హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది.
అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.
తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వచ్చింది.
రెండవ తెలంగాణా ఉద్యమ ప్రస్థానం | |
2001 - 2002 - 2003 | |
2004 - 2005 - 2006 | |
తెలంగాణా ------- ఉద్యమం | |
కె సి ఆర్ - నరేంద్ర - జయశంకర్ |
తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండవ అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి రెండవ అనే పదం వాడవచ్చు.
ఈ ఉద్యమానికి సారథి కె.చంద్రశేఖరరావు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు. 2001లో ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరిట ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసాడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. చక్కటి కార్యక్రమాలతో సమర్ధవంతమైన నాయకత్వంతో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించుకు వచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆసక్తి, ఈ అంశం యొక్క ఉద్వేగ భరిత చరిత్ర కూడా దీనికి దోహదపడ్డాయి.
ఈ లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లోని ప్రముఖ నేత ఆలె నరేంద్ర ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణ సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉద్యమం ప్రారంభించాడు. కొద్ది కాలానికే - ఆగష్టు 2002లో - తన సంస్థను తెరాసలో విలీనం చేసి, తెరాసలో తాను రెండో ప్రముఖ నాయకుడయ్యాడు.
2004లో జరిగిన శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని, తెరాస మంచి విజయాలు సాధించింది . ఆ ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లను ఓడించి, కాంగ్రెసు (, దాని నాయకత్వంలోని కూటమి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ చేజిక్కించుకుంది. కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రభుత్వంలో చేరింది.
ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది.
2009ఎన్నికలలో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న తెరాస పోటీ చేసిన 45 ఎమ్ ఎల్ఎ సీట్లకి 10 మాత్రమే గెలుచుకుంది. అలాగే రెండు ఎమ్పి సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడింది.29నవంబరు2009న నిరాహారదీక్ష ప్రారంభించిన కెసిఆర్ పరిస్థితి విషమించడంతో కేంద్రం 9డిసెంబరున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించుతున్నట్లు ప్రకటన చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆంధ్రలో అల్లర్లు చెలరేగగా23 డిసెంబరున ఏకాభిప్రాయ సాధన వచ్చేంతవరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగదని ప్రకటించింది. పిభ్రవరి3, 2010న న్యాయమూర్తి శ్రీకృష్ణ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల సమితిని ఏర్పరచింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక 6 జనవరి2011న విడుదలయింది. దాని ప్రకారం పేర్కొన్న ఆరు పరిష్కారాలలో, రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచి తెలంగాణా అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలనే పరిష్కారము ఉత్తమమైనదిగా, తెలంగాణ, సీమాంధ్రలను వేరుచేయడం రెండవ ఉత్తమమైన పరిష్కారంగా సిఫారస్ చేయబడింది. ఈ సిఫారస్లు వ్యతిరేకించబడ్డాయి. తెలంగాణ వుద్యమం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ వార్తలలో వుంటున్నా పరిష్కారం దిశగా పురోగతి లేదు.
This article uses material from the Wikipedia తెలుగు article ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.