భారతదేశ ఏకీకరణ

1947 లో భారత స్వాతంత్ర్య సమయంలో, భారతదేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది.

ప్రత్యక్షంగా బ్రిటిషు పాలనలో ఉండే భూభాగం మొదటిది కాగా, బ్రిటను రాచరికానికి లోబడి ఉంటూ, అంతర్గత వ్యవహారాలను ఆయా వారసత్వ పాలకులు నియంత్రించుకునే సంస్థానాలు రెండోది. ఈ సంస్థానాలు మొత్తం 562 ఉన్నాయి. ఈ సంస్థానాలకు బ్రిటిషు వారితో వివిధ రకాలైన ఆదాయ భాగస్వామ్య ఏర్పాట్లు ఉండేవి. వాటి పరిమాణం, జనాభా, స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఆదాయ పంపకాల ఏర్పాటు ఉండేది. అదనంగా, ఫ్రాన్స్, పోర్చుగల్‌ల నియంత్రణలో ఉండే అనేక వలసవాద ప్రాంతాలు కూడా ఉండేవి. ఈ భూభాగాలను భారతదేశంలో రాజకీయంగా ఏకీకృతం చేయడం భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యం. తరువాతి దశాబ్దంలో భారత ప్రభుత్వం దీనిని అమలు పరచింది. వివిధ పద్ధతుల ద్వారా, సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్లు వివిధ సంస్థాన పాలకులను భారతదేశంలో విలీనమయ్యేందుకు ఒప్పించారు. 1956 నాటికి, ఈ సంస్థానాలపై కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని భద్రపరచడానికి, విస్తరించడానికి, వారి పరిపాలనా వ్యవస్థను మార్చడానికీ ప్రభుత్వం దశల వారీగా ముందుకు సాగింది. 1956 నాటికి, భాగమైన భూభాగాల మధ్య స్వల్ప తేడా ఉంది. బ్రిటిషు ఇండియా, సంస్థానాలు. అదే సమయంలో, భారత ప్రభుత్వం, సైనిక, దౌత్య మార్గాలు రెండింటి ద్వారా, మిగిలిన వలసరాజ్యాల ఎన్‌క్లేవ్‌లపై వాస్తవ, న్యాయ నియంత్రణను పొందింది, ఇవి కూడా భారతదేశంలో కలిసిపోయాయి.

భారతదేశ ఏకీకరణ
1909 లో బ్రిటిషు ఇండియా, సంస్థానాలు

భారతదేశంలో సంస్థానాలు

భారతదేశంలో బ్రిటిషు వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ప్రస్తుతమున్న సంస్థానాల పట్ల రెండు విధానాలను అవలంబించారు. మొదటిది బలవంతంగా కలిపేసుకునే విధానం. బ్రిటిషు వారు భారత సంస్థానాలను తమ భారతదేశ సామ్రాజ్యంలోని ప్రావిన్సుల లోకి బలవంతంగా కలిపేసుకునే పద్ధతి ఇది. రెండవది బ్రిటిషు వారి పరోక్ష పాలన. సంస్థానాలపై తమ అధిపత్యం నెలకొల్పుకుంటారు. కానీ సంస్థానాలకు సార్వభౌమత్వం ఉంటుంది, వివిధ స్థాయిల్లో స్వయం పరిపాలనాధికారం ఉంటుంది. 19 వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిషు విధానం ఆక్రమణ వైపు మొగ్గు చూపింది, కాని 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం ఈ విధానంలో మార్పు చెయ్యాల్సిన పరిస్థితిని కల్పించింది. సంస్థానాలను ఆక్రమించడం, వాటిని లొంగదీసుకుని ఉంచడం, ఈ సంస్థానాలు తమకు మద్దతుగా ఉపయోగపడడం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని విధానంలో మార్పు తీసుకువచ్చారు. 1858 లో కలిపేసుకునే విధానాన్ని అధికారికంగా త్యజించారు. ఆ తరువాతి కాలంలో మిగిలిన సంస్థానాలతో బ్రిటిషు వారి సంబంధాలు, వారితో పొత్తులు పెట్టుకోవడం మీద ఆధారపడి ఉన్నాయి. తద్వారా బ్రిటిషు వారు అన్ని సంస్థానాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీటిపై బ్రిటిషు రాచరికమే సర్వంసహాధికారిగా ఉంటుంది. కానీ అదే సమయంలో సంస్థలతో పొత్తులను గౌరవిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారి విదేశీ సంబంధాలను నియంత్రణ లోకి తీసుకుంది. బ్రిటిషు వారికీ, ఒక్కో సంస్థానానికీ మధ్య ఉన్న కచ్చితమైన సంబంధాలు అయా సంస్థానాలతో ఉన్న ఒప్పందాల అనుసారం ఉంటాయి. ఈ ఒప్పందాలు అన్నీ ఒకే రకంగా ఉండవు, చాలా వైవిధ్యంగా, విభిన్నంగా ఉంటాయి. కొన్ని సంస్థానాలు పూర్తి అంతర్గత స్వపరిపాలనను కలిగి ఉంటాయి, మరికొన్నిటి అంతర్గత వ్యవహారాలలో బ్రిటిషు వారికి గణనీయమైన నియంత్రణ ఉంటుంది. కొంతమంది పాలకులకు పెద్దగా స్వతంత్రత ఉండదు -ఒక ఎస్టేటు యజమాని కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటారంతే.

20 వ శతాబ్దంలో, సంస్థానాలు తమతో మరింత సన్నిహితంగా మమేకమై ఉండటానికి బ్రిటిషు వారు అనేక ప్రయత్నాలు చేశారు. 1921 లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌ అనే సంప్రదింపుల, సలహా సంస్థను రూపొందించారు. 1936 లో చిన్న రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతను ప్రావిన్సుల నుండి తప్పించి, కేంద్రానికి బదిలీ చేశారు. భారత ప్రభుత్వానికి పెద్ద సంస్థానాలకూ మధ్య నేరుగా సంబంధాలను ఏర్పరుస్తూ, రాజకీయ ఏజెంట్లను పక్కన పెట్టారు. మరింత మహదాశావహ లక్ష్యం, భారత ప్రభుత్వ చట్టం 1935 లో ఉన్న సమాఖ్య పథకం - సంస్థానాలు, బ్రిటిషు భారతదేశమూ కలిసి ఒక సమాఖ్య ప్రభుత్వంలో ఐక్యంగా ఉండాలనే ఊహ. ఈ పథకం అమలుకు దగ్గరగా వచ్చింది. కాని రెండవ ప్రపంచ యుద్ధం మొదలవడంతో 1939 లో వదిలివేసారు. తత్ఫలితంగా, 1940 లలో, సంస్థానాలకు, బ్రిటిషు రాచరికానికీ మధ్య సంబంధాలు - బ్రిటిషు వారి సర్వంసహాధికార నియమానికీ (పారామౌంట్సీ), వాటి మధ్య కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలకూ లోబడి ఉండేవి.

భారత స్వాతంత్ర్యం తరువాత సర్వంసహాధికారం (పారామౌంట్సీ), అనుబంధ పొత్తులు కొనసాగలేదు. ఆ ఒప్పందాలు బ్రిటిషు రాచరికానికీ, సంస్థానాలకూ మధ్య నేరుగా కుదుర్చుకున్నవి కాబట్టి, వాటిని కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారత పాకిస్తాన్లకు బదిలీ చెయ్యడం సాధ్యంకాదని భావించారు. అదే సమయంలో, ఆయా ఒప్పందాలను అనుసరించి, సంస్థానాల రక్షణ కోసం భారతదేశంలో తమ దళాలను కొనసాగించడానికి బ్రిటిషువారు సిద్ధంగా లేరు. అందువల్ల భారతదేశం నుండి బ్రిటిషు వారు నిష్క్రమించడం తోనే, తమకూ సంస్థానాలకూ మధ్య ఉన్న అన్ని ఒప్పందాలతో పాటు సర్వంసహాధికారం (పారామౌంట్సీ) కూడా ముగియాలని బ్రిటిషు ప్రభుత్వం నిర్ణయించింది.

ఏకీకరణకు కారణాలు

భారతదేశ ఏకీకరణ 
గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కథియవార్ ప్రాంతాలు రెండు వందలకు పైగా సంస్థానాలకు నిలయంగా ఉన్నాయి, చాలా బరోడా యొక్క మ్యాప్ చూపినట్లుగా, అనేక ప్రాంతాలు కాని భూభాగాలు ఉన్నాయి.

పారామౌంట్సీని రద్దు చేయడం అంటే, ఒప్పందాల వలన బ్రిటిషు రాచరికానికి లభించిన హక్కులన్నీ సంస్థానాలకు తిరిగి వస్తాయి. తద్వారా భారతదేశం, పాకిస్తాన్ లతో తమ సంబంధాలపై చర్చ చేసేందుకు వాటికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అధికారం బదిలీ కోసం బ్రిటిషు వారు వేసిన తొలి ప్రణాళికల్లో, క్రిప్స్ మిషన్ ఇచ్చిన ఆఫర్ వంటివి, కొన్ని సంస్థానాలు స్వతంత్ర భారతదేశం నుండి విడిగా నిలబడటానికి ఎంచుకునే అవకాశాన్ని గుర్తించాయి. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యం కాదు. సంస్థానాలకు స్వాతంత్ర్యం ఇవ్వడమంటే, భారత చరిత్రను తిరస్కరించడమేనని భావించింది. ఆ పథకాన్ని భారతదేశపు "బాల్కనైజేషన్"గా పరిగణించింది. కాంగ్రెస్ సాంప్రదాయకంగా సంస్థానాల్లో తక్కువ చురుకుగా ఉండేది, ఎందుకంటే వారికి ఆయా సంస్థానాల్లో వనరులు పరిమితంగా ఉండేవి. పైగా వారి దృష్టి ఎక్కువగా బ్రిటిషు వారి నుండి స్వాతంత్ర్యపైనే ఉండేది ప్రగతిశీలంగా ఉండే సంస్థానాధీశుల పట్ల కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మోహన్‌దాస్ గాంధీ, సానుభూతితో ఉండేవారు - భారతీయులు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యానికి వారిని ఉదాహరణలుగా భావించేవారు. భారత ప్రభుత్వ చట్టం 1935 లో ఉన్న సమాఖ్య పథకం వలన, జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్ట్ కాంగ్రెస్ నాయకుల పెరుగుదల వలనా 1930 లలో ఈ అభిప్రాయం మారిపోయింది. సంస్థానాల్లో ప్రజాదరణ పొందిన రాజకీయ కార్మిక కార్యకలాపాలలో కాంగ్రెస్ చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. 1939 నాటికి, కాంగ్రెస్ యొక్క అధికారిక వైఖరి ఏమిటంటే, బ్రిటిషు ఇండియా ప్రావిన్సులకుండే స్వయంప్రతిపత్తితో, అదే నిబంధనలతో సంస్థానాలు కూడా స్వతంత్ర భారతదేశంలోకి ప్రవేశించాలి. వాటి ప్రజలకు కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. తత్ఫలితంగా బ్రిటిషు వారితో చర్చలలో, సంస్థానాలను కూడా భారతదేశంలో చేర్చాలని పట్టుబట్టడానికి కాంగ్రెసు ప్రయత్నించింది. కానీ దీన్ని మంజూరు చేసే అధికారం తమకు లేదని బ్రిటిషు వారు అభిప్రాయపడ్డారు.

కొంతమంది బ్రిటిషు నాయకులు, ముఖ్యంగా భారతదేశపు చివరి బ్రిటిషు వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ కూడా స్వతంత్ర భారతదేశానికి, సంస్థానాలకూ మధ్య సంబంధాలను తెంచడానికి ఇష్టపడలేదు. 19, 20 శతాబ్దాలలో వాణిజ్యం, వ్యాపారం, సమాచార మార్పిడి అభివృద్ధి చెందడంతో సంక్లిష్ట ప్రయోజనాల నెట్‌వర్క్ ద్వారా సంస్థానాలు బ్రిటిషు ఇండియాతో పెనవేసుకుని పోయాయి. రైల్వేలు, కస్టమ్స్, నీటిపారుదల, ఓడరేవుల వాడకం, ఇతర సారూప్య ఒప్పందాలూ ఇకపై రద్దైపోతాయి. ఇది ఉపఖండపు ఆర్థిక జీవితానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో సంస్థానాలను ఏకీకృతం చేయడం, కొంతవరకు విభజన చేసే గాయాలకు ఊరట నిస్తుందని విపి మీనన్ వంటి భారతీయ అధికారుల వాదనతో మౌంట్ బాటన్ అంగీకరించాడు. ఫలితం ఏమిటంటే, కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా, అధికార బదిలీ తరువాత సంస్థానాలను భారత్‌లో చేర్చేందుకు మౌంట్ బాటన్ వ్యక్తిగతంగా అంగీకరించి, దాని కోసం పనిచేసాడు.

చేరికకు అంగీకరించడం

సంస్థానాధీశుల అభిప్రాయం

స్వతంత్ర భారతదేశంలో తమ సంస్థానాలను ఏకీకృతం చేయడంలో సంస్థానాల పాలకులు ఒకేలా ఉత్సాహంగా లేరు. జమ్‌ఖండి రాష్ట్రం మొదట స్వతంత్ర భారత్‌తో కలిసిపోయింది. బికనీర్, జవహర్ పాలకుల వంటి వారు సైద్ధాంతిక పరంగా, దేశభక్తి పరంగా భారతదేశంలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే మరికొందరు భారతదేశంలోనో పాకిస్తాన్లోనో చేరడానికి, లేదా స్వతంత్రంగా ఉండటానికి లేదా తమవంటి వారితో కలిసి యూనియన్‌గా ఏర్పడటానికి తమకు హక్కు ఉందని పట్టుబట్టారు. భోపాల్, ట్రావెన్కోర్, హైదరాబాదులు ఏ డొమినియన్లోనూ చేరాలని భావించడం లేదని ప్రకటించాయి. హైదరాబాద్ అయితే, యూరోపియన్ దేశాలలో వాణిజ్య ప్రతినిధులను నియమించడానికి, రేవు సౌకర్యం కోసం గోవాను లీజుకు ఇవ్వడానికి లేదా కొనడానికి పోర్చుగల్‌తో చర్చలు ప్రారంభించే దాకా వెళ్ళింది. ట్రావెన్కోర్ దాని థోరియం నిల్వల వ్యూహాత్మక ప్రాముఖ్యతను సూచిస్తూ పశ్చిమ దేశాల గుర్తింపు కోరింది. కొన్ని రాష్ట్రాలు భారతదేశం, పాకిస్తాన్లతో పాటు మూడవ సంస్థగా, ఉపఖండ వ్యాప్తంగా సంస్థానాల సమాఖ్యను ప్రతిపాదించాయి. తమపై కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఒత్తిడిని ఎదుర్కోవటానికి గాను, సంస్థానాలకు ముస్లిం లీగ్కూ మధ్య పొత్తు కుదిర్చేందుకు భోపాల్ ప్రయత్నించింది.

మొదట్లో ఎదురైన ఈ ప్రతిఘటన తొందర్లోనే తొలగిపోయింది. దాదాపు అన్ని ముస్లిమేతర ప్రజల మెజారిటీ ఉన్న సంస్థానాలు భారతదేశంలో చేరడానికి అంగీకరించాయి. దీనికి అనేక కారణాలు దోహదపడ్డాయి. ఒక ముఖ్యమైన అంశం సంస్థానాధీశులలో ఐక్యత లేకపోవడం. చిన్న పెద్ద సంస్థానాలు తమ ప్రయోజనాలను కాపాడతాయని చిన్న సంస్థానాలు విశ్వసించలేదు. చాలా మంది హిందూ పాలకులు ముస్లిం సంస్థానాధీశులను విశ్వసించలేదు - ముఖ్యంగా స్వతంత్రత గురించి ప్రవచించిన భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్‌ అని భావించారు. మరికొందరు, సమైక్యత అనివార్యమని నమ్ముతూ, కాంగ్రెస్తో సంబంధాలను నెలకొల్పుకునేందుకు ప్రయత్నించారు. తద్వారా తుది పరిష్కారాన్ని రూపొందించడంలో కొంత ప్రయోజనం పొందాలని ఆశించారు. ఈ అనైక్యత ఫలితంగా ఐక్య ఫ్రంట్‌ను ప్రదర్శించలేకపోవడం లేదా ఉమ్మడి స్థితిని అంగీకరించక పోవడం వలన, కాంగ్రెస్‌తో చర్చలలో వారి బేరసారాల శక్తి గణనీయంగా తగ్గింపోయింది. రాజ్యాంగ సభకు దూరంగా ఉండాలని ముస్లిం లీగ్ తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్‌ను ఎదుర్కోవటానికి లీగ్‌తో ఒక కూటమిని నిర్మించాలనుకున్న సంస్థానాధీశుల ప్రణాళికకు ప్రాణాంతకమైంది. బరోడా, బికనీర్, కొచ్చిన్, గ్వాలియర్, జైపూర్, జోధ్పూర్, పాటియాలా, రేవా సంస్థానాలు 1947 ఏప్రిల్ 28 న రాజ్యాంగ సభలో స్థానాలను దక్కించుకోవడంతో రాజ్యాంగ సభను బహిష్కరించే ప్రయత్నాలు యావత్తూ విఫలమై పోయాయి.

భారతదేశంలో చేరికకు అనుకూలంగా తమ ప్రజల్లో ఉన్న అభిప్రాయం వలన కూడా చాలా మంది సంస్థానాధీశులు ఒత్తిడికి గురయ్యారు. స్వాతంత్ర్యం కోసం తాము వేస్తున్న ప్రణాళికలకు తమ స్వంత ప్రజల నుండి మద్దతు లేదని వారికి అర్థమైంది. ఉదాహరణకు, ట్రావెన్కోర్ మహారాజా, తన దివాన్ సర్ సిపి రామస్వామి అయ్యర్ పై హత్యాయత్నం తరువాత స్వాతంత్ర్యం కోసం తన ప్రణాళికలను వదిలేసుకున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో, భారతదేశంతో చేరికకు అంగీకరించడానికి పాలకులను ఒప్పించడంలో వారి ముఖ్యమంత్రులు లేదా దివాన్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే, భారతదేశంలో సమైక్యతను సంస్థానాలు అంగీకరించడానికి దారితీసిన ముఖ్యమైన అంశాలు - లార్డ్ మౌంట్ బాటన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ ల ప్రయత్నాలు. ముఖ్యంగా తరువాతి ఇద్దరూ హోంమత్రిత్వ శాఖలో రాజకీయ, పరిపాలనాధిపతులు. సంస్థానాలతో సంబంధాలకు బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ ఇదే.

మౌంట్ బాటన్ పాత్ర

భారతదేశ ఏకీకరణ 
ఇండియన్ యూనియన్‌కు అంగీకరించడానికి ఇష్టపడని రాజులను ఒప్పించడంలో లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.

అధికార బదిలీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరపడానికి భారతదేశానికి రాష్ట్రాల ప్రవేశం సురక్షితం అని మౌంట్ బాటన్ అభిప్రాయపడ్డారు. బ్రిటిషు రాజు యొక్క బంధువుగా, అతన్ని చాలా మంది సంస్థానాధీశులు విశ్వసించారు. పైగా అతడు చాలామందికి, ముఖ్యంగా భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్‌కు, వ్యక్తిగతంగా స్నేహితుడు. ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పటేల్‌లు, భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్‌గా ఉండమని మౌంట్‌బాటెన్‌ను కోరారు కాబట్టి, ఒప్పందం లోని నిబంధనలకు స్వతంత్ర భారతదేశం కట్టుబడి ఉండేలా చూడగల స్థితిలో అతను ఉంటాడని సంస్థానాధీశులు విశ్వసించారు.

మౌంట్ బాటన్ సంస్థానాధీశుల వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వారిని విలీనం వైపు నెట్టాడు. బ్రిటిషు ప్రభుత్వం ఏ సంస్థానాలకు డొమినియన్ హోదా ఇవ్వదని, వాటిని బ్రిటిషు కామన్వెల్త్‌లోకి తీసుకోదనీ ఆయన ప్రకటించాడు. దీని అర్థం సంస్థానాలు భారతదేశంలో గాని, పాకిస్తాన్‌లో గానీ చేరకపోతే బ్రిటిషు రాచరికంతో వాటి సంబంధాలు తెగిపోతాయి. భారత ఉపఖండం ఒక ఆర్థిక వ్యవస్థ అని, ఈ లింకు తెగిపోతే ఎక్కువగా నష్టపోయేది సంస్థానాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. మత హింస పెరగడం, కమ్యూనిస్టు ఉద్యమాలు వంటి చిక్కులున్న నేపథ్యంలో సంస్థానాధీశులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అతడు ఎత్తి చూపాడు.

మౌంట్ బాటెన్ 1948 వరకు భారత దేశాధినేతగా పనిచేస్తున్నందున, తాను యువరాజుల నిబద్ధతకు ధర్మకర్తగా వ్యవహరిస్తానని నొక్కి చెప్పాడు. భోపాల్ నవాబు వంటి అయిష్టంగా ఉన్న యువరాజులతో అతను వ్యక్తిగత సంభాషణలో నిమగ్నమయ్యాడు. భోపాల్ ను భారతదేశంలో భాగంగా చేసుకునే ప్రకటనపై సంతకం చేయమని రహస్య లేఖ ద్వారా కోరాడు. ఆ ప్రకటనను మౌంట్ బాటన్ తన వద్దనే సురక్షితంగా తాళం వేసి ఉంచుతాడు. ఆగస్టు 15 న అతడు దాన్ని స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తాడు - అప్పటికి నవాబు తన మనసు మార్చుకోకపోతే. నవాబు అంగీకరించాడు, సంతకం పెట్టాడు, ఈ ఒప్పందం నుండి తప్పుకోలేదుకూడా.

ఆ సమయంలో, చాలా మంది యువరాజులు, మిత్రపక్షమైన బ్రిటన్ తమను మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. మౌంట్ బాటన్ విధానాలను నిరసిస్తూ సర్ కాన్రాడ్ కార్ఫీల్డ్ రాజకీయ శాఖ అధిపతి పదవికి రాజీనామా చేశారు. మౌంట్ బాటన్ విధానాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కూడా విమర్శించింది. విన్స్టన్ చర్చిల్, ఆస్ట్రియాను ఆక్రమించుకునే ముందు అడాల్ఫ్ హిట్లర్ ఉపయోగించిన భాషతో భారత ప్రభుత్వం ఉపయోగించిన భాషను పోల్చాడు. అయితే, లంబీ, మూర్ వంటి ఆధునిక చరిత్రకారులు, భారతదేశంలో విలీనమయ్యేందుకు సంస్థానాలను అంగీకరింపజేయడంలో మౌంట్ బాటన్ కీలక పాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు.

ఒత్తిడి, దౌత్యం

భారతదేశ ఏకీకరణ 
స్వదేశీ, రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా వల్లాభాభాయ్ పటేల్ బ్రిటిషు ఇండియన్, ప్రావిన్సులు, సంస్థానాలను ఐక్య భారతదేశంగా కలిపేసే బాధ్యత ఉన్న వ్యక్తిఉ

భారతదేశంలో విలీనమయ్యేందుకు యువరాజుల నిర్ణయానికి దారితీసిన అత్యంత ముఖ్యమైన అంశం కాంగ్రెస్ విధానం, మరీ ముఖ్యంగా పటేల్, మీనన్‌ల విధానం. సంస్థానాలు సార్వభౌమిక రాజ్యాలు కావు, పారామౌంట్సీ ముగిసాక, ఇక అవి స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు అనేది కాంగ్రెస్ అభిప్రాయం. అందువల్ల సంస్థానాలు భారతదేశం లోనో పాకిస్తాన్‌ లోనో చేరాలి. 1946 జూలైలో నెహ్రూ, స్వతంత్ర భారత సైన్యానికి వ్యతిరేకంగా ఏ రాచరిక రాజ్యం సైనికపరంగా నిలబడలేదని చెప్పాడు. రాజుల దైవిక హక్కును స్వతంత్ర భారతదేశం అంగీకరించదని ఆయన 1947 జనవరిలో అన్నాడు. 1947 మే లో, రాజ్యాంగ సభలో చేరడానికి నిరాకరించిన ఏ రాచరిక రాజ్యాన్నైనా శత్రు రాజ్యంగా పరిగణిస్తామని ఆయన ప్రకటించాడు. సి. రాజగోపాలాచారి వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు, పారామౌంట్సీ "ఒక వాస్తవంలా వచ్చింది, ఒప్పందం ద్వారా కాదు" అని వాదిస్తూ, ఇది బ్రిటిషు వారసుడిగా స్వతంత్ర భారత ప్రభుత్వానికి చెందుతుంది.

సంస్థానాధీశులతో చర్చలు జరిపే బాధ్యతలు ఉన్న పటేల్, మీనన్‌లు, నెహ్రూ కంటే మృదువైన ధోరణిని అవలంబించారు. 1947 జూలై 5 న పటేల్ చేసిన భారత ప్రభుత్వ అధికారిక విధాన ప్రకటన ఎటువంటి బెదిరింపులు చేయలేదు. బదులుగా, ఇది భారతదేశ ఐక్యతను పునరుద్ఘాటించింది. సంస్థానాధీశుల స్వతంత్ర భారతదేశ ఉమ్మడి ప్రయోజనాలను నొక్కి చెప్పింది. కాంగ్రెస్ ఉద్దేశాల గురించి వారికి భరోసా ఇచ్చింది. స్వతంత్ర భారతదేశంలో చేరమని వారిని ఆహ్వానించింది. "విడివిడిగా ఉండి ఒప్పందాలు చేసుకోవడం కంటే, స్నేహితుల్లాగా కలిసి కూర్చుని చట్టాలు చేసుకుందాం రమ్మ"ని వారిని ఆహ్వానించింది. సంస్థానాలపై ఆధిపత్య సంబంధాన్ని నెలకొల్పడానికి రాష్ట్రాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించదని ఆయన పునరుద్ఘాటించాడు. బ్రిటిషు ప్రభుత్వ రాజకీయ విభాగం లాగా, ఇది పారామౌంట్సీ చేతిలో పనిముట్టు కాదు, సంస్థానాలకు భారతదేశానికీ మధ్య వ్యవహారాన్ని సమాన స్థాయిలో నిర్వహించే మాధ్యమం.

చేరిక ఒప్పందాలు

పటేల్, మీనన్‌లు తమ దౌత్య ప్రయత్నాలకు తోడు, సంస్థానాల పాలకులకు ఆకర్షణీయంగా ఉండేలా ఒప్పందాలను రూపొందించారు. రెండు కీలక పత్రాలను తయారు చేసారు. మొదటిది యథాతథ స్థితి ఒప్పందం (స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్), ఇది ముందే ఉనికిలో ఉన్న ఒప్పందాలు, పరిపాలనా పద్ధతులను కొనసాగించాలని నిర్ధారించింది. రెండవది, చేరిక ఒప్పంద పత్రం (ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్), సంస్థాన పాలకుడు తన రాజ్యాన్ని స్వతంత్ర భారతదేశంలో కలపడానికి అంగీకరించే పత్రమిది. దాంతో, ఆ సంస్థానానికి సంబంధించి, ఆ పత్రంలో ఉన్న అంశాలపై భారత దేశానికి నియంతరణ వస్తుంది. విలీనమౌతున్న సంస్థానాన్ని బట్టి, పత్రంలో ఉన్న విషయాల స్వభావం మారుతూ ఉంటుంది. బ్రిటిషు వారి కింద ఉండగా అంతర్గత స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు, భారత ప్రభుత్వానికి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు - ఈ మూడు విషయాలపై మాత్రమే నియంత్రణ ఇచ్చే పత్రంపై సంతకం చేశాయి. వీటిని భారత ప్రభుత్వ చట్టం 1935 లోని షెడ్యూల్ VII లో ఉన్న జాబితా 1 ప్రకారం నిర్వచించారు. బ్రిటిషు రాచరికానికి గణనీయమైన పరిపాలనా అధికారాలు ఉన్న సంస్థానాలు - అంటే దాని ఎస్టేట్స్ లేదా తాలూకాలు - వేరే విధమైన పత్రంపై సంతకం చేశాయి. అవి తమకున్న అన్ని అవశేష అధికారాలను, అధికార పరిధినీ ఇది భారత ప్రభుత్వానికి కట్టబెట్టాయి. మధ్యస్థాయి హోదా కలిగిన సంస్థానాల పాలకులు మూడవ రకం పత్రంపై సంతకం చేశాయి.

చేరిక ఒప్పంద పత్రాలు అనేక ఇతర రక్షణలను అమలు చేసాయి. 7 వ నిబంధన ప్రకారం, సంస్థానాలు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండవు. నిబంధన 8 భారత ప్రభుత్వానికి లోబడని అన్ని రంగాల విషయంలో వారికి స్వయంప్రతిపత్తి హామీ ఇచ్చింది. దీనికి తోడుగా అనేక వాగ్దానాలు చేసారు. చేరికకు అంగీకరించిన పాలకులు తమ ప్రాదేశికేతర హక్కులు, భారతీయ న్యాయస్థానాలలో ప్రాసిక్యూషన్ నుండి నిరోధకత, కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు వంటివి కొనసాగుతాయని, తమ సంస్థానాల్లో నెమ్మదిగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయవచ్చని, పద్దెనిమిది ప్రధాన రాష్ట్రాలలో దేన్లోనూ విలీనం కమ్మని బలవంతం చేయరని, బ్రిటిషు గౌరవాలకు అలంకరణలకూ అర్హులనీ ఒప్పుకున్నారు. చర్చలలో, లార్డ్ మౌంట్ బాటన్ పటేల్, మీనన్‌ల ప్రకటనలను పునరుద్ఘాటించాడు. పత్రాలు యువరాజులకు అవసరమైన "ఆచరణాత్మక స్వాతంత్ర్యాన్ని" ఇచ్చాయని నొక్కిచెప్పాడు. మౌంట్ బాటెన్, పటేల్, మీనన్ లు యువరాజులకు ఇచ్చిన నిబంధనలను ఇప్పుడు అంగీకరించకపోతే, తరువాత మరింత క్లిష్టమైన నిబంధనలను అంగీకరించాల్సి వస్తుందని చెప్పారు. స్టాండ్‌స్టిల్ ఒప్పందాన్ని ఒక చర్చల సాధనంగా కూడా ఉపయోగించుకున్నారు. చేరిక ఒప్పంద పత్రంపై సంతకం చేయని సంస్థానాలతో స్టాండ్‌స్టిల్ ఒప్పందంపై సంతకం చేసే ప్రశ్నే లేదని హో మంత్రిత్వ శాఖ తెగేసి చెప్పేసింది.

చేరిక ప్రక్రియ

చేరిక ఒప్పందాలకున్న పరిమితమైన పరిధి, విస్తృత స్వయంప్రతిపత్తి ఇస్తామని భారత ప్రభుత్వం చేసిన వాగ్దానం, అది ఇచ్చిన ఇతర హామీలతో చాలా మంది పాలకులకు తగినంత సౌకర్యంగా ఉన్నారు. ఇంతకంటే మంచి ఒప్పందం తమకు దొరకదని వాళ్లు భావించారు. తమకు బ్రిటిషు వారి మద్దతు ఎలాగూ లేదు, ప్రజల నుండేమో చేరిక కోసం ఒత్తిళ్ళు ఉన్నాయి. 1947 మే కు, అధికార బదిలీ జరిగిన 1947 ఆగస్టు 15 కూ మధ్య, మెజారిటీ సంస్థానాలు చేరిక ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. అయితే, కొన్ని మాత్రం చెయ్యలేదు. కొందరు సంతకం చేయడంలో ఆలస్యం చేశారు. మధ్య భారతదేశంలో పిప్లోడా అనే చిన్న సంస్థానం 1948 మార్చి వరకు అంగీకరించలేదు. అయితే, అన్నిటి కంటే పెద్ద సమస్య మాత్రం, కొన్ని సరిహద్దు రాష్ట్రాలతో వచ్చింది. జోధ్పూర్ మరింత మంచి ఒప్పందం కోసం పాకిస్థాన్‌తో బేరాలు పెట్టింది. జూనాగఢ్ నిజానికి పాకిస్తాన్‌తో విలీనమైంది. హైదరాబాద్, కాశ్మీర్‌లు స్వతంత్ర ఉంటామని ప్రకటించాయి.

సరిహద్దు రాజ్యాలు

జోధ్పూర్ పాలకుడు హన్వంత్ సింగ్‌కు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. భారతదేశంలో తనకూ తన జీవనశైలికీ పెద్దగా భవిష్యత్తు ఉన్నట్లు కనిపించలేదు. జైసల్మేర్ పాలకుడితో కలిసి, పాకిస్తాన్ దేశాధినేత అయిన మహ్మద్ అలీ జిన్నాతో చర్చలు జరిపాడు. కొన్ని పెద్ద సరిహద్దు రాష్ట్రాలను ఆకర్షించడానికి జిన్నా ఆసక్తి కనబరిచాడు. తద్వారా ఇతర రాజ్‌పుత్ రాష్ట్రాలను పాకిస్తాన్‌కు ఆకర్షించవచ్చనీ బెంగాల్, పంజాబ్‌ లలో సగం కోల్పోయినందుకు అది పరిహార మౌతుందనీ అతడు ఆశించాడు. జోధ్పూర్, జైసల్మేర్లను వారు ఎంచుకున్న ఏ నిబంధనల పైనైనా పాకిస్తాన్‌లో చేర్చుకోడానికి అతను అంగీకరించాడు. వారికి ఖాళీ కాగితాలను ఇచ్చి, వారి కిష్టమైన నిబంధనలను రాసుకొమ్మనీ, తాను సంతకం చేస్తాననీ చెప్పాడు. జైసల్మేర్ పాలకుడు నిరాకరించాడు. మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు మద్దతుగా ఉండటం తనకు కష్టమని వాదించాడు. హన్వంత్ సింగ్ సంతకం చేసేదాకా వెళ్ళాడు. అయితే, జోధ్పూర్‌లో వాతావరణం పాకిస్తాన్‌లో చేరికకు ప్రతికూలంగా ఉంది. హిందూ మెజారిటీ రాజ్యాన్ని పాకిస్తాన్‌లో చేర్చడం, దేశ విభజన ఆధారపడిన రెండు దేశాల సిద్ధాంత సూత్రాన్నే ఉల్లంఘిస్తుందని, రాష్ట్రంలో మత హింసకు అవకాశం ఉందని మౌంట్ బాటన్ అభిప్రాయపడ్డాడు. ఈ వాదనలతో హన్వంత్ సింగ్ మెత్తబడ్డాడు. కొంత అయిష్టంగానే భారతదేశంలో చేరడానికి అంగీకరించాడు.

జూనాగఢ్

సిద్ధాంతపరంగా భారతదేశం పాకిస్తాన్‌లలో ఎందులో విలీనమవ్వాలో ఎంచుకునే స్వేచ్ఛ సంస్థానాలకు ఉన్నప్పటికీ, "భౌగోళిక అత్యావశ్యకతలు" అంటే చాలా మంది భారతదేశాన్నే ఎన్నుకోవాలి అని మౌంట్ బాటన్ ఎత్తి చూపాడు. మొత్తమ్మీద, పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకున్న సంస్థానాలకు మాత్రమే పాకిస్తాన్‌ను ఎంచుకునే అవకాశముంటుంది.

గుజరాత్కు నైరుతి చివరన ఉన్న జూనాగఢ్‌కు పాకిస్తాన్తో సరిహద్దు లేదు. దాని నవాబు మౌంట్ బాటన్ అభిప్రాయాలను విస్మరించి పాకిస్తాన్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్తాన్ నుండి సముద్రం ద్వారా తమను చేరుకోవచ్చని అతడు వాదించాడు. జూనాగఢ్‌కు సామంతులుగా ఉన్న రెండు రాజ్యాలలో పాలకులు మంగ్రోల్, బాబ్రివాడ్ లు జూనాగఢ్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్, భారత్‌లో విలీనమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా జూనాగఢ్ నవాబు ఆ రెండు సంస్థానాలను ఆక్రమించాడు. పొరుగు సంస్థానాల పాలకులు కోపంగా స్పందించి, తమ దళాలను జూనాగఢ్ సరిహద్దుకు పంపించి, సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమల్దాస్ గాంధీ నేతృత్వంలోని జూనాగఢ్ ప్రజల బృందం ఆర్జీ హుకుమత్ ("తాత్కాలిక ప్రభుత్వం") అనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

జూనాగఢ్‌ను పాకిస్తాన్ వెళ్ళడానికి అనుమతిస్తే, గుజరాత్లో ఇప్పటికే ఉధృతంగా ఉన్న మత ఉద్రిక్తత మరింత తీవ్రమవుతుందని భావించి, ఆ సంస్థానం పాకిస్తాన్‌లో విలీనమవడాన్ని అంగీకరించమనై చెప్పేసింది. సంస్థానంలో 80% హిందువులేనని, విలీనాన్ని నిర్ణయించడానికి ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అదే సమయంలో, వారు జూనాగఢ్‌కు ఇంధనం, బొగ్గు సరఫరాను నిలిపివేశారు. వైమానిక, తపాలా సంబంధాలను తెంచుకున్నారు. సరిహద్దుకు దళాలను పంపారు. భారతదేశంలో చేరిన మాంగ్రోల్, బాబారియావాడ్ లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భారత దళాలు వెనక్కి వెళ్తే, ప్రజాభిప్రాయ సేకరణను చర్చిస్తామని పాకిస్తాన్ అంగీకరించింది. కానీ, భారత్ ఈ షరతును తిరస్కరించింది. అక్టోబరు 26 న, నవాబు, అతని కుటుంబం భారత దళాలతో ఘర్షణల తరువాత పాకిస్తాన్ పారిపోయారు. నవంబరు 7 న, కూలిపోతున్న జూనాగఢ్ దర్బారు, సంస్థాన పరిపాలనను చేపట్టమని భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 1948 ఫిబ్రవరిలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పజలు భారతదేశంలో చేరడానికి అనుకూలంగా దాదాపు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.

జమ్మూ కాశ్మీర్

భారతదేశ ఏకీకరణ 
పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న కాశ్మీరీ ప్రాంతం ఆకుపచ్చ రంగులో చూపబడింది. ముదురు-గోధుమ ప్రాంతం భారత-పరిపాలన జమ్మూ కాశ్మీర్‌ను సూచిస్తుంది, అక్సాయ్ చిన్ చైనా పరిపాలనలో ఉంది.

అధికార బదిలీ సమయంలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ("కాశ్మీర్" అని పిలుస్తారు) మహారాజా హరి సింగ్ అనే హిందువు పాలించేవాడు. అయితే, రాష్ట్రంలో ముస్లిం మెజారిటీ ఉంది. హరి సింగ్ భారతదేశానికి లేదా పాకిస్తాన్‌లో చేరడానికి సమానంగా సంశయించాడు. ఎందుకంటే తన రాజ్యంలోని కొన్ని భాగాలలో అది ప్రతికూల ప్రతిచర్యలకు దారితీస్తుంది. అతను పాకిస్తాన్‌తో స్టాండ్‌స్టిల్ ఒప్పందంపై సంతకం చేశాడు. భారత్‌తో కూడా చేసుకుంటానని ప్రతిపాదించాడు. కాని కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించినట్లు ప్రకటించాడు. అయితే, అతని పాలనను కాశ్మీర్ లోని అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా వ్యతిరేకించాడు.

పాకిస్తాన్, కాశ్మీర్ విలీనాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తూ, సరఫరాలు, రవాణా సంబంధాలను కత్తిరించింది. విభజన ఫలితంగా పంజాబ్‌లో ఏర్పడిన కల్లోలం వలన భారత్‌తో కూడా రవాణా సంబంధాలు తెగిపోయాయి. అంటే ఇపుడు రెండు దేశాలతో కాశ్మీర్‌కు ఉన్న సంబంధాలు వాయుమార్గం ద్వారా మాత్రమే. మహారాజా దళాలు పూంచ్ ముస్లిం జనాభాపై చేసిన దారుణాల గురించిన పుకార్లు పౌర అశాంతికి కారణమయ్యాయి. కొంతకాలం తర్వాత, పాకిస్తాన్ యొక్క నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుండి పఠాన్ గిరిజనులు సరిహద్దు దాటి కాశ్మీర్లోకి ప్రవేశించారు. ఆక్రమణదారులు శ్రీనగర్ వైపు వేగంగా పురోగమించారు. కాశ్మీర్ మహారాజా సైనిక సహాయం కోరుతూ భారతదేశానికి లేఖ రాశాడు. ఒక చేరిక ఒప్పంద పత్రంపై సంతకం చేయడం, షేక్ అబ్దుల్లా నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే రెండు షరతులు భారతదేశం పెట్టింది. మహారాజా అంగీకరించాడు. కానీ నెహ్రూ ఒక ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ధ్రువీకరించాలని ప్రకటించాడు. అయితే, అటువంటి ధ్రువీకరణ కోసం చట్టపరమైన అవసరం లేదు.

మొదటి కాశ్మీర్ యుద్ధంలో భారత దళాలు జమ్మూ, శ్రీనగర్ లోయలను దక్కించుకున్నాయి. కాని శీతాకాలపు ప్రారంభంతో పోరాట తీవ్రత తగ్గింది. ప్రధానమంత్రి నెహ్రూ, వివాదం అంతర్జాతీయ దృష్టికి వచ్చిందని గుర్తించి, కాల్పుల విరమణ ప్రకటించాడు.ఐరాస మధ్యవర్తిత్వాన్ని కోరాడు. గిరిజన దండయాత్రలను ఆపకపోతే, భారతదేశం పాకిస్తాన్ పై దండయాత్ర చేయవలసి ఉంటుందని వాదించాడు. ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు. 1950 జనవరి 26 న, భారత రాజ్యాంగం కాశ్మీర్‌లో అమల్లోకి వచ్చింది, రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక నిబంధనలతో . అయితే, కాశ్మీర్ మొత్తంపై భారతదేశం పరిపాలనా నియంత్రణ పొందలేదు. కాశ్మీర్ యొక్క ఉత్తర, పశ్చిమ భాగాలు 1947 లో పాకిస్తాన్ నియంత్రణలోకి వచ్చాయి. అదే నేడు పాకిస్తాన్ ఆక్రమితకాశ్మీర్. 1962 చైనా-ఇండియా యుద్ధంలో, లడఖ్ సరిహద్దులో ఉన్న ఈశాన్య ప్రాంతమైన అక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించింది. ఇది ఇంకా చైనా నియంత్రణ లోనే ఉంది.

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ద్వారా రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారు.

హైదరాబాద్

భారతదేశ ఏకీకరణ 
1909 లో హైదరాబాద్ రాష్ట్రం . దాని పూర్వ భూభాగాలు నేటి భారత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో కలిసాయి.
భారతదేశ ఏకీకరణ 
మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ (కుడివైపు) తన హైదరాబాద్ స్టేట్ ఫోర్సెస్‌తో సహ, మేజర్ జనరల్ (తరువాత జనరల్, ఆర్మీ చీఫ్ ) జయాంతో నాథ్ చౌదరికి సికింద్రాబాద్ వద్ద లొంగిపోయాడు.

ఆగ్నేయ భారతదేశంలో 82,000 చదరపు మైళ్ళు (212,000 చదరపు కిలోమీటర్లకు పైగా) విస్తరించి ఉన్న భూభాగం హైదరాబాద్. దాని 1.7 కోట్ల జనాభాలో 87% హిందువులు కాగా, దాని పాలకుడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం. దాని రాజకీయాలలో ముస్లిం ఉన్నతవర్గం ఆధిపత్యం చెలాయించింది. ముస్లిం ప్రభువులు, నిజాం అనుకూల ముస్లిం పార్టీ ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్, హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలనీ, భారత పాకిస్తాన్లకు సమాన దూరంలో నిలవాలనీ పట్టుబట్టారు. దీని ప్రకారం 1947 జూన్ లో నిజాం, అధికారం బదిలీ జరిగాక, తన రాజ్యం స్వాతంత్ర్యం పొందుతుందని ఒక రాజాజ్ఞ జారీ చేసాడు. భారత ప్రభుత్వం ఆ ఫర్మాన్‌ను తిరస్కరించింది. దీనిని "దావా చట్టబద్ధం ప్రామాణికత అనుమానాస్పదం" అని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కమ్యూనికేషన్ యొక్క ప్రధాన మార్గాల్లోకి వెళ్ళే హైదరాబాద్ యొక్క వ్యూహాత్మక స్థానం వల్ల, భారతదేశాన్ని బెదిరించడానికి "విదేశీ శక్తులకు" సులభంగా ఉపయోగపడుతుందని, పర్యవసానంగా, ఈ సమస్య జాతీయ-భద్రతా సమస్యలను కలిగి ఉందని భారత్‌ వాదించింది. రాష్ట్ర ప్రజలు, చరిత్ర, స్థానం దీనిని నిస్సందేహంగా భారతీయ ప్రాంతంగా చేశాయనీ దాని స్వంత "సాధారణ ప్రయోజనాల" రీత్యా కూడా భారతదేశంలో దాని ఏకీకరణ తప్పనిసరి అని కూడా చెప్పింది.

భారత, పాకిస్తాన్ల మధ్య వివాదం సంభవించినప్పుడు హైదరాబాద్ తటస్థతకు హామీ ఇచ్చే నిబంధన వంటి ప్రామాణిక చేరిక ఒప్పంద పత్రంలో లేని వాటితో కూడిన పరిమిత ఒప్పందం కుదుర్చుకోవడానికి నిజాం సిద్ధపడ్డాడు. ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి రాయితీలను కోరుతాయని భారత్ వాదించింది. హైదరాబాద్ భారతదేశంలో చేరడానికి ఇంకా అంగీకరించనప్పటికీ, స్టాప్‌గాప్ చర్యగా తాత్కాలిక స్టాండ్‌స్టిల్ ఒప్పందం సంతకం చేసారు. అయితే, 1947 డిసెంబరు నాటికి హైదరాబాద్, ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించగా, భారత్ తన రాష్ట్రాన్ని దిగ్బంధిస్తోందని నిజాం ఆరోపించాడు. భారత్ దాన్ని ఖండించింది.

కమ్యూనిస్టుల నేతృత్వంలోని తెలంగాణ తిరుగుబాటు కూడా నిజాంను చుట్టుముట్టింది. ఇది 1946 లో భూస్వామ్య అంశాలకు వ్యతిరేకంగా రైతు తిరుగుబాటుగా ప్రారంభమైంది; నిజాం దానిని లొంగదీసుకోలేకపోయాడు. 1948 లో పరిస్థితి మరింత దిగజారింది.ఇత్తెహాద్ -ఉల్-ముస్లిమీన్‌కు అనుబంధంగా కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన రజాకార్లు, హిందూ ప్రజల తిరుగుబాట్లకు వ్యతిరేకంగా ముస్లిం మతానికి చెందిన పాలక వర్గానికి మద్దతుగా నిలిచింది. దాని కార్యకలాపాలు తీవ్రమై, గ్రామాలను భయపెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆందోళనను ప్రారంభించింది. కమ్యూనిస్టు గ్రూపులు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. వీళ్ళు మొదత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి, కానీ ఇప్పుడు ఎదురు తిరిగి కాంగ్రెస్ గ్రూపులపై దాడి చేయడం ప్రారంభించాయి. చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనటానికి మౌంట్ బాటన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆగస్టులో, నిజాం, తనపై దండయాత్ర జరుగుతుందని భయపడుతున్నానని పేర్కొంటూ, UN భద్రతా మండలిని, అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ సంప్రదించడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్ స్వాతంత్ర్యాన్ని కొనసాగించడానికి అనుమతిస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, అప్పుడు హిందువులు, ముస్లింలు ఇద్దరూ తమ రాజ్యంలో భద్రంగా ఉండరని పటేల్ పట్టుబట్టాడు.

1948 సెప్టెంబరు 13 న, భారత సైన్యాన్ని ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాదులోకి పంపారు. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి దక్షిణ భారతదేశ శాంతికి ముప్పు తెచ్చిపెట్టింది . దళాలు రజాకర్ల నుండి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. సెప్టెంబరు 13, 18 మధ్య రాష్ట్రంపై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ఆపరేషన్ భారీ మత హింసకు దారితీసింది. 27,000-40,000 వరకూ మరణించారని అధికారిక లెక్కలు చెప్పగా, ఈ సంఖ్య 200,000 పైబడి ఉంటుందని కొందరు పండితుల అంచనాలున్నాయి. మిగతా సంస్థానాధీశుల లాగానే నిజాంను కూడా దేశాధినేతగా ఉంచారు. అతను ఐరాసకు ఇచ్చిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నాడు. పాకిస్తాన్ నుండి ఇతర దేశాల నుండి తీవ్ర విమర్శలు ఎదురైనా, భద్రతా మండలి ఈ వ్యవహారంతో మరింత వ్యవహరించలేదు. హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోయింది. 

ఏకీకరణ పూర్తి

భారతదేశ ఏకీకరణ 
ఆధునిక ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో భాగమైన సెంట్రల్ ప్రావిన్స్, బెరార్
భారతదేశ ఏకీకరణ 
బ్రిటిషు పాలిత మద్రాస్ ప్రావిన్స్, దాని ప్రక్కనే ఉన్న సంస్థానాలు
భారతదేశ ఏకీకరణ 
మద్రాస్ ప్రెసిడెన్సీని విభజించి పొరుగున ఉన్న సంస్థానాలతో విలీనం చేసి కేరళ, తమిళనాడు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్లను ఏర్పాటు చేసారు

ఒప్పందం లోని అంశాలు పరిమితంగా ఉన్నాయి. కేవలం మూడు విషయాల నియంత్రణనే భారతదేశానికి బదిలీ చేశారు. వివిధ రాష్ట్రాలలో పరిపాలన, పాలనలో గణనీయమైన తేడాల వలన వదులుగా ఉండే సమాఖ్యను సృష్టించి ఉండేవి. దీనికి విరుద్ధంగా, పూర్తి రాజకీయ సమైక్యత అయితే, వివిధ రాష్ట్రాల్లోని నాయకులు "వారి విధేయత, అంచనాలు రాజకీయ కార్యకలాపాలను కొత్త అధికర కేంద్రం వైపు", అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైపు మార్చడానికి ఒప్పించాల్సి వచ్చేది. ఇది అంత తేలికైన పని కాదు. మైసూరు వంటి కొన్ని సంస్థానాలు శాసనసభ పాలనా వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ప్రజలకు వోటు హక్కులూ ఉన్నాయి. బ్రిటిషు ఇండియా కంటే అవి భిన్నంగా ఏమీ లేవు. మరికొన్నింటిలో, రాజకీయ నిర్ణయాలు చిన్న, పరిమిత కులీన వర్గాలలోనే జరిగాయి. సంస్థానాలను విలీనం చేసుకున్న తరువాత భారత ప్రభుత్వం, 1948, 1950 ల మధ్య సంస్థానాలు, పూర్వ బ్రిటిషు ప్రావిన్సులను ఒకే రిపబ్లికన్ రాజ్యాంగం కింద ఒకే దేశంగా వెల్డింగ్ చేసే పనికి దిగింది.

సత్వర ఏకీకరణ

ఈ ప్రక్రియలో మొదటి దశ, 1947, 1949 మధ్యకాలంలో జరిగింది. ద్వంతంగా ఒక పాలనా ప్రాంతంగా మనలేవని తాను భావించిన చిన్న చిన్న సంస్థానాలను పొరుగు ప్రావిన్సులలో కలిపెయ్యడం గానీ, ఇతర సంస్థానాలతో కలిసి "సంస్థాన యూనియన్"గా ఏర్పాటు చేయడం గానీ చెయ్యాలని భారత్ సంకల్పించింది. ఈ విధానం వివాదాస్పదమైంది. ఎందుకంటే చేరిక ఒప్పందం ద్వారా ఈ సంస్థానాలకు హామీలిచ్చి ఇంకా ఎన్నాళ్ళో కాలేదు. ఏకీకరణ చెయ్యకపోతే, ఈ సంస్థానాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయని, అక్కడి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అందించలేకపోతే, సక్రమంగా పరిపాలించలేకపోతే అరాచకం తలెత్తుతుందనీ పటేల్, మీనన్ లు నొక్కి చెప్పారు. చిన్న రాష్ట్రాలు చాలా చిన్నవనీ వాటి ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టడానికి పెరుగుతున్న జనాభాకు మద్దతు ఇవ్వడానికీ వనరులు సరిపోవనీ వారు ఎత్తి చూపారు. చాలామంది స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగించే పన్ను నియమాలు ఇతర ఆంక్షలను విధించారు. ఐక్య భారతదేశంలో వాటిని కూల్చివేయవలసి వచ్చింది.

చేరే సమయంలో మౌంట్ బాటెన్ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తున్నందున, ప్రారంభంలో పటేల్, నెహ్రూలు గవర్నర్ జనరల్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండాలని అనుకున్నారు. అయితే, 1947 చివరలో ఒరిస్సాలో ఒక ఆదివాసీ తిరుగుబాటు వలన వారు ఈ పనిని ముందే చెయ్యక తప్పలేదు. 1947 డిసెంబరు లో, ఈస్టర్న్ ఇండియా ఏజెన్సీ, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీకి చెందిన యువరాజులను మీనన్‌తో రాత్రంతా సమావేశమయ్యారు. అక్కడ వారి సంస్థానాలను ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్స్, బీహార్‌లలో కలిపే విలీన ఒప్పందాలపై (మెర్జర్ అగ్రిమెంట్) సంతకం చేయమని వారిచేత ఒప్పించారు. 1948 జనవరి 1 న అది అమలులోకి వచ్చింది. ఆ సంవత్సరం తరువాత, గుజరాత్, దక్కన్లలోని 66 సంస్థానాలను బొంబాయిలో విలీనం చేసారు. వీటిలో పెద్ద రాష్ట్రాలు కొల్హాపూర్, బరోడాలు ఉన్నాయి. ఇతర చిన్న రాష్ట్రాలను మద్రాస్, తూర్పు పంజాబ్, పశ్చిమ బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాంలలో విలీనం చేశారు. విలీన ఒప్పందాలపై సంతకం చేసిన రాష్ట్రాలన్నీ ప్రావిన్స్‌లలో విలీనం కాలేదు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న విలీన ఒప్పందాలపై సంతకం చేసిన మాజీ పంజాబ్ హిల్ స్టేట్స్ ఏజెన్సీకి చెందిన ముప్పై రాష్ట్రాలను కలిపి హిమాచల్ ప్రదేశ్‌ ఏర్పాటు చేసారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం దీన్ని నేరుగా చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా నిర్వహించింది.

విలీన ఒప్పందాల్లో భాగంగా పాలకులు తమ రాష్ట్రం యొక్క "పూర్తి ప్రత్యేకమైన అధికార పరిధినీ అధికారాలనూ" డొమినియన్ ఆఫ్ ఇండియాకు అప్పగించవలసి ఉంది. వారి రాష్ట్రాలను పూర్తిగా విడిచిపెట్టడానికి వారు చేసిన ఒప్పందానికి ప్రతిఫలంగా, భారత ప్రభుత్వం యువరాజులకు పెద్ద సంఖ్యలో హామీలను ఇచ్చింది. యువరాజులు తమ అధికారాలను అప్పగించినందుకూ, వారి రాష్ట్రాల రద్దుకూ పరిహారంగా ప్రీవీ పర్స్ రూపంలో భారత ప్రభుత్వం నుండి వార్షిక చెల్లింపును అందుకుంటారు. రాష్ట్ర ఆస్తి స్వాధీనం చేసుకోగా, వారి వ్యక్తిగత ఆస్తి అన్ని వ్యక్తిగత హక్కులు, గౌరవాలు బిరుదులనూ రక్షిస్తుంది. ఆచారం ప్రకారం వచ్చే వారసత్వానికి కూడా హామీ ఇచ్చింది. అదనంగా, సంస్థానాల సిబ్బందిని ప్రాంతీయ పరిపాలన లోకి సమాన వేతనం, హోదా ఇచ్చే హామీలతో తీసుకుంటారు.

విలీన ఒప్పందాలు ప్రధానంగా చిన్న, ఒంటరిగా నిలబడలేని రాష్ట్రాల కోసం ఉద్దేశించినవి అయినప్పటికీ, కొన్ని పెద్ద రాష్ట్రాలకు కూడా వర్తింపజేసారు. పశ్చిమ భారతదేశంలో కచ్, ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, మణిపూర్, - ఇవన్నీ అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉన్నాయి - పెద్ద రాష్ట్రాలే అయినప్పటికీ విలీన ఒప్పందాలపై సంతకం చేయించారు. తరువాత అవి చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులుగా మారాయి. తన పరిపాలన యొక్క సమర్థత గురించి గర్వంగా ఉన్న భోపాల్ నవాబు, దాని పొరుగు దేశమైన మరాఠా రాష్ట్రాలతో విలీనం అయినట్లయితే తన గుర్తింపును కోల్పోతుందని భయపడి, ప్రత్యక్ష పరిపలనలో ఉండే చీఫ్ కమిషనరు ప్రావిన్సుగా మారింది. బిలాస్‌పూర్ మాకూడా అలాగే మారింది. అయితే, ఇందులో ఎక్కువ భాగం భాక్రా ఆనకట్ట పూర్తయినపుడు దాని జలాశయంలో మునిగిపోయింది.

నాలుగు-దశల ఏకీకరణ

విలీనం

పెద్ద రాష్ట్రాలను, చిన్న రాష్ట్రాల యొక్క కొన్ని సమూహాలనూ వేరే నాలుగు-దశల ప్రక్రియ ద్వారా విలీనం చేసారు. ఈ ప్రక్రియలో మొదటి దశలో, పక్కపక్కక్కనే ఉన్న పెద్ద రాష్ట్రాలను, పెద్ద సంఖ్యలో పక్కపక్కనే ఉన్న చిన్న రాష్ట్రాలనూ మిళితం చేసి వాటి పాలకులచే విలీన ఒప్పందాలను (వీటిని కోవనెంట్స్ ఆఫ్ మెర్జర్ అన్నారు) అమలు చేయడం ద్వారా "సంస్థానాల యూనియన్" లను ఏర్పాటు చేస్తారు. ఈ విలీన ఒడంబడికలో, ఒక్కరు తప్ప మిగతా పాలకులందరూ తమ పాలక అధికారాలను కోల్పోయారు. ఆ ఒక్కరూ కొత్త యూనియన్‌కు రాజ్‌ప్రముఖ్ అవుతారు. ఇతర పాలకులు రెండు సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు-ఒకటి పాలకుల మండలి, దీనిలో సభ్యులుగా సెల్యూట్ సంస్థానాల పాలకులు ఉంటారు. రెండోది ప్రెసీడియం. దీనిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు సెల్యూటేతర సంస్థానాల పాలకులచే ఎన్నుకోబడతారు, మిగిలిన వారిని కౌన్సిల్ ఎన్నుకుంటుంది. రాజ్‌ప్రముఖ్‌ను, ఉపరాజ్‌ప్రముఖ్‌నూ ప్రెసిడియం సభ్యుల నుండి కౌన్సిల్ ఎంపిక చేస్తుంది. కొత్త యూనియన్ కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి ఒడంబడికల్లో నిబంధనలు ఉన్నాయి, ఈ సభ రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. తమతమ సంస్థానాలు వివిక్త సంస్థలుగా లుప్తమై పోవడానికి అంగీకరించినందుకు ప్రతిఫలంగా, పాలకులకు ఒక ప్రీవీ పర్స్ ఇస్తారు. విలీన ఒప్పందాలపై సంతకం చేసిన వారికి ఇచ్చినట్లే ఇతర హామీలు కూడా ఇచ్చారు.

ఈ ప్రక్రియ ద్వారా, పటేల్ తన స్వరాష్ట్రమైన గుజరాత్ లోని కాథియవార్ ద్వీపకల్పంలోని 222 రాష్ట్రాలను 1948 జనవరిలో సౌరాష్ట్ర రాచరిక యూనియన్‌లోకి ఏకీకృతం చేశాడు. మరుసటి సంవత్సరం మరో ఆరు రాష్ట్రాలు ఈ యూనియన్‌లో చేరాయి. మధ్య భారత్ 1948 మే 28 న గ్వాలియర్, ఇండోర్ ల్తో పాటు మరో పద్దెనిమిది చిన్న రాష్ట్రాల యూనియన్ నుండి ఉద్భవించింది. 1948 జూలై 15 న పంజాబ్‌లోని పాటియాలా, కపూర్తలా, జింద్, నభాలో, ఫరీద్కోట్, మలేర్‌కోట్లా, నాలార్గఢ్, కల్సియాలు కలిసి పాటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ ఏర్పడింది. వరుస విలీనాల ఫలితంగా యునైటెడ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఏర్పడింది. వీటిలో చివరిది 1949 మే 15 న పూర్తయింది. ట్రావెన్కోర్ కొచ్చిన్లను 1949 మధ్యలో విలీనం చేసి ట్రావెన్కోర్-కొచ్చిన్ రాచరిక యూనియన్ ఏర్పడింది. విలీన ఒప్పందాలు లేదా విలీన కోవెనంట్లపై సంతకం చేయని సంస్థానాలు కాశ్మీర్, మైసూరు, హైదరాబాదు - ఈ మూడే.

ప్రజాస్వామీకరణ

ప్రతి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాలను విలీనం చేయడం, వాటిని ఒకే రాజకీయ, పరిపాలనా సంస్థగా ఏకీకరించడం అంత సులభం కాదు. ముఖ్యంగా విలీనమైన అనేక రాష్ట్రాలకు పరస్పర శత్రుత్వ చరిత్ర ఉంది. పూర్వ సెంట్రల్ ఇండియా ఏజెన్సీలో, మొదట సంస్థానాలను వింధ్య ప్రదేశ్ అనే రాచరిక యూనియన్‌లో విలీనం చేశారు.ఇందులోని రెండు సమూహాల రాష్ట్రాల మధ్య శత్రుత్వం ఎంత ఘోరంగా పరిణమించిందంటే పాత కోవెనంట్లను రద్దు చేస్తూ విలీన ఒప్పందంపై సంతకం చేయడానికి భారత ప్రభుత్వం ఆ పాలకులను ఒప్పించింది. వాటిని విలీనం చేసుకుని చీఫ్ కమిషనర్ రాష్ట్రంగా రాష్ట్రంపై ప్రత్యక్ష నియంత్రణ తీసుకుంది. విలీనాలు భారత ప్రభుత్వం లేదా రాష్ట్రాల మంత్రిత్వ శాఖ అంచనాలను అందుకోలేదు. 1947 డిసెంబరులో మీనన్, రాష్ట్రాల పాలకులు "ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల స్థాపనకు ఆచరణాత్మక చర్యలు" తీసుకోవాలని సూచించాడు. స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయన సూచనను అంగీకరించి, విలీనమైన రాచరిక సంఘాల రాజ్‌ప్రముఖులు తాము రాజ్యాంగ చక్రవర్తులుగా మాత్రమే వ్యవహరించడానికి ఒప్పుకునేలా వారిని నిర్బంధిస్తూ ప్రత్యేక ఒడంబడికపై సంతకం చేయించారు. దీంతో వారి అధికారాలు గతంలో బ్రిటిషు ప్రావిన్సుల గవర్నరు అధికారాల కంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ సంస్థానాల ప్రజలకు, మిగతా భారతదేశం లోని ప్రజలకు లాగానే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడుతుంది.

ఈ ప్రక్రియ ఫలితం, సంస్థానాలపై మరింత విస్తృతమైన భారత ప్రభుత్వపు సర్వం సహాధికారమేనని వర్ణించారు. అధికార బదిలీతో సర్వం సహాధికారం తగ్గుతుందనే బ్రిటిషు ప్రకటనకు ఇది విరుద్ధంగా ఉన్నప్పటికీ, స్వతంత్ర భారతదేశం పారామౌంట్ శక్తిగా నిలుస్తుందనేదే కాంగ్రెస్ అభిప్రాయం.

భారతదేశ ఏకీకరణ 
1951 లో భారతదేశ రాష్ట్రాలు

కేంద్రీకరణ, రాజ్యాంగీకరణ

ప్రజాస్వామ్యం, పూర్వపు సంస్థానాలకు పూర్వ బ్రిటిషు ప్రావిన్సులకూ మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని తెరిచే ఉంచింది. అది, సంస్థానాలు మూడు విషయాలకు సంబంధించి మాత్రమే చేరిక ఒప్పంద పత్రాలపై సంతకం చేసాయి. అవి కాకుండా ఇతర రంగాల్లో ప్రభుత్వ విధానాలు ఈ సంస్థానాలకు అంటలేదు. సామాజిక న్యాయం, జాతీయ అభివృద్ధిని తీసుకువచ్చే విధానాలను రూపొందించే సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని కాంగ్రెస్ భావించింది. పర్యవసానంగా, వారు మునుపటి బ్రిటిషు ప్రావిన్సులపై ఉన్నట్లుగా, పూర్వపు సంస్థానాలపై అదే స్థాయిలో అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి దక్కించుకోవాలని కోరారు. 1948 మే లో, వి.పి. మీనన్ చొరవతో, రాచరిక సంఘాల రాజ్‌ప్రముఖ్‌లు, స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్ మధ్య ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. చివరికి రాజ్‌ప్రముఖ్‌లు కొత్త ప్రవేశ ఒప్పందాలపై సంతకం చేశారు. ఇది భారత ప్రభుత్వ చట్టం 1935 లోని ఏడవ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే అన్ని విషయాలకు సంబంధించి చట్టాలను చేసే అధికారాన్ని భారత ప్రభుత్వానికి ఇచ్చింది. తదనంతరం, రాచరిక సంఘాలన్నీ, మైసూరు, హైదరాబాదులతో సహా, భారత రాజ్యాంగాన్ని తమ రాష్ట్ర రాజ్యాంగంగా స్వీకరించడానికి అంగీకరించాయి. తద్వారా అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మాజీ బ్రిటిషు ప్రావిన్సులతో సమానమైన చట్టపరమైన స్థితిలో ఉన్నాయని నిర్ధారించింది. దీనికి కాశ్మీర్ మినహాయింపు. దీనితో భారతదేశంతో సంబంధాలు ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేత, రాష్ట్ర రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగం చేత నిర్వహించబడుతున్నాయి.

1950 నుండి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం భారతదేశంలోని విభాగాలను పార్ట్ ఎ, బి, సి రాష్ట్రాలూనే మూడు తరగతులుగా వర్గీకరించింది. పూర్వ బ్రిటిషు ప్రావిన్సులు, వాటిలో విలీనం అయిన సంస్థానాలన్నీ కలిపి పార్ట్ ఎ రాష్ట్రాలు. రాచరిక యూనియన్లు, ప్లస్ మైసూరు, హైదరాబాదులు పార్ట్ బి రాష్ట్రాలు. మాజీ చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు, అండమాన్ నికోబార్ దీవులు మినహా ఇతర కేంద్ర పరిపాలన ప్రాంతాలు పార్ట్ సి రాష్ట్రాలు. పార్ట్ ఎ రాష్ట్రాలు, పార్ట్ బి రాష్ట్రాల మధ్య ఉన్న ఏకైక ఆచరణాత్మక వ్యత్యాసం ఏమిటంటే, పార్ట్ బి రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్లు కాకుండా విలీన ఒడంబడిక నిబంధనల ప్రకారం నియమితులైన రాజ్‌ప్రముఖులు ఉంటారు అదనంగా, రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి పూర్వపు రాచరిక దేశాలపై గణనీయమైన అధికారాలను ఇచ్చింది. ఇతర విషయాలతోపాటు, "వారి పాలన రాష్ట్రపతి సాధారణ నియంత్రణలో ఉంటుంది. ఎప్పటికప్పుడు రాష్ట్రపతి ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉంటుంది."

పునర్వ్యవస్థీకరణ

పార్ట్ ఎ, పార్ట్ బి రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసం పరివర్తనలో ఉన్న కొద్ది కాలం పాటు మాత్రమే కొనసాగడానికి ఉద్దేశించారు. 1956 లో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పూర్వ బ్రిటిషు ప్రావిన్సులను, సంస్థానాలను భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరించింది. అదే సమయంలో, రాజ్యాంగంలోని ఏడవ సవరణ పార్ట్ ఎ, పార్ట్ బి రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించింది, ఈ రెంటినీ ఇప్పుడు "రాష్ట్రాలు" గానే పరిగణించారు. పార్ట్ సి రాష్ట్రాలను " కేంద్రపాలిత ప్రాంతాలు "గా పేరు మార్చారు. రాజ్‌ప్రముఖులు తమ అధికారాన్ని కోల్పోయారు. వారి స్థానంలో రాజ్యాంగాధినేతలుగా గవర్నర్లను నియమించారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మార్పులతో చివరకు రాచరిక క్రమం అంతమై పోయింది. చట్టపరంగానూ, ఆచరణాత్మకం గానూ సంస్థానాలలో భాగమైన భూభాగాలు ఇప్పుడు సంపూర్ణంగా భారతదేశంలో కలిసిపోయాయి. ఇప్పుడు వాటికీ బ్రిటిషు భారతదేశంలో భాగమైన వాటికీ తేడాయేమీ లేదు. సంస్థానాధీశుల వ్యక్తిగత హక్కులు-ప్రీవీ పర్స్, కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు, ఆచార గౌరవాలు-అప్పటికి మనుగడ సాగించాయి గానీ 1971 లో వాటిని కూడా రద్దు చేసారు.

విలీనానంతర సమస్యలు

సంస్థానాధీశులు

భారతదేశంలో సంస్థానాల ప్రగతిశీల ఏకీకరణ చాలావరకు శాంతియుతంగా జరిగినప్పటికీ, సంస్థానాధీశులందరూ ఈ ఫలితంతో సంతోషంగా లేరు. ప్రవేశ సాధనాలు శాశ్వతంగా ఉంటాయని చాలా మంది ఊహించారు. స్వయంప్రతిపత్తిని కోల్పోవడం పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నారు. తమ కుటుంబ తరాల వారు నియంత్రించిన రాష్ట్రాల అదృశ్యమవడంతో కొందరు అసౌకర్యంగా భావించారు. తాము కష్టపడి నిర్మించిన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థలు అదృశ్యమవడం పట్ల మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. అయితే, వీరిలో మెజారిటీ వ్యక్తులు, ప్రైవేటు పౌరులుగా జీవించడానికి "ఒత్తిడి, ఉద్రిక్తత" ఉన్నప్పటికీ, ప్రీవీ పర్స్ అందించే ఉదార పింఛనుపై సంతృప్తి చెంది, పదవీ విరమణ పొందారు. కేంద్ర ప్రభుత్వ పదవులు నిర్వహించడానికి వారి అర్హతను చాలామంది ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, భావ్‌నగర్ మహారాజా, కల్నల్ కృష్ణ కుమారసింగ్ భవసింగ్ గోహిల్ మద్రాస్ రాష్ట్ర గవర్నర్ అయ్యాడు. అనేకమంది విదేశాలలో దౌత్య పదవులు పొందారు.

వలస భూభాగాలు

భారతదేశ ఏకీకరణ 
1947 లో ఫ్రెంచ్ ప్రాంతాలు

సంస్థానాల ఏకీకరణతో భారతదేశంలో మిగిలిన వలసరాజ్య ప్రాంతాల భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది. స్వాతంత్ర్యం పొందిన తరువాత, పాండిచేరి, కరైకల్, యానాం, మాహే, చందర్‌నగోర్ ప్రాంతాలు ఇంకా ఫ్రాన్స్ వలఅసలు గానే ఉన్నాయి. డామన్ డయు, దాద్రా నగర్ హవేలి, గోవాలు పోర్చుగల్ వలసలులుగానే ఉన్నాయి. వాటి రాజకీయ భవిష్యత్తును ఎంచుకోవడానికి ఫ్రెంచి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 1948 లో ఫ్రాన్స్, భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 1949 జూన్ 19 న చందర్‌నాగోర్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో విలీనానికి అనుకూలంగా 7,463, వ్యతిరేకంగా 114 ఓట్లు వచ్చాయి. ఇది 1949 ఆగస్టు 14 న డి ఫ్యాక్టో ప్రాతిపదికన, 1950 మే 2 న డి జ్యూర్‌ గానూ విలీనమైంది. ఇతర ఎన్క్లేవ్లలో, ఎడ్వర్డ్ గౌబర్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ అనుకూల శిబిరం, విలీన అనుకూల సమూహాలను అణిచివేసేందుకు పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించింది. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. 1954 లో యానాం, మాహేలలో ప్రదర్శనల ఫలితంగా విలీన అనుకూల సమూహాలు అధికారాన్ని చేపట్టాయి. 1954 అక్టోబరులో పాండిచేరి, కరైకల్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ విలీనానికి అనుకూలంగా ఓటు వేసింది. 1954 నవంబరు 1 న, నాలుగు ఎన్క్లేవ్‌లపై డి ఫ్యాక్టో నియంత్రణ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయింది. 1956 మేలో విలీన ఒప్పందం కుదిరింది. 1962 మేలో ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన తరువాత, ఎన్క్లేవ్స్ యొక్క డి జ్యూర్ నియంత్రణ కూడా బదిలీ అయింది.

Demonstrators demanding the integration of Goa into India march against the Portuguese on 15 August 1955.

దీనికి విరుద్ధంగా పోర్చుగల్ దౌత్య పరిష్కారాలను ప్రతిఘటించింది. ఇది తన భారతీయ ఎన్‌క్లేవ్‌లను నిరంతరం తన అధీనం లోనే ఉంచుకోవడం తమకు జాతీయ గర్వకారణంగా భావించింది 1951 లో, భారతదేశంలో తన ఆస్తులను పోర్చుగీస్ ప్రావిన్సులుగా మార్చడానికి దాని రాజ్యాంగాన్ని సవరించింది. 1954 జూలై లో, దాద్రా నగర్ హవేలీలలో రేగిన తిరుగుబాటు పోర్చుగీసు పాలనను కూలదోసింది. ఎన్క్లేవ్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీసువారు డామన్ నుండి బలగాలను పంపించడానికి ప్రయత్నించారు. కాని భారత దళాలు వాటిని అడ్డుకున్నాయి. పోర్చుగల్ తన సైనికులను ఎన్‌క్లేవ్‌లోకి అనుమతించమని భారత్‌పై వత్తిడి చేయడానికి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు చర్యలను ప్రారంభించింది, అయితే 1960 లో కోర్టు దాని ఫిర్యాదును తిరస్కరించింది, పోర్చుగల్ సైన్యాన్ని తన భూభాగంలోకి రాకుండా తిరస్కరించే హక్కు భారతదేశానికి ఉందని కోర్టు పేర్కొంది. దాద్రా నగర్ హవేలీలను భారతదేశపు కేంద్రపాలిత ప్రాంతంగా చేరుస్తూ 1961 లో భారత రాజ్యాంగాన్ని సవరించారు.

గోవా, డామన్ డయ్యు ఒక ముఖ్యమైన సమస్యగా మిగిలిపోయింది. 1955 ఆగస్టు 15 న, ఐదు వేల మ్ంది అహింసా ప్రదర్శనకారులు పోర్చుగీసుపై సరిహద్దు వద్ద కవాతు చేశారు. పోర్చుగీసు కాల్పులకు 22 మంది బలయ్యారు. 1960 డిసెంబరులో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, తన విదేశీ ఆస్తులు ప్రావిన్సులే అనే పోర్చుగీసు వాదనను తిరస్కరించింది. అధికారికంగా వాటిని "స్వయం పాలన లేని భూభాగాలు"గా జాబితా చేసింది. నెహ్రూ చర్చల ద్వారా పరిష్కారానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, 1961 లో అంగోలాలో తిరుగుబాటును పోర్చుగీసు అణచివేయడం భారత ప్రజాభిప్రాయాన్ని సమూలంగా మార్చింది. సైనిక చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. ఆఫ్రికన్ నాయకులు కూడా గోవాలో చర్యలు తీసుకోవాలని నెహ్రూపై ఒత్తిడి తెచ్చారు. అది ఆఫ్రికాను మరిన్ని భయానక చర్యల నుండి కాపాడుతుందని వారు వాదించారు. 1961 డిసెంబరు 18 న, చర్చల పరిష్కారం కోసం ఒక అమెరికన్ ప్రయత్నం విఫలమైన తరువాత, భారత సైన్యం పోర్చుగీస్ భారతదేశంలోకి ప్రవేశించి అక్కడ పోర్చుగీస్ దండులను ఓడించింది. పోర్చుగీసువారు ఈ విషయాన్ని భద్రతా మండలికి తీసుకువెళ్లారు. కాని భారతదేశం తన దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చే తీర్మానం యుఎస్ఎస్ఆర్ వీటో చెయ్యడంతో వీగిపోయింది. డిసెంబరు 19 న పోర్చుగల్ లొంగిపోయింది. ఈ స్వాధీనంతో భారతదేశంలోని చిట్టచివరి యూరోపియన్ వలస అంతరించింది. గోవాను కేంద్రంగా పరిపాలించే కేంద్ర భూభాగంగా భారతదేశంలో చేర్చారు. 1987 లో ఒక రాష్ట్రంగా మారింది.

సిక్కిం

భారతదేశ ఏకీకరణ 
భారతదేశం చైనాల మధ్య సరిహద్దులో వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంలో ఉన్న పూర్వ సిక్కిం సంస్థానం. 1975 లో భారతదేశంలో 22 వ రాష్ట్రంగా విలీనమైంది.

నేపాల్, భూటాన్, సిక్కింలు భారతదేశ సరిహద్దులో ఉన్న హిమాలయ రాజ్యాలు. నేపాల్‌ను బ్రిటిషు వారు 1923 నాటి నేపాల్-బ్రిటన్ ఒప్పందం ప్రకారం డి జ్యూర్ స్వతంత్రంగా గుర్తించారు ఇది రాచరిక రాజ్యం కాదు. భూటాన్ను బ్రిటిషు కాలంలో భారతదేశపు అంతర్జాతీయ సరిహద్దుకు వెలుపల ఒక రక్షిత ప్రాంతంగా పరిగణించారు. ఈ ఏర్పాటును కొనసాగిస్తూ భారత ప్రభుత్వం 1949 లో భూటాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భూటాన్ తన బాహ్య వ్యవహారాల నిర్వహణలో భారత ప్రభుత్వ సలహాకు కట్టుబడి ఉండడం ఈ ఒప్పందంలో భాగం. 1947 తరువాత, నేపాల్, భూటాన్లతో భారత్ కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది.

చారిత్రికంగా, సిక్కిం ఒక బ్రిటిషు డిపెండెన్సీ. దాని స్థాయి ఇతర సంస్థానాల మాదిరిగానే ఉంది. అందువల్ల వలసరాజ్య కాలంలో భారతదేశం యొక్క సరిహద్దులలోపలే ఉన్నట్లు పరిగణించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, సిక్కిం చోగ్యాల్ (రాజు) భారతదేశంలో పూర్తిగా విలీనం చెయ్యడాన్ని ప్రతిఘటించాడు. భారతదేశానికి ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా, భారత ప్రభుత్వం మొదట స్టాండ్‌స్టిల్ ఒప్పందంపై సంతకం చేసింది. తరువాత 1950 లో సిక్కిం చోగ్యాల్‌తో పూర్తి ఒప్పందం కుదుర్చుకుంది, దీని ఫలితంగా ఇది భారతదేశంలో భాగం కాని, భారత-సంరక్షిత ప్రాంతంగా మారింది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, శాంతిభద్రతల పట్ల అంతిమ బాధ్యత భారతదేశానికి ఉంది. మిగతా విషయాల్లో సిక్కింకు పూర్తి అంతర్గత స్వయంప్రతిపత్తి ఇచ్చారు. 1960 ల చివరలో, 1970 ల ప్రారంభంలో, మైనారిటీ భూటియా, లెప్చా ఉన్నత వర్గాల మద్దతు ఉన్న చోగ్యాల్ పాల్డెన్ తోండప్ నంగ్యాల్, ఎక్కువ అధికారాల కోసం, ముఖ్యంగా విదేశీ వ్యవహారాల విషయమై, చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ విధానాలను కాజీ లెండప్ డోర్జీ, సిక్కిం స్టేట్ కాంగ్రెస్ లు వ్యతిరేకించాయి. వారు నేపాలీ జాతి మధ్యతరగతికి ప్రాతినిధ్యం వహించారు. మరింత భారతీయ అనుకూల అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

1973 ఏప్రిల్ లో, చోగ్యాల్ వ్యతిరేక ఆందోళన జరిగింది. నిరసనకారులు ప్రజా ఎన్నికలను డిమాండ్ చేశారు. సిక్కిం పోలీసులు ప్రదర్శనలను నియంత్రించలేకపోయారు. శాంతిభద్రతల బాధ్యతల్లో జోక్యం చేసుకోవాలని డోర్జీ భారతదేశాన్ని కోరారు. చోగ్యాల్, డోర్జీల మధ్య చర్చలకు భారతదేశం చొరవ తీసుకుంది. ఒక ఒప్పందాన్ని రూపొందించింది. చోగ్యాల్‌ను రాజ్యాంగ చక్రవర్తి పాత్రకు తగ్గించడం, జాతులు అధికారాన్ని పంచుకునే సూత్రం ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం ఈ ఒప్పందంలో భాగం చోగ్యాల్ ప్రత్యర్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారు. సిక్కింకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉండటానికి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించారు. 1975 ఏప్రిల్ 10 న, ఈ రాష్ట్రం పూర్తిగా భారతదేశంలో కలిసిపోవాలని కోరుతూ సిక్కిం శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంపై 1975 ఏప్రిల్ 14 న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 97 శాతం ఓట్లతో ప్రజలు ఆమోదించారు. దీని తరువాత సిక్కింను భారతదేశపు 22 వ రాష్ట్రంగా చేరుస్తూ భారత పార్లమెంటు తన రాజ్యాంగాన్ని సవరించింది.

వేర్పాటువాదం, అర్ధ జాతీయవాదం

భారతదేశంలో కలిసిపోయిన మెజారిటీ సంస్థానాలు పూర్తిగా విలీనం అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన సమస్యలు మిగిలి పోయాయి. వీటిలో ముఖ్యమైనవి కాశ్మీర్‌కు సంబంధించి, 1980 ల చివరి నుండి హింసాత్మక వేర్పాటువాద తిరుగుబాటు చెలరేగుతోంది.

నోట్స్

మూలాలు

Tags:

భారతదేశ ఏకీకరణ భారతదేశంలో సంస్థానాలుభారతదేశ ఏకీకరణ ఏకీకరణకు కారణాలుభారతదేశ ఏకీకరణ చేరికకు అంగీకరించడంభారతదేశ ఏకీకరణ చేరిక ప్రక్రియభారతదేశ ఏకీకరణ ఏకీకరణ పూర్తిభారతదేశ ఏకీకరణ విలీనానంతర సమస్యలుభారతదేశ ఏకీకరణ నోట్స్భారతదేశ ఏకీకరణ మూలాలుభారతదేశ ఏకీకరణబ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులుభారత జాతీయ కాంగ్రెస్భారత ప్రభుత్వముభారత స్వాతంత్ర్య చట్టం 1947భారతదేశంలో బ్రిటిషు పాలనవి. పి. మెనన్సర్దార్ వల్లభభాయి పటేల్

🔥 Trending searches on Wiki తెలుగు:

రామతీర్థం (నెల్లిమర్ల)ప్రజా రాజ్యం పార్టీమేడిసుభాష్ చంద్రబోస్గరుడ పురాణంఛందస్సుప్రధాన సంఖ్యఆవర్తన పట్టికపోక్సో చట్టంహిందూధర్మంక్షత్రియులుత్రిఫల చూర్ణందానం నాగేందర్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారమ్య పసుపులేటివిశాల్ కృష్ణసిద్ధార్థ్చిరంజీవిరుక్మిణీ కళ్యాణంసమ్మక్క సారక్క జాతరక్రిక్‌బజ్కాకతీయులుతిరుమల చరిత్రవినుకొండనాగార్జునసాగర్నడుము నొప్పితెలంగాణచెప్పవే చిరుగాలికరక్కాయశివపురాణంకాకినాడసౌందర్యతిరుపతిపాలపిట్టజీమెయిల్ఇంటి పేర్లువశిష్ఠ మహర్షి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురుతుపవనంభారత రాజ్యాంగంప్రభాస్రామప్ప దేవాలయంచిలుకూరు బాలాజీ దేవాలయంభగత్ సింగ్తాటి ముంజలుముదిరాజ్ (కులం)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరావు గోపాలరావుజాతీయ ఆదాయంఏలకులు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్సంధిగోత్రాలువై.యస్. రాజశేఖరరెడ్డిబుధుడు (జ్యోతిషం)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసిరికిం జెప్పడు (పద్యం)మీనాక్షి అమ్మవారి ఆలయంమంచు మనోజ్ కుమార్శ్రీముఖిమీనాశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)సంపూర్ణ రామాయణం (1959 సినిమా)గోవిందుడు అందరివాడేలేభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఅలంకారంకిలారి ఆనంద్ పాల్మీసాల గీతకనకదుర్గ ఆలయంట్విట్టర్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణశ్రీరామదాసు (సినిమా)ఉత్పలమాలఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాత్రినాథ వ్రతకల్పం🡆 More