ది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii

ది గాడ్ ఫాదర్ పార్ట్ II 1974లో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నిర్మించి దర్శకత్వం వహించిన అమెరికన్ క్రైమ్ సినిమా.

ఈ చిత్రాన్ని పాక్షికంగా 1969లో మారియో పుజో రాసిన ది గాడ్‌ఫాదర్ నవలపై ఆధారపడి రూపొందించారు. అతను ఈ సినిమాకు కొప్పోలాతో కలిసి స్క్రీన్‌ప్లే రచించాడు. ఈ సినిమాను 1972 నాటి ది గాడ్‌ఫాదర్‌కి సినిమాకు సీక్వెల్‌గాను, ప్రీక్వెల్‌గానూ పరిగణించవచ్చు. ఇది రెండు సమాంతర కథలను చూపిస్తుంది: ఒకటి కొర్లియోన్ కుటుంబానికి చెందిన కొత్త డాన్, మైఖేల్ కొర్లియోన్ (అల్ పచ్చీనో) పై 1958 లో జరిగిన దాడి తరువాత మొదలౌతుంది. రెండోది అతని తండ్రి విటో కొర్లియోన్ (రాబర్ట్ డి నీరో) సిసిలీలో తన బాల్యం నుండి న్యూయార్క్ నగరంలో తన కుటుంబ సంస్థను స్థాపించే వరకు చేసిన ప్రయాణాన్ని చూపిస్తుంది. తారాగణంలో రాబర్ట్ డువాల్, డయీన్ కీటన్, టాలియా షైర్, మోర్గానా కింగ్, జాన్ కాజేల్, మరియానా హిల్, లీ స్ట్రాస్‌బర్గ్ కూడా ఉన్నారు.

ది గాడ్‌ఫాదర్ పార్ట్ II
ది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii
సినిమా పోస్టరు
దర్శకత్వంఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
స్క్రీన్ ప్లే
నిర్మాతఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
తారాగణం
  • అల్ పచ్చీనో
  • రాబర్ట్ డువాల్
  • దయీన్ కీటన్
  • రాబర్ట్ డి నీరో
  • తాలియా షైర్
  • మోర్గానా కింగ్
  • జాన్ కాజేల్
  • మారియానా హిల్
  • లీ స్ట్రాస్‌బర్గ్
ఛాయాగ్రహణంగార్డన్ విల్లిస్
కూర్పు
  • పీటర్ జిన్నర్
  • బారీ మాల్కిన్
  • రిచర్డ్ మార్క్స్
సంగీతంనినో రోటా
పంపిణీదార్లుపారమౌంట్ పిక్చర్స్
విడుదల తేదీs
1974 డిసెంబరు 12 (1974-12-12)(New York City)
డిసెంబరు 20, 1974 (United States)
సినిమా నిడివి
202 నిమిషాలు
దేశంఅమెరికా
భాషలు
  • ఇంగ్లీషు
  • సిసిలియన్
బడ్జెట్$13 million
బాక్సాఫీసు$48–93 million

మొదటి చిత్రం విజయం సాధించిన తరువాత, పారమౌంట్ పిక్చర్స్ ఒక ఫాలో-అప్‌ కథను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. మొదటి దానికి పనిచేసిన తారాగణం, సిబ్బందిలో చాలా మంది దీనికి కూడా పనిచేసారు. ఈ సినిమా నిర్మాణంలో కొప్పోలాకు మరింత సృజనాత్మక నియంత్రణ ఇచ్చారు. విటో పెరుగుదలను, మైఖేల్ పతనాన్నీ చూపించేలా ది గాడ్‌ఫాదర్‌కి సీక్వెల్‌ను, ప్రీక్వెల్‌నూ చూపించాలని అతను భావించాడు. షూటింగు 1973 అక్టోబరులో మొదలై, 1974 జూన్‌లో ముగిసింది. 1974 డిసెంబరు 12న న్యూయార్క్ నగరంలో గాడ్‌ఫాదర్ పార్ట్ II ప్రీమియర్ షో వేసారు. 1974 డిసెంబర్ 20న అమెరికాలో విడుదలైంది. విమర్శకుల నుండి భిన్నమైన సమీక్షలను అందుకుంది. అయితే, దాని ఖ్యాతి వేగంగా వ్యాపించింది. త్వరలోనే విమర్శకులు తమ విమర్శలను పునస్సమీక్షించుకున్నారు. $1.3 కోట్ల బడ్జెట్టుతో తీసిన ఈ సినిమా, అమెరికా కెనడాల్లో $4.8 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా $9.3 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం పదకొండు అకాడమీ అవార్డులకు నామినేట్ కాగా, ఉత్తమ చిత్రంగా గెలుపొందింది. అలా గెలిచిన మొదటి సీక్వెల్‌గా నిలిచింది. అది సాధించిన ఆరు ఆస్కార్ విజయాలలో కొప్పోలా ఉత్తమ దర్శకుడుగా, డి నీరో ఉత్తమ సహాయ నటుడుగా, కొప్పోలా, పుజోలు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలుగా ఎంపికయ్యారు. పచ్చీనో BAFTA లో ఉత్తమ నటుడిగా గెలుపొందాడు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు.

మొదటి సినిమా మాదిరిగానే, పార్ట్ II కూడా అత్యంత ప్రభావవంతమైన చిత్రంగా నిలిచిపోయింది -ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ జానర్‌లో. ఇది గొప్ప చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. అలాగే మొదటి దాని కంటే మెరుగైన సీక్వెల్ సినిమాల్లో దీన్ని అరుదైన ఉదాహరణగా పరిగణిస్తారు. 1997లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనిని అమెరికన్ ఫిల్మ్ హిస్టరీలో 32వ-గొప్ప చిత్రంగా ర్యాంకు ఇచ్చింది. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 1993లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారి అమెరికా నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో ఇది "సాంస్కృతికంగా, చారిత్రికంగా, సౌందర్యపరంగా ముఖ్యమైనది"గా పరిగణించింది. గాడ్‌ఫాదర్ త్రయంలో చివరి భాగమైన ది గాడ్‌ఫాదర్ పార్ట్ III, 1990లో విడుదలైంది.

కథ

ది గాడ్‌ఫాదర్ సినిమా తరువాత కొన్నాళ్ళకు జరిగిన ఘటనలు, విటో కొర్లియోన్ ప్రారంభ జీవితం మధ్య ఈ చలనచిత్రం నడుస్తుంది.

విటో

1901లో, తొమ్మిదేళ్ల విటో ఆండోలిని కుటుంబం సిసిలీ లోని కొర్లియోన్‌లో ఉండగా, అతని తండ్రి స్థానిక మాఫియా చీఫ్ డాన్ సికియోను అవమానించడంతో అతన్ని చంపేస్తారు. విటో న్యూయార్క్ నగరానికి పారిపోతాడు. రాగానే "విటో కొర్లియోన్"గా పేరు మార్చుకుంటాడు. 1917 లో విటో తన భార్య కార్మెలా, కొడుకు శాంటినోతో కలిసి న్యూయార్క్‌లో నివసిస్తూంటాడు. స్థానిక బ్లాక్ హ్యాండ్ దోపిడీదారు డాన్ ఫనుచ్చి జోక్యం కారణంగా అతను తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. తోటి ఇటాలియన్ వలసదారులను దోచుకునే ఫనుచ్చీ పద్ధతి విటోకు నచ్చదు. అతని పొరుగువాడైన క్లెమెంజా, విటోను ఒక తుపాకుల సంచిని దాచమని ఇస్తాడు; దానికి కృతజ్ఞతగా క్లెమెంజా, ఒక రగ్గును దొంగిలించడంలో విటోను తోడు తీసుకుంటాడు. అతను దానిని కార్మెలాకు బహుమతిగా ఇస్తాడు.

కొర్లియోన్‌లకు మరో ముగ్గురు పిల్లలు కలుగుతారు; కుమారులు ఫ్రెడో, మైఖేల్, కుమార్తె కాన్స్టాన్జియా. ఇంతలో, విటో, క్లెమెంజా, కొత్త భాగస్వామి టెస్సియోలు కలిసి వస్తువులను దొంగిలించి, వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తూంటారు. ఇది ఫనుచ్చీ దృష్టికి వస్తుంది. అందులో తనకు వాటా ఇమ్మని అతను వీళ్ళను వత్తిడి చేస్తాడు. కొద్దిపాటి మొత్తానికి అంగీకరించేలా ఫనుచ్చితో మాట్లాడతానని విటో తన భాగస్వాములను ఒప్పిస్తాడు. ఓ వేడుక సమయంలో విటో, ఫనుచ్చికి చాలా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తాడు. ఆ తరువాత విటో, ఫనుచ్చీని అతని అపార్ట్‌మెంటు లోనే చంపేస్తాడు. విటో స్థానికులకు సహాయం చేస్తూ, ఆ ప్రాంతంలో బలీయమైన గౌరవనీయమైన వ్యక్రిగా పేరు పొందుతాడు.

విటో, అతని కుటుంబం సిసిలీ వెళ్తారు. తన వ్యాపార భాగస్వామితో కలిసి విటో, తమ ఆలివ్ ఆయిల్ వ్యాపారంపై డాన్ సిక్సియో ఆమోదం కోసం అతని వద్దకు వెళ్తారు. సిక్సియో విటో తండ్రి పేరును అడుగుతాడు; విటో తానెవరో అతనికి చెప్పి, తన కుటుంబం లోని మరణాలకు ప్రతీకారంగా సిసియోను చంపేస్తాడు.

1941లో, విటో 50వ పుట్టినరోజున అతన్ని ఆశ్చర్యపరిచేందుకు కొర్లియోన్ కుటుంబీకులు తమ భోజనాల గదిలో సమావేశమవుతారు. సోనీ కార్లోను కానీకి పరిచయం చేస్తుంది. మైఖేల్ తాను కాలేజీని విడిచిపెట్టి యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్‌లో చేరానని ప్రకటిస్తాడు. సోనీకి కోపం వస్తుంది. టామ్‌ను నమ్మలేమని, ఫ్రెడో మాత్రమే నమ్మదగ్గ సోదరుడనీ భావిస్తుంది. తలుపు వద్ద విటో వస్తున్న అలికిడి వినబడి, మైఖేల్ తప్ప మిగిలిన వారందరూ అతన్ని అభినందించటానికి గది నుండి బయటికి వెళ్తారు.

మైఖేల్

1958లో, లేక్ తాహోలో అతని కుమారుడి మొదటి కమ్యూనియన్ పార్టీ సందర్భంగా, మైఖేల్ కొర్లియోన్ క్రైమ్ కుటుంబానికి డాన్‌గా వరుసగా సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటాడు. కొర్లియోన్‌ల వద్ద పనిచేసే ఫ్రాంక్ పెంటాంజెలీ, యూదు మాబ్ బాస్, దీర్ఘకాలంగా కొర్లియోన్‌ల వ్యాపార భాగస్వామి అయిన హైమన్ రోత్ వద్ద పనిచేసే రోసాటో సోదరుల నుండి తన బ్రాంక్స్ స్థలాన్ని కాపాడడానికి మైఖేల్ ఒప్పుకోకపోవడంతో నిరాశ చెందుతాడు. ఆ రాత్రి, మైఖేల్ ఇంటిలోనే అతనిపై జరిగిన హత్యాప్రయత్నం విఫలమౌతుంది. మైఖేల్, తన కుటుంబంలోనే ఎవరో ద్రోహి ఉన్నట్లుగా అనుమానిస్తున్నట్లు తన లాయరు టామ్ హెగెన్‌తో చెప్పి, ఆ వెంటనే అక్కడినుండి వెళ్ళిపోతాడు.

రోత్ తన హత్యకు ప్లాన్ చేశాడని మైఖేల్ అనుమానిస్తాడు, కానీ పెంటాంజెలీని అనుమానిస్తున్నట్లు కావాలని రోత్‌కి తప్పుగా చెబుతాడు. న్యూయార్క్ నగరంలో, మైఖేల్ సూచనల మేరకు, పెంటాంజెలీ రోసాటోస్‌తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే మైఖేల్ దాడికి ఆదేశించాడని వారు, అతనిపై ఆరోపిస్తారు. అనారోగ్యంతో ఉన్న రోత్, మైఖేల్, వారి భాగస్వాములు కలిసి క్యూబా లోని ఫుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వం అండతో తమ భవిష్యత్ వ్యాపార అవకాశాల గురించి చర్చించడానికి హవానా వెళతారు. క్యూబాలో కొనసాగుతున్న క్యూబా విప్లవం కారణంగా మైఖేల్ తన కార్యకలాపాలను కొనసాగించడానికి ఇష్టపడడు. నూతన సంవత్సర వేడుక సందర్భంగా ఫ్రెడో, రోత్‌కు కుడిభుజం లాంటి జానీ ఓలా గురించి తనకు ఏమీ తెలియనట్లు నటిస్తాడు. కానీ తరువాత అనుకోకుండా తమకు ఒకరినొకరు తెలుసని వెల్లడిస్తాడు. అంతర్గత ద్రోహి అతనేనని మైఖేల్‌కు తెలిసిపోతుంది. ఓలా, రోత్‌లపై దాడికి మైఖేల్ ఆదేశాలు ఇస్తాడు. కానీ రోత్‌ను అణచివేయడానికి ప్రయత్నించిన అతని అనుచరుణ్ణి క్యూబా సైనికులు చంపేస్తారు. తిరుగుబాటుదారుల పురోగమనాల కారణంగా బాటిస్టా పదవి నుండి తప్పుకుంటాడు. తరువాతి గందరగోళంలో, మైఖేల్, ఫ్రెడో, రోత్ విడివిడిగా క్యూబా నుండి తప్పించుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చిన మైఖేల్ తన భార్యకు గర్భస్రావం అయిందని తెలుసుకుంటాడు.

వాషింగ్టన్, డిసిలో సెనేట్ కమిటీ, వ్యవస్థీకృత నేరాలపై కొర్లియోన్ కుటుంబంపై దర్యాప్తు చేస్తుంది. పెంటాంజెలీ మైఖేల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి అంగీకరిస్తాడు. మైకెల్ తనను డబుల్ క్రాస్ చేసినట్లుగా అతను భావిస్తాడు. అతన్ని సాక్షి రక్షణలో ఉంచుతారు. నెవాడాకు తిరిగి వచ్చినప్పుడు ఫ్రెడో, మైఖేల్‌తో తన కుటుంబం పట్టించుకోకపోవడంతో తాను ఆగ్రహం వ్యక్తం చేశాననీ, అయితే మైఖేల్‌ను చంపే పథకం గురించి తనకు తెలియదనీ చెబుతాడు. మైఖేల్ ఫ్రెడోను దూరం పెడతాడు. కానీ తమ తల్లి జీవించి ఉన్నంత వరకు అతనికి ఏ హానీ జరగకూడదని ఆదేశిస్తాడు. మైఖేల్, పెంటాంజెలీ సోదరుణ్ణి సిసిలీ నుండి రప్పిస్తాడు. న్యాయస్థానంలో తన సోదరుడిని చూసాక పెంటాంజెలీ, మైఖేల్‌ వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డాడనే తన మునుపటి స్టేట్‌మెంటును ఉపసంహరించుకుంటాడు. ఆ కేసు వీగిపోతుంది. కే, మైఖేల్ నేర జీవితం నుండి తమ పిల్లలను విడిగా ఉంచాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. కోపోద్రిక్తుడైన మైఖేల్, కే ను కొడతాడు. ఆమెను కుటుంబం నుండి బహిష్కరిస్తాడు. పిల్లలను పూర్తిగా తన సంరక్షణలో ఉంచుకుంటాడు.

కొంతకాలానికి మైకెల్ తల్లి కార్మెలా మరణిస్తుంది. మైఖేల్ పరిస్థితులను చక్కదిద్దడానికి తొందరపడతాడు. అంత్యక్రియల సమయంలో మైఖేల్, కోనీ కోరిక మేరకు ఫ్రెడోను క్షమించినట్లు కనిపిస్తాడు. కే తన పిల్లలను సందర్శిస్తుంది; ఆమె వీడ్కోలు చెబుతుండగా, మైఖేల్ వచ్చి ఆమె ముఖంపై తలుపులు వేసేస్తాడు. ఇజ్రాయెల్‌లో ప్రవేశానికి, ఆశ్రయానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో రోత్, అమెరికాకు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. మైఖేల్ ఆదేశాల మేరకు, మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూండగా రోత్ హత్యకు గురౌతాడు. లాయరు టామ్ హేగెన్, పెంటాంజెలీ ఇంటికి వెళతాడు. ఇద్దరూ, రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా కుట్ర చేసి విఫలమైన కుట్రదారులు తమ కుటుంబాల రక్షణ కోసం ఎలా ఆత్మహత్య చేసుకుంటారో చర్చించుకుంటారు. పెంటాంజెలి తన బాత్‌టబ్‌లో మణికట్టును కోసుకుని చనిపోయినట్లు కనుగొంటారు. కొర్లియోన్ ఎన్‌ఫోర్సర్ అల్ నెరి, ఫ్రెడోతో కలిసి సరస్సులో చేపలు పట్టుకుంటూండగా పెడ్రోను కాల్చివేస్తాడు. మైఖేల్ తన ఇంటివద్ద ఒంటరిగా కూర్చుని, సరస్సు వైపు చూస్తూంటాడు.

తారాగణం

  • అల్ పచ్చీనో - మైఖేల్ కొర్లియోన్
  • రాబర్ట్ డువాల్ - టామ్ హెగెన్
  • డయాన్ కీటన్ - కే ఆడమ్స్-కొర్లియోన్
  • రాబర్ట్ డి నీరో - విటో కొర్లియోన్
    • ఒరెస్టే బాల్డిని - యువ వీటో కొర్లియోన్‌గా
  • జాన్ కాజలే - ఫ్రెడో కొర్లియోన్
  • టాలియా షైర్ - కాన్నీ కొర్లియోన్
  • లీ స్ట్రాస్‌బర్గ్ - హైమాన్ రోత్
  • మైఖేల్ వి. గజ్జో - ఫ్రాంక్ పెంటాంజెలి
  • జి. డి. స్ప్రాడ్లిన్ - సెనేటర్ పాట్ గేరీగా
  • రిచర్డ్ బ్రైట్ - అల్ నెరి
  • గాస్టోన్ మోస్చిన్ - డాన్ ఫనుచ్చి
  • టామ్ రోస్క్వి - రోకో లాంపోన్‌గా
  • బ్రూనో కిర్బీ - యవ్వనంలో పీటర్ క్లెమెన్జా
  • ఫ్రాంక్ సివెరో - జెన్కో అబ్బండాండో
  • మోర్గానా కింగ్ - కార్మెలా కొర్లియోన్‌గా
    • ఫ్రాన్సెస్కా డి సాపియో - యవ్వనంలో కార్మెలా కొర్లియోన్
  • మరియాన్నా హిల్ - డీన్నా కొర్లియోన్‌గా
  • లియోపోల్డో ట్రైస్టే - సిగ్నర్ రాబర్టోగా
  • డొమినిక్ చైనీస్ - జానీ ఓలాగా
  • అమెరిగో టాట్ - మైఖేల్ యొక్క అంగరక్షకుడిగా
  • ట్రాయ్ డోనాహ్యూ - మెర్లే జాన్సన్‌గా
  • జో స్పినెల్ - విల్లీ సిక్కీగా
  • అబే విగోడా - సాల్వటోర్ టెస్సియో
    • జాన్ అప్రియా - యువ టెస్సియోగా
  • హ్యారీ డీన్ స్టాంటన్ - F.B.I. ఏజెంట్
  • డానీ ఐయెల్లో - టోనీ రోసాటోగా
  • ఇటాలియా కొప్పోలా - మామా కార్లియోన్ శరీరం

చిత్రీకరణ

గాడ్ ఫాదర్ పార్ట్ II షూటింగు 1973 అక్టోబరు 1 న మొదలై, 1974 జూన్ 19 కి పూర్తైంది. క్యూబాలో జరిగిన సన్నివేశాలను డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగోలో చిత్రీకరించారు. చార్లెస్ బ్లూడోర్న్ కు చెందిన గల్ఫ్+వెస్ట్రన్ యాజమాన్యంలో ఉన్న పారమౌంట్, డొమినికన్ రిపబ్లిక్‌ను చలనచిత్ర నిర్మాణ స్థలంగా అభివృద్ధి చేయాలని గట్టిగా భావించింది. ఫోర్జా డి అగ్రో అనేది సినిమాలో చూపించబడిన సిసిలియన్ పట్టణం.

మొదటి చిత్రం వలె కాకుండా, కొప్పోలాకు ఈ సినిమా నిర్మాణంపై పూర్తి నియంత్రణ ఇచ్చారు. ఈ కారణం గానే, అనేక స్థానాల్లో చిత్రీకరణ, సమాంతరంగా నడిచే రెండు కథనాలు ఉన్నప్పటికీ దీని షూటింగు చాలా సాఫీగా సాగిందని కొప్పోలా తన వ్యాఖ్యానంలో చెప్పాడు. 2002 లో విడుదలైన చిత్రపు DVD ఎడిషన్‌లో దర్శకుని వ్యాఖ్యానంలో కొప్పోలా, "పేరులో పార్ట్ II అని వాడిన మొదటి అమెరికా చలన చిత్రం ఇది కావాల"నే తన నిర్ణయాన్ని చర్చించాడు. పారామౌంట్ తొలుత దీన్ని ఒప్పుకోలేదు. ప్రేక్షకులు తాము ఇప్పటికే చూసిన కథకు పొడిగింపునే చూసేందుకు ఆసక్తి చూపరని వారు అనుకున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడిదే పైచేయి అయింది. ఈ చిత్రం విజయంతో పేర్లలో అంకెలతో సీక్వెల్స్ నిర్మించడం మామూలై పోయింది.

విడుదలకు మూడు వారాల ముందు, సినీ విమర్శకులు, జర్నలిస్టులు పార్ట్ II ఒక ఘోరమైన ఫ్లాపు సినిమా అని విమర్శించారు. విటో, మైఖేల్ ల సమాంతర కథల మధ్య క్రాస్ కటింగ్ మరీ ఎక్కువగా ఉందని వాళ్ళు అన్నారు. ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసే సమయం ఇవ్వడం లేదని వాళ్ళు అన్నారు. కొప్పోలా, సినిమా ఎడిటర్లూ కథనాన్ని మార్చడానికి మళ్ళీ ఎడిటింగు రూముకు చేరారు కానీ, సమయానికి పనిని పూర్తి చేయలేకపోయారు, చివరి సన్నివేశాలు మొదట్లో పేలవంగా ఉన్నాయి.

విడుదల

సినిమా హాళ్ళలో

1974 డిసెంబరు 12 న న్యూయార్క్ నగరంలో గాడ్ ఫాదర్ పార్ట్ II ప్రీమియర్‌ ప్రదర్శన జరిగింది. 1974 డిసెంబర్ 20 న అమెరికా వ్యాప్తంగా విడుదలైంది.

హోమ్ మీడియా

1975 లో అమెరికన్ టెలివిజన్ కోసం విడుదల చేసినపుడు కొప్పోలా, ది గాడ్ ఫాదర్, ది గాడ్ ఫాదర్ పార్ట్ II కలిపి ది గాడ్ ఫాదర్ సాగా అని రూపొందించాడు. 1977 నవంబరు 18 న NBC కోసం విడుదల చేసినపుడు ఇందులో హింసాత్మక, లైంగిక విషయాలను తొలగించి, కాలానుగతంగా నడిచేలా ఆ రెండు చిత్రాల నుండి ఉపయోగించని ఫుటేజీతో కలిపి విడుదల చేసాడు. 1981లో, పారామౌంట్ గాడ్‌ఫాదర్ ఎపిక్ బాక్స్‌డ్ సెట్‌ను విడుదల చేసింది. ఇది మొదటి రెండు చిత్రాల కథను కాలక్రమానుసారంగా మళ్లీ అదనపు సన్నివేశాలతో చూపించింది. కొప్పోలా 1992లో మళ్లీ ది గాడ్‌ఫాదర్ పార్ట్ III నుండి ఫుటేజిని చేర్చి ఇంకా విడుదల చేయని అంశాలతో నవీకరించాడు. ది గాడ్‌ఫాదర్ త్రయం 1901–1980 పేరుతో విడుదలైన ఈ హోమ్ వ్యూయింగ్ విడుదల మొత్తం రన్ టైమ్‌ 583 నిమిషాల (9 గంటలు, 43 నిమిషాలు) ఉంది. ఇందులో జెఫ్ వెర్నర్ ఈ చిత్రాల నిర్మాణంపై రూపొందించిన "ది గాడ్‌ఫాదర్ ఫ్యామిలీ: ఎ లుక్ ఇన్‌సైడ్" అనే బోనస్ డాక్యుమెంటరీ నిడివి లేదు.

2001 అక్టోబరు 9 న గాడ్‌ఫాదర్ DVD కలెక్షన్‌ను ఒక ప్యాకేజీగా విడుదల చేసారు. ఇందులో మూడు చిత్రాకూ విడివిడిగా కొప్పోలా వ్యాఖ్యానం కూడా ఉంది. 1991 నుండి ది గాడ్‌ఫాదర్ ఫ్యామిలీ: ఎ లుక్ ఇన్‌సైడ్ పేరుతో 73 నిమిషాల డాక్యుమెంటరీ ఉంది. ది గాడ్‌ఫాదర్ సాగా; ఫ్రాన్సిస్ కొప్పోల నోట్‌బుక్ (చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు తన దగ్గర ఉంచుకున్న నోట్‌బుక్); రిహార్సల్ ఫుటేజ్; 1971 నుండి ప్రచార ఫీచర్; గోర్డాన్ విల్లీస్ సినిమాటోగ్రఫీ, నినో రోటా, కార్మైన్ కొప్పోలా సంగీతం, లొకేషన్‌లు, మారియో పుజో స్క్రీన్‌ప్లేలపై వీడియో విభాగాలు. DVDలో కొర్లియోన్ ఫ్యామిలీ ట్రీ, "గాడ్‌ఫాదర్" టైమ్‌లైన్, అకాడమీ అవార్డు అంగీకార ప్రసంగాల ఫుటేజీలు కూడా ఇందులో ఉన్నాయి.

ఆదరణ

బాక్స్ ఆఫీస్

ది గాడ్‌ఫాదర్ పార్ట్ II వాణిజ్యపరంగా మొదటి భాగాన్ని మించనప్పటికీ, ఇది అమెరికా, కెనడాల్లో $4.75 కోట్లు వసూలు చేసింది. పారామౌంట్ పిక్చర్స్ వారు 1974లో నిర్మించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం. అమెరికాలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఏడవది . దాని అంతర్జాతీయ పంపిణీదారు ప్రకారం, ఈ చిత్రం 1994 నాటికి అంతర్జాతీయంగా $4.53 కోట్లు వసూలు చేసింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా మొత్తం $9.3 కోట్లు సాధించింది.

స్పందనలు

ది గాడ్‌ఫాదర్ పార్ట్ II కు తొలుత డివైడెడ్ టాక్ వచ్చింది. కొందరు దీన్ని బాలేదని విమర్శించగా మరికొందరు మొదటి చిత్రం కంటే ఇది బాగుందని ప్రకటించారు. దాని సినిమాటోగ్రఫీ, నటనలు ప్రశంసలు పొందినప్పటికీ చాలా మంది, ఇది మరీ నెమ్మదిగా నడిచిందని విమర్శించారు. విన్సెంట్ కాన్బీ ఈ చిత్రాన్ని "మొద్టి భాగంలో మిగిలిన భాగాలను కలిపి కుట్టినట్లు రాసాడు. "ఇది ఆగుతూ నడుస్తూ ఉంటుంది. దాని స్వంత బుర్రంటూ లేదు. కథలో హేతుబద్ధత అంటూ లేదు." అని రాసాడు. ది న్యూ రిపబ్లిక్‌కు చెందిన స్టాన్లీ కౌఫ్ఫ్‌మాన్ "కథనంలో అంతరాలు, అవాంతరాలూ ఉన్నాయని" ఆరోపించాడు. రోజర్ ఎబర్ట్ కొంత సానుకూలంగా రాస్తూ మూడు నక్షత్రాల రేటింగు ఇచ్చాడు. "ఫ్లాష్‌బ్యాక్‌ల వలన కథనంలో వేగాన్ని, బలాన్నీ కొనసాగించడంలో కొప్పోలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఇతర అంశాలేమీ లేకుండా కాలానుగతంగా చెప్పిన మైఖేల్ కథ ప్రేక్షకుడి మీద గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉండేది. అయితే కొప్పోలా ఉత్సుకతను పోగొట్టి ప్రేక్షకుడు లీనమవకుండా అడ్డుకున్నాడు." అని అతను రాసాడు. పచ్చీనో నటనను ప్రశంసించడం, కొప్పోలాను "మూడ్, వాతావరణం, పీరియడ్‌లకు మాస్టర్" అని ప్రశంసించడం చేసినప్పటికీ ఎబర్ట్, దాని కథనం లోని కాలక్రమంలో ఏర్పడిన గంతులను "కోలుకోలేని నిర్మాణ బలహీనత"గా పరిగణించాడు. జీన్ సిస్కెల్ ఈ చిత్రానికి నాలుగింట మూడున్నర నక్షత్రాల రేటింగు ఇచ్చాడు. ఇది కొన్ని సమయాల్లో "మొదటి భాగమంత అందంగా, భయానకంగా, ఉత్తేజకరంగా ఉంది. నిజానికి, 'ది గాడ్‌ఫాదర్, పార్ట్ II' ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో రెండవది కావచ్చు. కానీ ఇది సరిగ్గా మొదటిదాని లానే లేదు. సీక్వెల్‌లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలా ఉంటే, అది ఒకే అంత్యక్రియలకు రెండోసారి వెళ్లడం లాంటిది-కన్నీళ్లు అంత తేలికగా రావు." అని అన్నాడు.

పునస్సమీక్ష

ఈ చిత్రంపై చేసిన సమీక్షలను త్వరలోనే మళ్ళీ సమీక్షించుకున్నారు. విడిగా చూసినా, లేదా మొదటిభాగంతో కలిపి ఒకే సినిమాగా పరిగణించినా, ది గాడ్‌ఫాదర్ పార్ట్ II ఇప్పుడు ప్రపంచం లోని గొప్ప చిత్రాలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతోంది. "గొప్ప" చిత్రాల జాబితాలో ఇది మొదటి భాగం కంటే పై స్థానంలో లేనప్పటికీ, చాలా మంది విమర్శకులు ఇది దానికంటే బాగుందన్నారు. ఎబర్ట్, తన పునస్సమీక్షలో దీనికి నాలుక్కు నాలుగు నక్షత్రాలూ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని తన గ్రేట్ మూవీస్ జాబితా లోకి చేర్చాడు. అతను తన తొలి సమీక్షలో ఒక్క "పదాన్ని కూడా మార్చను" అని చెబుతూ, "పకడ్బందీగా రాసారు, ఆత్మవిశ్వాసంతో, కళాత్మకతతో దర్శకత్వం వహించాడు, గోర్డాన్ విల్లిస్ ఛాయాగ్రహణం చక్కగా ఉంది." అని రాసాడు. నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ వెబ్‌సైట్ కోసం ఎంపిక చేయబడిన తన 2002 నాటి వ్యాసం ముగింపులో మైఖేల్ స్రాగో, "ది గాడ్ ఫాదర్", "ది గాడ్ ఫాదర్ పార్ట్ II" లు ఓ అమెరికన్ కుటుంబపు నైతిక పరాజయాన్ని వర్ణించినప్పటికీ, ఇవి ఒక గొప్ప, మార్గదర్శకమైన నిలుస్తాయి. ఇది జాతీయ సృజనాత్మక విజయంగా మిగిలిపోతుంది." అని రాసాడు. ఈ చిత్రంపై 2014 లో చేసిన సమీక్షలో ది గార్డియన్‌కి చెందిన పీటర్ బ్రాడ్‌షా ఇలా వ్రాశాడు: "ఫ్రాన్సిస్ కొప్పోలా తన మొదటి గాడ్‌ఫాదర్ చిత్రానికి ఉత్కంఠభరితమైన ప్రీక్వెల్-సీక్వెల్ ఎప్పటిలాగే ఉత్కంఠభరితంగా ఉంది. ఇది మొదటి చిత్రం కంటే మెరుగ్గా ఉంది. దీని పతాక సన్నివేశం హాలీవుడ్ చరిత్ర లోనే అత్యంత గొప్పది."

ప్రశంసలు

ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డు గెలుచుకున్న మొదటి సీక్వెల్. ది గాడ్‌ఫాదర్, ది గాడ్‌ఫాదర్ పార్ట్ II సినిమాలు ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న ఏకైక ఒరిజినల్/సీక్వెల్ కలయికగా నిలిచింది. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌తో పాటు, ది గాడ్‌ఫాదర్ త్రయం లోని మూడు సినిమాలూ ఉత్తమ చిత్రం పురస్కారానికి నామినేట్ అయ్యాయి; ఉత్తమ చిత్రాన్ని గెలుచుకున్న సీక్వెల్‌లు ది గాడ్‌ఫాదర్ పార్ట్ II, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ మాత్రమే.

అవార్డు వర్గం Nominee ఫలితం
47వ అకాడమీ అవార్డులు ఉత్తమ చిత్రం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, గ్రే ఫ్రెడరిక్‌సన్, ఫ్రెడ్ రూస్ గెలుపు
ఉత్తమ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నామినేషను
ఉత్తమ నటుడు అల్ పచ్చీనో నామినేషను
ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డి నీరో గెలుపు
మైకెల్ వాజో నామినేషను
లీ స్ట్రాస్‌బర్గ్ నామినేషను
ఉత్తమ సహాయ నటి టాలియా షైర్ నామినేషను
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పుజో | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో ప్యుజో గెలుపు
ఉత్తమ కళా దర్శకత్వం డీన్ టవోలారిస్, ఏంజెలో పి. గ్రాహం, జార్జి ఆర్ నెల్సన్ గెలుపు
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ థియోడోరా వాన్ రింకిల్ నామినేషను
ఉత్తమ ఒరిజినల్ డ్రమాటిక్ స్కోర్ నినో రోటా, కార్మిన్ కొప్పోలా గెలుపు
29వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అల్ పచ్చీనో గెలుపు
ప్రముఖ చలనచిత్ర పాత్రలకు మోస్ట్ ప్రామిసింగ్ కొత్తవాడు రాబర్ట్ డి నీరో నామినేషను
ఉత్తమ చలనచిత్ర సంగీతం నినో రోటా నామినేషను
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ పీటర్ జిన్నర్, బారీ మాల్కిన్, రిచర్డ్ మార్క్స్ నామినేషను
27వ డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు చలన చిత్రాలలో అత్యుత్తమ దర్శకత్వ విజయం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా గెలుపు
32వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఉత్తమ చలన చిత్రం - డ్రామా నామినేషను
ఉత్తమ దర్శకుడు - చలన చిత్రం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా నామినేషను
ఉత్తమ చలనచిత్ర నటుడు - డ్రామా అల్ పచ్చీనో నామినేషను
మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ - పురుషుడు లీ స్ట్రాస్‌బర్గ్ నామినేషను
ఉత్తమ స్క్రీన్‌ప్లే - చలన చిత్రం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పుజో | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో ప్యుజో నామినేషను
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ నినో రోటా నామినేషను
9వ నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా గెలుపు
27వ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్స్ మరొక మాధ్యమం నుండి స్వీకరించబడిన ఉత్తమ నాటకం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో పుజో | ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా, మారియో ప్యుజో గెలుపు

నోట్స్

మూలాలు

Tags:

ది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii కథది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii తారాగణంది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii విడుదలది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii ఆదరణది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii నోట్స్ది గాడ్‌ఫాదర్ పార్ట్ Ii మూలాలుది గాడ్‌ఫాదర్ పార్ట్ Iiది గాడ్‌ఫాదర్ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా

🔥 Trending searches on Wiki తెలుగు:

శివలింగంగుంటకలగరట్విట్టర్ప్రేమలుతులారాశికిరణజన్య సంయోగ క్రియగాయత్రీ మంత్రండెన్మార్క్పార్వతిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్పిచ్చిమారాజుకె. చిన్నమ్మక్రోధికోజికోడ్తిలక్ వర్మచిత్తూరు నాగయ్యమదర్ థెరీసా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఎస్. ఎస్. రాజమౌళిఆంధ్రప్రదేశ్ మండలాలురంజాన్నమాజ్వృషభరాశిదశావతారములులగ్నంమహాభాగవతంఅనసూయ భరధ్వాజ్నంద్యాల శాసనసభ నియోజకవర్గంచెల్లమెల్ల సుగుణ కుమారిలలితా సహస్ర నామములు- 1-100యూట్యూబ్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ కృష్ణుడుసుకన్య సమృద్ధి ఖాతారక్షకుడునాడీ వ్యవస్థఊపిరితిత్తులుఅశ్వగంధనెమలికేంద్రపాలిత ప్రాంతంమండల ప్రజాపరిషత్వ్యతిరేక పదాల జాబితాదక్షిణ భారతదేశంవనపర్తిరావణుడువిద్యఢిల్లీడిస్నీ+ హాట్‌స్టార్మాగుంట శ్రీనివాసులురెడ్డివై.యస్.అవినాష్‌రెడ్డినరసింహ శతకముపరకాల ప్రభాకర్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసౌర కుటుంబంవసంత వెంకట కృష్ణ ప్రసాద్తెలుగులో అనువాద సాహిత్యంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుసామెతలుప్రధాన సంఖ్యసద్గురుఆల్బర్ట్ ఐన్‌స్టీన్తెనాలి రామకృష్ణుడుతెలంగాణ శాసనమండలిసరస్వతిఎలక్టోరల్ బాండ్కాలేయంఆంధ్రప్రదేశ్మురళీమోహన్ (నటుడు)ఎస్. శంకర్బలగంఇంద్రజవేంకటేశ్వరుడుశిల్పా షిండేశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగంగా నదిసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)ఆవుసౌదీ అరేబియా🡆 More