ను అధికారం వరించింది. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న రాజీవ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా ఉండగా సింగ్ బయటపెట్టిన కొన్ని అక్రమాలు కాంగ్రెసు నాయకత్వానికి ఇబ్బందులను సృష్టించాయి. అతణ్ణి ఆర్థిక శాఖ నుండి రక్షణ శాఖకు బదిలీ చేశారు. అక్కడుండగా అతడు బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టాడు. దాంతో అతణ్ణి పదవి నుండి, పార్టీ నుండి కూడా తొలగించారు. మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి, సంస్కరణలు తేగలడన్న పేరు వీపీ సింగుకు ప్రజల్లో ఉండటంతో తదుపరి ఎన్నికల్లో అతడి సారథ్యంలోని జనతా దళ్‌కు ప్రజలు అధికారాన్ని అందించారు. జనతా దళ్‌ ప్రభుత్వానికి భాజపా, వామపక్షాలూ బయటి నుండి మద్దతు ఇచ్చాయి. ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే వీపీ సింగు పాత గాయాలను చెరపడానికి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషను కల్పించే వివాదాస్పద మండల్ కమిషను నివేదికను అమలులోకి తీసుకువచ్చారు. దీన్ని భాజపా వ్యతిరేకించి, అతని ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో ఆయన రాజీనామా చేశాడు. పార్టీ నుండి చంద్రశేఖర్ విడిపోయి జనతా దళ్ (సామ్యవాద) ఏర్పాటు చేసి, కాంగ్రెసు మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. కాని కొన్ని నెలల్లోనే, కాంగ్రెసు తన మద్దతును వెనక్కి తీసుకోవడంతో ఈ ప్రభుత్వం కూడా కూలిపోయింది.

1990లు

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా కొడుకు), కాంగ్రెసుతో 1987 ఎన్నికల పొత్తును ప్రకటించాడు. కానీ ఎన్నికలలో అతనికి అనుకూలంగా రిగ్గింగు జరిగింది. ఇది, రిగ్గింగు కారణంగా ఓడిపోయిన ప్రాంతాలలో తిరుగుబాటుకు దారితీసింది. పాకిస్తాన్ వీరికి ఆయుధాల శిక్షణతో పాటు అన్ని విధాలుగా సహకరించింది.

ఇస్లామిక్ తీవ్రవాదులు, హిందువులైన కాశ్మీరీ పండిట్లను హింసించి, పెద్దసంఖ్యలో వారిని కాశ్మీరు నుండి పారద్రోలారు. ఆ విధంగా 1990ల్లో 90 శాతానికి పైగా కాశ్మీరీ పండిట్లను కాశ్మీరు నుండి వెళ్ళగొట్టారు.

1991 మే 21 న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో కాంగ్రెసు (ఇందిర) తరపున ప్రచారంలో ఉండగా, ఎల్.టి.టి.ఈకి చెందిన ఒక మహిళ మానవ బాంబు రూపంలో ఆయనతో పాటు అనేకమందిని హతమార్చింది. దండ వెయ్యడానికి ముందుకి వంగుతూ తన బెల్టుకు ఉన్న బాంబును పేల్చి వేసింది. కాంగ్రెసు (ఇందిర) 244 సీట్లు గెలుచుకుని, ఇతరుల మద్దతుతో పి వి నరసింహారావు నాయకత్వాన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ప్రభుత్వం తన అయిదేళ్ల పదవీ కాలం పూర్తిగా పనిచేసింది. క్రమక్రమమైన ఆర్థిక సరళీకరణ విధానానికి, తదనుగుణ మార్పులకూ నాంది పలికింది. అంతర్జాతీయ వర్తకానికి, పెట్టుబడులకూ భారత ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచింది. దేశ అంతర్గత రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరిగాయి. కుల, మత జాతి వంటి అంశాల పునాదులపై ఏర్పడిన కలయికల స్థానే ఎన్నో చిన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి.

రామ జన్మభూమి వివాదంలో భాగంగా 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత హిందూ ముస్లిముల మధ్య మత కల్లోలాలకు దారి తీసింది. సుమారు 10000 మంది హతులయ్యారు. నరసింహారావు నాయకత్వంలోని ప్రభుత్వపు చివరి నెలల్లో ఎన్నో భారీ అవినీతి కుంభకోణాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ కారణంగా కాంగ్రెసు ఎన్నికల చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిని మూటగట్టుకుంది. హిందూ జాతీయతా పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అత్యంత ఆదిక్యత గల ఏకైక పార్టీగా ఆవిర్బవించింది.

ఆర్థిక రూపాంతరము

దివంగత ప్రధాని నరసింహారావు, అతని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన పథకాలతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించింది. తన పాలనలో ఆయన భారీ, నష్టదాయక ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు పునాది వేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సంస్కరణలను ప్రోత్సహించే పురోగామి బడ్గెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. కానీ 1997 ఆసియా ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరతల వల్ల ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంది. వాజపేయి ప్రభుత్వం ప్రైవేటీకరణ, పన్నుల తగ్గింపు, ప్రభుత్వ నిర్మాణ శాఖ కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడం మొదలైన వాటిని కొనసాగించింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌లు ఆర్థికంగా ప్రాముఖ్యత గడించి, విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించాయి. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళను ఏర్పరచడం, పన్ను సడలింపులు, మంచి మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి చర్యలు దేశం లోని అనేక ప్రాంతాలలో చక్కటి ఫలితాలను చూపించాయి.

పరిశ్రమల శాస్త్రీయ విభాగాల్లో బాగా చదువుకున్న, నైపుణ్యంగల కొత్త తరం భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారింది. కంప్యూటర్ల విస్తరణతో సమాచార సాంకేతిక పరిశ్రమ దేశం మీద పట్టు బిగించింది. కొత్త సాంకేతికత దాదాపు అన్ని పరిశ్రమలలోను, అన్ని విధానాలలోనూ ఉత్పాదకతను మెరుగు పరిచింది. నిపుణుల లభ్యతలో సహాయ పడింది. విదేశీ పెట్టుబడులు, విదేశీ ఉద్యోగ అవకాశాలూ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ మధ్యతరగతి వర్గం ఏర్పడింది. అది అవసరాలను పెంచింది. తద్వారా వివిధ వస్తువుల తయారీ పెరిగింది. నిరుద్యోగం క్రమంగా తగ్గింది. పేదరికం సుమారు 22 శాతానికి తగ్గింది. జాతీయ స్థూల ఉత్పత్తి 7 శాతానికి మించి పెరిగింది. ముఖ్యమైన సవాళ్ళు అలానే ఉన్నప్పటికి, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూనే పోయింది. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్‌ ముందు వరుసలో నిలబడింది. తద్వారా ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావాన్ని, ప్రాభవాన్నీ పెంచుకుంది.

పొత్తుల కాలం

మే 1996 ఎన్నికలలో లోక్ సభలో ఎక్కువ సీట్లు గెల్చుకున్న ఏకైక పార్టీగా భాజపా ఆవిర్బవించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కనీస ఆధిక్యం సంపాదించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో భాజపా ప్రభుత్వం 13 రోజులు పాటు సాగింది. ప్రభుత్వం కొనసాగేందుకు సరిపడా మద్దతు లభించక, వాజపేయి రాజీనామా చేసాడు. వెంటనే మరోసారి ఎన్నికలు నిర్వహించడానికి పార్టీలు మొగ్గు చూపక పోవడంతో 14 పార్టీల సమూహం, జనతా దళ్ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ అనే పేరుతో ప్రభుత్వంగా ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరం పాటు కూడా నిలబడలేదు. 1997 మార్చిలో కాంగ్రెసు తన మద్దతును ఉపసంహరించుకుంది. 16 పార్టీల యునైటెడ్ ఫ్రంట్ లో ఇందర్ కుమార్ గుజ్రాల్ బహుజన సమ్మతి కలిగి ఉండడం వల్ల ప్రధాన మంత్రిగా ఎంపికయ్యాడు.

1997 నవంబరులో కాంగ్రెసు మళ్ళీ తన మద్దతును తిరిగి ఉపసంహరించుకుంది. 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో భాజపా అత్యధిక సీట్లు (182) గెలుచుకున్నప్పటికీ, అది కనీస ఆధిక్యం కంటే బాగా తక్కువ. 1998 మార్చి 20 న వాజపేయి నాయకత్వంలో భాజపా ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. 1998 మే 11, 13 తేదీల్లో ఈ ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. పాకిస్తాన్ కూడా అదే సంవత్సరం అణుపరీక్షలు నిర్వహించింది. ఈ అణుపరీక్షల కారణంగా 1994 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ చట్టానికి అనుగుణంగా అమెరికా, జపాన్‌లు భారత్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అనేక ఇతర దేశాలు ఈ పరీక్షలను విమర్శించాయి.

1999 తొలినాళ్ళలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలవడానికి వాజపేయి చారిత్రాత్మక బస్సు యాత్ర చేసి ద్వైపాక్షిక లాహోర్ శాంతి ప్రకటన పై సంతకం చేశారు.

1999 ఏప్రిల్ లో ప్రభుత్వం మళ్ళీ పడిపోయింది. సెప్టెంబరులో తిరిగి ఎన్నికలు జరిగాయి. 1999 మే, జూన్‌లలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు విస్తృతంగా చొరబడడంతో భారత్ పాక్‌ల మధ్య ఘర్షణ తలెత్తి, కార్గిల్ యుద్ధానికి దారితీసింది. అంతకు మూడు నెలల ముందు కుదుర్చుకున్న లాహోరు ఒడంబడికకు కాలదోషం పట్టింది. భారత దళాలు పాకిస్తాన్ సహాయంతో చొచ్చుకుని వచ్చిన ఉగ్రవాదులను హతమార్చి తన సరిహద్దును తిరిగి పొందింది.

కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని సొమ్ము చేసుకుని నేషనల్ డెమోక్రెటిక్ అలయన్స్ భాజపా ఆధిపత్యంలో వాజపేయి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సహస్రాబ్ది ముగింపులో ఒడిషాను తాకిన తుఫాను 10000 మందిని పొట్టన బెట్టుకుంది.

2000 లు

భారతీయ జనతా పార్టీ పాలనలో

2000 మేలో భారత జనాభా వంద కోట్లను దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు పరచడానికి భారత దేశాన్ని సందర్శించాడు. జనవరిలో భారీ భూకంపం గుజరాత్‌ను తాకింది. కనీసం 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

2001 మధ్యలో రెండేళ్ళ తరువాత ప్రధాని వాజపేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ లు శిఖరాగ్ర సమావేశంలో కలిసారు. కానీ కాశ్మీర్ గురించిన భేదాభిప్రాయాల వల్ల ఈ సమావేశం ఏ ఫలితం లేకుండా ముగిసింది. కనీసం సంయుక్త ప్రకటన కూడా వెలువడలేదు.

ఎన్.డి.ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నో రాజకీయ కుంభకోణాల వల్ల (రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ లంచం తీసుకున్నాడన్న ఆరోపణల వంటివి) దాని విశ్వసనీయత దెబ్బ తింది. అదే కాకుండా పాకిస్తాన్ తో చర్చలు ఫలించకపోవడం, కార్గిల్ యుద్ధంలో ఇంటెలిజన్స్ సరైన సూచనలు ఇవ్వకపోవడం వల్ల కూడా దెబ్బతింది. సెప్టెంబరు 11 దాడులను పురస్కరించుకుని, అమెరికా 1998 లో భారత్ పాకిస్తాన్ లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఉగ్రవాదంపై పోరులో వారు అందించిన సహకారానికి అమెరికా ఇచ్చిన బహుమతిగా దీన్ని భావించారు. పాకిస్తాన్ మిలిటరీ పోస్టుపై భారత భారీ కాల్పులు, ఆ పిమ్మట భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడుల కారణంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య మరో యుద్ధం తప్పదన్న స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

2002 లో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందూ తీర్థయాత్రికులు గుజరాత్ లోని గోధ్ర దగ్గర రైల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయారు. దీని పర్యవసానంగా 2002 గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోయారు. 223 మంది ఆచూకీ గల్లంతయ్యింది.

2003 ఏడాదంతా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, పాకిస్తాన్ తో శాంతి స్థాపనలో పురోగతి వంటి కార్యక్రమాల వలన ప్రభుత్వానికి ప్రజాదరణ పెరిగింది. తమ మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. మితవాద కాశ్మీరు వేర్పాటువాదులతో భారత ప్రభుత్వం సమావేశమైంది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ద్వారా భారత నాలుగు మూలలను హైవేల ద్వారా అనుసంధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాంగ్రెసు తిరిగి పరిపాలనకు వచ్చింది

2004 జనవరిలో ప్రధాని వాజపేయి లోక్ సభను ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. 2004 మే లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణం అనూహ్య విజయాన్ని అందుకుంది. కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించడంతో (విదేశంలో పుట్టిన వ్యక్తికి ప్రధాని పదవి అర్హత ఎలా ఉంటుంది అన్న వివాదానికి తెరదించుతూ) మన్మోహన్ సింగ్ నూతన ప్రధాని మంత్రి పదవిని చేపట్టాడు. సామ్యవాద, ప్రాంతీయ పార్టీల మద్దతుతో కాంగ్రెసు ఏర్పరుచుకున్న సంకీర్ణం, యునైటెడ్ పీపుల్స్ అలయన్సుకు. బయట నుండి కమ్యూనిస్టుల మద్దతు ఉంది. మన్మోహన్ సింగ్ భారత దేశపు అత్యంత శక్తివంతమైన పదవిని అధిరోహించిన మొదటి సిక్కు, మొదటి హిందూయేతర ప్రధానిగా నిలిచాడు. మరింత ప్రైవేటైజేషన్ను సామ్యవాదులు, కమ్యూనిస్టులూ అడ్డుకోవడంతో కొంత ఆలస్యమైనప్పటికీ, మన్మోహన్ సింగ్ ఆర్థిక సరళీకరణను కొనసాగించాడు.

2004వ సంవత్సరం చివరికి భారత్, కాశ్మీరు నుండి కొన్ని సేనలను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టింది. తర్వాతి సంవత్సరం మధ్యలో శ్రీనగర్, ముజఫరాబాద్ మధ్య బస్సు సేవలు మొదలుపెట్టారు. భారత పాలనలో ఉన్న కాశ్మీరు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరుల మధ్య 60 ఏళ్లలో ఇదే మొదటి బస్సు సేవ. అయితే, 2006 మేలో ఇస్లామిక ఉగ్రవాదులు చేసిన దాడిలో 35 మంది హిందువులు హతమయ్యారు.

2004 లో వచ్చిన హిందూ మహాసముద్ర సునామీ 18,000 మందిని కబళించింది. 6,50,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియా తీరం వద్ద సముద్రం అడుగున వచ్చిన భూకంపం, ఈ సునామీకి కారణం. ఆ తరువాతి సంవత్సరంలో ముంబై వరదలు (1,000 కి పైగా మృతులు), కాశ్మీరు భూకంపం (79,000 కి పైగా మృతులు) వంటి ప్రకృతి విలయాలు భారత ఉపఖండాన్ని కుదిపేసాయి. 2006 ఫిబ్రవరిలో యూపీయే ప్రభుత్వం భారతదేశపు అతిపెద్ద గ్రామీణ ఉపాధి పథకాన్ని - మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - మొదలుపెట్టింది.

2006 లో అమెరికా ప్రధాని బుష్ భారత పర్యటనకు వచ్చినపుడు అమెరికా, భారత్‌లు ఒక ముఖ్యమైన అణు సహకార ఒప్పందం పై సంతకాలు చేసాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారత్ కు పౌర అణు సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తుంది. భారత్ తన అణు కార్యాచరణపై కఠినతర పరిశీలనకు ఒప్పుకుంటుంది. తర్వాతి కాలంలో అమెరికా చట్టసభలు ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో 30 సంవత్సరాలలో మొదటిసారిగా భారత్, అమెరికా నుండి అణు ఇందనాన్ని, రియాక్టర్లనూ కొనుక్కునే వీలు కలిగింది. అణు ఒప్పందం విషయంలో యు.పి.ఎ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్నప్పటికీ, పార్లమెంటులో విశ్వాస పరీక్షలో నెగ్గింది. తర్వాత అనేక వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక సమూహంగా ఏర్పడి ఈ ప్రభుత్వం అవినీతిమయమైందంటూ నిరసించాయి. మూడు నెలల్లో అమెరికన్ కాంగ్రెసు ఆమోదంతో బుష్, భారత్‌తో అణు వ్యాపారానికి తెరతీసే చట్టంపై సంతకం చేసారు. దాంతో ఇరు దేశాల మధ్య మూడు దశాబ్దాల నాటి వర్తక నిషేధానికి తెరపడింది.

2007 లో భారత మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది. ఎంతో కాలంగా నెహ్రూ-గాంధీ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్న ఆమె, సోనియా గాంధీ మద్దతుతో రాష్ట్రపతి కావడానికి ముందు, రాజస్థాన్ గవర్నరుగా సేవలు అందించింది. ఫిబ్రవరిలో సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు చోటు చేసుకుంది. హర్యానా లోని పానిపట్టులో జరిగిన ఈ దారుణంలో పాకిస్తానీయులు హతులయ్యారు. ఈ పేలుడు దర్యాప్తులో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. 2011 వరకు ఎవరినీ అరెస్టు చెయ్యకపోయినప్పటికి, దీనికి మాజీ హిందూ సైనిక అధికారి నేతృత్వంలోని అభినవ్ భారత్ అనే హిందూ ఛాందసవాద సంస్థ బాధ్యులని ఆరోపణలు వచ్చాయి.

2008 అక్టోబరులో భారత్ చంద్రుడి పైకి తన మొదటి ప్రయోగాన్ని చంద్రయాన్ పేరుతో విజయవంతంగా చేసింది. అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్‌లో భారత్ తన తొట్టతొలి వాణిజ్య ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం, పిఎస్‌ఎల్‌వి సి-8 ద్వారా ఒక ఇటాలియన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రక్షేపించింది.

2008 నవంబరులో ముంబయి దాడులు జరిగాయి. పాకిస్తాన్ తీవ్రవాదులే ఇందుకు కారణమని భారత్ ఆరోపించింది. పాకిస్తాన్‌తో తన శాంతి చర్చలను నిలిపి వేసింది. 2009 లో భారత సార్వత్రిక ఎన్నికలలో యు. పి. ఎ. ప్రభుత్వం 262 సీట్లతో ఘన విజయాన్ని అందుకుంది. అందులో కాంగ్రెసు స్వంతంగా 206 సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత యు.పి.ఎ. ప్రభుత్వం ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం ఎప్పుడూ లేనంత స్థాయికి చేరింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆవి దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసాయి.

21 వ శతాబ్దంలో భారత్ మావోయిస్టుల తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ప్రధాని మన్మోహన్ మాటల్లో చెప్పాలంటే "అతి కష్టమైన అంతర్గత భద్రతా సవాలును ఎదుర్కొంటోంది". జమ్మూకాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం పెరిగిపోయింది. ముంబై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాల్లో బాంబు పేలుళ్ళు జరుగాయి. కొత్త సహస్రాబ్దిలో భారత్ - అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయిల్, చైనా వంటి దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకుంది. భారత ఆర్థిక స్థితి ఎంతో వేగముగా పుంజుకుంది. భారత్ ఒక భావికాలపు ప్రబలశక్తిగా పరిగణించబడుతోంది.

2010 లు

2010 కామన్ వెల్త్ క్రీడలపై వెల్లువెత్తిన వివాదాలు దేశాన్ని కుదిపేసాయి. ప్రభుత్వ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది. దాని వెంటనే 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం, ఆదర్శ్ గృహ నిర్మాణ సంఘం కుంభకోణాలు వెలుగు చూసాయి. ప్రభుత్వ అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే డిల్లీలో 12 రోజుల నిరాహార దీక్ష చేసాడు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికి భారత్ స్థూల దేశీయ ఉత్పత్తిలో అధిక వృద్ది రేటును కనబరచింది. 2011 జనవరిలో భారత్ భద్రతామండలిలో 2011-2012 కాలానికి శాశ్వతేతర స్థానాన్ని పొందింది. 2004 లో బ్రెజిల్, జర్మనీ, జపాన్ లతో పాటు భద్రతామండలిలో శాశ్వత స్థానానికై దరఖాస్తు చేసుకుంది. మార్చిలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా మారింది.

2011-12 లో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరి, 2014 జూన్‌లో భారతదేశపు 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది.

2012 నాటి ఢిల్లీ సామూహిక మానభంగ ఘటన, సమాజంలో దానికి వచ్చిన ప్రతిస్పందన స్త్రీలపై అత్యాచారాల వ్యతిరేక చట్టాల్లో మార్పులకు దారితీసాయి. 2013 ఏప్రిల్లో శారదా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాలుతో సహా, తూర్పు భారతదేశంలో శారదా గ్రూపు పోంజీ స్కీము నిర్వహించి, తద్వారా 17 లక్షల మంది డిపాజిటర్ల నుండి 20-30 వేల కోట్ల రూపాయలు దోచింది. స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, 2013 డిసెంబరులో భారత సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

2010 ఆగస్టులో లడఖ్ ప్రాంతంలో కురిసిన మెరుపు వానలు, తదనంతరం వచ్చిన వరదల కారణంగా 255 మంది మరణించారు. 9000 మంది ప్రభావితమయ్యారు. 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లో కురిసిన మెరుపు వానలు విపరీతమైన వరదలకు కారణమయ్యాయి. 5,700 పైచిలుకు ప్రజలు మరణించారని అంచనాలు వేసారు. 2014 సెప్టెంబరులో జమ్మూకాశ్మీరులో వచ్చిన వరదల్లో 277 మంది మరణించారు. విపరీతమైన ఆస్తి నష్టం జరిగింది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 280 మంది మరణించారు.

2013 ఆగస్టు-సెప్టెంబరుల్లో ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన హిందూ ముస్లిము ఘర్షణల్లో 62 మంది మరణించారు. 93 మంది గాయాల పాలవగా, 50,000 మంది నిరాశ్రయులయ్యారు.

2013 నవంబరులో భారత్ తన తొట్టతొలి గ్రహాంతర నౌక మంగళ్‌యాన్ ను ప్రయోగించింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అధికారికంగా పిలిచే ఈ నౌక 2014 సెప్టెంబరు 24 న అంగారకుడి కక్ష్యలో ప్రవేశించింది. సోవియట్ యూనియన్, నాసా, యూరపియన్ స్పేస్ ఏజెన్సీల తరువాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించింది. తొట్టతొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశం భారత్.

2014 – భాజపా ప్రభుత్వం తిరిగి వచ్చింది

2014 లో జరిగిన 16 వ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో తొలిసారిగా భాజపా సంపూర్ణ ఆధిక్యత సాధించి, మోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది.

2016 నవంబరు 8 న భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో, భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద కుదుపుకు లోనైంది. సరిపడినంత ద్రవ్య లభ్యత లేక కొన్ని నెలల పాటు ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు.

మూలాలు

Tags:

గణతంత్ర భారతదేశ చరిత్ర 1947-50గణతంత్ర భారతదేశ చరిత్ర 1950, 1960 లుగణతంత్ర భారతదేశ చరిత్ర 1970 లుగణతంత్ర భారతదేశ చరిత్ర 1980 లుగణతంత్ర భారతదేశ చరిత్ర 1990లుగణతంత్ర భారతదేశ చరిత్ర పొత్తుల కాలంగణతంత్ర భారతదేశ చరిత్ర 2000 లుగణతంత్ర భారతదేశ చరిత్ర మూలాలుగణతంత్ర భారతదేశ చరిత్రఅమెరికా సంయుక్త రాష్ట్రాలుచైనాజవాహర్ లాల్ నెహ్రూపాకిస్తాన్ప్రచ్ఛన్నయుద్ధంప్రధానమంత్రిభారత రాజ్యాంగంభారత్ చైనా యుద్ధం 1962మహాత్మా గాంధీసర్దార్ వల్లభభాయి పటేల్సోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రజ్యోతిగోత్రాలు జాబితాభారత ఆర్ధిక వ్యవస్థమహాభాగవతంరష్మి గౌతమ్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)పది ఆజ్ఞలుఇక్ష్వాకులుభారత జీవిత బీమా సంస్థఉత్తరాషాఢ నక్షత్రముసర్వే సత్యనారాయణతెలంగాణా బీసీ కులాల జాబితాసామజవరగమనప్రేమలుస్వామి వివేకానందమమితా బైజుతాటి ముంజలుబాల కార్మికులుకొల్లేరు సరస్సు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపొంగూరు నారాయణనక్షత్రం (జ్యోతిషం)మెదడుసంగీతంసింహంసౌర కుటుంబంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుగోవిందుడు అందరివాడేలేతీన్మార్ సావిత్రి (జ్యోతి)కృష్ణా నదిభారతదేశ చరిత్రరాప్తాడు శాసనసభ నియోజకవర్గంయేసు శిష్యులుమేషరాశిపి.సుశీలఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుమూలా నక్షత్రంవిభక్తిసుడిగాలి సుధీర్తెలుగు సినిమాలు 2023శతక సాహిత్యముతోట త్రిమూర్తులుఆయాసంతాజ్ మహల్ఓటుదశదిశలుభారత రాజ్యాంగంఅంగుళంవేమన శతకముగురువు (జ్యోతిషం)జాతీయములుకొబ్బరిభారత జాతీయపతాకంఅన్నప్రాశనకూచిపూడి నృత్యంసాయిపల్లవిశ్రీశైల క్షేత్రంకేతిరెడ్డి పెద్దారెడ్డిసౌందర్యబి.ఆర్. అంబేద్కర్విడాకులుభారతదేశ సరిహద్దులునామవాచకం (తెలుగు వ్యాకరణం)వాసుకి (నటి)రావి చెట్టుత్రిష కృష్ణన్సిద్ధార్థ్ఆటవెలదిసన్ రైజర్స్ హైదరాబాద్శ్రీకాళహస్తికె. అన్నామలైమామిడిభువనేశ్వర్ కుమార్వరిబీజంకీర్తి సురేష్ప్రియురాలు పిలిచిందిదత్తాత్రేయరెండవ ప్రపంచ యుద్ధం🡆 More