మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి పంట తక్కువ కాలంలో కోతకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
వైద్య పరమైన ఉపయోగములు
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.
అనువైన వాతావరణం
బొప్పాయి ఉష్ణమండలపు పంట. సముద్ర మట్టం నుంచి 1000 మీ. ఎత్తువరకు పెంచవచ్చు. వేసవిలో 32 డిగ్రీల సెం.గ్రే. నుంచి 38 డిగ్రీల సెం.గ్రే వరకు తట్టుకుంటుంది. చలికాలంలో 5 డిగ్రీల సెం.గ్రే.కి తక్కువ ఉండరాదు. బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. వీటితోపాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగుచేయవచ్చును. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు, సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు. బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం.
రకాలు
బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు రకాలు
డయీషియస్
ఇవి ఆడ, మగ పుష్పాలు వేరువేరుగా పూసే చెట్ల రకాలు. వీటిలో గుజ్జు పసుపురంగులో ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
వాషింగ్టన
కో-4
కో-6
హానీడ్యూ
గైనో డయీషియస్
ఇవి ఆడపుష్పాలు, ఆడపుష్పాలతోపాటు ద్విలింగ పుష్పాల రకాలు. వీటిలో గుజ్జు ఆరంజి రంగులో తియ్యగా ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
కూర్గు హనీడ్యూ
సోలో
కో-3
పూసా డెలీషియస్
రెడ్ లేడీ (786)
ప్రస్తుతం పండ్ల కోసం భారతదేశంలో ఈ రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి.
విశేషాలు
బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్ (Papain) తయారీకోసం కో-2, కో-5 రకాలు సాగుచేస్తున్నారు.
పచ్చికాయలు కూరకోసం పూసాజెయింట్ రకం అనువుగా ఉంటుంది.
పూసా మెజెస్టీ, రెడ్ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం.
పెరటి తోటల్లోనూ, ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్ రకం అనుకూలం.
నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి పూసా నానా రకం అనుకూలంగా ఉంటుంది.
రంగు, రుచి కలిగిన చిన్న కాయల కోసం 'సోలో', ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు.
మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
ఈ పపైన్ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్మెంట్ తయారుచేస్తారు.
నొప్పి నివారిణిగానూ ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు.
బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది.
+ తెలుగు నాట పచ్చి బొప్పయి కాయతో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతంలో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానే బొప్పాకాయిని కూరగాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు.
బొప్పాయి పొట్ట, ప్రేగులలో విష పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది. అలానే బొప్పాయిలో ఫ్లవనోయిడ్స్, పొటాషియం, మినరల్స్, ఫైబర్ మెగ్నీషియం మొదలైన పదార్థాలు ఉంటాయి.
జాగ్రత్తలు
బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి. అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్ అనే యాంథెల్మింటిక్ ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది ఎక్కువయితే ప్రమాదకరం.
క్యారెట్ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది
అపోహలు
బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ, పట్టణ వాసులకు కూడా అనేక అపోహలున్నాయి. బొప్పాయి తింటే వేడి చేస్తుందని, గర్భిణి స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని, బహిస్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని, ముసలివారికి, పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి. వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా ఋజువయ్యింది. అంతే కాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం.
విశేషాలు
ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు
బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు
శ్రీలంక, భారత్, పాకిస్థాన్... వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు
ప్రస్తుతం బొప్పాయిని హవాయ్లో ఎక్కువగా పండిస్తున్నారు.
మెక్సికన్లు దీన్ని ట్రీ మెలన్ అనీ పాపా అనీ పిలుస్తారు.
పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారు రోజులపాటు ఉంచితే బాగా పండుతాయి.
మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగంలో, మెక్సికోలో ఎక్కువగా పండే బొప్పాయి స్పానిష్, పోర్చుగీస్ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైంది
గతంలో బొప్పాయి పండ్లను తినడానికి గాని, వాటిని పెంచ డానికి గాని ప్రజలు/ రైతులు అంతగా ఇష్టపడే వారు కాదు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తింటున్నందున పండిస్తున్నారు.
Look up బొప్పాయి in Wiktionary, the free dictionary.
This article uses material from the Wikipedia తెలుగు article బొప్పాయి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.