జిడ్డు కృష్ణమూర్తి: భారతీయ తత్వవేత్త

జిడ్డు కృష్ణమూర్తి ( 1895 మే 11 - 17 ఫిబ్రబరి 1986) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు.

ఈయనను చార్లెస్ లెడ్ బీటర్, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సాంప్రదాయ ప్రకారం పెంచారు. ఆయన ఒక విశ్వ గురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు. 1922 నుంచి ఆయనను జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించాడు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలుపలికి వచ్చేశాడు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశాడు. ప్రతి ఒక్కరు ప్రవక్త, మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించాడు.

జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి: జీవిత చరిత్ర, మరణం, పాఠశాలలు
జిడ్డు కృష్ణమూర్తి (1920లలో)
జననం(1895-05-12)1895 మే 12
మదనపల్లె, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)
మరణం1986 ఫిబ్రవరి 17(1986-02-17) (వయసు 91)
ఓహై, కాలిఫోర్నియా
యుగం20వ శతాబ్దపు తత్వశాస్త్రం
ప్రాంతంభారతీయ తత్వశాస్త్రం
సంస్థలుకృష్ణమూర్తి ఫౌండేషన్ (వ్యవస్థాపకుడు)
ప్రభావితులు
    • అనీ బిసెంట్
    • చార్లెస్ వెబ్‌స్టర్ లెడ్‌బీటర్
    • ఆల్డస్ హక్స్‌లీ
ప్రభావితమైనవారు

కృష్ణమూర్తి తన మిగిలిన జీవితాన్ని ప్రపంచ పర్యటనలు చేస్తూ, చిన్న పెద్ద జన సమూహాలతో మాట్లాడుతూ గడిపాడు. చాలా పుస్తకాలు రాశాడు. వాటిలో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ (1954), కృష్ణమూర్తి నోట్‌బుక్ (1976) ముఖ్యమైనవి. ఆయన ప్రసంగాలు, సంవాదాలు చాలావరకు ప్రచురింపబడ్డాయి. ఆయన 1986 జనవరిలో మరణించడానికి ఒక నెల ముందు అమెరికాలోని ఓహై లోని తన ఇంటిలో చివరి ప్రసంగం చేశాడు. క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన అనుయాయులు కొంతమంది ఆయన పేరు మీదుగా భారతదేశం, అమెరికా, బ్రిటన్ దేశాలలో స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు నడుపుతున్నారు. ఇవి ఆయన భావాలను, రచనలను వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి.

జీవిత చరిత్ర

దివ్య శిశువు

1909 ఏప్రిల్ లో చార్లెస్ వెబ్‌స్టర్ లెడ్‌బీటర్ అనే ఆయనను కృష్ణమూర్తి మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. లెడ్‌బీటర్ అంతకు మునుపే తనకు దివ్యదృష్టి ఉందని ప్రకటించుకున్నవాడు. అడయార్ నది ఒడ్డున కృష్ణమూర్తి ఆడుకుంటూ ఉండగా అతనిలో "ఏ మాత్రం స్వార్థానికి తావులేని ఒక తేజస్సు"ను గమనించాననీ చెప్పాడు. లెడ్ బీటర్ సహోద్యోగి, కృష్ణమూర్తికి హోం వర్క్ లో సహాయకారి అయిన ఎర్నెస్ట్ వుడ్ మాత్రం ఆయనను ఒక తెలివ తక్కువవాడిగా భావించాడు. లెడ్‌బీటర్ మాత్రం ఈ అబ్బాయి ఒక విశ్వగురువు, మంచి వక్త కాగలడనీ, ఇతను థియొసాఫికల్ సిద్ధాంతం ప్రకారం మానవ పరిణామాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి అప్పుడప్పుడూ భూమి మీదకు వచ్చే మైత్రేయుడి అంశ అనీ భావించాడు.

కృష్ణమూర్తి జీవిత చరిత్రను రాసిన మరో రచయిత్రి పుపుల్ జయకర్ ఆయన బాల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఆ బాలుడు ఏం కోరినా చేసేవాడనీ, సదా సంసిద్ధతతో, విధేయతతో ప్రవర్తించేవాడనీ రాసింది. తన చుట్టూ ఏం జరుగుతుందో అతను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. ఒక చిల్లుపడిన పాత్రలా ప్రవర్తించేవాడు. అందులో ఏమి పోసినా ఆ కన్నం గుండా వెళ్ళిపోవలసిందే, అందులో ఏమీ మిగలదు.

లెడ్‌బీటర్ కృష్ణమూర్తిని గుర్తించిన తర్వాత అడయార్ లోని దివ్యజ్ఞాన సమాజం వారు ఆయన్ను తమ పోషణలోకి తీసుకున్నారు. లెడ్‌బీటర్, ఇంకా అతని విశ్వాసపాత్రులైన అనుచరులు కొంతమంది ఆయనకు విద్య నేర్పించడం, ఆలనా పాలనా చూడటం, విశ్వగురువు ఒకవాహకంగా ఆయన్ని సిద్ధం చేయడం ప్రారంభించారు. కృష్ణమూర్తి, అతని సోదరుడు నిత్యానందకు మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజ ఆవరణలో ప్రత్యేకంగా బోధించేవారు. తర్వాత సోదరులిద్దరూ ఐరోపాలోని కులీన వర్గాలతో సమానంగా జీవితం అనుభవిస్తూ విదేశాలలో చదువు కొనసాగించారు. ఆయన అప్పటిదాకా బడిలో ఇచ్చిన పనిని సరిగా చేయకున్నా, సామర్థ్యాలు ప్రశ్నార్థకం అయినా, 14 ఏళ్ళ వయసులో కేవలం ఆరు నెలల వ్యవధిలో ఆంగ్లంలో మాట్లాడం, రాయడంలో మంచి పట్టు సాధించాడు. రచయిత లుటింజ్ పేర్కొంటూ కృష్ణమూర్తి తర్వాతి కాలంలో తనను దివ్యజ్ఞాస సమాజం వారు గుర్తించడం అనే సంఘటన ఒక రకంగా తన ప్రాణాలను కాపాడింది అని చెప్పాడు. ఒకవేళ అలా జరిగిఉండకపోతే ఏమై ఉండేవాడివని ఆయనను అడిగితే ఏమీ తడుముకోకుండా బహుశా చనిపోయి ఉండేవాడినేమో అన్నాడు.

ఈ సమయంలోనే కృష్ణమూర్తి అనీ బిసెంట్తో గాఢమైన అనుబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెను ఒక తల్లిలా భావించాడు. మొదట్లో కృష్ణమూర్తి బాధ్యతను చట్టబద్ధంగా ఆమెకు అప్పజెప్పడానికి అంగీకరించిన నారాయణయ్య, కుమారుడికి కొత్తగా వచ్చిన అనూహ్యమైన గుర్తింపు వల్ల నెమ్మదిగా తెర వెనుకకు వెళ్ళవలసి వచ్చింది. 1912 లో నారాయణయ్య కుమారుని దత్తతను వెనక్కు తీసుకోమని అనీబిసెంట్ మీద దావా వేశాడు. సుదీర్ఘమైన న్యాయపోరాటం తర్వాత అనీబిసెంట్ కృష్ణమూర్తిని, అతని సోదరుడును నిత్యానందను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కుటుంబం నుంచి వేరుపడటం వల్ల ఒకరిపట్ల ఒకరికి గాఢమైన అనురాగం ఏర్పడింది. తర్వాతి సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే ప్రయాణం చేసేవారు.

1911 లో దివ్యజ్ఞాన సమాజం వారు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్ (OSE) ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రపంచానికి ఒక జగద్గురువును పరిచయం చేయాలనుకున్నారు. కృష్ణమూర్తిని దానికి పెద్దగా నియమించారు, మిగతా సభ్యులు వేర్వేరు స్థానాల్లో నియమితులయ్యారు. జగద్గురువు రాకను ఆమోదించిన వారందరికీ అందులో సభ్యత్వం దక్కుతుంది. ఈ ప్రకటన వల్ల నెమ్మదిగా దివ్యజ్ఞానసమాజం అంతర్గతంగా, బాహాటంగా, హిందువుల్లో, భారతదేశపు ప్రసార మాధ్యమాల్లో పలు వివాదాలు మొదలయ్యాయి.

పెంపకం

కృష్ణమూర్తి జీవిత చరిత్ర రచయితల్లో ఒకరైన మేరీ లూటింజ్ రాసినదాన్ని బట్టి "కృష్ణమూర్తి ఒక దశలో తనకు సరైన చదువు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం పూర్తయితే తాను ఒక జగద్గురువు కాగలనని స్వయంగా విశ్వసించాడు." ఇంకో రచయిత లెడ్‌బీటర్, అతని అనుయాయులు కృష్ణమూర్తి శిక్షణ కోసం ఏర్పాటు చేసిన దైనందిన కార్యక్రమాల గురించి వర్ణించాడు. రోజూ క్రమం తప్పకుండా మంచి వ్యాయామం, క్రీడలు, పాఠశాలకు సంబంధించి వివిధ పాఠ్యాంశాలపై శిక్షణ, దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన అంశాల బోధన, యోగా, ధ్యానం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ, ఆంగ్లేయుల ఆచారాలు, సంప్రదాయాలు మొదలైనవి ఇందులో భాగాలు. అదే సమయంలో లెడ్‌బీటర్ కృష్ణమూర్తికి మార్మికమైన విషయాలను స్వయంగా వివరించేవాడు. ఈ సంగతి కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ఆటల్లో సహజమైన ఆసక్తి చూపిన కృష్ణమూర్తి, పాఠ్యాంశాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అనాసక్తితో ఉండేవాడు. చాలా సార్లు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం ప్రయత్నించి చివరికి ఆ చదువే మానుకున్నాడు. కానీ విదేశీ భాషలను మాత్రం కొన్నింటిని శ్రద్ధగా మాట్లాడటం నేర్చుకున్నాడు.

దివ్యజ్ఞాన సమాజం వారు ఆయనను బాహ్యప్రపంచానికి బాగా మెరుగుపెట్టిన బాహ్య స్వరూపం, తమ ఉద్దేశ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సంయమనం పాటించడం, విశ్వమానవ థృక్పథం, ప్రవర్తనలో మరోప్రపంచపు అందమైన నిర్లిప్తత వంటి లక్షణాలు కలిగిన వాడిగా పరిచయం చేయాలనుకున్నారు. కృష్ణమూర్తి జీవితం చరమాంకం చేరుకునే సరికి దాదాపు ఈ లక్షణాలన్నీ ఆయనలో పొడచూపడం గమనార్హం. ఆయనలో ఏదో వ్యక్తిగతమైన ఆకర్షణ శక్తి ఉన్నదనీ, అయితే అది భౌతిక రూపంలో కనిపించే ఆదరణ భావం కాదనీ, అది భావప్రధానమైన నిష్ఠ, పూజ్యభావన వైపు మొగ్గిన వ్యక్తిత్వమనీ మొదట్లోనే తెల్సింది. కానీ ఆయన పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ యుక్తవయసులో తిరుగుబాటు, భావోద్వేగ అస్థిరత, తనపై విధించిన నియమావళిని ఎదిరించడం, అతని చుట్టూ అల్లుకున్న ప్రచారాన్ని అసౌకర్యంగా చూపించడం, అప్పుడప్పుడు ఆయన కోసం నిర్ణయించిన భవిష్యత్తు గురించి సందేహాలను వ్యక్తం చేయడం వంటి సంకేతాలను చూపించేవాడు.

జిడ్డు కృష్ణమూర్తి: జీవిత చరిత్ర, మరణం, పాఠశాలలు 
1911 లో ఇంగ్లండులో కృష్ణమూర్తి, సోదరుడు నిత్య, థియోసఫిస్టులు అనీ బిసెంట్, జార్జ్ అరండేల్

1911 లో కృష్ణమూర్తిని, నిత్యానందను ఇంగ్లండుకు తీసుకువెళ్ళారు. ఈ పర్యటనలో కృష్ణమూర్తి లండన్లోని OSE సభ్యులకు మొదటిసారిగా బహిరంగ ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన తొలినాళ్ళ రచనలు దివ్యజ్ఞాన సమాజం వారు బుక్‌లెట్ల రూపంలో, పత్రికల్లో ప్రచురించడం ప్రారంభించారు. 1911 నుంచి 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే మధ్య కాలంలో సోదరులిద్దరూ పలు ఐరోపా దేశాల్లో పర్యటించారు. వీరికి సహాయంగా అనుభవజ్ఞులైన వ్యక్తులు తోడుగా వెళ్ళేవారు. ఈలోగా ఇంగ్లండు స్థిర నివాసం ఏర్పరుచుకున్న అమెరికా వాసి మేరీ మెలిస్సా హోడ్లీ డాడ్జ్ లాంటి సంపన్నుల ఉదారతతో వ్యక్తిగతంగా కృష్ణమూర్తికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడింది.

యుద్ధం తర్వాత కృష్ణమూర్తి, సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న సోదరుడు నిత్యతో కలిసి OSE ముఖ్య నాయకుడి హోదాలో ప్రపంచవ్యాప్తంగా తన ఉపన్యాసాల, సమావేశాల పరంపరను కొనసాగించాడు. తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించాడు. ఈ ఉపన్యాసాల, రచనల్లో తమ సంస్థ, దాని సభ్యులు రాబోయే కాలంలో ఎలాంటి పనులు చేయాలి అనే విషయం మీద చర్చలు ఉండేవి. మొదట్లో ఆయన ప్రసంగాలు తడబాటుతో కూడుకుని ఉండేవి. ఆయనను బిడియస్తుడిగా, చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పే వక్తగా అందరూ భావించారు. కానీ క్రమంగా ఆయన ఉచ్చారణ, విశ్వాసం మెరుగుపడింది. క్రమంగా సమావేశాలకు నాయకత్వం వహించడం ప్రారంభించాడు. 1921లో కృష్ణమూర్తి హెలెన్ నోత్ అనే 17 ఏళ్ల అమెరికన్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కుటుంబం థియోసాఫిస్ట్‌లతో సంబంధం కలిగి ఉంది. ఆయన పని, జీవితాశయంలో ఇలాంటి సాధారణ సంబంధాలుగా పరిగణించబడే వాటికి తావులేదని అర్థం చేసుకున్నాడు. 1920ల మధ్య నాటికి వారిద్దరూ విడిపోయారు.

జీవితాన్ని మార్చివేసిన అనుభవాలు

1922 లో కృష్ణమూర్తి, నిత్య కలిసి సిడ్నీ నుంచి కాలిఫోర్నియాకు వెళ్ళారు. అక్కడ ఓహై వ్యాలీలోని ఒక కాటేజిలో ఉన్నారు. అంతకుముందే క్షయవ్యాధి సోకినట్లు నిర్ధారించబడిన నిత్యానందకు ఆ వాతావరణం సహాయకారిగా ఉంటుందని అనుకున్నారు. నానాటికీ దిగజారుతున్న నిత్యానంద ఆరోగ్యం వల్ల కృష్ణమూర్తి కలత చెందాడు. ఓహైలో వీరికి రోజలిండ్ విలియమ్స్ అనే యువతి సన్నిహితురాలు అయింది. తర్వాతి కాలంలో ఈమె కృష్ణమూర్తి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించింది. మొదటిసారి సోదరులిరువురు ప్రత్యక్షంగా థియోసఫిస్టుల పర్యవేక్షణ లేకుండా ఉన్నారు. వారికి ఆ ప్రదేశం పట్ల ఆదర భావం కలిగింది. నెమ్మదిగా కొంతమంది సభ్యులు కలిసి ఒక ట్రస్టుగా ఏర్పడి ఒక కాటేజీని, కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అదే కృష్ణమూర్తి అధికారిక నివాసం అయింది.

1922 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్టమూర్తి కొన్ని గాఢమైన జీవితానుభవాలకు లోనయ్యాడు. ఈ అనుభవాలనే ఆధ్యాత్మిక మేలుకొలుపు, మానసిక పరివర్తన, భౌతిక ప్రతిక్రియ లాంటి పేర్ల కింద వర్గీకరించవచ్చు. తొలి సంఘటనలు రెండు నిర్దిష్టమైన దశల్లో జరిగాయి. మొదట ఒక మూడు రోజులు ఈ ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. మళ్ళీ రెండు వారాల తర్వాత మరింత దీర్ఘమైన స్థితి అనుభవించాడు. దీన్ని కృష్ణమూర్తి, అతని చుట్టూ ఉన్న వాళ్ళు ద ప్రాసెస్ (ప్రక్రియ) అని అన్నారు. ఈ ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఆయన మరణించేదాకా తరచూ జరుగుతూనే ఉండేది.

కొంతమంది సాక్షుల ప్రకారం ఇది 1922 ఆగస్టు 17న ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయనకు మెడ వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి కలిగింది. తర్వాతి రెండు రోజుల వరకు నొప్పి ఎక్కువవడం, ఆకలి మందగించడం, సంధి ప్రేలాపనలు లాంటి లక్షణాలు తీవ్రమయ్యాయి. ఆయన స్పృహ తప్పిపోయినట్లు అనిపించేది, కానీ ఆయన చుట్టుపక్కల జరిగే విషయాలన్నీ తెలుస్తూ ఉండేవి. ఆ స్థితిలో ఆయనకు మార్మికమైన అనుభూతి కలిగింది. మరుసటి రోజు కూడా ఆ లక్షణాలు, అనుభవాలు మరింత తీవ్రతరం అయ్యాయి. చివరగా అంతులేని శాంతి లభించినట్లయింది. దీని తర్వాత, ముందు సంఘటనలకు కొనసాగింపుగా ప్రక్రియ ఆయన మీద ప్రభావం చూపించసాగింది. అదే సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో క్రమం తప్పకుండా రాత్రిపూట ఆయన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనయ్యాడు. తర్వాత ఈ ప్రాసెస్ లో భాగంగా వివిధ స్థాయిల్లో నొప్పి, భౌతిక అసౌకర్యం, సూక్ష్మ గ్రాహ్యత, చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం, కొన్నిసార్లు స్పృహలో లేకున్నట్లు అనిపించడం, ఆయన శరీరం నొప్పికి లొంగిపోయింది అనిపించడం, మనసు బాగాలేకపోవడం లాంటి లక్షణాలు కనిపించేవి.

ఈ అనుభవాలే "అనుగ్రహం", "అపారం", "పవిత్రత", "విస్తృతత్వం", "అన్యమైనది" అని పలు రకాలుగా అభివర్ణించబడ్డాయి. ఇది ముందు పేర్కొన్న ప్రక్రియ కంటే విభిన్నమైన స్థితి. లూటింజ్ ప్రకారం కృష్ణమూర్తి నోట్ బుక్ లో ఉన్నదాన్న బట్టి చూస్తే ఈ అన్యత్య భావన జీవితాంతం ఆయనతో పాటే ఉండి, ఆయన ఎవరో సంరక్షణలో ఉన్నట్లు నిర్భయత్వాన్ని కలిగించింది. కృష్ణమూర్తి తన నోట్‌బుక్‌లో సాధారణంగా ప్రక్రియ కలిగించే తీవ్రమైన అనుభవాన్ని మరుసటి రోజు మేల్కొన్నప్పుడు ఇలా వర్ణించేవాడు:

అన్ని ఆలోచనలకు అతీతమైన మరో ప్రపంచపు అన్యత్వపు భావనతో త్వరగా మేల్కొన్నాను... అందులో సునిశితత్వం ఉంది. అది కేవలం అందాన్ని ఆస్వాదించేది మాత్రమే కాకుండా ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది. ఒక గడ్డి పరక ఆశ్చర్యం గొలిపేంత ఆకుపచ్చగా ఉంది; అందులో రంగులు మొత్తం ఉన్నాయి; చూడ్డానికి చాలా చిన్నది కానీ అది గాఢమైనది, మిరుమిట్లుగొలిపేది, దాన్ని నాశనం చేయడం చాలా సులువు...

ఈ అన్యత్వ భావన రోజువారీ సంఘటనల్లో కూడా ఆయనతోటే ఉండేది.

ఒకటి రెండు ఇంటర్వ్యూలలో ఆ బలం, ఆ శక్తి గదిలో ఎలా నిండిపోయాయో ఆలోచిస్తే వింతగా ఉంది. చూడబోతే అది మన కళ్లలో, ఊపిరిలో ఉన్నట్లు అనిపించింది. ఇది కొన్నిసార్లు అకస్మాత్తుగా, చాలా అనూహ్యంగా, చాలా శక్తివంతంగా, తీవ్రంగా అనుభవంలోకి వస్తుంది. కొన్ని సార్లు నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉనికిలోకి వస్తుంది. అది మనం కావాలన్నా, వద్దన్నా వచ్చే తీరుతుంది. దానికి అలవాటు పడే అవకాశం లేదు, ఎందుకంటే అది మునుపెన్నడూ ఎరగనిది, మళ్ళీ తిరిగి రానిది.

1922 లో కృష్ణమూర్తికి మొదటిసారి ఇలాంటివి జరిగిప్పటి నుంచి వాటికోసం రకరకాలైన వివరణలు ప్రతిపాదించబడ్డాయి. లెడ్‌బీటర్, ఇంకా ఇతర థియోసఫిస్టులు దైవ సాధనానికి కొన్ని వింత అనుభవాలు ఎదురవడం సహజమే అనుకున్నా ఈ పరిణామం అంతా వారికి ఒక మాయలా అనిపించింది. కృష్ణమూర్తి తరువాతి సంవత్సరాలలో, నిరంతర ఆయనలో జరిగే ప్రక్రియ స్వభావం, నిరూపణ గురించి తనకు, సహచరులకు మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలలో తరచుగా ఒక అంశంగా వచ్చేది; ఈ చర్చలు ఈ అంశంపై కొంత స్పష్టతనిచ్చాయి కానీ చివరికి అసంపూర్తిగానే మిగిలాయి. జీవిత చరిత్ర రచయిత రోలాండ్ వెర్నాన్ ప్రకారం, ప్రక్రియ గురించి లీడ్‌బీటర్ సంతృప్తికరంగా వివరించలేకపోవడం వల్ల తదనంతర పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది.

ఓహై వద్ద జరిగిన ప్రక్రియ, దానికి కారణం, చెల్లుబాటు ఏమైనప్పటికీ, కృష్ణమూర్తికి అది ఒక విపత్తు మైలురాయి. ఈ సమయం వరకు అతని ఆధ్యాత్మిక పురోగతి, థియోసఫిస్టులలో పేరుగాంచిన వారి గంభీరమైన చర్చలతో ప్రణాళిక చేయబడింది. ఇప్పుడేమో కొత్తగా మరేదో జరిగింది, దాని కోసం కృష్ణమూర్తికి వారిచ్చిన శిక్షణ అతన్ని పూర్తిగా సిద్ధం చేయలేదు. కృష్ణమూర్తి మనస్సాక్షి నుండి ఒక భారం దించేసినట్లయింది. ఆయన ఒక స్వతంత్ర వ్యక్తిగా మారడానికి తన మొదటి అడుగు వేశాడు. జగద్గురువుగా అతని భవిష్యత్ పాత్ర పరంగా, అప్పటిదాకా జరిగిన ప్రక్రియ అతనికి పునాది. ఇది అతని వద్దకు ఏకాకిగా వచ్చింది. ఏ గురువులచే అతనిలో నాటబడలేదు. అది కృష్ణమూర్తిలో సరికొత్త ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్య స్ఫూర్తిని వేళ్ళూనుకునేలా చేసింది.

కృష్ణమూర్తికి కలిగిన ఆధ్యాత్మిక అనుభవాల గురించిన వార్తలు వ్యాపించడంతో, 1925 థియోసాఫికల్ సొసైటీ కన్వెన్షన్ స్థాపించబడిన 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆయనది దైవదూత స్థాయి అనే విషయాన్ని గురించి పుకార్లు తారాస్థాయిని చేరుకున్నాయి. ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని అంచనాలు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ప్రశంసలతో పాటు కృష్ణమూర్తికి దాని గురించి చింత కలిగింది. ప్రముఖ థియోసాఫిస్ట్‌లు, ఇంకా ఆ సమాజంలో వర్గాలు త్వరలో సమీపిస్తున్న దేవదూత రాకడను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. కృష్ణమూర్తి మాత్రం "అతి ఎందులోనూ పనికిరాదు" అని పేర్కొన్నాడు. వివిధ వర్గాలు ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన "అసాధారణమైన" ప్రకటనలు చేశాయి. కొంతమంది వాటిమీద వివాదాలు లేవదీశారు. సమాజంలో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయాలు కృష్ణమూర్తిని వాటికి మరింత దూరం చేసింది.

ఈ సమయంలో నిత్యా నిరంతర ఆరోగ్య సమస్యలు క్రమంగా పెద్దవవుతూ వచ్చాయి. 1925 నవంబరు 13న, 27 సంవత్సరాల వయస్సులో, అతను ఇన్‌ఫ్లుయెంజా, క్షయవ్యాధి సమస్యలతో ఓహైలో మరణించాడు. నిత్య ఆరోగ్యం సరిగా లేనప్పటికీ, అతని మరణం మాత్రం ఊహించనిది. ఇది కృష్ణమూర్తికి థియోసఫీపైన, ఆ సమాజపు నాయకులపై ఉన్న నమ్మకాన్ని సమూలంగా కదిలించింది. వారు నిత్య ఆరోగ్యం గురించి హామీలు ఇస్తూనే వచ్చారు. తన జీవితంలో సాధించాల్సిన కార్యాలకు నిత్య చాలా అవసరం, అందువల్ల అతను చనిపోవడానికి వీల్లేదు" అని బెసెంట్, ఇంకా కృష్ణమూర్తి అనుచరులు బలంగా విశ్వసించారు. "మాస్టర్స్, వారి పరంపర మీద అతని నమ్మకం మొత్తం వమ్ము అయింది" అని జయకర్ వ్రాశాడు. అంతేకాకుండా, "తన కుటుంబానికి, బాల్యానికి మిగిలి ఉన్న ఏకైక లంకె నిత్యనే. తాను స్వేచ్ఛగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి అతనే. అతనే తన ఆప్తమిత్రుడు, సహచరుడు." ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, ఈ వార్త "అతన్ని పూర్తిగా కదిలించివేసింది." కానీ నిత్య మరణించిన 12 రోజుల తర్వాత అతను "అత్యంత నిశ్శబ్దంగా, ప్రకాశవంతంగా, అన్ని భావోద్వేగాలకు దూరం కాగలిగాడు"; అతను ఎలాంటి బాధ అనుభవించాడో కనీసం ఆ జాడ కూడా కనిపించ లేదు.

గతంతో తెగతెంపులు

తరువాతి కొన్ని సంవత్సరాలలో, కృష్ణమూర్తి నూతన దృక్పథం, స్పృహ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అతని ఉపన్యాసాలు, చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో కొత్త భావనలు కనిపించాయి. ఇవి థియోసాఫికల్ పదజాలం నుండి క్రమంగా దూరమయ్యాయి. ఆర్డర్ ఆఫ్ ది స్టార్‌తో కొనసాగడానికి లీడ్‌బీటర్, అనీ బిసెంట్ చేసిన ప్రయత్నాలను అతను తిప్పికొట్టడంతో, 1929లో అతని కొత్త మార్గం తారాస్థాయికి చేరింది.

1929 ఆగస్టు 3న నెదర్లాండ్స్‌లోని ఆమ్నెన్‌లో వార్షిక స్టార్ క్యాంప్ సందర్భంగా కృష్ణమూర్తి తన పరంపరని రద్దు చేశారు. అతను గత రెండు సంవత్సరాలలో "జాగ్రత్తగా పరిశీలించిన" తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆ కారణం ఏంటంటే:

సత్యం అనేది ఒక దుర్గమ క్షేత్రం. మీరు దానిని ఏ మార్గం ద్వారా, ఏ మతం ద్వారా, ఏ శాఖ ద్వారానూ ఆ సత్యక్షేత్రానికి చేరుకోలేరు. అది నా దృక్కోణం. నేను ఖచ్చితంగా, బేషరతుగా దానికి కట్టుబడి ఉంటాను. సత్యం, అపరిమితమైనది, షరతులు లేనిది, ఏ మార్గంలోనైనా చేరుకోలేనిది, వ్యవస్థీకరించబడనిది; లేదా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రజలను నడిపించడానికి లేదా బలవంతం చేయడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయకూడదు. ఇది సరైన పని కాదు, ఎందుకంటే నాకు అనుచరులు వద్దు. మీరు ఎవరినైనా అనుసరించిన క్షణం మీరు సత్యాన్ని అనుసరించడం మానేస్తారు. నేను చెప్పే విషయం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారా లేదా అని నేను ఆందోళన చెందను. నేను ప్రపంచంలో ఒక నిర్దిష్టమైన పనిని చేయాలనుకుంటున్నాను. దాన్ని నేను అచంచలమైన ఏకాగ్రతతో చేయబోతున్నాను. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను: మనిషిని విడిపించడం. నేను అతనిని అన్ని పంజరాల నుండి, అన్ని భయాల నుండి విముక్తం చేయాలని కోరుకుంటున్నాను. మతాలు, కొత్త శాఖలను కనుగొనకూడదని లేదా కొత్త సిద్ధాంతాలు, కొత్త తత్వాలను స్థాపించకూడదని కోరుకుంటున్నాను.

జిడ్డు కృష్ణమూర్తి: జీవిత చరిత్ర, మరణం, పాఠశాలలు 
1920ల మొదట్లో కృష్ణమూర్తి

పరంపర రద్దు తర్వాత, లీడ్‌బీటర్‌తో సహా ప్రముఖ థియోసాఫిస్ట్‌లు కృష్ణమూర్తికి వ్యతిరేకంగా మారారు. లీడ్‌బీటర్‌ "దైవం రాకడ తప్పుదారి పట్టింది" అని పేర్కొన్నాడు. కృష్ణమూర్తి అన్ని వ్యవస్థీకృత విశ్వాసాలను, గురువుల భావనను, మొత్తం గురు శిష్య సంబంధాలనే ఖండించారు. మనిషిని పరిపూర్ణంగా, నిరాటంకంగా విముక్తుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తాను జగద్గురువు కాదని ప్రత్యేకించి ఆయన చెప్పినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. సమాజంలో ఆయన హోదా గురించి కాస్త విశదీకరించమని ఎప్పుడు అడిగినా అది ఇప్పుడు అనవసరం అనీ, లేదా తాను వేరే చోట చెప్పినట్లు "కావాలనే అస్పష్టమైన" సమాధానం ఇచ్చేవాడు.

నేపథ్యాన్ని గమనిస్తే అతని దృక్పథంలో కొనసాగుతున్న మార్పులు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ రద్దుకు ముందే ప్రారంభమైనట్లు అనుకోవచ్చు. జగద్గురువు విషయంలో విలక్షణతలో భేదాలు, కృష్ణమూర్తి యొక్క దృక్పథం, పదజాలం, ఉచ్చారణలలో వచ్చిన మార్పుల కారణంగా అప్పటికే కలవరపడి లేదా చికాకులో ఉన్న అతని ఆరాధకులలో చాలా మంది ఆయన మీద విశ్వాసం కోల్పోయారు. వారిలో బీసెంట్, ఇంకా అతనితో చాలా సన్నిహిత సంబంధం కలిగిన మేరీ లూటింజ్ తల్లి ఎమిలీ కూడా ఉన్నారు. అతను త్వరలోనే థియోసాఫికల్ సొసైటీ, దాని బోధనలు, అభ్యాసాల నుండి విడిపడినాడు. అయినప్పటికీ అతను తన జీవితాంతం దానిలోని కొంతమంది సభ్యులు, మాజీ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాడు.

కృష్ణమూర్తి తాను చేసిన కృషిని తరచుగా నా బోధనలు అని కాకుండా కేవలం బోధనలు అని అభివర్ణించేవాడు.

కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీతో పాటు, పనిచేయని ఆర్డర్ ఆఫ్ ది స్టార్‌తో అనుబంధంగా ఉన్న వివిధ ట్రస్టులు, ఇతర సంస్థల నుండి రాజీనామా చేశాడు. ఎంతో మంది దాతలు ఆర్డర్‌కు విరాళంగా ఇచ్చిన డబ్బు, ఆస్తులను తిరిగి ఇచ్చాడు. వాటిలో నెదర్లాండ్స్‌లోని కోట, ఇంకా 5,000 ఎకరాల (2,023 హెక్టార్లు) భూమి కూడా ఉన్నాయి.

మధ్య సంవత్సరాలు

1930 నుండి 1944 వరకు కృష్ణమూర్తి "స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్" (SPT) ఆధ్వర్యంలో ప్రసంగ పర్యటనలు, ప్రచురణలలో నిమగ్నమయ్యాడు. ఈ సంస్థను ఆర్డర్ ఆఫ్ ది స్టార్ నుండి సన్నిహిత సహచరుడు, స్నేహితుడు అయిన దేశికాచార్య రాజగోపాల్‌తో కలిసి స్థాపించాడు. ఓహై కార్యకలాపాల స్థావరంగా కృష్ణమూర్తి, రాజగోపాల్, రోసలిండ్ విలియమ్స్ (1927లో రాజగోపాల్‌ను ఈమె వివాహం చేసుకుంది) నివసించే ఆర్య విహార అనే ఇంటిని ఎన్నుకున్నారు. SPT వ్యాపార, సంస్థాగత అంశాలు రాజగోపాల్ నిర్వహించేవాడు. కృష్ణమూర్తి ఎక్కువ సమయం ప్రసంగం, ధ్యానంలో గడిపేవాడు. రాజగోపాల్‌ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు. 1931లో వారి కుమార్తె రాధ పుట్టిన తర్వాత ఇద్దరూ శారీరకంగా దూరమయ్యారు. రోసలిండ్‌తో కృష్ణమూర్తి స్నేహం ప్రేమగా మారింది. రాధా రాజగోపాల్ ప్రకారం, కృష్ణమూర్తి, రోసలిండ్ మధ్య అనుబంధం 1932లో ప్రారంభమైంది. అది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది. రాజగోపాల్ కుమార్తె రాధా స్లోస్ తన పుస్తకం లైవ్స్ ఇన్ ది షాడో విత్ జె. కృష్ణమూర్తిలో ఈ వ్యవహారం గురించి రాసింది.

1930లలో కృష్ణమూర్తి ఐరోపా, లాటిన్ అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రసంగించారు. 1938లో అతను ఆల్డస్ హక్స్‌లీని కలిశాడు. వీరిద్దరి మధ్య చాలా ఏళ్లుగా సాగిన సన్నిహిత స్నేహం అప్పుడే మొదలైంది. ఐరోపాలో రాబోయే సంఘర్షణ గురించి వారు ఆందోళన పడ్దారు. దీనిని జాతీయవాదం హానికరమైన ప్రభావంగా వారు భావించారు. రెండవ ప్రపంచ యుద్ధంపై కృష్ణమూర్తి వైఖరి యునైటెడ్ స్టేట్స్‌లో దేశభక్తి ఉత్సుకత ఉన్న సమయంలో శాంతివాదంగా, విధ్వంసంగా కూడా భావించబడింది. దరిమిలా కొంతకాలం FBI ఆయన మీద నిఘా వేసింది. అతను దాదాపు నాలుగు సంవత్సరాల పాటు (1940, 1944 మధ్య) బహిరంగ ఉపన్యాసాలు చేయలేదు. ఈ సమయంలో అతను ఆర్య విహారలో నివసిస్తూ అక్కడినుంచే పనిచేశాడు. ఇది యుద్ధ సమయంలో ఎక్కువగా స్వీయ-నిరంతర వ్యవసాయ క్షేత్రంగా నిర్వహించబడింది. దాని మిగులు వస్తువులతో ఐరోపాలో సహాయక చర్యలకు విరాళంగా ఇచ్చేవారు. యుద్ధ సమయంలో ఓహైలో గడిపిన సంవత్సరాల గురించి అతను తరువాత ఇలా అన్నాడు: "ఇది ఎటువంటి సవాలు, డిమాండ్, బయటతిరగలేని లేని కాలం అని నేను అనుకుంటున్నాను. ఈ కాలంలో అంతా బంధించబడినట్లు కనిపించింది; నేను ఓహైని విడిచిపెట్టినప్పుడు అదంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది."

కృష్ణమూర్తి 1944 మేలో ఓహైలో వరుస చర్చలతో బహిరంగ ప్రసంగాలకు మళ్ళీ శ్రీకారం చుట్టాడు. ఈ చర్చలు, తదుపరి విషయాలను "స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్"కి అనుబంధ సంస్థ అయిన "కృష్ణమూర్తి రైటింగ్స్ ఇంక్" (KWINC) ప్రచురించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కృష్ణమూర్తికి సంబంధించిన కొత్త కేంద్రీకృత సంస్థ. దీని ఏకైక ఉద్దేశం ఆయన బోధనలను వ్యాప్తి చేయడం. కృష్ణమూర్తి భారతదేశం నుండి సహచరులతో సంప్రదింపులు కొనసాగించాడు. 1947 శరదృతువులో అక్కడ మాట్లాడే పర్యటనను ప్రారంభించాడు. యువ మేధావులను, కొత్త అనుచరులను ఆకర్షించాడు. ఈ పర్యటనలో అతను మెహతా సోదరీమణులు, తర్వాత తన జీవిత చరిత్ర రాసిన పుపుల్, ఇంకా నందినిలను పరిచయం చేసుకున్నాడు. వారు ఆయన సహచరులు, విశ్వసనీయులు అయ్యారు. 1948లో ఊటీలో ఆయన ముందు అనుభవించిన "ప్రక్రియ" మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. ఈ సంఘటనలలు ఆ సోదరీమణులు కూడా గమనించారు. 1948లో పూనాలో, కృష్ణమూర్తి యోగా గురువు బి. కె. ఎస్. అయ్యంగార్ను కలిశారు. తర్వాతి మూడు నెలల పాటు అయ్యంగార్ ప్రతిరోజూ ఉదయం ఆయనకు యోగా అభ్యాసాలు నేర్పించాడు. ఆపై ఇరవై సంవత్సరాల పాటు అప్పుడప్పుడూ ఈ అభ్యాసం సాగింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కృష్ణమూర్తి భారతదేశంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూతో సహా పలువురు ప్రముఖులు ఆయనను కలవడానికి వచ్చారు. నెహ్రూతో తన సమావేశాలలో, కృష్ణమూర్తి బోధనల గురించి సుదీర్ఘంగా విశదీకరించారు. ఒక సందర్భంలో ఇలా అన్నారు, "వ్యక్తులు, ఆలోచనలు , వస్తువులతో, చెట్లు, భూమి , వస్తువులతో సంబంధంలో మిమ్మల్ని మీరు చూసుకోవడంలో మాత్రమే స్వీయ అవగాహన ఏర్పడుతుంది. మీ చుట్టూ , మీలో ఉన్న ప్రపంచం. సంబంధం అనేది ఆత్మను బహిర్గతం చేసే అద్దం, స్వీయ-జ్ఞానం లేకుండా సరైన ఆలోచన , చర్యకు ఆధారం లేదు." నెహ్రూ "ఎలా ప్రారంభించాలి?" అన్న ప్రశ్నకి కృష్ణమూర్తి, "నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రారంభించు. మనసులోని ప్రతి పదాన్ని, ప్రతి పదబంధాన్ని, ప్రతి పేరాను చదువు, అది ఆలోచన ద్వారా పనిచేస్తుంది." అని చెప్పాడు.

ఆఖరి సంవత్సరాలు

కృష్ణమూర్తి బహిరంగ ఉపన్యాసాలు, బృంద చర్చలు, ప్రపంచవ్యాప్తంగా ఆయన సంబంధీకులతో ప్రసంగించడం కొనసాగించారు. 1960ల ప్రారంభంలో, అతను భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ బోమ్తో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. డేవిడ్ ఆలోచనల ప్రకారం భౌతిక ప్రపంచం మూలతత్వం, మానవజాతి మానసిక, సామాజిక స్థితికి సంబంధించిన తాత్విక, శాస్త్రీయ దృక్పథం కృష్ణమూర్తి తత్వానికి దగ్గరగా వచ్చాయి. వీరిద్దరూ త్వరలో సన్నిహిత మిత్రులయ్యారు. వ్యక్తిగత సంభాషణల రూపంలోనూ, అప్పుడప్పుడు ఇతర పాల్గొనేవారితో సమూహ చర్చల రూపంలో ఒక ఉమ్మడి విచారణను ప్రారంభించారు. ఇది దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగింది. ఈ చర్చలలో అనేకం పుస్తకాల రూపంలో లేదా పుస్తకాల భాగాలుగా ప్రచురించబడ్డాయి. కృష్ణమూర్తి ఆలోచనలను శాస్త్రజ్ఞులకు విస్తృతంగా పరిచయం చేశాయి. కృష్ణమూర్తి తత్వం, మతపరమైన అధ్యయనాలు, విద్య, మనస్తత్వశాస్త్రం, భౌతిక శాస్త్రం, స్పృహ అధ్యయనాలు వంటి విభిన్న రంగాలలోకి ప్రవేశించినప్పటికీ, అతను అప్పటికి ఆ తర్వాత కూడా బాగా అకడమిక్ సర్కిల్‌లలో తెలిసినవాడు కాదు. అయినప్పటికీ, కృష్ణమూర్తి భౌతిక శాస్త్రవేత్తలైన ఫ్రిట్జోఫ్ కాప్రా ఇ. సి. జార్జ్ సుదర్శన్, జీవశాస్త్రవేత్త రూపర్ట్ షెల్‌డ్రేక్, మానసిక వైద్యుడు డేవిడ్ షైన్‌బర్గ్, అలాగే వివిధ సైద్ధాంతిక ధోరణులకు చెందిన మానసిక వైద్యులను కలిసి చర్చలు జరిపాడు.. బోమ్‌తో సుదీర్ఘ స్నేహం తరువాతి సంవత్సరాలలో కొంత ఒడిదుడుకులకు లోనైనా వారు తమ విభేదాలను అధిగమించి కృష్ణమూర్తి మరణించే వరకు స్నేహితులుగా ఉన్నారు. కానీ ఆ సంబంధం మునుపటి తీవ్రతను తిరిగి పొందలేదు.

1970వ దశకంలో, కృష్ణమూర్తి అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో చాలాసార్లు సమావేశమయ్యారు. వారిరువురి మధ్య కొన్ని సందర్భాల్లో సుదీర్ఘమైన, చాలా తీవ్రమైన సంభాషణలు జరిగాయి. జయకర్ ఇందిరాగాంధీతో సమావేశాలలో తన సందేశాన్ని రాజకీయ కల్లోలాల సమయంలో గాంధీ విధించిన కొన్ని అత్యవసర చర్యలను ఎత్తివేయడంలో సాధ్యమైన ప్రభావంగా పరిగణించాడు.

ఇంతలో, కృష్ణమూర్తికి రాజగోపాల్‌తో ఒకప్పుడు ఉన్న సన్నిహిత సంబంధాలు క్షీణించాయి. కృష్ణమూర్తి రాజగోపాల్ ఆధీనంలో ఉన్న అతని రచనలు, మాన్యుస్క్రిప్ట్‌లు, ఇంకా వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాల ప్రచురణ హక్కులతో పాటు విరాళంగా ఇచ్చిన ఆస్తి, నిధులను తిరిగి పొందేందుకు డి. రాజగోపాల్‌ను కోర్టుకు లాగాడు. 1971 లో ప్రారంభమైన ఈ వ్యాజ్యం, దాని సంబంధిత పరస్పర ఫిర్యాదులు చాలా సంవత్సరాలు కొనసాగాయి. కృష్ణమూర్తి జీవితకాలంలో చాలా ఆస్తి, సామగ్రి తిరిగి ఇవ్వబడ్డాయి; ఈ కేసుకు సంబంధించిన పక్షాలు చివరకు 1986లో అతని మరణం తర్వాత న్యాయస్థానం బయటే అన్ని విషయాలు పరిష్కరించుకున్నారు.

1984, 1985లో, కృష్ణమూర్తి యునైటెడ్ నేషన్స్‌లోని పేసెమ్ ఇన్ టెర్రిస్ సొసైటీ చాప్టర్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్‌లో ఆహ్వానించబడిన ప్రేక్షకులతో మాట్లాడారు. 1985 అక్టోబరులో, అతను చివరిసారిగా భారతదేశాన్ని సందర్శించాడు. అప్పటి నుండి 1986 జనవరి మధ్య కొన్ని "వీడ్కోలు" సమావేశాలు, చర్చలు నిర్వహించాడు. ఈ చివరి చర్చలలో అతను సంవత్సరాలుగా అడుగుతున్న ప్రాథమిక ప్రశ్నలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, మానవజాతిపై వాటి ప్రభావం గురించి కొత్త ఆందోళనలు ఈ చర్చల్లో చోటు చేసుకున్నాయి. కృష్ణమూర్తి తన స్నేహితులకు మరణాన్ని ఆహ్వానించడం ఇష్టం లేదని, అయితే అతని శరీరం ఎంతకాలం ఉంటుందో తెలియదనీ (ఆయన అప్పటికే చాలా బరువును కోల్పోయాడు), ఇకపై మాట్లాడలేనప్పుడు, అతనికి "మరో ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు" అని వ్యాఖ్యానించాడు. 1986 జనవరి 4న మద్రాసులోతన చివరి ప్రసంగంలో, తనతో కలిసి విచారణ స్వభావం, సాంకేతికత ప్రభావం, జీవితం, ధ్యానం యొక్క స్వభావం ఇంకా సృష్టి స్వభావాన్ని పరిశీలించమని ప్రేక్షకులను మళ్లీ ఆహ్వానించాడు.

కృష్ణమూర్తి తన వారసత్వం గురించి కూడా ఆందోళన చెందాడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రపంచమంతటికీ కాకుండా ప్రత్యేక వ్యక్తులకు అందించబడిన కొంతమంది వ్యక్తిగా మారడం గురించే ఈ ఆందోళన. తన బోధనలను ఎవరూ పనిగట్టుకుని వివరించడానికి ముందుకు రానవసరం లేదని అభిప్రాయపడ్డాడు. అతను అనేక సందర్భాల్లో తన సహచరులను తన తరపున ప్రతినిధులుగా లేదా అతని మరణానంతరం తన వారసులుగా ప్రకటించుకోవద్దని హెచ్చరించాడు.

తన మరణానికి కొన్ని రోజుల ముందు, తుది ప్రకటనలో, తన సహచరులు లేదా సాధారణ ప్రజలలో ఎవరికీ తనకు ఏమి జరిగిందో (బోధనా మార్గంగా) అర్థం కాలేదని ప్రకటించాడు. తన శరీరంలో పనిచేస్తున్న "సుప్రీం ఇంటెలిజెన్స్" అతని మరణంతో పోతుంది, అంటే ఆయన బోధనలకు వారసులంటూ ఎవరూ ఉండరని మరలా పునరుద్ఘాటించినట్లు. అయినప్పటికీ, ప్రజలు కొంతవరకు "బోధనలను పాటిస్తే" దానితో సన్నిహితంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నాడు. మునుపటి చర్చలలో, అతను తనను తాను థామస్ ఎడిసన్‌తో పోల్చుకున్నాడు, అతను జ్ఞానమనే దీపాన్ని కనిపెట్టడానికి కష్టపడి పనిచేసానని, వేరే వాళ్ళు కేవలం స్విచ్ వేస్తే సరిపోతుందని పేర్కొన్నాడు.

మరణం

కృష్ణమూర్తి 1986 ఫిబ్రవరి 17న తొంభై ఏళ్ళ వయసులో పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. కృష్ణమూర్తి ఫౌండేషన్ ట్రస్టు వాళ్ళు ఆయన ఆఖరి గడియ వరకు ఆరోగ్య స్థితిని వెల్లడిస్తూ వచ్చారు. మొదటి చిహ్నాలు ఆయన మరణానికి తొమ్మిది నెలల ముందే కనిపించాయి. ఆయన అప్పుడు బాగా అలిసిపోయినట్లు కనిపించాడు. 1985 అక్టోబరులో ఇంగ్లండు నుంచి భారతదేశం వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనలో విపరీతమైన అలసట, జ్వరం, బరువు కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించాయి. 1986 జనవరి 10న మద్రాసులో ఆయన ఆఖరి ఉపన్యాసం తర్వాత తిరిగి ఓహైకి వెళ్ళిపోవాలనుకున్నాడు. అది 24 గంటల విమాన ప్రయాణం. ఓహైకి చేరుకున్న వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలలో ఆయనకు పాంక్రియాటిక్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అది శస్త్రచికిత్సకు గానీ, మరే పద్ధతికీ లొంగనిది. కృష్ణమూర్తి తిరిగి తన ఓహై గృహానికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన చివరి రోజులు అక్కడే గడిచాయి. స్నేహితులు, వృత్తినిపుణులు ఆయనకు సేవలు చేశారు. ఆయన మనస్సు చివరి క్షణాల వరకు ప్రశాంతంగా ఉంది. 1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియా సమయం ప్రకారం అర్ధరాత్రి పది నిమిషాలు దాటిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆయన కోరిక మేరకు ఎటువంటి మెమోరియల్ జరపలేదు. ఆయన అస్థికలు మూడు భాగాలుగా విభజించి, ఒకటి ఓహైలో, ఒకటి భారతదేశంలో, ఒకటి ఇంగ్లండుకు పంపించమన్నాడు. భారతదేశంలో వీటిని వారణాసిలోని గంగా నది, గంగోత్రి, మద్రాసు అడయార్ సముద్ర తీరం కలిపారు.

పాఠశాలలు

జిడ్డు కృష్ణమూర్తి: జీవిత చరిత్ర, మరణం, పాఠశాలలు 
1987 లో కృష్ణమూర్తి చిత్రంతో తపాలాశాఖ విడుదల చేసిన బిళ్ళ

కృష్ణమూర్తి భారతదేశంలో ఐదు పాఠశాలలు, ఇంగ్లండులో బ్రాక్‌వుడ్ పార్క్ స్కూల్ అని ఒకటి, కాలిఫోర్నియాలో ఓక్ గ్రూవ్ స్కూల్ అనే పేరుతో ఒక్ స్కూలు ప్రారంభించాడు. ఈ పాఠశాలల లక్ష్యం ఏమని ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

  1. ప్రపంచ దృక్పథం. ఏదో ఒక భాగం అని కాకుండా సర్వం ఒకటే అనే దృష్టి; మతపరమైన దృష్టి అస్సలు ఉండకూడదు. ఎప్పుడూ పక్షపాతం లేని పరిపూర్ణ దృక్పథం కలిగించాలి
  2. మనిషి, ప్రకృతి పట్ల దయ. మానవజాతి ప్రకృతిలో ఒక భాగం. ఒకవేళ ప్రకృతిని సరిగ్గా చూసుకోకపోతే, అది తిరిగే మనిషికే ప్రమాదం. సరైన విద్య, ఎక్కడి మనుషుల మధ్యనైన గాఢానుబంధం పర్యావరణ సమస్యలతో సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.
  3. మతపరమైన స్ఫూర్తి, శాస్త్రీయ స్వభావం. మతంతో కూడిన మనసు ఒంటరిది, కానీ అలాంటివి ఎన్నో. మనుషులు, ప్రకృతి సహజీవనం సాగించినప్పుడే మనుగడ.

1928లో కృష్ణమూర్తి, అనీ బిసెంట్ ప్రారంభించిన కృష్ణమూర్తి ఫౌండేషన్ భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆరు పాఠశాలలను నిర్వహిసస్తోంది.

ప్రభావం

జిడ్డు కృష్ణమూర్తి: జీవిత చరిత్ర, మరణం, పాఠశాలలు 
మదనపల్లె లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించిన ఇల్లు లోపల దృశ్యం, అధ్యయన కేంద్రంగా వాడబడుతున్నది

కృష్ణమూర్తి భారతదేశంలో ప్రధాన స్రవంతిలోని మత సంస్థలను కూడా ఆకర్షించాడు. ఆయన ఎంతో మంది పేరు పొందిన హిందు, బౌద్ధ పండితులతో చర్చలు జరిపాడు. వీరిలో దలైలామా కూడా ఒకరు. ఈ చర్చల్లో చాలావరకు వివిధ పుస్తకాల్లో అధ్యాయాలుగా ప్రచురించబడ్డాయి. కృష్ణమూర్తిచే ప్రభావితమైన వారిలో జార్జి బెర్నార్డ్ షా, డేవిడ్ బోమ్, జవాహర్ లాల్ నెహ్రూ, దలైలామా, ఆల్డస్ హక్స్‌లీ, అలన్ వాట్స్, హెన్రీ మిల్లర్, బ్రూస్ లీ, టెరెన్స్ స్టాంప్, జాక్సన్ పొలాక్, టోని ప్యాకర్, అచ్యుత్ పట్వర్ధన్, దాదా ధర్మాధికారి, ఎకార్ట్ టోలీ మొదలైన వారు ముఖ్యులు.

ఆయన మరణానంతరం కూడా ఆయన మీద, ఆయన రచనల మీద ఆసక్తి ఇంకా కొనసాగుతుంది. చాలా పుస్తకాలు, ఆడియో, వీడియో, కంప్యూటర్ మాధ్యమాలు ఇంకా వివిధ ఆన్ లైన్ ప్రచురణకర్తలచే ప్రచురించబడుతున్నాయి. నాలుగు అధికారిక సంస్థలు, ఆతన రచనల భాండాగారాలను నిర్వహిస్తూ, బోధనలను వివిధ భాషల్లో వ్యాప్తి చేస్తున్నాయి. అచ్చులో ఉన్నవాటిని డిజిటల్ మాధ్యమంలోకి మారుస్తున్నాయి. వెబ్ సైట్లు, టీవీ కార్యక్రమాలు, సమావేశాలు, ఆసక్తి కలిగిన వారి మధ్య సంభాషణలు నిర్వహిస్తూ ఉన్నాయి.

ఇతరాలు

కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త ‘‘ఆంధ్రప్రభ’’ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్‌ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు. కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి ‘‘మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?’’ అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్‌ భాషలోకి మారిపోయారు.

తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని అతను చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. అతను బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల అతను కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ అతను ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు.

కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి.

రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.

తెలుగులో వెలువడిన కొన్ని రచనలు

  1. కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.
  2. శ్రీలంక సంభాషణలు.
  3. గతం నుండి విముక్తి
  4. ఈ విషయమై ఆలోచించండి (1991),
  5. ముందున్న జీవితం
  6. ధ్యానం
  7. విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
  8. మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
  9. స్వీయజ్ఞానం
  10. స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
  11. నీవే ప్రపంచం
  12. గరుడయానం
  13. నిరంతర సత్యాన్వేషణ
  14. చేతన

ఇవీ చూడండి

మూలాలు

గమనికలు

ఉదహరింపులు

కి సంబంధించిన మీడియా ఉంది.

This article uses material from the Wikipedia తెలుగు article జిడ్డు కృష్ణమూర్తి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రజిడ్డు కృష్ణమూర్తి మరణంజిడ్డు కృష్ణమూర్తి పాఠశాలలుజిడ్డు కృష్ణమూర్తి ప్రభావంజిడ్డు కృష్ణమూర్తి ఇతరాలుజిడ్డు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశంజిడ్డు కృష్ణమూర్తి తెలుగులో వెలువడిన కొన్ని రచనలుజిడ్డు కృష్ణమూర్తి ఇవీ చూడండిజిడ్డు కృష్ణమూర్తి మూలాలుజిడ్డు కృష్ణమూర్తి ఆధార గ్రంథాలుజిడ్డు కృష్ణమూర్తి బయటి లింకులుజిడ్డు కృష్ణమూర్తిఆంధ్రప్రదేశ్ప్రవక్తమతం

🔥 Trending searches on Wiki తెలుగు:

మెదక్ లోక్‌సభ నియోజకవర్గంకృష్ణా నదిదేవికగురువు (జ్యోతిషం)మొదటి పేజీరష్మి గౌతమ్త్రిష కృష్ణన్ఏలూరురాజనీతి శాస్త్రముకులంకరోనా వైరస్ 2019సన్నిపాత జ్వరంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా1వ లోక్‌సభ సభ్యుల జాబితాగరుత్మంతుడుబుధుడు (జ్యోతిషం)రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంరుతురాజ్ గైక్వాడ్భారతీయ జనతా పార్టీయాదవఅరకులోయమాదిగఅక్కినేని నాగార్జుననితిన్యేసుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఏప్రిల్ 25భాషా భాగాలుకమల్ హాసన్ నటించిన సినిమాలువిష్ణువువినోద్ కాంబ్లీవ్యవస్థాపకతన్యుమోనియాతెలంగాణ ప్రభుత్వ పథకాలుఅగ్నికులక్షత్రియులువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)మొదటి ప్రపంచ యుద్ధంఅంగారకుడు (జ్యోతిషం)లగ్నంసాహిత్యంచాకలిప్రేమమ్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)వై.ఎస్.వివేకానందరెడ్డికాజల్ అగర్వాల్అనురాధ శ్రీరామ్ఖమ్మంబౌద్ధ మతంచేతబడిశుక్రుడు జ్యోతిషంభారత జాతీయగీతంగోల్కొండపంచతంత్రంమృగశిర నక్షత్రముహార్సిలీ హిల్స్విశ్వబ్రాహ్మణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీసూర్యుడుదెందులూరు శాసనసభ నియోజకవర్గంనాయుడువాట్స్‌యాప్వాతావరణంరాశిమెదడు వాపుమృణాల్ ఠాకూర్కుంభరాశిమూర్ఛలు (ఫిట్స్)శోభితా ధూళిపాళ్లశ్రీశైల క్షేత్రంకొణతాల రామకృష్ణమీనాక్షి అమ్మవారి ఆలయంఇంటి పేర్లుఅమర్ సింగ్ చంకీలాకాలేయంపద్మశాలీలువేమిరెడ్డి ప్రభాకరరెడ్డితెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.ఆంధ్ర విశ్వవిద్యాలయం🡆 More