హృద్ధమనుల వ్యాధి

హృదయానికి మిగిలిన అవయవాల వలె ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందించుటకు రక్తప్రసరణ అవసరం.

హృదయం నిరంతరంగా జీవితకాలం అంతా తోడు యంత్రంగా పనిచేయాలి. అందువలన దానికి నిరంతరం రక్తప్రసరణ చేకూరాలి. వామ (ఎడమ), దక్షిణ (కుడి) హృద్ధమనులు హృదయానికి రక్తం కొనిపోతాయి. హృత్సిరలు రక్తంను తిరిగి గుండెలో కుడికర్ణికకు చేరుస్తాయి.

హృదయానికి రక్తప్రసరణ తగినంత లోపిస్తే గుండెనొప్పి కలుగుతుంది. రక్తప్రసరణ చాలా తీవ్రంగా లోపిస్తే గుండెపోటు కలుగుతుంది. గుండెపోటు కలిగినపుడు కొంత హృదయ కండర కణజాలం రక్తప్రసరణ లేక ‘ప్రసరణరహిత మరణం (ఇన్ ఫార్క్షన్) పొందుతుంది.. అందువలన ప్రాణనష్టంతో బాటు ఇతర ఉపద్రవాలు కలిగే అవకాశం ఉంది. 40 సంవత్సరముల వయస్సు దాటిన పురుషులలో జీవితకాలంలో ఇద్దఱిలో ఒకరు, స్త్రీలలో ముగ్గురిలో ఒకరు హృద్ధమనివ్యాధికి (కరోనరీ ఆర్టెరీ డిసీజ్) గురి అవుతారు. ప్రపంచంలో 30 శాతపు మరణాలు హృదయ రక్తప్రసరణ లోపాల వలన కలుగుతాయి.    

హృద్ధమనుల వ్యాధి

హృద్ధమనుల వ్యాధి (కరోనరీ ఆర్టెరీ డిసీజ్ ) అంటే పరోక్షంగా హృద్ధమనుల కాఠిన్యతగా (ఎథిరోస్క్లీరోసిస్ ) భావించాలి. ధమనీకాఠిన్యం శైశవం నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యంలో తీవ్రతరం అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపక కణాలు పేరుకొని ఫలకలుగా పొడచూపుతాయి. ధమనుల గోడలోని మృదుకండరాల మధ్య కాల్సియం ఫాస్ఫేట్ నిక్షేపాలు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీకాఠిన్యపు ఫలకలు ధమనులలోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణం తగ్గి అవి సంకుచితం చెందుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చు, లేక ఎక్కువగా ఉండవచ్చు. ధమనులలో హెచ్చుభాగం కాఠిన్యత పొందవచ్చు. హృద్ధమనులు, వాటి శాఖలలో నాళపు లోపలి పరిమాణం 40 శాతం కంటె తక్కువగా తగ్గినపుడు రక్తప్రవాహానికి చెప్పుకోదగ్గ అడ్డంకి కలుగదు. రక్తనాళాలలో ఫలకలు స్థిరంగా ఉండి నాళం లోపలి పరిమాణం 40- 70 శాతం తగ్గినపుడు రక్త ప్రవాహానికి అవరోధం కలిగి శ్రమ, వ్యాయామాలతో హృదయానికి ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు, ఆ అవసరాలు తీరక గుండెనొప్పి (ఏంజైనా) కలుగుతుంది. విరామంతో యీ గుండెనొప్పి తగ్గుతుంది. ఇట్టి గుండెనొప్పులు స్థిర హృద్ధమని వ్యాధులుగా పరిగణిస్తారు. రక్తప్రసరణ లోపం తీవ్రతరం అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశం ఉంది. జఠరికలు లయ తప్పి జఠరిక ప్రకంపనం (వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ ) లోనికి వెళ్తే ప్రాణాపాయం కలుగుతుంది.

ఒక్కోసారి ఒక హృద్ధమని ఆకస్మికంగా పూర్తిగా కాని చాలా భాగం కాని మూసుకుపోవచ్చు. ధమనిలో ఏర్పడిన కఠినఫలక (ప్లేఖ్) చిట్లి దానిపై నెత్తురుగడ్డ ఏర్పడి రక్తప్రసరణకు తీవ్ర అవరోధం కలిగిస్తే, హృదయ కండరజాలంలో కొంతభాగం ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందక మరణిస్తే గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) కలుగుతుంది. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కండర కణజాలానికి బదులు పీచుకణజాలం ఏర్పడుతుంది. అపుడు హృదయం పనితీరు క్షీణిస్తుంది. హృద్ధమని లేక ఒక హృద్ధమనిశాఖ హటాత్తుగా పాక్షికంగా మూసుకుపోతే గుండెలో ఒక భాగానికి రక్తప్రసరణ ఆకస్మికంగా తగ్గి తీవ్రమైన గుండెనొప్పి కలిగినా గుండె కండరజాలం మరణించకపోవచ్చు.  శ్రమలేకుండానే గుండెనొప్పి కలగడం, ఎక్కువ సమయం గుండెనొప్పి ఉండడం, నొప్పి తీవ్రంగా ఉండడం, వంటి లక్షణాలు సత్వర హృద్ధమని వ్యాధులను సూచిస్తాయి. ఈ గుండెనొప్పిని అస్థిరమైన గుండెనొప్పిగా (అన్ స్టేబిల్ ఏంజైనా) పరిగణిస్తారు.

హృద్ధమని వ్యాధికి కారణాలు

వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనం హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమనివ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుమేహవ్యాధిగ్రస్థులలోను, అల్పసాంద్రపు లైపోప్రోటీనులు అధికంగా ఉన్నవారిలోను, అధికసాంద్రపు లైపోప్రోటీనులు తక్కువగా ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోను, పొగత్రాగేవారిలోను,, వ్యాయామం చేయక భౌతిక జడత్వం కలవారిలోను, స్థూలకాయులలోను (భారసూచిక 18.5-24.9పరిమితులలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళాలలోపు స్త్రీలలో 35 అంగుళాలలోపు  ఉండుట మేలు.),దగ్గఱి కుటుంబసభ్యులలో పిన్నవయస్సులోనే (పురుషులలో 55 సంవత్సరాలలోను, స్త్రీలలో 65 సంవత్సరాలలోను) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు కలిగిన వారిలోను,హృద్ధమనీవ్యాధులు కలిగే అవకాశాలు హెచ్చు.. ధూమపానం సలిపేవారు ధూమపానం పూర్తిగా 15 సంవత్సరాలు మానివేస్తే వారిలో హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశం ధూమపానం సలుపని వారితో సమానం అవుతుంది. రక్తపరీక్షలలో సి-రీయేక్టివ్ ప్రోటీన్ 2 మి.గ్రాలు/డె.లీ మించినవారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణాలు పెరిగిన వారిలోను, దూరధమని వ్యాధులు కలవారిలోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశాలు హెచ్చు.

రక్తప్రసరణలోప హృదయవ్యాధి లక్షణాలు

హృద్ధమనులలో  కాఠిన్యపు ఫలకలు (ప్లేక్స్) మార్పులేక  స్థిరంగా ఉండి రక్తప్రసరణకు తగినంత అవరోధం కలిగిస్తే ప్రసరణలోప లక్షణాలు శ్రమతో కనిపిస్తాయి. శారీరక శ్రమ చేసినపుడు  శరీరంకు రక్తప్రసరణను పెంచవలసిన భారం హృదయంపై పడుతుంది. అపుడు హృదయవేగం పెరుగుతుంది. వేగం పెరిగినపుడు గుండెకు ప్రాణవాయువు, పోషకపదార్థాల అవసరాలు పెరుగుతాయి. అందుచే గుండెకు రక్తప్రసరణ అవసరాలు పెరుగుతాయి, కాని హృద్ధమనులలో అవరోధాలు ఉండడం వలన ఆ అవసరాలు తీరవు. ఆ కారణంచే రక్తప్రసరణలోప హృదయ వ్యాధి (Ischemic heart disease) లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. ముకుళిత రక్తపీడనం (సిస్టోలిక్ బ్లడ్ ప్రెషరు) పెరిగినపుడు కూడా హృదయానికి శ్రమ  పెరుగుతుంది. హృదయ కండరానికి రక్తప్రసరణ జఠరికలు వికసించినపుడు హెచ్చుగా సమకూడుకుంది. హృదయవేగం పెరిగినపుడు జఠరికల వికాస సమయం తగ్గి హృదయానికి రక్తప్రసరణ తగ్గుతుంది.

హృదయానికి రక్తప్రసరణ చాలనపుడు ఛాతిలో రొమ్ము ఎముకకు (ఉరోస్థి) ; వెనుక నొప్పి గాని, అసౌఖ్యత గాని కలుగుతుంది. కొందఱిలో ఛాతిలో బిగుతు, ఛాతిపై భారం, ఛాతిని పిండినట్లు భావం, లేక, ఛాతిలో తిమ్మిరి కలుగుతాయి. ఈ బాధ ఎడమ భుజానికి, దవడకు ప్రాకవచ్చు. కొందఱిలో గుండెనొప్పిగా కాక రక్తప్రసరణ లోపం ఆయాసం, నీరసం, ఒళ్ళు తూలడం, అనిశ్చలత, మెదడులో మార్పులుగా కనిపించవచ్చు. ఈ లక్షణాలు నియమిత శ్రమతో కలుగుతాయి, నియమిత విరామం తర్వాత గాని, నాలుక క్రింద  నైట్రోగ్లిసరిన్ తీసుకొనుట వలన గాని తొలగుతాయి.

హృద్ధమనులలోని మృదుకండరాల దుస్సంకోచం వలన, బృహద్ధమని కవాటాల సంకుచితం (అయోర్టిక్ స్టెనోసిస్) వలన, ముకుళిత రక్తపీడనం బాగా పెరిగినపుడు, హృదయకండర అతివృద్ధి వ్యాధి (హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి) కలవారిలోను, ధమనీకాఠిన్యత లేకపోయినా గుండెనొప్పి, గుండెనొప్పి లక్షణాలు కలుగ వచ్చు.

వైద్యులు రోగులను పరీక్షించునపుడు  అధిక రక్తపుపోటును, దూరధమని వ్యాధులను, మస్తిష్క ధమనుల వ్యాధులను, హృదయ కవాట వ్యాధులను, కనుగొనగలరు. ఈ వ్యాధులు కలవారిలో హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువ.

పరీక్షలు

హృద్ధమని వ్యాధికి కారణాలు లేనపుడు, గుండెనొప్పి లక్షణాలు లేనివారిలో, వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు ఊఱకే చేయుట వైద్యులు ప్రోత్సహించరు. అట్టి పరీక్షల వలన వ్యాధికి తప్పుడు సమాచారం తఱచు రావడం దీనికి కారణం.

విద్యుత్ హృల్లేఖ

హృద్ధమని వ్యాధి లక్షణాలు కలవారిలో విద్యుత్ హృల్లేఖనం చేయాలి. ఛాతినొప్పి లేని సమయాలలో తీసే హృల్లేఖలో అసాధారణాలు ఉండవు. ఛాతినొప్పి ఉన్నపుడు తీసిన విద్యుత్ హృల్లేఖలో ST భాగము మూలాధార రేఖకు దిగువకు కాని ఎగువకు కాని పోయి ఉండవచ్చు. ఛాతిలో నొప్పి , ఆయాసం కలిగించే ఇతర వ్యాధులను కనిపెట్టడానికి ఛాతికి ఎక్స్- రే చిత్రాలు తియ్యాలి. రక్తకణ పరీక్షలతో పాండురోగం (వీరిలో రక్తకణాల ప్రాణవాయువు వహనం తగ్గుతుంది ), బహుళ రక్తకణ వ్యాధిని (పోలీసైథీమియా - వీరిలో ఎఱ్ఱరక్తకణాల సంఖ్య ఎక్కువై రక్తసాంద్రత, జిగట పెరుగుతుంది. వీరిలో చిన్న ధమనులలోను, రక్తకేశనాళికలలోను రక్తప్రసరణ మందమవుతుంది). కనుగొనవచ్చు. గళగ్రంథి స్రావక పరీక్షలతో గళగ్రంథి ఆధిక్యతను (హైపర్ థైరాయిడిజ్మ్) తెలుసుకొనవచ్చు. రక్తరసాయనిక పరీక్షలతో మధుమేహవ్యాధిని, మూత్రాంగాల పనితీరు తెలుసుకొనవచ్చు.

ప్రతిధ్వని హృదయచిత్రీకరణ (ఎఖోకార్డియోగ్రఫీ)

ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం హృదయవైఫల్యం, హృదయ కవాటవ్యాధులు, గుండెపోటులు కలిగిన వారిలో గుండెగోడల కదలికల సమాచారం సమకూర్చగలదు. ఎడమ జఠరిక రక్తప్రసరణ శాతం (ఎజెక్షన్ ఫ్రాక్షన్), హృదయం కార్యనిర్వహణలు  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం వలన తెలుస్తాయి.

వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు (ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్స్)

గుండెనొప్పి కలిగినవారిలో విరామ సమయంలో తీసే విద్యుత్ హృల్లేఖాలలో మార్పులు హెచ్చుగా లేనప్పుడు, వ్యాయామం చేయగలిగిన వారికి వ్యాయామం చేయిస్తూ విద్యుత్ హృల్లేఖ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు  65 %  మందిలో వ్యాధి గ్రహణత (వ్యాధిని కనుగొనుట / సెన్సిటివిటీ), 75 శాతం మందిలో వ్యాధి నిర్దిష్టత (వ్యాధిని రూఢీకరించుట / స్పెసిఫిసిటీ) కలిగి ఉంటాయి.

వ్యాయామంతో హృదయకండరంలో రక్తప్రసరణ లోపాలు గల భాగాలను (మయోకార్డియల్ పెర్ఫ్యూజన్ డిఫెక్ట్స్ ) రేడియోధార్మిక పదార్థాలు ( థాలియం 201 ) ఉపయోగించి చిత్రీకరించవచ్చు.

వ్యాయామంతో ప్రతిధ్వని హృదయ చిత్రీకరణాలు కూడా ఉపయోగకరమే. వ్యాయామ ప్రతిధ్వని హృదయ చిత్రీకరణాలు, వ్యాయామంతో హృదయ రక్తప్రసరణ  చిత్రీకరణాలు (ఎక్సర్ సైజ్ మయోకార్డియల్ పెర్ఫ్యూజన్ ఇమేజింగ్)  80- 85 శాతపు వ్యాధిగ్రహణతను, 77-88 % వ్యాధి నిర్దిష్టతను  కలిగి ఉంటాయి.

వ్యాయామం చేయలేని వారిలో  హృదయ సంకోచం పెంచే (అయినోట్రోపిక్ ఏజెంట్) డోబుటమిన్  ఔషధం ఉపయోగించి ప్రతిధ్వని హృదయ చిత్రీకరణంతో  ఒత్తిడి పరీక్షలు చేస్తారు. రక్తప్రసరణ లోపించిన భాగాలలో హృదయకండర సంకోచం పరిమితమయి ఉంటుంది.

డైపిరిడమాల్, ఎడినొసైన్, రెగడినొసన్ వంటి రక్తనాళ వ్యాకోచక ఔషధాలను ఇచ్చి, రేడియోథార్మిక పదార్థాలతో హృదయకండర రక్త ప్రసరణ పరీక్షలు (మయోకార్డియల్ పెర్ఫ్యూజన్ స్టడీస్) చేస్తారు.

సాధారణంగా ఒత్తిడి పరీక్షల ఫలితాలు బాగున్నపుడు గుండెకు రక్తప్రసరణ బాగున్నట్లు నిర్ణయించవచ్చు. ఈ పరీక్షలలో  అసాధారణాలు చాలా ఉన్నపుడు ఒకటికి మించి హృద్ధమనులలో ధమనీకాఠిన్య సంకుచితాలు ఉండే అవకాశాలు ఎక్కువ. వారికి వ్యత్యాస పదార్థాలతో  హృద్ధమనుల చిత్రీకరణ (కరోనరీ ఏంజియోగ్రఫీ), ఆపై  అవసరమయితే హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు  చేస్తారు .

గణనయంత్ర హృద్ధమనీ చిత్రీకరణ (సి.టి.కరోనరీ ఏంజియోగ్రఫీ)

ఈ పరీక్ష వలన హృద్ధమనుల నిర్మాణంలో అసాధారణాలు తెలుస్తాయి. రక్త ప్రసరణ లోపాలు కల గుండె భాగాలు  ప్రస్ఫుటం కావు. వ్యాయామంతో కాని ఔషధాలతో కాని  అయస్కాంత ప్రతిధ్వని హృదయ రక్తప్రసరణ చిత్రీకరణలు (మాగ్నెటిక్ రెజొనెన్స్ పెర్ఫ్యూజన్ ఇమేజింగ్) చేసి రక్తప్రసరణ లోపం గల భాగాలను, ఇతర అసాధారణాలను కనుగొనగలరు.

హృద్ధమనుల చిత్రీకరణ (కరోనరీ ఏంజియోగ్రఫీ)

ఈ పరీక్షలలో, ఊరుధమని లేక ముంజేతి బహిర్ధమని ద్వారా కృత్రిమనాళం బృహద్ధమని లోనికి, ఆపై హృద్ధమనులలోనికి చొప్పించి వ్యత్యాస పదార్థాలను

హృద్ధమనుల వ్యాధి 
హృద్ధమనుల చిత్రీకరణ

చిమ్మి, ఎక్స్ రే చిత్రాలతో హృద్ధమనులను, వాటి శాఖలను చిత్రీకరిస్తారు. ఈ పరీక్షలు ధమనులలో సంకుచితాలను, వాటి తీవ్రతను, తెలుసుకొనుటకే కాక వాటికి చికిత్సామార్గాలను నిర్ణయించుటకు కూడా ఉపయోగపడుతాయి. ఎడమ జఠరికలోనికి వ్యత్యాసపదార్థాలను చిమ్మి, ఎడమ జఠరిక పరిమాణం, పనితీరు, కవాటాలలో అసాధారణాలను కనుగొనుటకు ఈ పరీక్షలు తోడ్పడుతాయి. అవసరమయిన వారికి హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు చేసి వ్యాకోచ సాధనాలను (స్టెంట్స్) అమర్చవచ్చు.

ఈ పరీక్షల వలన వ్యత్యాస పదార్థాలకు వికటత్వం (ఎనఫిలాక్సిస్) కలగడం, మూత్రపిండాలు దెబ్బతినడం (సత్వర మూత్రాంగ విఘాతం), దూరధమనులలోనికి కొలెష్ట్రాలు అవరోధకాలుగా (ఎంబొలై) చేరి రక్తప్రసరణకు అడ్డుపడడం, రక్తస్రావం వంటి ఉపద్రవాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. హృద్ధమనుల వ్యాధి నిర్ణయానికి హృద్ధమనుల చిత్రీకరణం ప్రామాణిక పరీక్ష.

ఛాతినొప్పి కలిగిన వారిలో హృదయ రక్తప్రసరణ లోపం, పుపుస ధమనిలో రక్తప్రసరణ అవరోధకాలు, ఊపిరితిత్తులను ఆవరించుకొను పొరల మధ్య (పుపుసవేష్టనంలో) గాలి చేరడం (న్యూమోథొరాక్స్), బృహద్ధమని విచ్ఛేదనాలు, వంటి ప్రాణాపాయకరమైన  వ్యాధులకై  వైద్యులు శోధించాలి.

చికిత్స

హృద్ధమని వ్యాధిగ్రస్థులు వారి వ్యాధికి కల కారణాలను అదుపులో పెట్టుకోవాలి. పొగత్రాగుట పూర్తిగా మానివేయాలి. మధుమేహవ్యాధిని, రక్తపు పోటును అదుపులో పెట్టుకోవాలి. భోజనంలో కొలెష్ట్రాలు, సంతృప్తపు కొవ్వుపదార్థాలవాడుకను నియంత్రించుకోవాలి. అల్పసాంద్ర లైపోప్రోటీనుల  విలువలు 100 మి.గ్రాలు / డె.లీ కంటె తక్కువ ఉండునట్లు స్టాటిన్ మందులు వాడుకోవాలి. వీరికి దినానికి అరగంట నుంచి గంట వఱకు వ్యాయామం అవసరం. స్థూలకాయులు బరువు తగ్గే ప్రయత్నాలు చేయాలి.

ఔషధాలు

హృద్ధమనివ్యాధి మార్పులేక స్థిరంగా ఉన్నవారిలో  ఔషధ చికిత్స ఫలితాలు ధమనీవ్యాకోచ చికిత్సల  ఫలితాలతో సమతుల్యంగా ఉంటాయి.

హృదయానికి ప్రసరణ లోపాలు ఉన్నవారికి గుండెనొప్పులను తగ్గించుట, గుండెపోటులు నివారించుట, మృత్యువాత పడకుండా చేయుట చికిత్స లక్ష్యాలు.

గుండెనొప్పి వచ్చినపుడు నొప్పి నివారణకు విరామంతో బాటు, నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్  బిళ్ళల రూపంలో కాని, తుంపర సాధనాలతో జల్లుగా గాని, వాడుకోవాలి.

గుండె నొప్పులను నివారించడానికి వివిధ ఔషధాల సమన్వయంను వాడుతారు. ఇవి:

బీటా గ్రాహక అవరోధకాలు ( బీటా ఎడ్రినెర్జిక్ రిసెప్టార్ బ్లాకర్స్)

బీటా గ్రాహక అవరోధకాలు హృదయ వేగాన్ని, హృదయ సంకోచనాన్ని తగ్గించి హృదయానికి ప్రాణవాయువు అవసరాలు తగ్గిస్తాయి. గుండెనొప్పుల తఱచుదనాన్ని, గుండెనొప్పుల తీవ్రతను, గుండెపోటులను, గుండెపోటులచే కలుగు మరణాలను తగ్గిస్తాయి. మెటోప్రొలోల్ తఱచు వాడబడే ఔషధం. విరామ సమయాలలో గుండెవేగం 50-60 లో ఉండునట్లు బీటా గ్రాహక అవరోధకాల మోతాదును సవరించాలి. తీవ్రమైన ఉబ్బస, తీవ్ర దీర్ఘకాల శ్వాస అవరోధక వ్యాధి, హృదయమాంద్యం, హృదయవైఫల్యం ప్రస్ఫుటంగా ఉన్నపుడు బీటా అవరోధకాలను జాగ్రత్తగా వాడాలి. రక్తపీడనం కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

కాల్సియమ్  మార్గ అవరోధకాలు ( కాల్సియం ఛానెల్ బ్లాకర్స్)

ఈ ఔషధాలు కణాల కాల్సియం మార్గాలను బంధించి కాల్సియం గమనం అరికట్టి రక్తనాళాలలో మృదుకండరాల సంకోచాన్ని తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి గుండెకు రక్తప్రసరణ పెంచుతాయి. ధమనులలో రక్తపీడనం తగ్గించి జఠరికలపై పనిభారం తగ్గిస్తాయి. హృదయ సంకోచంను (కంట్రాక్టిలిటీ ) కూడా తగ్గిస్తాయి. బీటా అవరోధకాలను వాడలేనివారిలోను , బీటాఅవరోధకాలు గుండెనొప్పులను అరికట్టలేనపుడు వాటికి తోడుగా కాల్సియం మార్గ అవరోధకాలను వాడుతారు. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందని (ఉదా : వెరాపమిల్,  డిల్టియజెమ్) కాల్సియం మార్గ అవరోధకాలు హృదయవేగం తగ్గిస్తాయి, హృదయసంకోచంను కూడా తగ్గిస్తాయి. కాబట్టి హృదయ మాంద్యంకలవారిలోను, హృదయవైఫల్యం కలవారిలోను వీటిని వాడకపోవుట మంచిది. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందిన కాల్సియం మార్గ అవరోధకాలు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. హృదయ సంకోచాన్ని తగ్గించవు, హృదయమాంద్యం కలిగించవు. వీటిని బీటా అవరోధకాలతోను, హృదయవైఫల్యం గలవారిలోను వాడవచ్చు. సత్వరంగా పనిచేసే కాల్సియమ్ మార్గ అవరోధకాలు అతిత్వరగా రక్తపీడనం బాగా తగ్గించి గుండెపోటులు, మరణాలు కలిగించగలవు కాబట్టి వీటిని వాడకూడదు. దీర్ఘకాలిక కాల్సియమ్ మార్గ అవరోధకాలు వాడడం మేలు.

దీర్ఘకాలపు నైట్రేటులు

ఇవి హృద్ధమనులను వ్యాకోచింపజేస్తాయి, సిరలను వ్యాకోచింపజేసి జఠరికలలో వికాసం చివరలో ఉండే (రక్త) ప్రమాణాన్ని (వికాసాంతర రక్తప్రమాణం / ఎండ్ డయస్టాలిక్ వాల్యూమ్ ) తగ్గించి గుండె పనిభారాన్ని తగ్గిస్తాయి. అధిక మోతాదులలో ధమనుల పీడనాన్ని కూడా తగ్గిస్తాయి. గుండెనొప్పులను తగ్గిస్తాయి. ఈ నైట్రేటులకు దేహానికి సహనం  పెరుగకుండుటకై వీటిని 12 గంటల విరామంతో వాడుట మేలు.దేహంలో నైట్రేటులకు సహనము పెరిగితే నైట్రేటులు పనిచెయ్యవు. సిల్డెనఫిల్, వార్డెనఫిల్, టాడలఫిల్ వంటి ఫాస్ఫోడైయెస్టరీజ్ – 5 అవరోధకాలు వాడేవారు నైట్రేటులను వాడకూడదు.

రెనొలజిన్

పై మందులతో గుండెపోటులు తగ్గనివారికి రెనొలజిన్ వాడవచ్చు. గుండెవేగం పైన రక్తపీడనం పైన రెనొలజిన్ ప్రభావం ఉండదు. కాని వెరాపమిల్, డిల్టియజిమ్ లు వాడేవారిలో విద్యుత్ హృల్లేఖాలలో qt విరామం పెంచగలవు కావున తగిన పరిశీలన, జాగ్రత్త అవసరం .

ఏస్పిరిన్

హృద్ధమని వ్యాధి కలవారిలో  ఏస్పిరిన్ సూక్ష్మరక్తఫలకాలు (ప్లేట్ లెట్స్) గుమికూడుటను అరికట్టి గుండెపోటులను, మరణాలను తగ్గిస్తుంది. జీర్ణమండలంలో రక్తస్రావాలు లేనివారిలోను, ఏస్పిరిన్ అసహనం లేనివారిలోను ఏస్పిరిన్ తప్పక వాడాలి.

థీనోపైరిడిన్స్

ఇవి కూడా సూక్ష్మరక్తఫలకాలు గుమికూడుటను అరికడుతాయి. వీటిని ఏస్పిరిన్ పడని వారిలోను, గుండెపోటుల వంటి సత్వర హృద్ధమనివ్యాధులలోను, హృద్ధమనులలో వ్యాకోచసాధనాలను  కొత్తగా అమర్చినవారిలోను వాడుతారు. క్లొపిడోగ్రెల్, టైక్లోపైడిన్, ప్రాసుగ్రెల్ ఈ తరగతిలోని కొన్ని మందులు.

ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైమ్ అవరోధకాలు

హృద్ధమని వ్యాధిగ్రస్థులలో మధుమేహం, రక్తపుపోటు, హృదయవైఫల్యం  ఉన్నవారిలో ఏస్ అవరోధకాలు ఇవి చాలా ఉపయోగకరం. ఏస్ అవరోధకాలు వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక నిరోధకాలు వాడుతారు.

చర్మం ద్వారా హృద్ధమని వ్యాకోచ చికిత్సలు ( పెర్క్యుటేనియస్ ఇంటర్వెన్షన్ )

ఔషధాలతో గుండెనొప్పులు తగ్గని వారిలో చర్మం ద్వారా కృత్రిమనాళపు బుడగలతో బృహద్ధమనిలోనికి ఆపై హృద్ధమనులలోనికి వెళ్ళి వాటిని వ్యాకోచింపజేస్తారు. ఆ వ్యాకోచంను స్థిరంగా నిలుపడానికి వ్యాకోచసాధనాలు  హృద్ధమనులలో అమర్చుతారు.

హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స  

హృద్ధమనుల వ్యాధి 
హృద్ధమనిలో అవరోధమును అధిగమించు శస్త్రచికిత్స

హృద్ధమనులలో  వ్యాధి విస్తృతంగా ఉన్నపుడు, వామహృద్ధమని, వామ పూర్వఅవరోహణ ధమనులలో తీవ్రసంకుచితాలు ఉన్నపుడు , ఎక్కువ హృద్ధమనులలో వ్యాధి సంకుచితాలు తీవ్రంగా ఉన్నప్పుడు తొడలు, కాళ్ళ నుంచి గ్రహించిన దృశ్యసిరల (సెఫినిస్ వీన్స్) భాగాలను కాని, అంతరస్తన ధమనిని (ఇంటర్నల్ మమ్మరీ ఆర్టెరీ) కాని అవరోధాల తరువాత భాగాలలో హృద్ధమనులకు శస్త్రచికిత్సతో జతపఱచి హృదయానికి రక్తప్రసరణను పునరుద్ధింపవచ్చు. దృశ్యసిరల భాగాలను వాడేటప్పుడు వాటి ముందు కొనలను బృహద్ధమనితో కలుపుతారు. ఈ చికిత్సల వలన గుండెపోటులు, మరణాలు తగ్గుతాయి.

Tags:

హృద్ధమనుల వ్యాధి హృద్ధమనుల వ్యాధి హృద్ధమని వ్యాధికి కారణాలుహృద్ధమనుల వ్యాధి రక్తప్రసరణలోప హృదయవ్యాధి లక్షణాలుహృద్ధమనుల వ్యాధి పరీక్షలుహృద్ధమనుల వ్యాధి చికిత్సహృద్ధమనుల వ్యాధిహృద్ధమనులు

🔥 Trending searches on Wiki తెలుగు:

యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామొదటి పేజీమార్చి 30సుకన్య సమృద్ధి ఖాతాపసుపుసుందరిరంగస్థలం (సినిమా)ప్రియాంకా అరుళ్ మోహన్పెళ్ళిసమాసంరాగులుటైటన్ప్రతాప్ సి. రెడ్డిసత్య కృష్ణన్కాళోజీ నారాయణరావుద్విగు సమాసముభారతదేశంలో కోడి పందాలుమాయాబజార్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకాశీభారత రాజ్యాంగ పీఠికయుద్ధంవిడదల రజినిసమాచార హక్కుభారతీయ శిక్షాస్మృతిభారత ఎన్నికల కమిషనువిరాట్ కోహ్లివాసిరెడ్డి పద్మచైనాసర్వనామముతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆప్రికాట్సీతాదేవిఅదితిరావు హైదరీరక్తపోటుక్లోమమునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఅనుపమ పరమేశ్వరన్మలబద్దకంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుచదరంగం (ఆట)నందమూరి తారక రామారావుఊపిరితిత్తులుతెలంగాణముఖేష్ అంబానీద్వారకా తిరుమలఉత్తర ఫల్గుణి నక్షత్రముత్రిష కృష్ణన్చంద్రుడుతెలంగాణ జిల్లాల జాబితాగేమ్ ఛేంజర్రాగంవిశాల్ కృష్ణ2024 భారత సార్వత్రిక ఎన్నికలుసంభోగండేటింగ్ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ఆరుద్ర నక్షత్రమువిజయవాడసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)చందనా దీప్తి (ఐపీఎస్‌)దాశరథి కృష్ణమాచార్యభారతదేశంలో సెక్యులరిజంవంగా గీతదానం నాగేందర్మాదిగరావణుడు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసూర్య (నటుడు)కృతి శెట్టిశారదసాహిత్యంతామర వ్యాధివరిబీజంచెల్లమెల్ల సుగుణ కుమారితమిళనాడుహనుమంతుడు🡆 More