పారిశ్రామిక విప్లవం

సుమారు 1760 నుండి 1820 - 1840 మధ్య కాలం వరకు ఐరోపా, అమెరికాల్లో కొత్త ఉత్పాదక ప్రక్రియల దిశగా జరిగిన పరివర్తనను పారిశ్రామిక విప్లవం అంటారు.

ప్రస్తుతం దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అని కూడా పిలుస్తున్నారు. చేతి ఉత్పత్తి పద్ధతుల నుండి యంత్రాలకు మళ్లడం, కొత్త రసాయనాల తయారీ, ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు, ఆవిరి శక్తి, నీటి శక్తి ల వినియోగం, యంత్ర పరికరాల అభివృద్ధి, యాంత్రిక కర్మాగార వ్యవస్థలు ఈ పరివర్తనలో భాగం. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల రేటులో అపూర్వమైన పెరుగుదలకు దారితీసింది.

పారిశ్రామిక విప్లవం
1835 లో నేత షెడ్‌లో రాబర్ట్స్ మగ్గం. పారిశ్రామిక విప్లవంలో వస్త్ర పరిశ్రమ ప్రముఖమైనది. నీటి చక్రం లేదా ఆవిరి యంత్రం ద్వారా నడిచే యాంత్రిక కర్మాగారాలే కొత్త కార్యాలయాలు.

ఉపాధి, ఉత్పత్తి విలువల పరంగాను, పెట్టుబడి పరంగానూ పారిశ్రామిక విప్లవంలో వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించిన మొట్టమొదటి పరిశ్రమ, వస్త్రం.: 40 

పారిశ్రామిక విప్లవం గ్రేట్ బ్రిటన్లో ప్రారంభమైంది. అప్పట్లో జరిగిన సాంకేతిక ఆవిష్కరణలు అనేకం బ్రిటన్‌లో జరిగినవే. 18 వ శతాబ్దం మధ్య నాటికి, బ్రిటన్, ప్రపంచం లోని ప్రముఖ వాణిజ్య దేశంగా ఉండేది. ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యాన్ని ఉత్తర అమెరికా, కరేబియన్‌^ల లోని వలస రాజ్యాలతోను, భారత ఉపఖండం లోని సైనిక, రాజకీయ ఆధిపత్యంతోనూ (ముఖ్యంగా తొలి-పారిశ్రామిక మొఘల్‌తో బెంగాల్, ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాల ద్వారా), బ్రిటన్ నియంత్రిస్తూ ఉండేది. పారిశ్రామిక విప్లవానికి వాణిజ్య అభివృద్ధి, వ్యాపార కార్యకలాపాలు పెరగడం ప్రధాన కారణాలు. : 15 

పారిశ్రామిక విప్లవం, చరిత్రలో ఒక ప్రధానమైన మలుపు. రోజువారీ జీవితంలోని దాదాపు ప్రతి అంశమూ ఏదో ఒక విధంగా దీనివలన ప్రభావితమైంది. ముఖ్యంగా, సగటు ఆదాయంలోను, జనసంఖ్యలోనూ అపూర్వమైన, నిరంతర వృద్ధి జరిగింది. పారిశ్రామిక విప్లవపు ప్రధాన ప్రభావం ఏమిటంటే, పాశ్చాత్య ప్రపంచంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణం చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థిరంగా పెరగడం మొదలవడమే అని కొందరు ఆర్థికవేత్తలు చెబుతారు. అయితే అర్ధవంతమైన అభివృద్ధి మాత్రం 19 వ శతాబ్దం చివరిలో, 20 శతాబ్దంలో గాని మొదలవలేదని మరికొందరు అంటారు.

పారిశ్రామిక విప్లవానికి ముందు, ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి ముందూ తలసరి ఆదాయం నిలకడగా ఉండేది. పారిశ్రామిక విప్లవంతో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో తలసరి ఆదాయంలో వృద్ధి మొదలైంది. జంతువుల మచ్చిక, వ్యవసాయం తరువాత, మానవజాతి చరిత్రలో పారిశ్రామిక విప్లవమే అతి ముఖ్యమైన సంఘటన అని ఆర్థిక చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.

ఆర్థిక, సామాజిక మార్పుల వేగం ఎప్పుడు పుంజుకుందనే విషయం లాగానే పారిశ్రామిక విప్లవం కచ్చితంగా ఎప్పుడు మొదలై, ఎప్పుడు ముగిసింది అనే విషయాలు కూడా చరిత్రకారులలో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం 1780 లలో బ్రిటన్లో ప్రారంభమైందని, 1830 - 1840 ల నాటికి గానీ వాటి ప్రభావం పూర్తిగా అనుభవం లోకి రాలేదనీ ఎరిక్ హాబ్స్‌బామ్ అభిప్రాయపడ్డాడు. అయితే టిఎస్ ఆష్టన్ మాత్రం 1760 - 1830 ల మధ్య ఇది జరిగిందని అభిప్రాయపడ్డాడు. వేగవంతమైన పారిశ్రామికీకరణ మొదట 1780 లలో బ్రిటన్లో యాంత్రిక స్పిన్నింగ్‌తో ప్రారంభమైంది. ఆవిరి శక్తి, ఇనుము ఉత్పత్తిలో అధిక వృద్ధి రేటు 1800 తరువాత సంభవించాయి. యాంత్రిక వస్త్ర ఉత్పత్తి 19 వ శతాబ్దం ప్రారంభంలో గ్రేట్ బ్రిటన్ నుండి ఐరోపా ఖండం, అమెరికాలకు వ్యాపించింది. వస్త్రాలు, ఇనుము, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు బెల్జియం, అమెరికా లోను, తరువాత ఫ్రాన్స్‌లో వస్త్ర పరిశ్రమా ఉద్భవించాయి.

పారిశ్రామిక విప్లవంలో జరిగిన అసలు ఆవిష్కరణలైన యాంత్రిక స్పిన్నింగు, యాంత్రిక నేత వంటి పద్ధతులను అనుసరించడం మందగించడం వలన, వాటి మార్కెట్లు పరిపక్వం చెందడం వలనా, 1830 ల చివరి నుండి 1840 ల ప్రారంభం వరకు ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ కాలంలో వెలుగు చూసిన లోకోమోటివ్స్, స్టీమ్‌బోట్లు, స్టీమ్‌షిప్‌లను ప్రవేశపెట్టడం, హాట్ బ్లాస్ట్ ఐరన్ స్మెల్టింగ్ ఆవిష్కరణలు, 1840, 1850 లలో విస్తృతంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అన్నీ కూడా అధిక అభివృద్ధి వేగాలను సాధించలేకపోయాయి. 1870 తరువాత కొత్త వర్గాల ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధి ప్రారంభమైంది. దీన్ని రెండవ పారిశ్రామిక విప్లవం అని పిలుస్తున్నారు. ఈ కొత్త ఆవిష్కరణలలో కొత్తకొత్త ఉక్కు తయారీ ప్రక్రియలు, భారీ ఉత్పత్తి, అసెంబ్లీ లైన్లు, ఎలక్ట్రికల్ గ్రిడ్ వ్యవస్థలు, పెద్ద ఎత్తున యంత్ర పరికరాల తయారీ, ఆవిరి శక్తితో నడిచే కర్మాగారాల్లో పెరుగుతున్న ఆధునిక యంత్రాల వాడకం వంటివి ఉన్నాయి.

ముఖ్యమైన సాంకేతిక పరిణామాలు

పారిశ్రామిక విప్లవపు ఆరంభం, 18 వ శతాబ్దం రెండవ సగంలో జరిగిన అనేక చిన్న చిన్న ఆవిష్కరణలతో ముడిపడి ఉంది 1830 ల నాటికి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలలో ఈ క్రింది పురోభివృద్ధి జరిగింది:

  • వస్త్రాలు - ఆవిరి శక్తి లేదా నీటి శక్తితో నడిచే యంత్రాలతో పత్తి వడకడం (స్పిన్నింగు) కార్మికుడి ఉత్పాదకతను సుమారు 500 రెట్లు పెంచింది. పవర్ లూమ్, కార్మికుడి ఉత్పాదకతను 40 రెట్లకు పైగా పెంచింది. పత్తి జిన్నిగు మిల్లు వలన పత్తి నుండి విత్తనాన్ని తొలగించే వేగం 50 రెట్లు పెరిగింది. ఉన్ని, నారల వడకడం, నేతలలో ఉత్పాదకత కూడా పెద్ద ఎత్తున పెరిగింది గానీ, అవి పత్తి విషయంలో జరిగినంత గొప్ప మార్పులు కావు.
  • ఆవిరి శక్తి - ఆవిరి ఇంజన్ల సమర్థత పెరిగింది. దాంతో వాటి ఇంధన వినియోగం ఐదవ వంతు నుండి, పదోవంతు దాకా పడిపోయింది. స్థావరంగా ఉండే ఆవిరి ఇంజనులను రోటరీ చలనానికి అనువర్తించడంతో పారిశ్రామిక అవసరాలకు అనువుగా మారాయి.: 82  అధిక పీడనాల వద్ద పనిచేసే ఇంజన్ల కారణంగా, బరువు-శక్తిల నిష్పత్తి పెరగడంతో ఈ ఇంజన్లు రవాణాకు అనుకూలంగా మారాయి. 1800 తరువాత ఆవిరి శక్తి శరవేగంగా విస్తరించింది.
  • ఇనుము తయారీ - రాక్షసి బొగ్గుకు బదులుగా కోక్ వాడడంతో దుక్క ఇనుము (పిగ్ ఐరన్), చేత ఇనుము (రాట్ ఐరన్) ల ఉత్పత్తిలో ఇంధన వ్యయం బాగా తగ్గింది.: 89–93  కోక్‌ను ఉపయోగించడం వల్ల పెద్ద పెద్ద బ్లాస్ట్ ఫర్నేసుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫలితంగా చౌకగా ఉత్పత్తి చేసే వీలు కలిగింది. 1750 ల మధ్యలో నీటిని పంపు చేయడానికి, గాలిని ఊదడానికీ ఆవిరి యంత్రాన్ని ఉపయోగించడం ప్రారంభమైంది. నీటి శక్తికి ఉన్న పరిమితిని ఇలా అధిగమించడంతో ఇనుము ఉత్పత్తిలో పెద్దయెత్తున పెరుగుదల సాధించారు. పోత ఇనుము బ్లోయింగ్ సిలిండర్‌ను మొదట 1760 లో ఉపయోగించారు. ఇది తరువాత దాన్ని డబుల్ యాక్టింగ్‌గా మెరుగుపరచారు. దీంతో బ్లాస్టు ఫర్నేసులో అధిక ఉష్ణోగ్రతలు సాధించేందుకు వీలైంది. పడ్లింగ్ ప్రక్రియతో నిర్మాణాలకు వాడగల ఇనుమును ఫైనరీ ఫోర్జ్ కంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసారు. రోలింగ్ మిల్లులో హ్యామరింగు చెయ్యడం, చేతఇనుము కంటే పదిహేను రెట్లు వేగవంతమైంది. తరువాతి దశాబ్దాలలో (1828) కనుగొన్న హాట్ బ్లాస్ట్ పద్ధతితో ఇనుము ఉత్పత్తిలో ఇంధన సమర్థత బాగా పెరిగింది.
  • మెషిన్ టూల్స్ ఆవిష్కరణ - మొదటి మెషిన్ టూల్స్‌ను ఈ కాలంలో కనుగొన్నారు. వీటిలో స్క్రూ కటింగ్ లేత్, సిలిండర్ బోరింగ్ మెషిన్, మిల్లింగ్ మెషిన్ ఉన్నాయి . మెషిన్ టూల్స్‌తో కచ్చితమైన లోహ భాగాలను చౌకగా తయారు చెయ్యడం సాధ్యపడింది. అయితే, సమర్థవంతమైన పద్ధతులను అభివృద్ధి చేయడానికి అనేక దశాబ్దాలు పట్టింది.

వస్త్ర తయారీ

బ్రిటిషు వస్త్ర పరిశ్రమ గణాంకాలు

పారిశ్రామిక విప్లవం 
1747 లో చేనేత. విలియం హోగార్త్ రచించిన ఇండస్ట్రీ అండ్ ఐడిల్‌నెస్ నుండి

1750 లో బ్రిటన్ 25 లక్షల పౌండ్ల ముడి పత్తిని దిగుమతి చేసుకుంది, దీనిలో ఎక్కువ భాగాన్ని లాంకషైర్‌లోని కుటీర పరిశ్రమల్లో వడకడానికి, నేతకూ వాడారు. ఈ పని కార్మికుల ఇళ్లలోను, అప్పుడప్పుడు మాస్టర్ నేత దుకాణాలలోనూ చేతితో జరిగేది. 1787 లో ముడి పత్తి వినియోగం 2.2 కోట్ల పౌండ్లకు పెరిగింది. దీన్ని శుభ్రం చేయడానికి, దారం తీయడానికి, స్పిన్నింగుకూ చాలావరకు యంత్రాలనే వాడారు. : 41–42  బ్రిటిషు వస్త్ర పరిశ్రమ 1800 లో 5.2 కోట్ల పౌండ్ల పత్తిని ఉపయోగించింది. 1850 నాటికి ఇది 58.8 కోట్ల పౌండ్లకు పెరిగింది.

బ్రిటన్లో మొత్తం ఆర్థిక వ్యవస్థలో నూలు వస్త్ర పరిశ్రమ జోడించిన విలువ వాటా 1760 లో 2.6%, 1801 లో 17%, 1831 లో 22.4%గా ఉంది. 1801 లో బ్రిటిషు ఉన్ని పరిశ్రమ జోడించిన విలువ వాటా 14.1%. 1797 లో బ్రిటన్‌లో సుమారు 900 నూలు కర్మాగారాలు ఉన్నాయి. 1760 లో బ్రిటన్‌లో తయారైన నూలు వస్త్రంలో మూడింట ఒక వంతు ఎగుమతి చేసారు. 1800 నాటికి ఇది మూడింట రెండు వంతులకు పెరిగింది. నూలు వడకడం 1781 లో ఉన్న 51 లక్షల పౌండ్ల నుండి 1800 నాటికి 5.6 కోట్ల పౌండ్లకు పెరిగింది. 1800 లో ప్రపంచ నూలు వస్త్రంలో 0.1% కన్నా తక్కువ బ్రిటన్‌లో కనుగొన్న యంత్రాలపై తయారైంది. 1788 లో బ్రిటన్లో 50,000 నూలు వడికే కదురులు (స్పిండిల్‌లు) ఉండగా, తదుపరి 30 సంవత్సరాలలో అవి 70 లక్షలకు పెరిగాయి.

నూలు వడికే కర్మాగారాలకు, నేత కర్మాగారాలకూ కేంద్రంగా ఉన్న లాంకషైర్‌లో వేతనాలు, 1770 లో భారతదేశంలో వేతనాలకంటే ఆరు రెట్లు ఉండేవి. ఆసమయంలో బ్రిటన్‌లో మొత్తం ఉత్పాదకత భారతదేశం కంటే మూడు రెట్లు ఎక్కువ.

నూలు

భారతదేశం, చైనా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో చేనేత వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇవి సా.శ. 1000 తరువాత కొంతకాలానికి ప్రధాన పరిశ్రమగా మారాయి. పత్తి పండే ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో చాలావరకు చిన్న రైతులు ఆహార పంటలతో పాటు పత్తి పండించేవారు. ఈ పత్తిని ఇళ్ళలోనే వడకడం, అల్లకం చేసేవారు. ఇది ఎక్కువగా స్వీయ వినియోగం కోసమే ఉండేది. 15 వ శతాబ్దంలో చైనా తన ప్రజలు కట్టే పన్నులలో కొంత భాగాన్ని నూలు వస్త్రం రూపంలో చెల్లించాలని ఆదేశించింది. 17 వ శతాబ్దం నాటికి దాదాపు చైనీయులంతా నూలు దుస్తులనే ధరించేవారు. దాదాపు ప్రతిచోటా నూలు వస్త్రాన్ని వస్తుమార్పిడికి ఉపయోగించే వీలు ఉండేది. భారతదేశంలో గణనీయమైన మొత్తంలో నూలు వస్త్రాలను, సుదూర మార్కెట్ల కోసం తయారు చేసేవారు. వీటిని వృత్తిగత చేనేత కార్మికులు ఉత్పత్తి చేసేవారు. కొంతమంది వ్యాపారులకు చిన్నపాటి నేత వర్కుషాపులు కూడా ఉండేవి. భారతదేశం అనేక రకాల నూలు వస్త్రాలను ఉత్పత్తి చేసేది. వీటిలో కొన్ని అద్భుతమైన నాణ్యత కలిగి ఉండేవి.

అమెరికాలోని వలసరాజ్యాల్లో పత్తి పెంచడానికి ముందు ఐరోపాలో అంతగా దొరికేది కాదు. తొలితరం స్పానిష్ అన్వేషకులు, స్థానిక అమెరికన్లు అద్భుతమైన నాణ్యత గల, తమకు తెలియని జాతుల పత్తిని పండిస్తున్నట్లు గమనించారు. సీ ఐలాండ్ రకం పత్తి ఉష్ణమండల ప్రాంతాలలోను, జార్జియా, దక్షిణ కెరోలినాల్లాంటి తీరప్రాంతాల్లోనూ పెరిగేది. కాని లోపలి ప్రాంతాలలో బాగా పండేది కాదు. 1650 లలో బార్బడోస్ నుండి సీ ఐలాండ్ పత్తిని ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. అప్‌ల్యాండ్ గ్రీన్ సీడ్ పత్తి దక్షిణ అమెరికాలోని లోపలి ప్రాంతాలలో బాగా పెరిగేది గానీ, దాన్నుండి విత్తనాన్ని తీసెయ్యడంలో ఉన్న ఇబ్బంది కారణంగా ఇది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేది కాదు. పత్తి జిన్నింగు మిల్లులు రావడంతో ఈ సమస్య పరిష్కారమైంది.: 157  1806 లో మెక్సికో నుండి మిస్సిస్సిప్పిలోని నాచ్చెజ్‌కు తీసుకువచ్చిన పత్తి విత్తనం నేడు ప్రపంచ వ్యాప్తంగా పండే 90% పైగా పత్తికి మాతృక. ఈ రకం పత్తిని తెంచడం మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా జరిగేది.

వాణిజ్యం, వస్త్రాలు

పారిశ్రామిక విప్లవం 
పారిశ్రామిక విప్లవం ప్రారంభంలో యూరోపియన్ వలస సామ్రాజ్యాలు (ఆధునిక రాజకీయ సరిహద్దులపై చూపించబడ్డాయి)

డిస్కవరీ యుగం తరువాత, 16 వ శతాబ్దం ప్రాంతంలో వలసవాదం ప్రారంభమైంది. పోర్చుగీసువారు భారతదేశానికి దక్షిణాది ఆఫ్రికాను చుడుతూ వచ్చే వాణిజ్య మార్గాన్ని కనుగొన్న తరువాత, డచ్ వారు వెరెనిగ్డే ఓస్టిండిస్చే కాంపాగ్నీ (VOC) లేదా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ప్రపంచపు మొట్టమొదటి బహుళజాతి సంస్థ ఇది. ప్రజలకు స్టాక్ వాటాలను జారీ చేసిన మొదటి బహుళజాతి సంస్థ కూడా. ఆ తరువాత బ్రిటిషు వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఇతర దేశాల వారు కూడా వివిధ బహుళజాతి సంస్థలను స్థాపించారు. ఈ సంస్థలు హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటాను, హిందూ మహాసముద్ర ప్రాంతం-ఉత్తర అట్లాంటిక్ ఐరోపాల మధ్య ప్రాంతం లోనూ వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, ఏజెంట్లను నియమించుకున్నాయి. వీరి వాణిజ్యం లోని అతిపెద్ద విభాగాలలో ఒకటి, నూలు వస్త్రాలు. వీటిని భారతదేశంలో కొనుగోలు చేసి ఆగ్నేయాసియా లోను, ఇండోనేషియా ద్వీపసమూహం లోనూ విక్రయించేవారు. ఇండోనేషియా ద్వీపసమూహంలో దొరికే సుగంధ ద్రవ్యాలను కొని, ఆగ్నేయాసియా, ఐరోపాల్లో విక్రయించేవారు. 1760 ల మధ్య నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే మొత్తం ఎగుమతుల్లో మూడొంతులు వస్త్రమే ఉండేది. ఐరోపాలోని ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో భారతీయ వస్త్రాలకు డిమాండ్ ఉండేది. అంతకు ముందు అక్కడ ఉన్ని, నార మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే, పశ్చిమ ఐరోపాలో 19 వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా నూలు వస్త్రాల వినియోగం బాగా తక్కువగా ఉండేది.

యాంత్రికీకరణకు ముందు ఐరోపాలో నూలు ఉత్పత్తి

పారిశ్రామిక విప్లవం 
నార్న్‌బెర్గ్‌లోని వీవర్, సి. 1524

1600 నాటికి ఫ్లెమిష్ శరణార్థులు ఇంగ్లాండు పట్టణాల్లో నూలు వస్త్రాన్ని నేయడం ప్రారంభించారు. అప్పట్లో అక్కడ ఉన్ని, నారలను నేస్తూ ఉండేవారు. అయితే, నూలును ముప్పుగా భావించని గిల్డ్ వారు ఈ ఫ్లెమిష్ వాళ్ళను పట్టించుకోలేదు. నూలు వడకడం, నేయడం వంటి మునుపటి యూరోపియన్ ప్రయత్నాలు 12 వ శతాబ్దంలో ఇటలీలోను, 15 వ శతాబ్దంలో దక్షిణ జర్మనీలోనూ జరిగాయి. కాని పత్తి సరఫరా నిలిపివేసినప్పుడు ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. స్పెయిన్లో, 10 వ శతాబ్దం లోనే మూర్‌లు పత్తి సాగు చేసారు, నూలు వడికారు, నేత నేసారు.

భారతదేశంలో కూలీ బ్రిటన్ కూలీలో ఐదు నుండి ఆరో వంతు దాకా ఉండేది. అందుచేత బ్రిటిషు వస్త్రం భారతీయ వస్త్రంతో పోటీ పడలేకపోయింది. 1700, 1721 లలో బ్రిటిషు ప్రభుత్వం భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటున్న నూలు బట్టల పోటీ నుండి దేశీయ ఉన్ని, నార పరిశ్రమలను రక్షించుకోడానికి కాలికో చట్టాలను చేసింది.

లాంకషైర్‌లో ఉత్పత్తయ్యే ఫుస్టియన్ వస్త్రం బరువైన వస్త్రాల అవసరాన్ని తీర్చేది. గోగునారను పడుగు (నిలువు పోగులు) గాను, నూలును పేక (అడ్డ పోగులు) గానూ వాడి ఈ వస్త్రాన్ని నేసేవారు. రాట్నం మీద వడికిన పత్తి నూలుకు తగినంత బలం ఉండదు కాబట్టి, గోగునారను పడుగుగా వాడేవారు. కానీ ఈ రెండింటి మిశ్రమం 100% నూలు లాగా మృదువుగా ఉండదు. పైగా ఈ ఫుస్టియన్ వస్త్రాన్ని కుట్టడం చాలా కష్టం.

పారిశ్రామిక విప్లవానికి ముందు, నూలు వడకడం, నేయడం ఇళ్ళలోనే చేసేవారు. దేశీయ వినియోగం కోసమే నేసేవారు. పుటింగ్ అవుట్ వ్యవస్థలో కుటీర పరిశ్రమగా కూడా జరిగేది. అప్పుడప్పుడు మాస్టర్ వీవర్ కు చెందిన వర్క్‌షాపులో జరిగేది. పుటింగ్-అవుట్ వ్యవస్థలో, ఇళ్ళవద్దనే పనిచేసే నేత కార్మికులు వర్తకుల కోసం కాంట్రాక్టు ప్రకారం ఉత్పత్తి చేసేవారు. ముడిపదార్థాలు వర్తకులే ఇచ్చేవారు. ఆఫ్ సీజన్లో మహిళలు నూలు వడికితే, పురుషులు నేత నేసేవారు. ఒక్క చేతి మగ్గానికి అవసరమైన నూలు దారాన్ని సరఫరా చెయ్యాలంటే, నాలుగు నుండి ఎనిమిది మంది దాకా రాట్నం మీద నూలు వడికాల్సి వచ్చేది. : 823 

నూలు యంత్రాల ఆవిష్కరణ

1733 లో జాన్ కే, ఒక ఫ్లయింగ్ షటిల్‌ కోసం పేటెంటు పొందాడు. 1747 లో ఒక ముఖ్యమైన మెరుగుదల కూడా చేసాడు. ఈ ఎగిరే ఆసుతో నేతపనివారి ఉత్పత్తి రెట్టింపైంది. నేసేవారికి, వడికేవారికీ మధ్య ముందే ఉన్న అసమతుల్యత (పైన చెప్పిన విధంగా) దీంతో మరింత పెరిగిపోయింది. ఆ తరువాత జాన్ కుమారుడు రాబర్ట్, డ్రాప్ బాక్స్‌ను కనుగొన్నాడు, ఇది దారాల రంగులను మార్చడానికి దోహదపడింది.1760 తరువాత లాంకషైర్ ప్రాంతంలో దీన్ని విస్తృతంగా ఉపయోగించారు. : 821–22 

లూయిస్ పాల్ ఉన్ని నుండి సమమైన మందం గల దారాన్ని తీయగల రోలర్ స్పిన్నింగ్ ఫ్రేమ్, ఫ్లైయర్-అండ్-బాబిన్ వ్యవస్థను తయారుచేసి, పేటెంటు పొందాడు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో బర్మింగ్‌హామ్‌కు చెందిన జాన్ వ్యాట్ సహాయపడ్డాడు. పాల్, వ్యాట్ లు బర్మింగ్‌హామ్‌లో ఒక మిల్లును తెరిచారు. అందులో వారి కొత్త యంత్రాన్ని స్థాపించారు. దీన్ని గాడిద నడిపేది. 1743 లో నార్తాంప్టన్‌లో ఐదు పాల్ - వ్యాట్ యంత్రాలతో, ఒక్కొక్కదానిలో 50 కదురులతో ఒక కర్మాగారాన్ని స్థాపించారు. ఇది సుమారు 1764 వరకు పనిచేసింది. ఇదే విధమైన మిల్లును లియోమిన్స్టర్‌లో డేనియల్ బోర్న్ నిర్మించాడు, కాని ఇది కాలిపోయింది. లూయిస్ పాల్, డేనియల్ బోర్న్ ఇద్దరూ 1748 లో కార్డింగ్ యంత్రాలకు పేటెంట్ పొందారు. వేర్వేరు వేగాలతో ప్రయాణించే రెండు సెట్ల రోలర్ల ఆధారంగా, తరువాత దీనిని మొదటి కాటన్ స్పిన్నింగ్ మిల్లులో ఉపయోగించారు .

పారిశ్రామిక విప్లవం 
వుప్పెర్టల్ లోని ఒక మ్యూజియంలో స్పిన్నింగ్ జెన్నీ మోడల్. 1764 లో జేమ్స్ హార్గ్రీవ్స్ కనుగొన్న ఈ స్పిన్నింగ్ జెన్నీ, విప్లవాన్ని ప్రారంభించిన ఆవిష్కరణలలో ఒకటి.

1764 లో లాంకషైర్‌లోని స్టాన్హిల్ గ్రామంలో, జేమ్స్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. 1770 లో దానికి పేటెంట్ పొందాడు. అనేక కదురులు గల మొదటి ప్రాక్టికల్ స్పిన్నింగ్ ఫ్రేమ్ ఇది. జెన్నీ, అచ్చం రాట్నం లాగానే పనిచేసేది - మొదట దారాన్ని పట్టుకోవడం, తరువాత దాన్ని లాగడం, తరువాత మెలితిప్పడం చేసేది. ఇది చెక్కతో తయారు చేసిన సరళమైన యంత్రం. 1792 లో 40-కదుర్లు గల యంత్రం ఖర్చు £ 6 మాత్రమే అయ్యేది. దీనిని ప్రధానంగా ఇళ్ళలో పనిచేసేవారు వాడేవారు. జెన్నీ ద్వారా తయారైన నూలు దారం స్వల్పంగానే మెలితిరిగి ఉండేది. దీన్ని పేకలో మాత్రమే వాడేవారు, పడుగు దారానికి ఉండాల్సినంత దృఢత్వం దీనికి ఉండేది కాదు.: 825–27 

స్పిన్నింగ్ ఫ్రేమ్ లేదా వాటర్ ఫ్రేమ్‌ను రిచర్డ్ ఆర్క్‌రైట్ అభివృద్ధి చేశాడు, ఇద్దరు భాగస్వాములతో కలిసి అతడు 1769 లో దీనికి పేటెంట్ పొందాడు. గడియారాలు తయారు చేసే జాన్ కే నిర్మించిన స్పిన్నింగ్ మిషనుపై ఈ డిజైన్ పాక్షికంగా ఆధారపడింది. జాన్ కేను ఆర్క్‌రైట్ పనిలో పెట్టుకున్నాడు.: 827–30  ప్రతి కదురు కోసం, నీటి చట్రం నాలుగు జతల రోలర్లను ఉపయోగించింది. ప్రతిదీ ముందు దాని కంటే వేగంతో తిరుగుతూ దారాన్ని బయటకు లాగుతాయి. తరువాత కదురు దాన్ని మెలి తిప్పుతుంది. రోలర్ల మధ్య అంతరం దారం పొడవు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతరం మరీ తక్కువగా ఉంటే దారాలు తెగిపోయేవి, మరీ తక్కువగా ఉంటే దారం ఒకే మందంతో వచ్చేది కాదు. టాప్ రోలర్లు తోలుతో కప్పి, వాటిపై లోడు కోసం బరువులు ఉంచేవారు. బరువుల వలన మెలి తిప్పిన దారం రోలర్లకు ముందు విడిపోకుండా ఉండేది. దిగువ రోలర్లు కలప, లోహాలతో చేసి ఉండేవి. వీటికి గాడి కొట్టి ఉండేది. వాటర్ ఫ్రేమ్ తో తయారయ్యే దారం పడుగులో వాడగలిగేలా ఉండేది. దీంతో బ్రిటన్‌లో 100% నూలు వస్త్రాన్ని తయారు చేయడానికి వీలు కలిగింది. మొదటి కర్మాగారంలో స్పిన్నింగ్ ఫ్రేమ్‌ను గుర్రంతో పనిచేయించారు. ఆర్క్‌రైట్ అతని భాగస్వాములు 1771 లో డెర్బీషైర్‌లోని క్రోమ్‌ఫోర్డ్‌లోని ఒక కర్మాగారంలో నీటి శక్తిని ఉపయోగించారు. దాంతో ఈ ఆవిష్కరణకు వాటర్ ఫ్రేమ్ అనే పేరు వచ్చింది.

పారిశ్రామిక విప్లవం 
శామ్యూల్ క్రాంప్టన్ నిర్మించిన స్పిన్నింగ్ మ్యూల్ ఉదాహరణ. ఈ మ్యూల్ తక్కువ శ్రమతో అధిక-నాణ్యత దారాన్ని ఉత్పత్తి చేసింది. బోల్టన్ మ్యూజియం, గ్రేటర్ మాంచెస్టర్

శామ్యూల్ క్రాంప్టన్ 1779 లో స్పిన్నింగ్ మ్యూల్ తయారు చేసాడు. మ్యూల్ ఒక సంకర జాతి జంతువు. ఈ యంత్రం కూడా స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్‌ల కలయిక అవడంతో దీనికి ఆ పేరు పెట్టాడు. క్రాంప్టన్ యంత్రం చేతితో వడకడం కంటే తక్కువ ఖర్చుతో సన్నటి నూలును ఉత్పత్తి చేసింది. మ్యూల్ లో తయారైన దారానికి పడుగుగా వాడేందుకు సరిపడేంత బలం ఉండేది. అంతిమంగా బ్రిటన్, పెద్ద మొత్తంలో నూలును ఉత్పత్తి చేసి, పోటీలో నిలబడేందుకు తోడ్పడింది.: 832 

పారిశ్రామిక విప్లవం 
వెస్ట్ యార్క్‌షైర్‌లోని లీడ్స్‌లో మార్షల్ టెంపుల్ వర్క్స్ లోపల.

ఆర్క్‌రైట్ పేటెంట్ గడువు ముగియడంతో నూలు సరఫరా బాగా పెరుగుతుందని, నేత కార్మికుల కొరత ఏర్పడుతుందనీ గ్రహించిన ఎడ్మండ్ కార్ట్‌రైట్, నిలువు పవర్ లూమ్ తయారు చేసి, 1785 లో పేటెంట్ పొందాడు. 1776 లో, అతను ఇద్దరు-మనుషులు పనిచేసే మగ్గానికి పేటెంట్ పొందాడు. ఇది మరింత సాంప్రదాయకంగా ఉండేది.: 834  కార్ట్‌రైట్ రెండు కర్మాగారాలను నిర్మించాడు; మొదటిది కాలిపోయింది. రెండవ దాన్ని అతని కార్మికులే ధ్వంసం చేసారు. కార్ట్‌రైట్ మగ్గం రూపకల్పనలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిలో చాలా తీవ్రమైనది దారం తెగిపోవడం. శామ్యూల్ హొర్రోక్స్ 1813 లో చాలా విజయవంతమైన మగ్గం తయారు చేసాడు. హొర్రోక్స్ మగ్గాన్ని 1822 లో రిచర్డ్ రాబర్ట్స్ మెరుగుపరచాడు. వీటిని రాబర్ట్స్, హిల్ & కో. పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.

పత్తికి డిమాండు పెరగడంతో దక్షిణాది అమెరికాలో మొక్కల పెంపకందారులకు ఒక అవకాశాన్ని అందించింది. గింజను తొలగించడానికి మెరుగైన మార్గాన్ని కనుగొంటే అప్‌ల్యాండ్ పత్తి లాభదాయకమైన పంట అవుతుందని భావించారు. ఎలి విట్నీ దాన్ని సవాలుగా తీసుకుని, చవకైన కాటన్ జిన్నును కనిపెట్టాడు. గింజ తీసేందుకు గతంలో రెండు నెలలు పట్టే పనిని పత్తి ఈ జిన్ను యంత్రం ద్వారా ఒక్క రోజులో చెయ్యగలిగారు.

ఈ అభివృద్ధిలో ఔత్సాహికులు పెట్టుబడి పెట్టారు. వీరిలో రిచర్డ్ ఆర్క్‌రైట్ ఒకడు. అతను అనేక ఆవిష్కరణలు చేసినట్లు ఘనత పొందాడు గానీ, వాస్తవానికి వాటిని థామస్ హైస్, జాన్ కే వంటి వ్యక్తులు అభివృద్ధి చేశారు; ఆర్క్‌రైట్ వాళ్లను పోషించాడు, వారి ఆలోచనలకు పేటెంట్లు పొందాడు, వారి కృషికి ఆర్థిక సహాయం చేశాడు, వారు తయారు చేసిన యంత్రాలను రక్షించాడు. కాటన్ మిల్లును స్థాపించాడు. ఉత్పత్తి ప్రక్రియలన్నిటినీ ఒకచోట చేర్చి, కర్మాగారాన్ని నిర్మించాడు. మొదట గుర్రపు శక్తిని, తరువాత నీటి శక్తినీ వినియోగించుకోవడాన్ని ఆచరణలో పెట్టాడు. నూలు తయారీని ఒక యాంత్రిక పరిశ్రమగా చేసాడు.

ఇతర ఆవిష్కర్తలు వడకడం లోని వివిధ దశల (కార్డింగ్, మెలితిప్పడం, రోలింగ్) సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా నూలు సరఫరా బాగా పెరిగింది. త్వరలోనే వస్త్ర యంత్రాలను నడపడానికి ఆవిరి శక్తి వాడడం మొదలైంది. వస్త్ర కర్మాగారాల విస్తరణ కారణంగా 19 వ శతాబ్దం ప్రారంభంలో మాంచెస్టర్‌ను కాటనోపోలిస్ అనేవారు.

యాంత్రీకరణ వలన నూలు వస్త్రం ధర గణనీయంగా తగ్గినప్పటికీ, 19 వ శతాబ్దం మధ్య నాటికి యంత్రంపై నేసిన వస్త్రం, భారతీయ చేనేత వస్త్రపు నాణ్యతను అందుకోలేకపోయింది. భారతీయ పత్తి నాణ్యత, పనివారి నైపుణ్యాలు దీనికి కారణం. అయితే, ముతగ్గా ఉండే ఆ బ్రిటిషు వస్త్రమే మార్కెట్లో భారతీయ చేనేత వస్త్రం కంటే చవగ్గా లభించి, చివరికి భారతీయ చేనేత పరిశ్రమను నాశనం చేసింది.

ఉన్ని

ఐరోపాలో యాంత్రిక స్పిన్నింగును కనుగొనే తొలి ప్రయత్నాలు ఉన్నితో మొదలయ్యాయి; అయితే, ఉన్ని వడకడాన్ని యాంత్రీకరించడం పత్తిని యాంత్రీకరణ కంటే చాలా కష్టమని తేలింది. పారిశ్రామిక విప్లవం సమయంలో ఉన్ని స్పిన్నింగులో ఉత్పాదకత మెరుగుదల గణనీయంగా ఉంది కాని పత్తితో పోలిస్తే చాలా తక్కువ.

పట్టు

పారిశ్రామిక విప్లవం 
లోంబే మిల్ ను. డెర్బీ సిల్క్ మిల్ గా పునర్నిర్మించారు.

డెర్బీలోని జాన్ లోంబే తయారుచేసిన నీటితో నడిచే పట్టు మిల్లు మొదటి అత్యంత యాంత్రిక కర్మాగారం. ఇది 1721 నాటికి పనిచేయడం మొదలైంది. లోంబే ఇటలీలో ఉద్యోగం చేస్తూ, పారిశ్రామిక గూఢచారిగా పనిచేసి పట్టు దారం తయారీ నేర్చుకున్నాడు; అయితే, ఇటాలియన్ పట్టు పరిశ్రమ దాని రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకున్నందున, ఆ సమయంలో పరిశ్రమ స్థితి ఎలా ఉందో తెలియదు. లోంబే కర్మాగారం సాంకేతికంగా విజయవంతం అయినప్పటికీ, పోటీ లేకుండా చేసుకునేందుకు గాను ఇటలీ నుండి ముడి పట్టు సరఫరా నిలిపివేసారు. తయారీని ప్రోత్సహించడానికి లండన్ టవర్లో ప్రదర్శించిన లోంబే యంత్రాల నమూనాల కోసం ఖర్చులు రాజకుటుంబం చెల్లించింది.

ఇనుము పరిశ్రమ

పారిశ్రామిక విప్లవం 
రివర్బరేటరీ ఫర్నెస్ బొగ్గును ఉపయోగించి చేత ఇనుమును ఉత్పత్తి చేసేది. దహనమయ్యే బొగ్గు, కరుగుతున్న ఇనుముతో కలవకుండా వేరుగా ఉంటుంది. సల్ఫర్, సిలికా వంటి మలినాలతో ఇనుము కలుషితమవదు. ఇది ఇనుము ఉత్పత్తిని పెంచడానికి మార్గం తెరిచింది.
పారిశ్రామిక విప్లవం 
ఐరన్ బ్రిడ్జ్, ష్రాప్‌షైర్, ఇంగ్లాండ్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనుముతో నిర్మించిన వంతెన. 1781 లో తయారైంది.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇనుము ఉత్పత్తి గణాంకాలు

బార్ ఇనుము, అనేక ఇనుప వస్తువులు తయారు చేసే ముడి రూపం. మేకులు, తీగ, కీళ్ళు, గుర్రపు నాడాలు, వాగన్ చక్రాలు, గొలుసులు మొదలైన వస్తువులను తయారు చేయడానికీ, నిర్మాణాల్లో వాడే ఆకృతుల కోసం గానూ దీన్ని వాడుతారు. కొద్ది మొత్తంలో బార్ ఇనుమును ఉక్కు తయారీలో వాడేవారు. చేత ఇనుముతో కుండలు, పొయ్యిలు, ఇతర పెళుసు వస్తువులనూ తయారు చేసేవారు. చేత ఇనుమును శుద్ధి చేసి, బార్ ఇనుముగా మార్చేవారు. ఈ ప్రక్రియలో గణనీయమైన నష్టాలు వచ్చేవి. బ్లూమరీ ప్రక్రియ ద్వారా కూడా బార్ ఇనుము తయారు చేసేవారు. 18 వ శతాబ్దం చివరి వరకు ఇనుము కరిగించే ఏకైక ప్రక్రియ ఇదే.

1720 లో యుకెలో బొగ్గుతో 20,500 టన్నులు, కోక్‌తో 400 టన్నుల చేత ఇనుమును ఉత్పత్తి చేసారు. 1750 లో బొగ్గు ఇనుము 24,500 టన్నులు, కోక్ ఇనుము 2,500 టన్నులు ఉత్పత్తి చేసారు. 1788 లో బొగ్గు చేతఇనుము ఉత్పత్తి 14,000 టన్నులు కాగా, కోక్ ఇనుము ఉత్పత్తి 54,000 టన్నులు. 1806 లో బొగ్గు చేతఇనుము 7,800 టన్నులు, కోక్ చేతఇనుము 250,000 టన్నులు ఉత్పత్తి చేసారు. : 125 

1750 లో యునైటెడ్ కింగ్‌డమ్ 31,200 టన్నుల బార్ ఇనుమును దిగుమతి చేసుకుంది. చేత ఇనుమును శుద్ధి చేసిగాని, బొగ్గును ఉపయోగించి తయారు చేసిగానీ 18,800 టన్నుల బార్ ఇనుమును ఉత్పత్తి చేసింది. కోక్ ఉపయోగించి 100 టన్నులను ఉత్పత్తి చేసింది. 1796 లో యునైటెడ్ కింగ్‌డమ్ 125,000 టన్నుల బార్ ఇనుమును కోక్‌తోటి, 6,400 టన్నులు బొగ్గుతోటీ తయారు చేసింది. దిగుమతులు 38,000 టన్నులు, ఎగుమతులు 24,600 టన్నులు. 1806 లో యునైటెడ్ కింగ్‌డమ్ బార్ ఇనుమును దిగుమతి చేసుకోలేదు కాని 31,500 టన్నులను ఎగుమతి చేసింది. : 125 

ఇనుము ప్రాసెస్‌లో నూత్న ఆవిష్కరణలు

పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము పరిశ్రమలో వచ్చిన ఒక పెద్ద మార్పు - కలప, ఇతర జీవ ఇంధనాల స్థానంలో బొగ్గును ఇంధనంగా వాడడం. చెట్లను కొట్టి వాటిని రాక్షసి బొగ్గుగా మార్చడం కంటే బొగ్గును తవ్వి తీయడం చాలా తక్కువ శ్రమతో అయిపోయేది. పైగా బొగ్గు కలప కంటే చాలా సమృద్ధిగా లభిస్తుంది. ఇనుము ఉత్పత్తి భారీగా పెరుగుతున్న 18 వ శతాబ్దం చివరి కాలానికి కలప లభ్యత కూడా తగ్గుతూ వచ్చింది. : 122  1750 నాటికి రాగి, సీసం లను శుద్ధిచెయ్యడంలోను, గాజు తయారీలోనూ బొగ్గు స్థానంలో కోక్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఇనుమును కరిగించడం, శుద్ధి చేయడంలో ఇంధనంగా వాడే బొగ్గు, కోక్ ల లోని అధిక గంధకం (సల్ఫరు) కారణంగా, రాక్షసి బొగ్గు వాడి తయారు చేసిన ఇనుము కంటే నాసిరకంగా ఉండేది. బొగ్గును కోక్‌గా మార్చడం వల్ల సల్ఫర్ కంటెంట్ కొద్దిగా తగ్గుతుంది.: 122–25 

పారిశ్రామిక విప్లవానికి ముందు ఇనుము పరిశ్రమ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న మరో అంశం - నీటి శక్తి సరిపోకపోవడం. ఈ పరిమితిని ఆవిరి ఇంజను అధిగమించింది.

ఇనుమును శుద్ధి చేసేందుకు బొగ్గును వాడడం విప్లవానికి కొంతకాలం ముందే మొదలైంది. 1678 తరువాత సర్ క్లెమెంట్ క్లర్క్ తదితరులు కనిపెట్టిన కొత్త పద్ధతుల్లో, రివర్బరేటరీ ఫర్నెస్‌లలో (వీటిని కుపోలా అనేవారు) బొగ్గును వాడేవారు. ముడిఖనిజం, రాక్షసి బొగ్గు లేదా బొగ్గుల మిశ్రమాన్ని మండించినపుడు ఆక్సైడు ముడిపదార్థం రిడక్షను చర్యకు లోనై ఇనుము తయారయ్యేది. గంధకం లాంటి మలినాలు ఇనుము లోకి చేరకపోవడం ఈ పద్ధతి లోని విశిష్టత. ఈ సాంకేతికతను 1678 నుండి సీసం తయారీ లోను, 1687 నుండి రాగి తయారీ లోనూ వాడడం మొదలుపెట్టారు.

1709 లో అబ్రహాం డార్బీ కోల్‌బ్రూక్‌డేల్ లోని తన బ్లాస్ట్ ఫర్నెస్ లో కోక్ వాడకాన్ని ప్రవేశపెట్టాడు. అయితే, ఆ పద్ధతిలో తయారు చేసిన దుక్క ఇనుము, చేత ఇనుము తయారీకి పనికి వచ్చేలా లేదు. దాన్ని చాలా వరకు కుండలు, పాత్రల వంటి పోత ఇనుము వస్తువుల తయారీకే వాడారు. అతడి పద్ధతిలో తయారు చేసిన పాత్రలు అతడి ప్రత్యర్థులు తయారు చేసిన వాటికంటే పల్చగా, చవగ్గా ఉండడంతో అతడికి ప్రయోజనం కలిగింది.

1755-56 వరకు కోక్ దుక్క ఇనుమును చేత ఇనుము తయారీ కోసం వాడడం దాదాపుగా లేనట్లే. అబ్రహాం డార్బీ కొడుకు అబ్రహాం డార్బీ-2 హార్షే, కెట్లీ లలో ఫర్నెస్‌లను నిర్మించడంతో ఇది మొదలైంది. ఈ ఫర్నెస్‌లలో నీటితో నడిచే బెల్లోస్ ఉండేవి. నీటిని న్యూకామెన్ ఆవిరి ఇంజనుతో పంపు చేసేవారు. న్యూకామెన్ ఇంజనే నేరుగా అవసరమైనంత గాలిని స్థిరంగా ఊదలేదు కాబట్టి, ఇంజన్ను నేరుగా గాలి ఊదే సిలిండర్లకు తగిలించేవారు కాదు. అబ్రహాం డార్బీ-3 1768 లో డేల్ కంపెనీని చేజిక్కించుకున్నపుడు అక్కడ ఇలాంటి నీటితో నడిచే గాలి ఊదే సిలిండర్లను స్థాపించాడు. డేల్ కంపెనీ, తన గనుల్లో నీటిని తోడేందుకు అనేక న్యూకామెన్ ఇంజన్లను వాడేది. ఆ ఇంజన్లకు అవసరమైన విడి భాగాలను కూడా తయారుచేసి దేశమంతటా అమ్మేది.: 123–25 

ఆవిరి శక్తి

పారిశ్రామిక విప్లవం 
వాట్ ఆవిరి యంత్రం.ఆవిరి యంత్రపు రెసిప్రొకేటింగ్ మోషన్ను పారిశ్రామిక అవరాలకు అవసరమైన రోటరీ మోషనుగా జేమ్స్ వాట్ మార్చాడు. వాట్ తదితరులు ఆవిరి యంత్రం సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచారు.

ఒకచోట స్థావరంగా ఉండే ఆవిరి యంత్రపు అభివృద్ధి పారిశ్రామిక విప్లవం లోని ముఖ్యమైన అంశం. అయితే, పారిశ్రామిక విప్లవ ప్రారంభ కాలంలో, పరిశ్రమలకు అవసరమైన శక్తి చాలావరకు నీరు, గాలి ద్వారా సమకూరేది. 1800 నాటికి బ్రిటన్లో ఆవిరి ద్వారా అందిన శక్తి 10,000 హార్స్‌పవర్‌ ఉంటుందని అంచనా. 1815 నాటికి ఆవిరి శక్తి 210,000 హెచ్‌పికి పెరిగింది.

1698 లో థామస్ సావెరీ మొట్టమొదటగా ఆవిరి శక్తిని వాణిజ్యపరంగా విజయవంతంగా ఉపయోగించారు. అతను లండన్లో తక్కువ-లిఫ్ట్ గల వాటర్ పంపును నిర్మించి పేటెంట్ పొందాడు. ఇది ఒక హార్స్‌పవర్ (హెచ్‌పి) ను ఉత్పత్తి చేసింది. అనేక నీటి పనులలోను, కొన్ని గనులలోనూ దీన్ని ఉపయోగించారు. అందుకే దాని పేరు ది మైనర్స్ ఫ్రెండ్ అని వచ్చింది. సావెరీ పంపు తక్కువ హార్స్‌పవర్ అవసరాలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండేది. కానీ పెద్ద పరిమాణాలలో బాయిలర్ పేలుళ్లకు గురయ్యే అవకాశం ఉండేది. 18 వ శతాబ్దం చివరి వరకు సావెరీ పంపులు ఉత్పత్తి అయ్యాయి.  

మొట్టమొదటి విజయవంతమైన పిస్టన్ ఆవిరి యంత్రాన్ని థామస్ న్యూకోమెన్ 1712 కి తొలిసారిగా ప్రవేశపెట్టాడు. ఇంజన్ను ఉపరితలంపై ఉంచి లోతైన గనుల్లోని నీటిని తోడి వేసేందుకు బ్రిటన్‌లో అనేక న్యూకామెన్ ఇంజన్లను ఏర్పాటు చేసారు. ఇవి పెద్ద యంత్రాలు, వీటిని నిర్మించడానికి గణనీయమైన మూలధనం అవసరం. ఇది 5 హెచ్‌పి పైగానే ఉత్పత్తి చేసేవి. మునిసిపల్ నీటి సరఫరా పంపులను నడపడానికి కూడా వీటిని ఉపయోగించారు. ఆధునిక ప్రమాణాల ప్రకారం అవి చాలా అసమర్థ మైనవే. కాని బొగ్గు గనుల నుండి ఇవి నీటిని తోడివేయడంతో, గనులను మరింత లోతుగా తవ్వి ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే వీలు కలిగింది. న్యూకామెన్ ఇంజన్లకు కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, వీటి విశ్వసనీయత, నిర్వహణ సులభం కావడం వంటి కారణాల వలన 19 వ శతాబ్ది తొలి దశాబ్దాల వరకు బొగ్గు క్షేత్రాలలో వీటి ఉపయోగం కొనసాగుతూనే వచ్చింది. ఈ ఇంజన్లు 1722 లో హంగరీతో మొదలుపెట్టి, 1729 లో న్యూకామెన్ మరణించేనాటికి జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్లకు వ్యాపించాయి. 1733 లో ఉమ్మడి పేటెంట్ గడువు ముగిసేటప్పటికి మొత్తం 110 ఇంజన్లను నిర్మించినట్లు, వాటిలో 14 విదేశాలలో ఉన్నట్లూ తెలుస్తోంది. 1770 లలో ఇంజనీర్ జాన్ స్మెటన్ చాలా పెద్ద ఇంజన్లను నిర్మించాడు. వాటిలో అనేక మెరుగుదలలను ప్రవేశపెట్టాడు. 1800 నాటికి మొత్తం 1,454 ఇంజన్లు తయారు చేసారు.

పారిశ్రామిక విప్లవం 
న్యూకామెన్ ఇంజను. తొట్టతొలి పిస్టను స్టీమ్ ఇంజను. ఆ తరువాతి కాలంలో తయారైన స్టీమ్ ఇంజన్లు పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయి.

పనిచేసే పద్ధతుల్లో మౌలికమైన మార్పులు తీసుకువచ్చినది స్కాటు దేశస్థుడు జేమ్‌స్ వాట్. తన వ్యాపార భాగస్వామి, ఇంగ్లీషు వాడైన మాథ్యూ బోల్టన్ మద్దతుతో 1778 లో అతడు ఆవిరి ఇంజన్ను అభివృద్ధి చేసాడు. అందులో అతడు అనేక విప్లవాత్మకమైన మార్పులు చేసి మెరుగుపరచాడు. వాతావరణ పీడనంతో కాకుండా ఆవిరిని పీడనంతో పిస్టన్ను నడపడం, స్టీం జాకెట్‌ను వాడడం, ప్రత్యేక స్టీమ్ కండెన్సరు మొదలైనవి వీటిలో ముఖ్యమైనవి. స్టీమ్ కండెన్సరు వలన చల్లబరచే నీటి అవసరం లేకుండా పోయింది. అలాగే, స్టీమ్ జాకెట్, సిలిండరులోనే ఆవిరి ద్రవీభవించకుండా నిరోధించి సమర్ధతను పెంచింది. ఈ మెరుగుదలల కారణంగా, బోల్టన్-వాట్ ఇంజను న్యూకామెన్ ఇంజను వాడే ఇంధనంలో 20-25% ఇంధనం మాత్రమే ఖర్చు చేసేది. 1795 బోల్టన్ అండ్ వాట్ సంస్థ ఈ ఇంజన్లు తయారు చేసేందుకు సోహో ఫౌండ్రీని స్థాపించింది.

1783 నాటికి వాట్ ఆవిరి యంత్రాన్ని అభివృద్ధి చేసి, పూర్తిగా డబుల్-యాక్టింగ్ రొటేటివ్ రకంగా మార్చారు. దీంతో, ఈ యంత్రాన్ని కర్మాగారాల్లో, మిల్లుల్లో రోటరీ యంత్రాలను దీనికి తగిలించి నేరుగా నడపడానికి వీలైంది. వాట్ తయారు చేసిన రెండు ప్రాథమిక ఇంజను రకాలు వాణిజ్యపరంగా చాలా విజయవంతమయ్యాయి. 1800 నాటికి, బౌల్టన్ & వాట్ సంస్థ 496 ఇంజన్లను నిర్మించింది. వీటిలో 164 పంపులను నడపడానికి, 24 బ్లాస్ట్ ఫర్నేసుల కోసం, 308 మిల్లు యంత్రాలను నడిపేందుకూ వాడారు. చాలా ఇంజన్లు 5 నుండి 10 హెచ్‌పి సామర్థ్యంతో ఉండేవి.

ఇంజను లేత్, ప్లేనింగ్, మిల్లింగ్, షేపింగ్ మెషీన్లు వంటి మెషీన్ టూల్‌ల అభివృద్ధితో, ఇంజన్ల లోహ భాగాలను సులభంగా, కచ్చితత్వంతో తయారు చెయ్యడానికి వీలు కలిగింది. దాంతో పెద్ద, శక్తివంతమైన ఇంజనులను నిర్మించడం సాధ్యమైంది.

20 వ శతాబ్దం ప్రారంభంలో విస్తృతంగా విద్యుదీకరణ జరిగే వరకు, చిన్నచిన్న పారిశ్రామిక శక్తి అవసరాలను జంతువులు, మానవుల ద్వారానే తీరేది. హ్యాండిల్‌ను చేతితో తిప్పడం, గుర్రాలు తిప్పే యంత్రాలు మొదలైన పారిశ్రామిక యంత్రాలు వీటిలో ఉన్నాయి.

యంత్ర పరికరాలు

పారిశ్రామిక విప్లవం 
మౌడ్స్లే తయారు చేసిన 1797, 1800 ల నాటి స్క్రూ-కట్టింగ్ లేత్
పారిశ్రామిక విప్లవం 
1818 నాటి మిడిల్‌టౌన్ మిల్లింగ్ యంత్రం. రాబర్ట్ జాన్సన్ సిమియన్ నార్త్‌లకు దీనితో సంబంధం ఉంది

పారిశ్రామిక యుగ పూర్వం యంత్రాలను వివిధ హస్తకళాకారులు నిర్మించారు — యాంత్రికులు నీరు, విండ్‌మిల్లులను నిర్మించారు, వడ్రంగులు చెక్క ఫ్రేమింగ్‌ను తయారు చేశారు. కమ్మర్లు, టర్నర్‌లు లోహ భాగాలను తయారు చేశారు. చెక్కతో చేసిన యంత్రాలు ఉష్ణోగ్రత, తేమల్లో మార్పులకు అనుగుణంగా కొలతలు మారి, వాటి కీళ్ళు కాలక్రమేణా వదులయ్యేవి. పారిశ్రామిక విప్లవం పురోగమిస్తున్నప్పుడు, లోహ భాగాలు, ఫ్రేమ్‌లతో కూడిన యంత్రాలు ఉపయోగం లోకి వచ్చాయి. మెటల్ భాగాల ఇతర ముఖ్యమైన ఉపయోగాలు తుపాకీ, స్క్రూలు, బోల్టులు, నట్ల వంటి బిగించే మరలు. ఆయా భాగాలు తయారు చేయడంలో కచ్చితత్వం అవసరం కూడా ఉంది. కచ్చితత్వం వలన మెరుగైన పని యంత్రాలను తయారు చేసేందుకు, విడి భాగాల మార్పిడికీ, బిగించే మరల ప్రామాణీకరణకూ వీలు కలుగుతుంది.

లోహ భాగాల కోసం ఉద్భవించిన డిమాండు అనేక యంత్ర పరికరాల అభివృద్ధికి దారితీసింది. 18 వ శతాబ్దంలో చేతి గడియారాలు, గోడ గడియారాల తయారీదారులు, శాస్త్రీయ పరికరాల తయారీదారులు అభివృద్ధి చేసిన సాధనాలలో వాటికి మూలాలు ఉన్నాయి.

యంత్ర పరికరాలు రాక ముందు సుత్తి, ఆకురాయి, చిత్రిక, రంపం, ఉలి వంటి ప్రాథమిక చేతి పనిముట్లను ఉపయోగించి లోహాలపై మానవీయంగా పని చేసేవారు. పర్యవసానంగా, లోహ యంత్ర భాగాల వాడకం వీలైనంత తక్కువగా ఉండేది. చేతి ఉత్పత్తి పద్ధతులు చాలా శ్రమతో కూడుకున్నవి, ఖరీదైనవీ. పైగా వీటితో కచ్చితత్వం సాధించడం కష్టం.

1774 లో జాన్ విల్కిన్సన్ కనుగొన్న సిలిండర్ బోరింగ్ యంత్రం, కచ్చితత్వం గల పెద్ద యంత్ర పరికరాల్లో మొట్టమొదటిది. ఆవిరి ఇంజన్లలో పెద్ద వ్యాసం గల సిలిండర్లను బోరింగ్ చేయడానికి దీన్ని ఉపయోగించారు. విల్కిన్సన్ బోరింగ్ యంత్రం అంతకు ముందు ఫిరంగి బోరింగు కోసం ఉపయోగించిన కాంటిలివరు యంత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో కట్టింగ్ సాధనం ఒక బీమ్‌ మీద అమర్చబడి ఉంటుంది, అది సిలిండరు గుండా బోరింగు చేసుకుంటూ పోతుంది. సిలిండరును రెండు చివర్ల వద్ద వెలుపలి వైపున పట్టుకుని ఉంటుంది.

ప్లేనింగ్ మెషిన్, మిల్లింగ్ మెషిన్, షేపింగ్ మెషీన్ లను 19 వ శతాబ్దం తొలి దశాబ్దాలలో అభివృద్ధి చేసారు. మిల్లింగ్ యంత్రాన్ని అప్పుడే కనుగొన్నప్పటికీ, 19 వ శతాబ్దంలో తరువాతి కాలం వరకు దీన్ని అంతగా వాడలేదు.

19 వ శతాబ్దం ప్రారంభంలో మెషిన్ టూల్ తయారీదారుల పాఠశాలలో శిక్షణ ఇచ్చిన హెన్రీ మౌడ్స్‌లే, ఉత్కృష్టమైన సామర్థ్యం కలిగిన మెకానిక్. అతడు వూల్విచ్‌లోని రాయల్ ఆర్సెనల్ వద్ద ఉద్యోగం చేసాడు. అతను జాన్ వెర్బ్రుగెన్ కు చెందిన రాయల్ గన్ ఫౌండ్రీలో అప్రెంటిస్‌గా పనిచేశాడు. 1774 లో, జాన్ వెర్బ్రుగెన్ వూల్విచ్‌లో ఒక క్షితిజ సమాంతర బోరింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ లో మొదటి పారిశ్రామిక పరిమాణం లోని లేత్. కచ్చితమైన హస్తనైపుణ్యం అవసరమయ్యే హై-సెక్యూరిటీ మెటల్ తాళాల ఉత్పత్తి కోసం జోసెఫ్ బ్రామా మౌడ్స్‌లేను నియమించుకున్నాడు. స్లైడ్ రెస్ట్ లేత్‌తో సారూప్యత కలిగిన లేత్‌కు బ్రామా పేటెంట్ పొందాడు. స్పిండిల్ లీడ్ స్క్రూ మధ్య మార్చగల గేర్‌లను ఉపయోగించడం ద్వారా వివిధ పిచ్‌లు గల మరలను కత్తిరించగల స్లైడ్ రెస్ట్ లాత్‌పై మౌడ్స్‌లే నైపుణ్యం సాధించాడు. దీన్ని కనుగొనడానికి ముందు మరలు తయారు చెయ్యడంలో అంతటి కచ్చితత్వం ఉండేది కాదు.: 392–95  స్లైడ్ రెస్ట్ లేత్‌ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తారు. ఇది పూర్తిగా మౌడ్స్‌లే ఆలోచన కానప్పటికీ, లీడ్ స్క్రూ, స్లైడ్ రెస్ట్, చేంజ్ గేర్‌ల కలయికను ఉపయోగించి, ఓ పనిచేసే లేత్‌ను నిర్మించిన మొదటి వ్యక్తి ఆయన.: 31, 36 

మౌడ్స్‌లే బ్రామా ఉద్యోగాన్ని వదిలి తన సొంత దుకాణాన్ని స్థాపించాడు. పోర్ట్స్‌మౌత్ బ్లాక్ మిల్స్‌లో రాయల్ నేవీ కోసం పుల్లీ బ్లాకులను తయారు చేసే యంత్రాలను నిర్మించడంలో అతను నిమగ్నమయ్యాడు. ఈ యంత్రాలు పూర్తిగా లోహాలతో తయారైనవి, సామూహికంగా ఉత్పత్తి అయిన, మార్చుకోగలిగిన విడి భాగాలను తయారుచేసే మొదటి యంత్రాలు. స్థిరత్వం, కచ్చితత్వం గురించి మౌడ్స్‌లే నేర్చుకున్న పాఠాలను యంత్ర పరికరాల అభివృద్ధిలో ఉపయోగించాడు. రిచర్డ్ రాబర్ట్స్, జోసెఫ్ క్లెమెంట్, జోసెఫ్ విట్‌వర్త్ వంటి వారితో కూడిన ఒక తరానికి వీటిపై తన వర్క్‌షాప్‌లలో శిక్షణ ఇచ్చాడు.

డెర్బీకి చెందిన జేమ్స్ ఫాక్స్, లీడ్స్‌కు చెందిన మాథ్యూ ముర్రే లు, శతాబ్ది తొలి మూడవ భాగంలో యంత్ర పరికరాలను ఎగుమతిలో అరోగ్యకరమైన వ్యాపారం చేసారు. రాబర్ట్స్ అధిక-నాణ్యత యంత్ర పరికరాల తయారీదారు. కచ్చితమైన వర్క్‌షాప్ కొలత కోసం జిగ్స్, గేజ్‌ల వాడకానికి అతడు మార్గదర్శకుడు.

పారిశ్రామిక విప్లవం సమయంలో తుపాకీలు, బోల్టులు, నట్లు, మరికొన్ని పరిశ్రమలు తప్పించి భారీగా ఉత్పత్తి చేసే లోహపు విడి భాగాలు పెద్దగా ఉండేవి కావు. అందువల్ల యంత్ర పరికరాల ప్రభావం అంత గొప్పగా ఏమీ లేదు. 19 వ శతాబ్దం ఆరంభంలో భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసిన లోహ భాగాలను పరస్పరం మార్చుకునేలా చేసే పద్ధతులను వాడి, తుపాకీల విడి భాగాలను తయారు చేసిన ఘనత అమెరికా యుద్ధ విభాగానికి చెందుతుంది.

ప్రాథమిక యంత్ర సాధనాలను ఆవిష్కరించిన తరువాతి అర్ధ శతాబ్దంలో, విలువ ప్రకారం చూస్తే, యంత్ర పరిశ్రమ అమెరికా ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద పారిశ్రామిక రంగంగా మారింది.

రసాయనాలు

పారిశ్రామిక విప్లవం సమయంలో జరిగిన మరో ముఖ్యమైన అభివృద్ధి, పెద్ద ఎత్తున రసాయనాల ఉత్పత్తి. వీటిలో మొదటిది 1746 లో ఆంగ్లేయుడు జాన్ రోబక్ ( జేమ్స్ వాట్ మొదటి భాగస్వామి) కనుగొన్న సీడ్ ఛాంబర్ ప్రక్రియ. దీని ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసాడు. ఖరీదైన గాజు పాత్రలకు బదులుగా చౌకైన సీసపు పలకలతో చేయడం ద్వారా తయారీ ఖర్చు తగ్గింది, దాంతో తయారీ పరిమాణాన్ని అతను బాగా పెంచగలిగాడు. ప్రతిసారీ కొద్ది పరిమాణంలో తయారు చేయడానికి బదులు, ఈ పద్ధతిలో అతను తడవకు సుమారు 50 కిలోల ఆమ్లాన్ని తయారు చెయ్యగలిగాడు. ఇది పూర్వపు పద్ధతి కంటే కనీసం పది రెట్లు హెచ్చు.

పెద్ద ఎత్తున క్షార ఉత్పత్తి కూడా ఆ కాలంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. 1791 లో నికోలస్ లెబ్లాంక్, సోడియం కార్బోనేట్ ఉత్పత్తికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. లెబ్లాంక్ ప్రక్రియలో సోడియం క్లోరైడ్‌తో సల్ఫ్యూరిక్ ఆమ్లం చర్య జరపడం ద్వారా సోడియం సల్ఫేట్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం వెలువడేవి. సోడియం సల్ఫేట్‌ను, సున్నపురాయి (కాల్షియం కార్బోనేట్), బొగ్గుతో వేడి చేసినపుడు సోడియం కార్బోనేట్, కాల్షియం సల్ఫైడ్ మిశ్రమం వెలువడుతుంది. ఈ మిశ్రమంలో నీటిని కలుపినపుడు సోడియం కార్బోనేట్‌ నీటిలో కరిగి, కాల్షియం సల్ఫైడ్ విడివడుతుంది. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో కాలుష్యం వెలువడేది (హైడ్రోక్లోరిక్ ఆమ్లం మొదట్లో గాలికి వదిలేవారు. కాల్షియం సల్ఫైడ్ పనికిరాని వ్యర్థ ఉత్పత్తి). ఏది ఏమయినప్పటికీ, గతంలో కొన్ని మొక్కలను (బరిల్లా) కాల్చడం ద్వారా తయారు చేసిన పద్ధతితో పోలిస్తే, ఈ ఈ సింథటిక్ సోడా యాష్ పద్ధతి ఆర్థికంగా లాభదాయకమైనది.

ఈ రెండు రసాయనాలు చాలా ముఖ్యమైనవి. అవి అనేక ఇతర ఆవిష్కరణలకు మూల కారణమయ్యాయి. అనేక చిన్నాచితకా కార్యకలాపాల స్థానంలో ఈ కొత్త, మరింత చవకైన, మరింతగా నియంత్రించదగిన తయారీ ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. గాజు, వస్త్రం, సబ్బు, కాగితపు పరిశ్రమలలో సోడియం కార్బోనేట్‌ను విరివిగా వాడుతారు. సల్ఫ్యూరిక్ ఆమ్లపు తొలి ఉపయోగాల్లో ఇనుము, ఉక్కుల పిక్లింగ్ (తుప్పు తొలగించడం), వస్త్రాల బ్లీచింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త క్లాడ్ లూయిస్ బెర్తోలెట్ చేసిన ఆవిష్కరణల ఆధారంగా సుమారు 1800 లో స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త చార్లెస్ టెనాంట్ బ్లీచింగ్ పౌడరును (కాల్షియం హైపోక్లోరైట్) అభివృద్ధి చేసి, వస్త్ర పరిశ్రమలో బ్లీచింగ్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాడు. గతంలో బ్లీచింగు చెయ్యాలంటే వస్త్రాలను క్షారాల్లో లేదా పుల్లని పాలలో నానబెట్టి, తరువాత బ్లీచింగు క్షేత్రాల్లో ఎండబెట్టేవారు. ఈ కొత్త పద్ధతి వలన, బ్లీచింగుకు అవసరమైన సమయం బాగా తగ్గిపోయింది (నెలల నుండి రోజుల్లోకి). నార్త్ గ్లాస్గోలోని సెయింట్ రోలాక్స్ వద్ద ఉన్న టెనాంట్ కర్మాగారం ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన కర్మాగారంగా మారింది.

1860 తరువాత రసాయన ఆవిష్కరణల దృష్టి రంగులపై పడింది. జర్మనీ బలమైన రసాయన పరిశ్రమను నిర్మించి, ఈ రంగంలో నాయకత్వ స్థానం పొందింది. 1860-1914 కాలంలో ఔత్సాహిక రసాయన శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతులను తెలుసుకోవడానికి జర్మన్ విశ్వవిద్యాలయాలకు తరలివచ్చారు. బ్రిటన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇలాంటి పరిశోధనా విశ్వవిద్యాలయాలు లేవు. అంచేత, జర్మనీలో శిక్షణ పొందిన రసాయన శాస్త్రవేత్తలను నియమించుకునేవారు.

సిమెంటు

పారిశ్రామిక విప్లవం 
థేమ్స్ టన్నెల్ (1843 లో తెరిచారు).
నీటి అడుగున నిర్మించిన తొట్టతొలి సొరంగంలో సిమెంటు ఉపయోగించారు.

1824 లో జోసెఫ్ ఆస్పిడిన్ పోర్ట్‌ల్యాండ్ సిమెంటు తయారుచేసే రసాయనిక పద్ధతిని రూపొందించి పేటెంటు పొందాడు. నిర్మాణ కార్యక్రమాల్లో ఇదొక పెద్ద ముందడుగు. బంకమట్టి, సున్నపురాయి లను 1,400 oC వరకు వేడి చేసి, ఆ తరువాత దాన్ని పొడి చేసే పద్ధతి ఇది. ఈ పొడిని ఇసుక, గులక, నీటితో కలిపి కాంక్రీటు తయారుచేసాడు. ఆ తరువాత చాలా ఏళ్ళకు మార్క్ ఐసంబార్డ్ బ్రూనెల్ అనే ప్రఖ్యాత ఇంజనీరు థేమ్‌స్ సొరంగాన్ని ఈ పోర్ట్‌లాండ్ సిమెంటు తోనే నిర్మించాడు. లండన్ మురికినీటి పారుదల వ్యవస్థ నిర్మాణంలోనూ సిమెంటును పెద్దయెత్తున ఉపయోగించారు.

గ్యాస్ లైటింగ్

పారిశ్రామిక విప్లవపు మలిదశలో వచ్చిన మరొక ప్రధాన పరిశ్రమ గ్యాస్ లైటింగ్. ఇతరులు ఇదే విధమైన ఆవిష్కరణను వేరే చోట చేసినప్పటికీ, పెద్ద ఎత్తున దీన్ని ప్రవేశ పెట్టినది మాత్రం బౌల్టన్ & వాట్ ఉద్యోగి విలియం ముర్డోక్. ఈ ప్రక్రియలో కొలిమిలో బొగ్గును పెద్ద ఎత్తున గ్యాసిఫికేషన్ చేయడం, ఆ వాయువును శుద్ధి చెయ్యడం (సల్ఫర్, అమ్మోనియా, భారీ హైడ్రోకార్బన్‌ల తొలగింపు), దాని నిల్వ చెయ్యడం, పంపిణీ చెయ్యడం ఈ ప్రక్రియలో భాగాలు. మొదటి గ్యాస్ లైటింగ్ సేవలు 1812 - 1820 మధ్య లండన్లో మొదలుపెట్టారు. వారు త్వరలోనే యునైటెడ్ కింగ్‌డమ్‌లో బొగ్గును వినియోగించే ప్రధాన వినియోగదారులలో ఒకరుగా అయ్యారు. గ్యాస్ లైటింగ్ ఇచ్చే కాంతి వలన అప్పటివరకు పొడవైన కొవ్వొత్తులు, నూనె వాడుతూ ఉన్న కర్మాగారాలు, దుకాణాలను ఎక్కువసేపు తెరిచి ఉంచడానికి వీలైంది. ఇది సామాజిక, పారిశ్రామిక సంస్థలను ప్రభావితం చేసింది. ఇంటా బయటా మునుపటి కంటే పెద్ద ఎత్తున వెలుతురు ఉంటున్నందువలన నగరాలు పట్టణాల్లో రాత్రి జీవితం వృద్ధి చెందింది.

గ్లాస్ తయారీ

పారిశ్రామిక విప్లవం 
క్రిస్టల్ ప్యాలెస్ 1851 యొక్క గొప్ప ప్రదర్శనను నిర్వహించింది

19 వ శతాబ్దం ప్రారంభంలో సిలిండర్ ప్రక్రియ అనే గాజు ఉత్పత్తి పద్ధతిని ఐరోపాలో అభివృద్ధి చేసారు. 1832 లో ఛాన్స్ బ్రదర్స్ ఈ ప్రక్రియలో షీట్ గ్లాస్ తయారు చేసారు. వారు కిటికీ గ్లాసు, ప్లేట్ గ్లాసు తయారు చేసే ప్రముఖ సంస్థగా మారారు. ఈ పద్ధతిలో అంతరాయం లేకుండా పెద్ద గాజు పలకలను తయారు చేసేందుకు వీలైంది. తద్వారా ఇంటి లోపల స్థలాన్ని ఆదా చేసి, కిటికీల అమరికకు మరింత వీలు కల్పించింది. వినూత్న రీతిలో షీట్ గ్లాస్ వాడటానికి అత్యున్నత ఉదాహరణ క్రిస్టల్ ప్యాలెస్.

కాగితం తయారీ యంత్రం

వైర్ ఫాబ్రిక్ లూప్ మీద నిరంతరం కాగితాన్ని తయారుచేసే యంత్రాన్ని 1798 లో ఫ్రాన్స్‌లోని సెయింట్-లెగర్ డిడోట్ కుటుంబం కోసం పనిచేసిన నికోలస్ లూయిస్ రాబర్ట్ తయారు చేసాడు. లండన్లో స్టేషనర్లుగా ఉన్న ఫైనాన్షియర్లు, సోదరులు సీలీ, హెన్రీ ఫోర్డ్రీనియర్ల పేరు మీద ఈ పేపర్ యంత్రాన్ని ఫోర్డ్రీనియర్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ యంత్రం బాగా అభివృద్ధి చెంది, అనేక వైవిధ్యాలతో మెరుగు పడినప్పటికీ, ఫోర్డ్రీనియర్ యంత్రమే నేడు కాగితం ఉత్పత్తికి ప్రధాన సాధనం.

కాగితపు యంత్రం ప్రదర్శించిన నిరంతర ఉత్పత్తి పద్ధతి తరువాతి కాలంలో ఇనుము, ఉక్కు తదితర నిరంతర ఉత్పత్తి ప్రక్రియల అభివృద్ధిని ప్రభావితం చేసింది.

వ్యవసాయం

బ్రిటిషు వ్యవసాయలో వచ్చిన విప్లవం, పారిశ్రామిక విప్లవానికి ఒక కారణంగా పరిగణిస్తారు. ఎందుకంటే వ్యవసాయంలో వచ్చిన మెరుగైన ఉత్పాదకత కారణంగా అక్కడి కార్మికులు ఆర్థిక వ్యవస్థ లోని ఇతర రంగాలలోకి మళ్ళడానికి వీలు కలిగించింది. అయితే, అప్పట్లో ఐరోపాలో తలసరి ఆహార సరఫరా స్తబ్దుగా ఉండేది, లేదా క్షీణించింది. ఈ పరిస్థితి 18 వ శతాబ్దం చివరి వరకు ఐరోపా‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుగుపడలేదు.

వ్యవసాయాన్ని ప్రభావితం చేసిన సాంకేతిక పరిజ్ఞానాలలో విత్తే డ్రిల్, డచ్ నాగలి, నూర్పిడి యంత్రాలూ ఉన్నాయి.

ఆంగ్ల న్యాయవాది జెథ్రో తుల్ 1701 లో మెరుగైన విత్తే డ్రిల్‌ను కనుగొన్నాడు. ఇది ఒక విత్తే యంత్రం, విత్తనాలను భూమిలో సమానంగా పంపిణీ చేసి సరైన లోతులో నాటుతుంది. ఆ సమయంలో నాటిన విత్తనాలకు దిగుబడి నాలుగైదు రెట్లు మాత్రమే ఉన్న ఆ కాలంలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ విత్తే యంత్రం చాలా ఖరీదైనది, అంత విశ్వసనీయమైనది కాదు. అందువల్ల అది అంతగా ప్రభావం చూపలేదు. 18 వ శతాబ్దం మధ్యకాలం నాటికి గానీ మంచి నాణ్యత గల విత్తే యంత్రాలు ఉత్పత్తి కాలేదు.

1730 లో జోసెఫ్ ఫోల్జాంబే తయారు చేసిన రోథర్హామ్ నాగలి వాణిజ్యపరంగా విజయవంతమైన మొదటి ఇనుప నాగలి. 1784 లో స్కాటిష్ ఇంజనీర్ ఆండ్రూ మీకిల్ నూర్పిడి యంత్రాన్ని కనుగొన్నాడు. అప్పటివరకు, మొత్తం వ్యవసాయానికి అవసరమైన కూలీల్లో నాలుగో వంతు చేతితో నూర్పిడి చేయడానికే పోయేది.: 286  ఈ ఉపకరణం వ్యాప్తి చెందడానికి చాలా దశాబ్దాలు పట్టింది దీనివల్ల, అనేక మంది వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కరువై, వారు ఆకలితో అలమటించారు. ఇది 1830 లో స్వింగ్ రయోట్స్‌గా పేరుబడ్డ వ్యవసాయ తిరుగుబాటుకు దారితీసింది.

పారిశ్రామిక విప్లవం సమయంలో అభివృద్ధి చేసిన యంత్ర ఉపకరణాలు, లోహపు పని పద్ధతులు చివరికి 19 వ శతాబ్దం చివరలో రీపర్స్, బైండర్లు, హార్వెస్టర్ల వంటి వ్యవసాయ ఉపకరణాల భారీ ఉత్పత్తికి దారితీశాయి.

గనుల తవ్వకం

బ్రిటన్లో, ముఖ్యంగా సౌత్ వేల్స్‌లో బొగ్గు తవ్వకం చాలా ముందే ప్రారంభమైంది. ఆవిరి యంత్రం కనుగొనడానికి పూర్వం, గనులు పెద్ద లోతుగా ఉండేవి కావు. పైపైన ఉన్న బొగ్గును తవ్వేసాక ఇక ఆ గనిని వదిలిపెట్టేవారు. ఇతర సందర్భాల్లో, భూగర్భం అనుకూలంగా ఉంటే, ఏదైనా అడిట్ ద్వారానో లేదా డ్రిఫ్ట్ గని ద్వారానో బొగ్గు తవ్వేవారు. కొన్ని ప్రాంతాల్లో షాఫ్ట్ మైనింగ్ జరిగింది. కాని గనిలో ఊరే నీటిని తొలగించడమనేది పెద్ద సమస్యగా ఉండేది. బకెట్లతో తోడడం ద్వారా లేదా గని లోంచి కొండ కిందికి నడిచే సొరంగం ద్వారా చేసేవారు. ఈ రెండు సందర్భాల్లోనూ, గురుత్వాకర్షణ ద్వారా ప్రవహించేంత ఎత్తున నీటిని విడుదల చేయాలి. 1698 లో థామస్ సావెరీ, 1712 లో న్యూకామెన్ లు స్టీమ్ ఇంజను నడిపే ఆవిరి పంపు ప్రవేశపెట్టడంతో గనుల్లోంచి నీటిని తోడెయ్యడం సులువయింది. మరింత లోతుకు వెళ్ళడానికి వీలు కలిగి, తద్వారా ఎక్కువ బొగ్గును తీయడానికి వీలు కలిగింది. ఇవి పారిశ్రామిక విప్లవానికి ముందు జరిగిన పరిణామాలు. కాని న్యూకామెన్ ఇంజనుకు జాన్ స్మిటన్ చేసిన మెరుగుదలలు, ఆ తరువాత 1770 ల నుండి జేమ్స్ వాట్ తయారు చేసిన మరింత సమర్థవంతమైన ఆవిరి ఇంజన్లు వాడడంతో ఇంధన వ్యయం తగ్గిపోయి, గనులు మరింత లాభదాయకంగా మారాయి. 1810 లలో అభివృద్ధి చేసిన కార్నిష్ ఇంజను, వాట్ ఆవిరి ఇంజను కంటే చాలా సమర్థవంతంగా పనిచేసింది.

బొగ్గు పొరల్లో ఉండే దహన వాయువు కారణంగా బొగ్గు తవ్వకం చాలా ప్రమాదకరంగా ఉండేది. 1816 లో సర్ హంఫ్రీ డేవి, జార్జ్ స్టీఫెన్‌సన్ లు వేరువేరుగా కనుగొన్న భద్రతా దీపం ద్వారా కొంత భద్రత చేకూరింది. అయితే, ఈ దీపాలు చాలా త్వరగా అసురక్షితంగా మారాయి. బలహీనమైన కాంతిని అందించాయి. వాయువుల పేలుళ్లు కొనసాగాయి. ఇవి బొగ్గు దుమ్ము పేలుళ్లకు కారణమయ్యేవి. దీంతో మొత్తం 19 వ శతాబ్దంలో ప్రాణనష్టం పెరుగుతూ వచ్చింది. పని పరిస్థితులు చాలా హీనంగా ఉండేవి, రాళ్ళు కూలడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది.

రవాణా

పారిశ్రామిక విప్లవం ప్రారంభంలో అంతర్దేశీయ రవాణా, నదులు రోడ్ల ద్వారా జరిగేది. సముద్రం ద్వారా భారీ వస్తువులను సుదూర ప్రాంతాలకు తరలించడానికి నౌకలను ఉపయోగించేవారు. బొగ్గును నదుల దాకా రవాణా చేయడానికి వాగన్‌వేలను (బళ్ళ బాటలు) ఉపయోగించారు, కాని అప్పటికి కాలువలు ఇంకా విస్తృతంగా నిర్మించలేదు. నేలపై రవాణాకు జంతువులే సాధనం కాగా, సముద్రం మీద ప్రయాణించేందుకు తెరచాపలు వాడేవారు. గుర్రాలు లాగే రైల్వేలను 18 వ శతాబ్దం చివరిలో ప్రవేశపెట్టారు. 19 వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో ఆవిరి లోకోమోటివ్‌లు ప్రవేశపెట్టారు. నావికా సాంకేతికతలను మెరుగుపరచడంతో 1750 - 1830 మధ్య నౌకల సగటు వేగం 50% పెరిగింది.

పారిశ్రామిక విప్లవం టర్న్‌పైక్ రోడ్ నెట్‌వర్కు, కాలువలు, జలమార్గాల నెట్‌వర్కు, రైల్వే నెట్‌వర్కులతో బ్రిటన్ రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ముడి పదార్థాలను, తుది ఉత్పత్తులను మునుపటి కంటే వేగంగా, చౌకగా తరలించగలిగారు. మెరుగైన రవాణా వలన కొత్త ఆలోచనలను త్వరగా వ్యాప్తి చేయడానికి వీలైంది.

కాలువలు, మెరుగైన జలమార్గాలు

పారిశ్రామిక విప్లవం 
బ్రిడ్జ్‌వాటర్ కాలువ, వాణిజ్యపరంగా విజయవంతం అయింది. ఇది చివరిగా తవ్విన కాలువలలో ఒకటి.

పారిశ్రామిక విప్లవానికి ముందు, విప్లవ సమయంలోనూ అనేక బ్రిటిషు నదులపై నావిగేషన్ అడ్డంకులను తొలగించడం, మలుపులను సవరించడం, విస్తరించడం, లోతు చేయడం, నావిగేషన్ లాకులను నిర్మించడం వంటి అనేక చర్యలతో మెరుగుపరచారు. 1750 నాటికి బ్రిటన్‌లో 1,000 మైళ్ళకు పైగా నౌకాయానానికి వీలైన నదులు, కాలువలూ ఉన్నాయి. : 46 

కాలువలు, జలమార్గాల ద్వారా పెద్దమొత్తంలో వస్తువులను దేశాంతర్గత ప్రాంతాలకు చౌకగా రవాణా చేయడానికి వీలైంది. ఒక గుర్రం బండిలో లాగగలిగే లోడు కంటే డజన్ల రెట్లు లోడుతో ఉన్న ఒక బార్జ్‌ను లాగగలదు.

1820 ల నాటికి జాతీయ నెట్‌వర్క్ ఒకటి ఏర్పడింది. కాలువల నిర్మాణం తరువాతి కాలంలో రైల్వేలను నిర్మించడానికి ఒక నమూనాగా ఉపయోగపడింది. 1840 ల నుండి రైల్వేలు వ్యాప్తి చెంది, చివరికి లాభదాయక వాణిజ్య సంస్థలుగా కాలువలను అధిగమించాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో నిర్మించిన చివరి ప్రధాన కాలువ మాంచెస్టర్ షిప్ కెనాల్. ఇది 1894 లో ప్రారంభమైనపుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద పడవల కాలువ. మాంచెస్టర్‌ను ఒక ఓడరేవుగా రూపొందించింది ఈ కాలువ. అయితే, దాని స్పాన్సర్లు ఆశించిన వాణిజ్య విజయాన్ని సాధించలేదు. వేగవంతమైన, చౌకైన రవాణా మార్గంగా రైల్వేలు విస్తరించాక, రవాణా మార్గంగా కాలువలు అంతరించిపోవడానికి ఈ కాలువ సూచిక.

రోడ్లు

పారిశ్రామిక విప్లవం 
అమెరికాలో మొదటి మకాడమ్ రహదారి నిర్మాణం (1823). ముందుభాగంలో, కార్మికులు "6 ఔన్సుల బరువును మించని, రెండు అంగుళాల ఉంగరంలో దూరిపోయేంత చిన్న" రాళ్లను పగలగొడుతున్నారు.

పారిశ్రామిక విప్లవం సమయంలో ఫ్రాన్స్‌లో అద్భుతమైన రోడ్ల వ్యవస్థ ఉండేది. అయితే, ఐరోపా ఖండంలోని, యునైటెడ్ కింగ్‌డమ్ లోని చాలా రహదారులు చెడ్డ స్థితిలో ఉండేవి, ప్రమాదకరంగా ఉండేయి.

బ్రిటిషు రహదారి వ్యవస్థలో ఎక్కువ భాగం వేలాది స్థానిక పారిష్‌లు సరిగా నిర్వహించేవి కాదు. కానీ, 1720 ల తరువాత, సుంకం వసూలు చేసి కొన్ని రహదారులను నిర్వహించడానికి టర్న్‌పైక్ (టోల్ రోడ్డు) ట్రస్ట్‌లను ఏర్పాటు చేసారు. ప్రధాన రహదారుల సంఖ్య 1750 ల నుండి సుంకం వసూలు చేసేలా మార్చారు. ఇంగ్లాండ్, వేల్స్‌లోని దాదాపు ప్రతి ప్రధాన రహదారినీ టర్న్‌పైక్ ట్రస్ట్ కు అప్పజెప్పారు. కొత్త ఇంజనీరింగ్ రహదారులను జాన్ మెట్‌కాల్ఫ్, థామస్ టెల్ఫోర్డ్, ముఖ్యంగా జాన్ మక్ఆడామ్ నిర్మించారు, మొదటి ' మకాడమైజ్డ్ ' రహదారి 1816 లో బ్రిస్టల్‌లోని అష్టన్ గేట్ వద్ద ఉన్న మార్ష్ రోడ్. ప్రధాన టర్న్‌పైక్‌లు లండన్ నుండి బయల్దేరేవి. రాయల్ మెయిల్ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరుకోవడానికి ఇవే ప్రధాన మార్గం. ఈ రహదారులపై భారీ వస్తువుల రవాణా వెడల్పాటి చక్రాలున్న, గుర్రాలు లాగే, నెమ్మదిగా నడిచే బండ్ల ద్వారా జరిగేది. తేలికైన వస్తువులను చిన్న బండ్లపై చేర్చవేసేవారు. ధనికులు స్టేజ్‌కోచ్‌లపై ప్రయాణించేవారు. పేద వర్గాల వారు డబ్బు చెల్లించి క్యారియర్‌ల బండ్లపై ప్రయాణించేవారు.

రైల్వేలు

రోడ్డు వ్యాగన్లతో పోల్చితే రైలుమార్గాలు విజయవంతం కావడానికి ఒక ప్రధాన కారణం, ఒరిపిడి తగ్గడం. 1805 లో ఇంగ్లాండ్‌లోని క్రోయిడాన్ వద్ద చెక్క ట్రామ్‌వేతో కప్పబడిన ఇనుప పలకపై రైలు మార్గాన్ని ప్రదర్శించారు

“సాధారణ టర్న్‌పైక్ రహదారిపై మంచి గుర్రం రెండు వేల పౌండ్లు లేదా ఒక టన్నును లాగగలదు. కొత్త రహదారి గొప్పతనాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించడం కోసం, ఈ ప్రయోగాన్ని చూసేందుకు పెద్దమనుషులను ఆహ్వానించారు. ప్రతి బండి లోను మూడు టన్నుల బరువు ఉండేలా, పన్నెండు బండ్లలో రాళ్లను నింపి, వాటన్నిటినీ ఒకదాని వెనక ఒకటి కట్టారు. ఆ బండ్లకు ఒక గుర్రాన్ని కట్టారు. ఇది రెండు గంటల్లో ఆరు మైళ్ళ దూరం తేలిగ్గా లాగింది. తేలిగ్గా లాగగలదని నిరూపించేందుకే కాక, ఆగిన బండిని మళ్ళీ మళ్ళీ లాగడం మొదలు పెట్టగల శక్తి ఉందని నిరూపించేందుకు మధ్యలో నాలుగు సార్లు ఆపారు.”

1800 తరువాత చవకైన పడిల్ ఇనుము విస్తృతంగా లభించడం, పట్టాలు తయారు చేయడానికి రోలింగ్ మిల్లులు ఏర్పడడం, 1800 లో అధిక-పీడన ఆవిరి యంత్రం అభివృద్ధి చేయడంతో రైల్వేలు ఆచరణాత్మక మయ్యాయి.

పారిశ్రామిక విప్లవం 
1830 లో లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలను ప్రారంభించినట్లు చిత్రీకరించిన పెయింటింగ్. ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్-సిటీ రైల్వే ఇది. ఇది విజయవంతం కావడం రైల్వే మానియాకు దారితీసింది.

మైనింగ్ ప్రాంతాలలో బొగ్గును తరలించడానికి బళ్ళబాటలు 17 వ శతాబ్దంలో ఏర్పాటయ్యాయి. మరింత దూరాలకు రవాణా చేసేందుకు కాలువలు, నదీ వ్యవస్థలను వాడారు. ఇవన్నీ గుర్రాలు లాగేవే. కొన్ని గురుత్వాకర్షణపై ఆధారపడి వాలులో ప్రయాణించేవి. వాలులో తిరిగి పైకి లాగేందుకు స్థావరంగా ఉండే ఆవిరి యంత్రాలను వాడేవారు. ఆవిరి లోకోమోటివ్‌ను మొట్టమొదట వాగన్ లేదా పలకల మార్గాల్లో వినియోగించారు. (పోత ఇనుప పలకలను ఉపయోగించేవారు కాబట్టి ఆ పేరు వచ్చింది). 19 వ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో దుక్క ఇనుము, చేత ఇనుముల ఉత్పత్తి పద్ధతులు మెరుగుపడి ఉత్పత్తి ఖర్చు తగ్గే వరకూ గుర్రాలు లాగే పబ్లిక్ రైల్వేలు ప్రారంభం కాలేదు.

1800 లో బౌల్టన్, వాట్ పేటెంట్ గడువు ముగిసి, అధిక పీడన ఆవిరి యంత్రాలను ప్రవేశపెట్టిన తరువాత ఆవిరి లోకోమోటివ్‌లను నిర్మించడం ప్రారంభించారు. అధిక-పీడన ఇంజన్లు, ఉపయోగించిన ఆవిరిని గాల్లోకి వదిలేసేవి. దాంతో కండెన్సరు, చల్లబరచే నీరు అవసరం లేకుండా పోయాయి. స్థావరంగా ఉండే కండెన్సింగ్ ఇంజన్ల కంటే ఇవి చాలా తేలికగాను, పరిమాణంలో చిన్నవిగానూ ఉండేవి. తొలినాళ్ళలో తయారు చేసిన లోకోమోటివ్‌లలో కొన్నిటిని గనులలో ఉపయోగించారు. 1825 లో స్టాక్‌టన్ డార్లింగ్టన్ రైల్వేలతో ఆవిరితో నడిచే ప్రజా రైల్వేలు మొదలయ్యాయి.

1829 రెయిన్హిల్ ట్రయల్స్ లో రాబర్ట్ స్టీఫెన్సన్ తయారు చేసిన విజయవంతమైన లోకోమోటివ్ డిజైను తోటి, 1828 హాట్ బ్లాస్ట్ పద్ధతి వలన ఇనుము తయారీలో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గడం తోటీ రైల్వేలు వేగంగా విస్తరించాయి.

1830 సెప్టెంబరు 15 న, లివర్‌పూల్ - మాంచెస్టర్ రైల్వే మొదలైంది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్నగర రైల్వే. దీనికి ప్రధాన మంత్రి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ హాజరయ్యాడు. జోసెఫ్ లోకే, జార్జ్ స్టీఫెన్‌సన్ లు ఈ రైల్వేను రూపొందించారు. వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక పట్టణమైన మాంచెస్టర్‌ను రేవు పట్టణమైన లివర్‌పూల్‌తో అనుసంధానించారు. సాంకేతిక పరిజ్ఞానపు ఆదిమ స్వభావం కారణంగా ఇది కొత్తలో సమస్యలతో సతమతమైంది. అయితే సమస్యలు క్రమంగా ఇస్త్రీ అవడంతో రైల్వే అత్యంత విజయవంతమైంది. ప్రయాణీకులను, సరుకునూ రవాణా చేసింది. ఈ అంతర్నగర రైల్వే విజయం, సరుకు రవాణాలో రైల్వే మానియాకు దారితీసింది.

పెద్ద నగరాలు, పట్టణాలను కలిపే ప్రధాన రైల్వేల నిర్మాణం 1830 ల లోనే మొదలైనా, పారిశ్రామిక విప్లవం చివరిలో మాత్రమే ఊపందుకుంది. రైల్వేల నిర్మాణాల్లో పనిచేసిన కార్మికులు చాలా మంది, ఆ పని పూర్తయిన తరువాత కూడా తమ గ్రామాలకు తిరిగి రాలేదు. నగరాల్లోనే ఉండి, కర్మాగారాల్లో పనుల్లో కుదిరారు.

సామాజిక ప్రభావాలు

కర్మాగార వ్యవస్థ

పారిశ్రామిక విప్లవానికి ముందు, చాలా మంది శ్రామికులు వ్యవసాయంలో, స్వయం ఉపాధి రైతులుగా భూస్వాములు లేదా అద్దెదారులు లేదా భూమిలేని వ్యవసాయ కార్మికులుగా పనిచేసేవారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని కుటుంబాలు స్వయంగా నూలు, నేత వస్త్రం, వారి స్వంత దుస్తులు తయారు చేసుకోవడం సర్వసాధారణం. బయటి అమ్మకాల కోసం కూడా ఉత్పత్తి చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు, భారతదేశం, చైనా, ఇరాక్ లు, ఆసియా, మధ్యప్రాచ్యాల్లోని కొన్ని ప్రాంతాలు నూలు వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూండగా, యూరోపియన్లు ఉన్ని, నార వస్తువులను ఉత్పత్తి చేసేవారు.

16 వ శతాబ్దం నాటికి బ్రిటన్లో, రైతులు, పట్టణ ప్రజలు తమ ఇళ్లలోనే మార్కెట్ కోసం వస్తువులను ఉత్పత్తి చేసే వారు. దీన్ని కుటీర పరిశ్రమగా అభివర్ణిస్తారు. వడకడం, నేయడం వీరు చేసిన ముఖ్యమైన పనులు. వ్యాపారులు వారికి ముడిసరుకు ఇచ్చి, వస్తువుకు ఇంత అని చెల్లించి, వస్తువులను కొని వాటిని అమ్ముకునేవారు. కార్మికులు ఈ ముడిసరుకును దురుపయోగం చెయ్యడం, నాణ్యత తక్కువగా ఉండటం సాధారణ వంటి సమస్యలు ఉండేవి. ముడిసరుకును సేకరించడం, పంపిణీ చేయడం, పూర్తయిన వస్తువులను తీసుకోవడంలో ఉన్న లాజిస్టిక సమస్యలు కూడా ఈ వ్యవస్థ లోని పరిమితులు.

1792 లో ఆరు పౌండ్లకు దొరికే 40 కదుర్ల జెన్నీ వంటి కొన్ని తొలి స్పిన్నింగు, నేత యంత్రాలు కుటీర పారిశ్రామికులకు అందుబాటు లోనే ఉండేవి. తరువాత వచ్చిన స్పిన్నింగ్ ఫ్రేములు, స్పిన్నింగ్ మ్యూల్‌లు, పవర్ లూమ్స్ ఖరీదైనవి. ఇది కర్మాగారాల పెట్టుబడిదారీ యాజమాన్యానికి దారితీసింది.

పారిశ్రామిక విప్లవ సమయంలో వస్త్ర కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల్లో ఎక్కువమంది పెళ్ళికాని మహిళలు, పిల్లలే. చాలా మంది అనాథలు కూడా ఉండేవారు. వారు సాధారణంగా రోజుకు 12 నుండి 14 గంటలు పనిచేసేవారు. ఆదివారం సెలవు ఉండేది. వ్యవసాయ పనులు ఉండని రోజుల్లో మహిళలు కర్మాగారాల్లో ఉద్యోగాల్లో చేరేవారు. తగినంత రవాణా లేకపోవడం, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాల వలన కార్మికుల నియామకం, నిలుపుకోవడం కష్టంగా ఉండేది. నిరాశ్రయులైన రైతులు, వ్యవసాయ కార్మికుల వంటి వారు, కండసిరి తప్ప మరేమీ లేనివారు, కర్మాగారాల్లో కార్మికులుగా మారారు.

జీవన ప్రమాణాలు

పారిశ్రామిక విప్లవపు నిజమైన ప్రభావం ఏమిటంటే, "చరిత్రలో మొట్టమొదటిసారిగా, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు నిరంతర వృద్ధిని పొందడం ప్రారంభించాయి. ఈ ఆర్థిక ప్రవర్తన గురించి శాస్త్రీయ ఆర్థికవేత్తలు కనీసం సైద్ధాంతిక సంభవంగా కూడా ప్రస్తావించలేదు." అని రాబర్ట్ ఇ. లుకాస్, జూనియర్ వంటి కొంతమంది ఆర్థికవేత్తలు అన్నారు. పారిశ్రామిక విప్లవ సమయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉత్పాదక శక్తులు అపూర్వమైన స్థాయిలో పెరిగిప్పటికీ, 19, 20 శతాబ్దాల చివరి వరకు మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు అర్ధవంతంగా పెరగలేదనీ, కార్మికుల జీవన ప్రమాణాలు ప్రారంభ పెట్టుబడిదారీ విధానంలో అనేక విధాలుగా క్షీణించాయనీ మరి కొందరు అన్నారు: ఉదాహరణకు, బ్రిటన్లో నిజమైన వేతనాలు 1780 - 1850 ల మధ్య 15% మాత్రమే పెరిగాయని, బ్రిటన్లో ఆయుర్దాయం 1870 ల వరకు గణనీయంగా పెరగలేదనీ అధ్యయనాల్లో తేలింది. అదేవిధంగా, పారిశ్రామిక విప్లవం సమయంలో జనాభా సగటు ఎత్తు క్షీణించింది, ఇది వారి పోషక స్థితి కూడా తగ్గిపోతోందని సూచిస్తుంది. నిజమైన వేతనాలు ఆహార ధరలకు అనుగుణంగా లేవు.

పారిశ్రామిక విప్లవం సందర్భంగా పిల్లల ఆయుర్దాయం ఒక్కసారిగా పెరిగింది. లండన్‌లో ఐదేళ్ళకు ముందే మరణించిన పిల్లల శాతం 1730–1749 లో 74.5% ఉండగా, అది 1810–1829 లో 31.8 శాతానికి తగ్గింది.

జీవన పరిస్థితులపై పారిశ్రామిక విప్లవ ప్రభావాలు ఎలా ఉన్నాయనేది చాలా వివాదాస్పద విషయం. 1950 నుండి 1980 వరకు ఆర్థిక, సామాజిక చరిత్రకారులు దీనిపై విస్తృతంగా చర్చించారు. 1950 ల్లో హెన్రీ ఫెల్ప్స్ బ్రౌన్, షీలా వి. హాప్కిన్స్ రాసిన వ్యాసాల తరువాత, సామాజికంగా దిగువన ఉన్న జనాభాలో ఎక్కువ భాగం వారి జీవన ప్రమాణాలలో తీవ్రమైన పతనం జరిగిందనే ఏకాభిప్రాయానికి వచ్చారు. 1813-1913 లో, కార్మికుల వేతనాలలో గణనీయమైన పెరుగుదల ఉంది.

పోషకాహారం

19 వ శతాబ్దం చివరి వరకు బ్రిటన్, ఫ్రాన్స్‌లతో సహా ప్రపంచ జనాభాలో ఎక్కువ మందిలో దీర్ఘకాలిక ఆకలి, పోషకాహార లోపం మామూలుగా ఉండేది. సుమారు 1750 వరకు, పోషకాహార లోపం కారణంగా, ఫ్రాన్స్‌లో ఆయుర్దాయం సుమారు 35 సంవత్సరాలుగాను, బ్రిటన్‌లో 40 సంవత్సరాలుగానూ ఉండేది. ఆ సమయంలో అమెరికా ప్రజలకు తగినంత పోషకాహారం లభించేది. సగటున 45-50 సంవత్సరాల ఆయుర్దాయం ఉండేది. అయితే 19 వ శతాబ్దం మధ్య నాటికి అమెరికా సగటు ఆయుర్దాయం కొంత తగ్గింది. యాంటెబెల్లమ్ పజిల్ అని పిలువబడే కాలంలో తలసరి ఆహార వినియోగం కూడా తగ్గింది.

గ్రేట్ బ్రిటన్లో మొక్కజొన్న చట్టాల (1815-1846) కారణంగా ఆహార సరఫరా తగ్గింది. ఈ మొక్కజొన్న చట్టాలు, దిగుమతి చేసుకున్న ధాన్యంపై సుంకాలను విధించి, దేశీయ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరలను అధికంగా ఉంచడానికి రూపొందించారు. గ్రేట్ ఐరిష్ కరువు తొలి సంవత్సరాల్లో మొక్కజొన్న చట్టాలను రద్దు చేసారు.

పారిశ్రామిక విప్లవం ప్రారంభంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాలు, యాంత్రిక వస్త్రాలు, ఇనుము, బొగ్గు వంటి వాటి వలన, ఆహార ధరలు ఏమాత్రం తగ్గలేదు. బ్రిటన్, నెదర్లాండ్స్‌లో, మంచి వ్యవసాయ పద్ధతుల కారణంగా పారిశ్రామిక విప్లవానికి ముందు ఆహార సరఫరా పెరిగింది; అయితే, థామస్ మాల్టస్ గుర్తించినట్లుగా, జనాభా కూడా పెరిగింది. ఈ పరిస్థితిని మాల్తుసియన్ ట్రాప్ అని పిలుస్తారు. చివరకు కాలువలు, మెరుగైన రోడ్లు, స్టీమ్‌షిప్‌ల వంటి రవాణా మెరుగుదలల ద్వారా ఈ సమస్యను అధిగమించడం మొదలైంది.

గృహకల్పన

19 వ శతాబ్దంలో కొత్త పారిశ్రామిక, ఉత్పాదక నగరాలతో పాటు ఎడిన్బర్గ్, లండన్ వంటి సేవా కేంద్రాలు కూడా వేగవంతమైన జనాభా పెరుగుదలలో భాగం. ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన డబ్బు లభ్యత ఒక సమస్యగా ఉండేది. ఇందుకోసం నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేసేవారు. ఈ సంఘాలు పెద్ద కాంట్రాక్ట్ సంస్థలతో నేరుగా వ్యవహరించేవి. ఇళ్ళున్న కామందుల నుండి అద్దెకు తీసుకోవడమనేది సాధారణం. ఇది అద్దెదారులకు ప్రయోజనకరంగా ఉండేదని పి. కెంప్ చెప్పారు. ప్రజలు ఎంత వేగంగా నగరాలకు వెళ్లారంటే, వారికి సరిపడినన్ని ఇళ్ళు నిర్మించేందుకు తగినంత మూలధనం లభించలేదు. తక్కువ-ఆదాయం పొందే కొత్తవారు అప్పటికే జన సమ్మర్దంగా ఉండే మురికివాడల్లో ఇరుక్కున్నారు. పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ప్రజారోగ్య సౌకర్యాలు సరిపోయేవి కావు; మరణాల రేటు ఎక్కువగా ఉండేది -ముఖ్యంగా శిశు మరణాలు. యువకులలో క్షయ ఎక్కువగా ఉండేది. కలరా, టైఫాయిడ్‌లు వ్యాపిస్తూండేవి. గ్రామీణ ప్రాంతాల్లో లాగా, 1840 లలో ఐర్లాండ్‌ను సర్వనాశనం చేసిన కరువు లాంటిది, ఈ నగరాల్లో ఏర్పడలేదు.

అనారోగ్య పరిస్థితులను బయటపెడుతూ వాటిని ఖండిస్తూ పెద్ద ఎత్తున సాహిత్యం పెరిగింది. సోషలిస్ట్ ఉద్యమ స్థాపకుల్లో ఒకరైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ 1844 లో రాసిన ది కండిషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ఆఫ్ ఇంగ్లండ్‌ అనేది ఆనాటి ప్రసిద్ధ పుస్తకం. అందులో మాంచెస్టర్, ఇతర మిల్లు పట్టణాల్లోని మురికివాడలను వర్ణించాడు. ఇక్కడ ప్రజలు ముతక గుడిసెల్లో నివసించేవారు. కొన్ని గుడిసెలకు పూర్తిగా మరుగు ఉండేది కాదు. కొన్నిటికి గచ్చు ఉండేది కాదు. ఈ మురికివాడల్లో అడ్దదిడ్డంగా కట్టిన ఇళ్ళ మధ్యగా నడక దారులు ఉండేవి. పారిశుధ్య సౌకర్యాలు లేవు. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండేది. అయితే, అందరూ ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవించలేదు. పారిశ్రామిక విప్లవంలో పుట్టుకొచ్చిన మధ్యతరగతి వ్యాపారవేత్తలు, గుమాస్తాలు, ఫోర్‌మెన్లు ఇంజనీర్లూ మెరుగైన పరిస్థితులలో నివసించారు.

మురుగునీరు, పరిశుభ్రత, గృహ నిర్మాణం వంటి వాటిని నియంత్రించే కొత్త ప్రజారోగ్య చర్యల కారణంగా 19 వ శతాబ్దంలో పరిస్థితులు మెరుగుపడ్డాయి. తన పుస్తకం 1892 ఎడిషన్ పరిచయంలో ఎంగెల్స్, 1844 లో తాను వ్రాసిన చాలా పరిస్థితులు బాగా మెరుగుపడ్డాయని పేర్కొన్నాడు.

పారిశుధ్యం

1844 లో ది కండిషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లండ్ లో, శుద్ధి చేయని మురుగునీరు భయంకరమైన వాసనలు సృష్టించి, పారిశ్రామిక నగరాల్లో నదులను పచ్చగా ఎలా మార్చిందో ఫ్రెడరిక్ ఎంగెల్స్ వివరించాడు.

1854 లో, లండన్లోని సోహోలో ఒక ఇంటి లెట్రిన్ బావి నుండి వచ్చిన మురికి నీరు ఒక తాగు నీటి బావిని కలుషితం చేసి కలరా వ్యాప్తి చెందడాన్ని జాన్ స్నో పరిశీలించాడు. కలుషితమైన నీటి ద్వారా కలరా వ్యాప్తి చెందుతుందని స్నో కనుగొన్న విషయాలు అంగీకరించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కాని అతను చేసిన పరిశీలనే తాగు నీరు, వ్యర్థ వ్యవస్థల రూపకల్పనలో ప్రాథమిక మార్పులకు దారితీసింది.

నీటి సరఫరా

పారిశ్రామిక యుగానికి ముందు నీటి సరఫరా నేల వాలును బట్టీ, నీటి చక్రాలతో పంపింగు చెయ్యడం ద్వారానూ జరిగేది. చెక్క పైపులు వాడేవారు. ఆవిరితో నడిచే పంపులు, ఇనుప పైపులూ వచ్చాక, ఇళ్ళకూ, గుర్రాలకూ నీళ్ళు సరఫరా చేయడం సులభమైపోయింది.

అక్షరాస్యతలో పెరుగుదల

కాగితపు యంత్రం ఆవిష్కరణతోటి, ముద్రణ కోసం ఆవిరి శక్తిని ఉపయోగించడం వలన వార్తాపత్రికలు, పుస్తకాల ప్రచురణ విస్తరించడం తోటీ అక్షరాస్యత పెరగడానికి దోహదపడింది.  

జనాభా పెరుగుదల

పారిశ్రామిక విప్లవ కాలంలో, చరిత్రలో మొట్ట మొదటి సారి, జనాభా, తలసరి ఆదాయం రెండూ ఒకేసారి పెరిగాయి.

ది ఫాటల్ షోర్ లోని రాబర్ట్ హ్యూస్ ప్రకారం, 1700 నుండి 1740 వరకు అరవై లక్షల వద్ద స్థిరంగా ఉన్న ఇంగ్లాండ్, వేల్స్ జనాభా 1740 తరువాత అనూహ్యంగా పెరిగింది. ఇంగ్లాండ్ జనాభా 1801 లో 83 లక్షల నుండి 1850 లో 1.68 కోట్ల్లకు పెరిగింది. 1901 నాటికి అది దాదాపు రెట్టింపు అయి 3.05 కోట్లకు చేరుకుంది. మెరుగైన పరిస్థితుల కారణంగా 1800 లలో బ్రిటన్ జనాభా ఒక కోటి నుండి 4 కోట్లకు పెరిగింది. ఐరోపా జనాభా 1700 లో 10 కోట్ల నుండి 1900 నాటికి 40 కోట్లకు పెరిగింది.

పట్టణీకరణ

పారిశ్రామిక విప్లవం 
బర్మింగ్‌హామ్‌కు పశ్చిమాన ఉన్న బ్లాక్ కంట్రీ

18 వ శతాబ్దం చివరి నుండి ఆధునిక పరిశ్రమల పెరుగుదలతో భారీగా పట్టణీకరణ జరిగి, కొత్త నగరాల పెరుగుదలకు దారితీసింది. మొదట ఐరోపాలోను తరువాత ఇతర ప్రాంతాలలోనూ పుట్టుకొచ్చిన కొత్త అవకాశాలు గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు భారీ సంఖ్యలో వలసదారులను తీసుకువచ్చాయి. 1800 లో, ప్రపంచ జనాభాలో 3% మాత్రమే నగరాల్లో నివసించేవారు, 21 వ శతాబ్దం ప్రారంభంలో ఇది 50%గా ఉంది. 1717 లో మాంచెస్టర్ జనాభా 10,000, కానీ 1911 నాటికి ఇది 23 లక్షలకు పెరిగింది.

కార్మిక పరిస్థితులు

సామాజిక వ్యవస్థ, పని పరిస్థితులు

పారిశ్రామికవేత్తలూ వ్యాపారవేత్తలతో కూడిన మధ్యతరగతి, భూస్వాములపైన, కులీనులపైన సాధించిన విజయానికి పారిశ్రామిక విప్లవం సాక్షిగా నిలిచింది. సాధారణ శ్రామిక ప్రజలకు కొత్త మిల్లులు, కర్మాగారాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు కనిపించాయి. కాని ఈ పనులు కఠినమైనవి, పనిగంటలు ఎక్కువగా ఉండేవి. యంత్రాలు నిర్దేశించిన వేగంతోనే పని చెయ్యాల్సి ఉంటుంది. 1900 నాటికి కూడా అమెరికాలో చాలా మంది కార్మికులు రోజుకు 10 గంటలు (ఉక్కు పరిశ్రమలో 12 గంటలు) పనిచేసేవారు. అయినప్పటికీ, మంచి జీవితానికి అవసరమైన డబ్బు కన్నా 20% నుండి 40% తక్కువేవారికి లభించేది. వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు పిల్లలే. శ్రామిక వర్గాల వారికి, పారిశ్రామిక జీవితం "ఒక ఎడారి వంటిది, తమ శ్రమతో దాన్ని నివాసయోగ్యంగా చేసుకోవలసి వచ్చింది." పారిశ్రామిక విప్లవం జరగడానికి చాలా కాలం ముందునుండి కఠినమైన పని పరిస్థితులు ప్రబలంగా ఉండేవి. పారిశ్రామిక పూర్వ సమాజం చాలా జడంగా ఉండేది, క్రూరంగానూ ఉండేది - బాల కార్మికులు, మురికి జీవన పరిస్థితులు, సుదీర్ఘ పని గంటలు పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రబలంగా ఉండేవి.

కర్మాగారాలు, పట్టణీకరణ

పారిశ్రామిక విప్లవం 
మాంచెస్టర్, ఇంగ్లాండ్ (" కాటనోపోలిస్ "), 1840 నాటి చిత్రం, ఇందులో కర్మాగారాల చిమ్నీల వరసను చూడవచ్చు

పారిశ్రామికీకరణతో కర్మాగారం పుట్టింది. కర్మాగారాల్లో పని కోసం పెద్ద సంఖ్యలో కార్మికులు నగరాలకు వలస వెళ్ళడం పట్టణ ప్రాంతాల వృద్ధికి దోహదపడింది. మిల్లులు, వాటి అనుబంధ పరిశ్రమలతో "కాటనోపోలిస్ " అనే పేరు పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి పారిశ్రామిక నగరం, మాంచెస్టర్‌ను మించిన ఉదాహరణ దీనికి మరొకటి లేదు. 1771 - 1831 మధ్య మాంచెస్టర్ జనాభా ఆరు రెట్లు పెరిగింది. 1811 - 1851 మధ్య బ్రాడ్‌ఫోర్డ్ జనాభా ప్రతి పదేళ్ళకు 50% చొప్పున పెరుగుతూ వచ్చింది. 1851 నాటికి బ్రాడ్‌ఫోర్డ్ జనాభాలో అక్కడ పుట్టినవారు 50% మాత్రమే.

దీనికి తోడు, 1815 - 1939 మధ్య, వేగంగా పెరుగుతున్న ఐరోపా జనాభాలో 20 శాతం మంది, పేదరికం వలన తమతమ ఇళ్ళను విడిచి వలస వెళ్ళారు. విదేశాలలో శ్రమకు ఉన్న అపారమైన డిమాండు, భూమి లభ్యత, చౌక రవాణాల కారణంగా వారు విదేశాల వైపు ఆకర్షితులయ్యారు. అయితే, కొత్త ప్రదేశాల్లో సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేక, వారిలో 70 లక్షల మంది ఐరోపాకు తిరిగి వచ్చారు. ఈ సామూహిక వలసలు పెద్దయెత్తున ప్రభావాలను కలిగించాయి: 1800 లో, ప్రపంచ జనాభాలో ఒక శాతం కంటే తక్కువ మంది విదేశీ యూరోపియన్లు, వారి వారసులూ ఉండగా, 1930 నాటికి అది 11 శాతానికి పెరిగింది. ఈ భారీ వలసల ప్రభావం అమెరికా ఖండాలపై పడగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలపై చాలా ఎక్కువగా పడింది.

19 వ శతాబ్దంలో ఎక్కువ భాగం, చిన్న మిల్లులలో ఉత్పత్తి జరిగింది, ఇవి సాధారణంగా నీటితో నడిచేవి, స్థానిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడేవి. తరువాత, ప్రతి కర్మాగారం దాని స్వంత ఆవిరి యంత్రం, చిమ్నీ ఏర్పాటు చేసుకున్నాయి.

ఇతర పరిశ్రమలలో, ఫ్యాక్టరీ ఉత్పత్తి వైపుగా జరిగిన పరివర్తనం అంతగా సమాజాన్ని విభజించలేదు. కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ కార్మికుల కోసం కర్మాగార పరిస్థితను, జీవన పరిస్థితులనూ మెరుగుపరచడానికి ప్రయత్నించారు. అటువంటి ప్రారంభ సంస్కర్తలలో ఒకరు రాబర్ట్ ఓవెన్. న్యూ లానార్క్ మిల్లులలో కార్మికుల పరిస్థితులను మెరుగుపర్చడంలో తాను చేపట్టిన మార్గదర్శక ప్రయత్నాలకు అతడు ప్రసిద్ధి చెందాడు. సామ్యవాద ఉద్యమపు తొలినాళ్ళ లోని ముఖ్య ఆలోచనాపరులలో ఒకరిగా అతణ్ణి భావిస్తారు.

1746 నాటికి బ్రిస్టల్ సమీపంలోని వార్మ్లీలో ఇంటిగ్రేటెడ్ ఇత్తడి మిల్లు పనిచేస్తూండేది. ఒక చివరి నుండి ముడిసరుకు లోపలికి వెళ్లి, కరిగి, ఇత్తడిగా మారి, చిప్పలు, సూదులు, వైర్లు, ఇతర వస్తువులుగా బయటికి వచ్చేది. అక్కడి కార్మికులకు నివాస గృహాలు నిర్మించారు. జోషియా వెడ్జ్‌వుడ్, మాథ్యూ బౌల్టన్, ఇతర తొలితరపు పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్టరీ వ్యవస్థను స్థాపించిన వారిలో కొందరు..

బాల కార్మికులు

పారిశ్రామిక విప్లవం 
ఒక గని గ్యాలరీ వెంట బొగ్గు తొట్టెను లాగుతున్న యువ కార్మికులు. బ్రిటన్లో 1842, 1844 లో ఆమోదించిన చట్టాలతో గని పని పరిస్థితులను మెరుగుపడ్డాయి.

పారిశ్రామిక విప్లవం జనాభా పెరుగుదలకు దారితీసింది. కాని పారిశ్రామిక విప్లవం అంతటా, శిశు మరణాల రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ, బాల్యం బతికే అవకాశాలు మెరుగుపడలేదు. విద్యావకశాలు పరిమితంగానే ఉండేవి. పిల్లలు పని చేయాలనే భావించేవారు. పిల్లలు పెద్దలతో సమానంగా ఉత్పత్తి చేసినప్పటికీ, వారికి పెద్దవారి కంటే తక్కువ చెల్లించేవారు; పారిశ్రామిక యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి బలం అవసరం లేదు. పైగా పారిశ్రామిక వ్యవస్థ పూర్తిగా కొత్తది కాబట్టి, అనుభవజ్ఞులైన వయోజన కార్మికులెవరూ లేరు. దీంతో 18, 19 వ శతాబ్దాల్లో పారిశ్రామిక విప్లవ ప్రారంభ దశలలో బాల కార్మికులనే ఎక్కువగా నియోగించేవారు. 1788 లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్లలో ఉన్న 143 నీటితో నడిచే నూలు మిల్లులలో మూడింట రెండొంతుల మంది కార్మికులు పిల్లలే.

పారిశ్రామిక విప్లవానికి ముందు కూడా బాల కార్మికులు ఉండేవారు. కాని జనాభా, విద్య పెరుగుదలతో ఇది మరింత పెరిగింది. చాలా మంది పిల్లలు పెద్దల కంటే చాలా తక్కువ వేతనం కోసం, వారికంటే చెడ్డ పరిస్థితుల్లో, వయోజన పురుషుల వేతనంలో 10-20% మాత్రమే వేతనంగా తీసుకుంటూ పని చేయవలసి వచ్చేది.

కొన్ని దురన్యాయాలను, ముఖ్యంగా బొగ్గు గనులు, వస్త్ర కర్మాగారాల్లో జరుగుతున్నవాటిని వివరిస్తూ నివేదికలు వెలువడ్డాయి. ఇవి పిల్లల దుస్థితి ప్రజల్లో ప్రాచుర్యం పొందటానికి సహాయపడ్డాయి. పిల్లల దుస్థితి పట్ల ఉన్నత, మధ్యతరగతి ప్రజలలో పెల్లుబికిన ఆగ్రహం యువ కార్మికుల సంక్షేమంలో మార్పులకు దోహదపడింది.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాలూ చట్టం ద్వారా బాల కార్మికులను పరిమితం చేయడానికి ప్రయత్నించాయి కాని ఫ్యాక్టరీ యజమానులు ప్రతిఘటించారు; వీరిలో కొందరైతే, ఆకలితో అలమటించే పిల్లలకు ఆహారం కొనడానికి డబ్బు ఇవ్వడం ద్వారా పేదలకు సహాయం చేస్తున్నామని భావించారు, మరికొందరు కార్మికులు చౌకగా దొరకడాన్ని స్వాగతించారు. 1833, 1844 లలో, బాల కార్మికులకు వ్యతిరేకంగా తొలి సాధారణ చట్టాలు, కర్మాగార చట్టాలు బ్రిటన్లో ఆమోదించారు: తొమ్మిది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పని చేయడానికి అనుమతించలేదు, 18 లోపు వయసున్న పిల్లలను రాత్రి వేళల్లో పని చేయడానికి అనుమతించలేదు, వయస్సులోపు యువత పని గంటలను పన్నెండుకు పరిమితం చేసారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు చట్టాల అమలును పర్యవేక్షించారు. అయినప్పటికీ, ఇన్స్పెక్టర్ల కొరత వలన చట్టాల అమలు కష్టతరమైంది. సుమారు పదేళ్ల తరువాత, మైనింగ్‌లో పిల్లలు, మహిళలను నియమించడాన్ని నిషేధించారు. ఇలాంటి చట్టాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించినప్పటికీ, 20 వ శతాబ్దం వరకు బాల కార్మికులు ఐరోపా అమెరికాల్లో గణనీయంగా ఉన్నారు.

కార్మిక సంస్థ

పారిశ్రామిక విప్లవంలో కార్మికులు ఎక్కువగా మిల్లులు, కర్మాగారాలు, గనులలో ఉండేవారు. తద్వారా శ్రామిక ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకుపోయేందుకు సమూహాలు లేదా కార్మిక సంఘాల ఏర్పాటు సులభమైంది. ఈ సంఘాల శక్తితో పనులు చెయ్యడం ఆపేసి, ఉత్పత్తిని నిలిపివేయడం ద్వారా మెరుగైన పరిస్థితుల కోసం డిమాండు చెయ్యగలిగారు. నైపుణ్యం కలిగిన కార్మికులను భర్తీ చేయడం చాలా కష్టం. సంఘాల డిమాండ్లను తమకు తాముగానే తీర్చడమో లేదా కోల్పోయిన ఉత్పత్తి ఖర్చును భరించడమో యజమానులు నిర్ణయించుకోవలసి వచ్చింది. ఈ రకమైన బేరసారాల ద్వారా వారి పరిస్థితులను విజయవంతంగా మెరుగు పరచుకున్న తొలి సమూహాలు ఇవి.

మార్పులను ప్రభావితం చేయడానికి యూనియన్లు ఉపయోగించిన ప్రధాన పద్ధతి సమ్మె. అనేక సమ్మెలు రెండు వైపులా, సంఘాలు, యజమానులూ ఇద్దరికీ బాధాకరం గానే పరిణమించాయి. బ్రిటన్లో, కాంబినేషన్ యాక్ట్ 1799 ను 1824 లో రద్దు చేసేంతవరకు కార్మికులు ఎలాంటి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయకూడదనే నిషేధం ఉండేది. దీన్ని రద్దు చేసాక కూడా, యూనియన్లపై తీవ్రమైన నియంత్రణలుండేవి. 1834 లో ఒక బ్రిటిషు వార్తాపత్రిక, "యూనియన్లనేవి ఏ దేశంలోనైనా, చట్టం ఆశ్రయం పొందుతూ, వేర్లు తన్నుకున్న అత్యంత ప్రమాదకరమైన సంస్థలు" అని అభివర్ణించింది. . . "

1832 లో, సంస్కరణ చట్టం బ్రిటన్లో ఓటును విస్తరించింది గానీ సార్వత్రిక ఓటు హక్కును మాత్రం ఇవ్వలేదు. ఆ సంవత్సరం డోర్సెట్‌లోని టోల్‌పడిల్‌కు చెందిన ఆరుగురు పురుషులు 1830 లలో వేతనాలు క్రమంగా తగ్గించడాన్ని నిరసిస్తూ ఫ్రెండ్లీ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్స్ ను స్థాపించారు. వారానికి పది షిల్లింగ్‌ల కన్నా తక్కువ పని చేయడానికి వారు నిరాకరించారు. ఆ సమయానికి వేతనాలు వారానికి ఏడు షిల్లింగ్‌లకు తగ్గించారు, దాన్ని ఇంకా ఆరుకు తగ్గించబోతున్నారు కూడా. 1834 లో, స్థానిక భూస్వామి అయిన జేమ్స్ ఫ్రాంప్టన్, ప్రధానమంత్రి లార్డ్ మెల్బోర్న్కు యూనియన్ గురించి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాడు. ప్రజలు గుంపుగా చేరి తీర్మానాలు చేయకుండా నిషేధించిన 1797 నాటి ఒక అస్పష్టమైన చట్టాన్ని అతడు తన లేఖలో గుర్తు చేసాడు. ఫ్రెండ్లీ సొసైటీ సభ్యులు చేసినది అదే. జేమ్స్ బ్రైన్, జేమ్స్ హామ్మెట్, జార్జ్ లవ్లెస్, జార్జ్ సోదరుడు జేమ్స్ లవ్లెస్, జార్జ్ బావ థామస్ స్టాండ్ఫీల్డ్, థామస్ కుమారుడు జాన్ స్టాండ్ఫీల్డ్ లను అరెస్టు చేసారు, వారిని దోషులుగా నిర్ధారించి ఆస్ట్రేలియాకు పంపించేసారు. వారు టోల్‌పడిల్ అమరవీరులుగా ప్రసిద్ధి చెందారు. 1830, 1840 లలో, చార్టిస్ట్ ఉద్యమం రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రచారం చేసిన మొదటి పెద్ద-స్థాయి వ్యవస్థీకృత కార్మికవర్గ రాజకీయ ఉద్యమం. దాని సంస్కరణల చార్టరుపై ముప్పై లక్షల మంది సంతకాలు చేసారు. కానీ పార్లమెంటు దాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండా తిరస్కరించింది.

శ్రమజీవులు ఆర్థిక ఇబ్బందుల కాలాల్లో ఒకరికొకరు సహాయంగా ఉండేందుకు మిత్ర సంఘాలు, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరిచేందుకు రాబర్ట్ ఓవెన్ వంటి అభ్యూదయ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సంస్థలకు మద్దతు ఇచ్చారు.

సమ్మె హక్కుపై చట్టపరమైన ఆంక్షలను యూనియన్లు నెమ్మదిగా అధిగమించాయి. 1842 లో, చార్టిస్ట్ ఉద్యమం ద్వారా పత్తి కార్మికులు, బొగ్గుగని కార్మికులూ సాధారణ సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె సమయంలో గ్రేట్ బ్రిటన్ అంతటా ఉత్పత్తిని నిలిచిపోయింది.

చివరికి, 1867, 1885 లలో వోటుహక్కును విస్తరించిన తరువాత, ట్రేడ్ యూనియన్ల ద్వారా శ్రామిక ప్రజల కోసం సమర్థవంతమైన రాజకీయ సంస్థ కోసం ప్రయత్నాలు చేసి సోషలిస్ట్ రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. తరువాతి కాలంలో ఈ పార్టీలు విలీనమై బ్రిటిషు లేబర్ పార్టీ అవతరించింది..

పారిశ్రామిక విరోధులు (లడ్డైట్లు)

ఇంగ్లాండు ఆర్థిక వ్యవస్థ వేగంగా పారిశ్రామికీకరణ చెందడంతో చాలా మంది చేతిపనుల కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ఉద్యమం మొదట నాటింగ్హామ్ సమీపంలో లేస్, అల్లిక కార్మికులతో ప్రారంభమై, వస్త్ర పరిశ్రమ నెలకొన్న ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఉత్పత్తిలో యంత్రాలతో పోటీ పడలేనందున చాలా మంది నేత కార్మికులు అకస్మాత్తుగా నిరుద్యోగులైపోయారు. ఇలాంటి చాలా మంది నిరుద్యోగ కార్మికులు, నేత కార్మికులు, ఇతరులూ తమ ఉపాధిని దెబ్బతీసిన యంత్రాల పట్ల శత్రుత్వం పెంచుకుని, కర్మాగారాలను యంత్రాలనూ నాశనం చేయడం ప్రారంభించారు. ఈ దాడి చేసినవారిని లుడ్డైట్స్ అని పిలుస్తారు. 1811 లో ఈ దాడులను మొదలుపెట్టిన నెడ్ లడ్ అనే వ్యక్తి పేరిట ఈ పేరు వచ్చింది. ఆ కాలంలో లడ్ ఒక జానపద హీరో ఔయిపోయాడు. లడ్డైట్స్ వేగంగా ప్రజాదరణ పొందారు. బ్రిటిషు ప్రభుత్వం పరిశ్రమలను రక్షించడానికి సైన్యాన్ని ఉపయోగించి కఠినమైన చర్యలు తీసుకుంది. పట్టుబడిన వారిని విచారించి ఉరితీశారు. లేదా జీవితాంతం దేశం నుండి బహిష్కరించారు.

పారిశ్రామికీకరణ పెరిగే కొద్దీ ఇతర రంగాలలోకి కూడా అశాంతి పాకింది. 1830 లలో దక్షిణ బ్రిటన్ లోని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు చేసిన కెప్టెన్ స్వింగ్ ఆందోళనలు అలాంటివే. నూర్పిడి యంత్రాలను ధ్వంసం చెయ్యడం, గడ్డి వాములను తగలబెట్టడం వంటివి చేసారు. అయితే, ఇలాంటి అల్లర్లే మొదట కార్మిక సంఘాల ఏర్పాటుకు దారితీసి, సంస్కరణల కోసం మరింత ఒత్తిడి తెచ్చాయి.

భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆ తరువాత చైనా వంటి సాంప్రదాయక చేనేత ఉత్పత్తి కేంద్రాలు యంత్రాలతో తయారు చేసిన వస్త్రాల పోటీని తట్టుకోలేకపోయాయి. కొన్ని దశాబ్దాల్లోనే ఈ చేనేత పరిశ్రమను కొత్త వస్త్ర పరిశ్రమలు నాశనం చేశాయి. లక్షలాది మందికి పని లేకుండా పోయి, ఆకలితో అలమటించారు.

పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో అపారమైన, అపూర్వమైన ఆర్థిక విభజనను సృష్టించింది. ప్రపంచవ్యాప్త ఉత్పత్తి వాటా కింది విధంగా మారింది.

మొత్తం ప్రపంచ తయారీ అవుట్‌పుట్‌లో వాటా (శాతం)
1750 1800 1860 1880 1900
ఐరోపా 23.2 28.1 53.2 61.3 62.0
అమెరికా 0.1 0.8 7.2 14.7 23.6
జపాన్ 3.8 3.5 2.6 2.4 2.4
మిగతా ప్రపంచం 73.0 67.7 36.6 20.9 11.0

పర్యావరణంపై ప్రభావం

పారిశ్రామిక విప్లవం సమయంలో వాతావరణంలో పొగ కాలుష్యం పెరిగింది. పర్యావరణ ఉద్యమానికి బీజాలు ఇక్కడే పడ్డాయి. గొప్ప కర్మాగారాల ఆవిర్భావం, బొగ్గు వినియోగంలో అపారమైన పెరుగుదల వలన పారిశ్రామిక కేంద్రాల్లో మున్నెన్నడూ లేనంత వాయు కాలుష్యం ఏర్పడింది; 1900 తరువాత పెద్ద మొత్తంలో పారిశ్రామిక రసాయన ఉత్సర్గాలు శుద్ధి చేయని మానవ వ్యర్థాలకు తోడయ్యాయి. సోడా యాష్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే లెబ్లాంక్ ప్రక్రియ వెదజల్లే హానికరమైన వాయు కాలుష్యాన్ని (హైడ్రోక్లోరిక్ ఆమ్లం) నియంత్రించడానికి 1863 లో బ్రిటన్‌లో క్షార చట్టాలు వచ్చాయి. ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి ఆల్కలీ ఇన్స్పెక్టరును, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లనూ నియమించారు. ఇన్స్పెక్టరేట్ బాధ్యతలను క్రమంగా విస్తరిస్తూ, చివరికి 1958 లో ఆల్కలీ ఆర్డర్ ను తీసుకువచ్చారు. ఇది పొగ, గ్రిట్, దుమ్ము, వాయువులను విడుదల చేసే అన్ని భారీ పరిశ్రమలను పర్యవేక్షణలో ఉంచింది.

వాయువుల తయారీ పరిశ్రమ 1812–1820లో బ్రిటిషు నగరాల్లో ప్రారంభమైంది. వీటికి ఉపయోగించిన సాంకేతికత, అత్యంత విషపూరిత కాలుష్యాన్ని ఉత్పత్తి చేసేది. దాన్ని మురుగు కాలువల్లోకి, నదుల్లోకీ వదలివేసేవారు. గ్యాస్ కంపెనీలపై పదేపదే న్యూసెన్సు కేసులు పెట్టేవారు. ఈ కేసుల్లో వారు ఓడిపోయి, ఈసారి సరికొత్త పనికిమాలిన పద్ధతులను ప్రవేశపెట్టేవారు. 1820 లలో థేమ్స్‌ను కలుషితం చేసి, అందులోని చేపలకు విషప్రాయమైనందుకు గాను గ్యాస్ కంపెనీలపై లండన్ నగరం పదేపదే అభియోగాలు మోపింది. చివరగా, విషాన్ని నియంత్రించడానికి పార్లమెంటు కంపెనీ చార్టర్లను రాసింది. ఈ పరిశ్రమ 1850 లో అమెరికాకు చేరి అక్కడ కూడా కాలుష్యానికీ వ్యాజ్యాలకూ కారణమైంది.

1890 తరువాత, పారిశ్రామిక నగరాల్లో స్థానిక నిపుణులు, సంస్కర్తలూ పర్యావరణ క్షీణతను కాలుష్యాన్నీ గుర్తించి, సంస్కరణలను డిమాండ్ చేసి, వాటిని సాధించడానికి ఉద్యమాలను ప్రారంభించడంలో ముందడుగు వేశారు. నీరు, వాయు కాలుష్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 1898 లో బ్రిటన్‌లో బొగ్గు పొగ నివారణ సంఘం ఏర్పడింది. ఇది పురాతన పర్యావరణ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి. బొగ్గు పొగతో దుప్పటి లాగా కప్పేసినందుకు కోపగించిన ఆర్టిస్ట్ సర్ విలియం బ్లేక్ రిచ్‌మండ్ దీనిని స్థాపించాడు. ప్రజారోగ్య చట్టం 1875 అన్ని కొలిమిలు, నిప్పు గూళ్లు తాము వదిలే పొగను తామే వాడాలనే నిబంధన విధించింది. పెద్ద మొత్తంలో నల్ల పొగను విడుదల చేసే కర్మాగారాలపై ఆంక్షలు విధించింది. 1926 లో పొగ తగ్గించే చట్టం ద్వారా ఈ చట్టం లోని నిబంధనలను మసి, బూడిద, ఇసుక కణాలు వంటి ఇతర ఉద్గారాలకు విస్తరించారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌ను దాటిన పారిశ్రామికీకరణ

కాంటినెంటల్ యూరప్

ఐరోపా ఖండ ప్రాంతానికి పారిశ్రామిక విప్లవం గ్రేట్ బ్రిటన్ కంటే కొంచెం ఆలస్యంగా వచ్చింది. అనేక పరిశ్రమలలో, బ్రిటన్లో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశాలకు తరలివెళ్ళింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్రిటన్ నుండి కొనడం ద్వారా గానీ, బ్రిటిషు ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు కొత్త అవకాశాల కోసం ఆయా దేశాలకు వెళ్లడం వలన గానీ ఇది జరిగింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాల్లో పారిశ్రామిక విప్లవం విస్తరించింది. బెల్జియమ్ లోని వెల్లోనియా ప్రాంతంలో పరిశ్రమలు విలసిల్లాయి. అక్కడి బొగ్గు గనులు, ఇనుము, జింకు తయారీ పరిశ్రమలు విపరీతంగా విస్తరించి, బ్రిటను తరువాత బెల్జియమే ప్రపంచ పారిశ్రామిక నాయకుడనే పేరు పొందడానికి కారణమైంది.

జర్మనీలో రంగులు, ఇతర రసాయనిక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 1809 నాటికి, జర్మనీ లోని వెస్ట్‌ఫాలియాలోని రుహ్ర్ లోయలో కొంత భాగాన్ని 'మినియేచర్ ఇంగ్లాండ్' అని పిలిచేవారు. విస్తృతంగా రైలు మార్గాలను నిర్మించి దేశ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసుకున్నారు. జర్మన్, రష్యన్, బెల్జియన్ ప్రభుత్వాలు కొత్త పరిశ్రమలకు నిధులు సమకూర్చాయి.

జపాన్

పారిశ్రామిక విప్లవం 1870 లో ప్రారంభమైంది. ప్రభుత్వం రైల్‌రోడ్లు, మెరుగైన రహదారులను నిర్మించింది. దేశాన్ని మరింత అభివృద్ధికి సిద్ధం చేయడానికి భూ సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేలాది మంది విద్యార్థులను అమెరికా, ఐరోపాలకు పంపి చదివించింది. జపాన్‌లో ఆధునిక సైన్స్, గణితం, సాంకేతికత, విదేశీ భాషలను బోధించడానికి 3,000 మందికి పైగా పాశ్చాత్యులను నియమించింది.

1871 లో, ఇవాకురా మిషన్ అనే జపాన్ రాజకీయ నాయకుల బృందం పాశ్చాత్య పద్ధతులను నేర్చుకోవడానికి ఐరోపా, అమెరికాల్లో పర్యటించింది. దాని ఫలితమే, జపాన్‌ పారిశ్రామిక పరుగు నందుకోవడానికి తోడ్పడిన పారిశ్రామికీకరణ విధానం. 1882 లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ జపాన్, స్టీల్ టెక్స్‌టైల్ కర్మాగారాలకు నిధులు సమకూర్చడానికి పన్నులను ఉపయోగించింది.

సంయుక్త రాష్ట్రాలు

18 వ శతాబ్దం చివరలో 19 వ శతాబ్దం ప్రారంభంలో UK, పశ్చిమ ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ మొదలైనప్పుడు, అమెరికా ప్రధానంగా వ్యావసాయిక దేశంగా ఉండేది. తక్కువ జనాభా కలిగిన విస్తారమైన దేశంలో వ్యవసాయ, సహజ వనరుల ఉత్పత్తులను రవాణా చేసేందుకు రోడ్లు, కాలువల నిర్మాణం, స్టీమ్‌బోట్లను ప్రవేశపెట్టడం, రైలు మార్గాల నిర్మాణం ముఖ్యమైనవి.

పారిశ్రామిక విప్లవం కాలంలో ముఖ్యమైన అమెరికన్ సాంకేతిక ఆవిష్కరణలు కాటన్ జిన్, పరస్పరం మార్చుకోగలిగే భాగాలను తయారుచేసే వ్యవస్థను అభివృద్ధి చేయడం, మిల్లింగ్ యంత్రం అభివృద్ధి మొదలైనవి. 19 వ శతాబ్దం చివరలో ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక దేశంగా యుఎస్ ఎదగడానికి యంత్ర పరికరాల అభివృద్ధి, మార్చుకోగలిగిన విడిభాగాల వ్యవస్థలే ఆధారం.

కాల్పనికవాదుల వ్యతిరేకత

పారిశ్రామిక విప్లవం సమయంలో జరుగుతున్న కొత్త పారిశ్రామికీకరణ మేధోవర్గం నుండి, కళాకారుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. గ్రామీణ జీవితం లోని సాంప్రదాయికతను కాల్పనిక వాదులు (రొమాంటిసిస్టులు) ఆరాధించేవారు. పారిశ్రామికీకరణ, పట్టణీకరణల వల్ల కలుగుతున్న సమూలమైన మార్పుల పట్ల, కార్మికవర్గాల దౌర్భాగ్య స్థితి పట్లా వారు ఎదురుతిరిగారు. వారిలో ప్రముఖులు - కళాకారుడు, కవి విలియం బ్లేక్, కవులు విలియం వర్డ్స్ వర్త్, శామ్యూల్ టేలర్ కోల్రిడ్జ్, జాన్ కీట్స్, లార్డ్ బైరన్, పెర్సీ బైషే షెల్లీ ఉన్నారు . "క్రూరమైన" యంత్రాలు, కర్మాగారాలకు విరుద్ధంగా "ప్రకృతి" ప్రాముఖ్యతను కళ, సాహిత్యం ద్వారా ఈ ఉద్యమం నొక్కి చెప్పింది. మేరీ షెల్లీ నవల ఫ్రాంకెన్‌స్టైయిన్ శాస్త్రీయ పురోగతి రెండు అంచుల కత్తి అనే ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. ఫ్రెంచ్ రొమాంటిసిజం కూడా పరిశ్రమలను తీవ్రంగా విమర్శించింది.

నోట్స్

మూలాలు

Tags:

పారిశ్రామిక విప్లవం ముఖ్యమైన సాంకేతిక పరిణామాలుపారిశ్రామిక విప్లవం సామాజిక ప్రభావాలుపారిశ్రామిక విప్లవం యునైటెడ్ కింగ్‌డమ్‌ను దాటిన పారిశ్రామికీకరణపారిశ్రామిక విప్లవం కాల్పనికవాదుల వ్యతిరేకతపారిశ్రామిక విప్లవం నోట్స్పారిశ్రామిక విప్లవం మూలాలుపారిశ్రామిక విప్లవంఆవిరి యంత్రంజలశక్తియంత్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

తాటి ముంజలుకానుగవెల్లలచెరువు రజినీకాంత్ఆల్ఫోన్సో మామిడికాశీదగ్గుబాటి పురంధేశ్వరివందే భారత్ ఎక్స్‌ప్రెస్బి.ఆర్. అంబేద్కర్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాప్రియురాలు పిలిచిందిసచిన్ టెండుల్కర్నువ్వు లేక నేను లేనుమానవ శరీరముజయం రవిరామోజీరావుమహామృత్యుంజయ మంత్రంక్రికెట్ఊరు పేరు భైరవకోనఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంహనుమంతుడుఅ ఆఘట్టమనేని కృష్ణరవీంద్రనాథ్ ఠాగూర్గ్రామంనువ్వు నాకు నచ్చావ్ఇన్‌స్టాగ్రామ్మృణాల్ ఠాకూర్ఉష్ణోగ్రతతీహార్ జైలురైతుబంధు పథకంఅమితాబ్ బచ్చన్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఅక్షయ తృతీయతెలంగాణ జిల్లాల జాబితానామవాచకం (తెలుగు వ్యాకరణం)మంగళవారం (2023 సినిమా)గోత్రాలుషిర్డీ సాయిబాబానిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆర్టికల్ 370 రద్దుఅక్కినేని నాగ చైతన్యసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్బుధుడు (జ్యోతిషం)సురేఖా వాణిపంచభూతలింగ క్షేత్రాలుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిత్రిఫల చూర్ణంఏప్రిల్ 24పేర్ని వెంకటరామయ్యఅల్లరి నరేష్ప్రేమంటే ఇదేరాఓం భీమ్ బుష్తిరుమలసింహంప్రియమణిభారతీయ రిజర్వ్ బ్యాంక్ప్రభాస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపరిసరాల పరిశుభ్రతశివమ్ దూబేవిడదల రజినిదినేష్ కార్తీక్భారత రాజ్యాంగ పీఠికతోటపల్లి మధుడి. కె. అరుణకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిగోత్రాలు జాబితాబ్రాహ్మణులుమహాభారతంశ్రీశైల క్షేత్రంఅయోధ్యరావి చెట్టుపంచముఖ ఆంజనేయుడుహైదరాబాదుబంగారంజే.సీ. ప్రభాకర రెడ్డి🡆 More